Equipment maintenance
-
సాక్షి హెల్త్ రిపోర్ట్: ‘పరీక్ష’ యంత్రాలు పనిచేయట్లే!
సాక్షి నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రధానమైన జిల్లా ఆస్పత్రులను సైతం వైద్య పరికరాల కొరత పీడిస్తోంది. కొన్ని చోట్ల నిపుణులైన సిబ్బంది లేక స్కానింగ్, ఎక్స్‌రే మెషీన్లు, రక్త ఇతర పరీక్షల పరికరాలు నిరుపయోగంగా ఉంటే.. చాలాచోట్ల వీటితో పాటు బీపీ పరీక్ష వంటి చిన్న చిన్న వైద్య పరికరాలు, ఇతర యంత్రాలు పనిచేయడం లేదు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు పాడై నెలలు, ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోక పోవడంతో కొన్ని చోట్ల తుప్పు, బూజు పట్టిపోతున్నాయి. నిర్లక్ష్యమే శాపం ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో నెలకొల్పామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా చెబుతున్నారు. కానీ కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులకు సరైన విధంగా సేవలందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రోగ నిర్ధారణకు కీలకమైన వైద్య పరికరాలు లేకపోవడంతో పేద రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు 5,999 ఉన్నాయి. అందులో ఆరోగ్య ఉప కేంద్రాలు 4,745 ఉన్నాయి. 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 232 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 224 బస్తీ దవాఖానాలు, 90 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 27 జిల్లా ఆసుపత్రులు, 20 ఏరియా ఆసుపత్రులు, 14 స్పెషాలిటీ ఆసుపత్రులు, 9 బోధనాసుపత్రులు ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ఔట్ పేషెంట్లు ఆయా ఆస్పత్రులకు వస్తుంటారు. ఆయా ఆసుపత్రిలన్నింటిలోనూ బీపీ మిషన్ మొదలుకొని సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ వరకు చిన్నా పెద్దవి కలిపి 30 వేల వైద్య పరికరాలు ఉన్నాయి. అందులో ఏకంగా 4,500 పరికరాలు పని చేయకుండా పాడైపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. జిల్లాల్లో ఇదీ పరిస్థితి... ► పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసే పరికరాలు పని చేయడం లేదు. జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌రే మిషన్ ఇప్పటివరకు నెలకొల్పకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు. అలాగే ల్యాబ్‌లో సెల్‌కౌంట్ మిషన్, బయో కెమిస్ట్రీ మిషన్లు సంవత్సరాలుగా పనిచేయకపోవడంతో రక్తం మూత్ర పరీక్షలను మాన్యువల్‌గా చేస్తున్నారు. ► భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్పీహెచ్సీలో ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదు. ► మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 2018లో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎక్స్‌రే మిషన్ పనిచేయడంలేదు. ► వనపర్తి జిల్లా ఆస్పత్రిలో అల్ట్రాసౌండ్ పరికరం ఉన్నా నిరుపయోగంగా మారింది. ► జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పతిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీటీ స్కానర్, సీ ఆర్మ్ స్కానర్, వెంటిలేటర్లు, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు అవసరమయ్యే పరికరాలు ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది లేక ఈ పరికరాలు నిరుపయోగంగా మారాయి. ► రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేక ఆర్థో, జనరల్, ఈఎన్టీ, పల్మనాలజిస్టు, ఆప్‌తో విభాగాలకు చెందిన విలువైన పరికరాలను పక్కనబెట్టారు. ► వరంగల్ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ మెషీన్, సీటీ స్కాన్, ఎక్స్‌రే, వెంటిలేటర్లు సరిగా పనిచేయడంలేదు. ► నిజామాబాద్ జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఐదు ఎక్స్‌రేల్లో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. యూవీ పౌండేషన్ ఇచ్చిన వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలు సిబ్బంది లేకపోవడంతో వినియోగించడంలేదు. ► డిచ్పల్లి సీహెచ్‌సీలో గర్భిణుల కొరకు స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆస్పత్రిలో రేడియాలజిస్టు్ట్ట, గైనకాలజిస్టు లేకపోవడంతో స్కానింగ్ తీయడం లేదు. ► కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఆల్ట్రా స్కానింగ్ యంత్రం కొత్తది ఉంది. అయితే వైద్యుడు లేకపోవడంతో దానిని గదిలో పెట్టి తాళం వేశారు. పీహెచ్‌సీల్లో ఎక్స్‌రే యంత్రాలు ఉపయోగించకుండా మూలకు పెట్టారు. జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రం అసలు లేనేలేదు. ► తాండూరు జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు దంత వైద్యులు ఉండగా దంత పరీక్షలు నిర్వహించే యంత్రం ఏడాదిగా పని చేయటం లేదు. వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తూ క్లినిక్‌లు నిర్వహిస్తుండటంతో వారే ఆ మిషన్‌ను పాడు చేశారనే ఆరోపణలున్నాయి. ఇక వైద్యులు లేక కంటి పరీక్ష పరికరాలు మూలకు పడ్డాయి. ► నల్లగొండ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో సీటీస్కాన్, ఎక్స్‌రే, డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లోని అన్ని రకాల పరిరకాలు పనిచేస్తున్నాయి. అయితే ఎనిమిది మంది రేడియోగ్రాఫర్లకు గాను ఒక్కరు మాత్రమే ఉండడంతో ఈసీజీ, ఎక్స్‌రే, సీటీ స్కాన్సేవలను అందించడంలో కొంత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ► సూర్యాపేట జనరల్ ఆస్పత్రిలో సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా కొందరు వై ద్యులు ఈ పరీక్షలు ప్రైవేటులో చేయించుకుని రావాలని రోగులకు సూచిస్తున్నారు. ► రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో గర్భిణులను పరీక్షించే స్కానింగ్ మిషన్ రెండేళ్లుగా పని చేయడం లేదు. నకిరేకల్‌లోని 30 పడకల వైద్యశాలలో స్కానింగ్ మిషన్, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలు లేవు. ► ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ఒక్కరే టెక్నీషియన్ ఉండటంతో రోగులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉంది. ముఖ్యంగా గుండె, నరాల బలహీనత, క్యాన్సర్వంటి రోగాలకు సంబంధించిన ఔషధాలు అందుబాటులో లేవు. ► జనగామ జిల్లా ఆస్పత్రిలో నాలుగేళ్లుగా సీటీ స్కాన్ మూలన పడింది. మరమ్మతుకు అవకాశం ఉన్నా కాల యాపన చేస్తూ సీటీ స్కాన్ గది తాళం వేసి పెడుతున్నారు. దీంతో రోగులు ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకుం టున్నారు. ఇదే ఆస్పత్రిలో పంటికి సంబంధించిన ఎక్స్‌రే మిషన్ కూడా పనిచేయడం లేదు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్ పూర్లో లక్షల విలువైన ఎక్స్‌రే మిషన్లు పాడై తుప్పుపట్టి పోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ► కరీంనగర్ జిల్లా ఆసు పత్రిలో రెండు బెడ్‌సైడ్ ఎక్స్‌రే మిషన్లు ఉన్నాయి కానీ పని చేయడం లేదు. స్వల్ప మరమ్మతులు చేస్తే వాటిని వినియోగం లోనికి తెచ్చే అవకాశం ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అవి ఉపయోగంలో లేకుండా పోయాయి. ఇక రెండు నెలల క్రితం 20 వెంటిలేటర్లు ఆసుపత్రికి వచ్చాయి. కానీ నిపుణులైన సిబ్బంది లేకపోవడంతో అలా స్టోర్‌రూం ముందు పెట్టి ఉంచారు. మరోవైపు 10 సీసీ సిరంజీలు, డిస్పోజబుల్æబెడ్‌షీట్స్, అథెసివ్ ప్లాస్టర్లు, డైనా ప్లాస్టర్లు, డిస్టిల్ వాటర్క్యాన్లు తదితర సర్జికల్, ల్యాబ్ మెటీరియల్‌కు తీవ్ర కొరత ఉంది. ► ఇది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్. వేల రూపాయలు ఖర్చయ్యే సుమారు 57 రకాల పరీక్షలను నిరుపేదలకు ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం వీటిని నెలకొల్పింది. అయితే ప్రస్తుతం సిబ్బంది లేకపోవడంతో ప్రాథమిక రక్త పరీక్షలైన సీబీపీ, సీఆర్పీ వంటి టెస్టులు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పరీక్షలు చేయట్లే.. కోటగిరి ఆస్పత్రిలో శరీరంలోని నొప్పులు తగ్గే మందులు అందుబాటులో లేవని చెబుతున్నారు. కళ్లు పరీక్ష చేసే కాంపౌండర్ కూడా పరీక్ష చేసే పరికరం లేదని చెప్పి వొట్టి మందులే రాస్తున్నడు. పెద్దాస్పత్రి అనుకుని మాలాంటి గరీబోళ్లు ఇక్కడికి వస్తే ఆస్పత్రిలో డాక్టర్ లేడు. – పోతురాజు అబ్బవ్వ, కోటగిరి ఎక్స్‌రే సౌకర్యం లేదు వెలిశాల పీహెచ్సీలో ఎక్స్‌రే సౌకర్యం లేదు. మాకు తెలిసిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. ఆస్పత్రికి వెళితే ప్రాథమిక చిక్సిత చేసి పంపించారు. చిట్యాల సీహెచ్‌సీకి వెళ్లగా.. టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో పరకాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాం. – రేనుకుంట్ల సంపత్, సుబ్బక్కపల్లి, టేకుమట్ల మండలం -
అందని అత్యవసర సేవలు
ఎంజీఎం : ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనం.. రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం పేద రోగుల పాలిట శాపంగా మారాయి. పరికరాల మరమ్మతుకు సేబర్–సిందూరి ఏజెన్సీతో చేసుకున్న ఒప్పందం ఇటూ ఎంజీఎం పరిపాలనాధికారులకు.. అటూ ఆస్పత్రికి వచ్చే బాధితులకు నరకయాతన చూపిస్తున్నాయి. ఇలా ఆస్పత్రి అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడం.. ఆస్పత్రి చుట్టు ఉన్న ప్రైవేట్ ల్యాబ్, నర్సింగ్‌హోమ్‌ల దళారులకు వరంగా మారింది. సూపర్‌స్పెషాలిటీ సేవల లేమీతో కొంత మంది దళారులు అత్యవసర కేంద్రం వద్ద నిత్యం అడ్డా వేస్తూ... క్యాజువాలిటీ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందితో చేతులు కలిపి యథేచ్చగా రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షల పరికరాలు మరమ్మతులకు నోచుకోకపోవడం సైతం వారికి మరో ఆదాయ వనరుగా మారాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగుల జేబులకు చిల్లు పడుతోంది. ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి 20 రోజులు గడస్తున్న చిన్న పాటి సమస్యలు సైతం పరిష్కారం కాకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు.. అత్యవసర సేవలకు అపద్బాంధువుగా గుర్తుకు వచ్చే ధర్మాస్పత్రిలో రోజు, రోజుకూ వైద్యసేవలు పరిస్థితి అధ్వానంగా తయారు కావడంతో రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యసవర విభాగానికి (క్యాజువాలిటీ) వివిధ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, క్రిమి సంహారక మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడే బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరికి మెరుగైనా వైద్య చికిత్సలు అందించేందుకు, పూర్తి స్థాయిలో వారి యొక్క పరిస్థితులను గమనిస్తూ చికిత్సలు అందిచేందుకు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ల్యాబ్ ద్వారా పరీక్షలు చేస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా ఎమర్జెన్నీ ల్యాబ్‌లో లక్షల రూపాయాలు విలువ చేసే పరికరాలు సాంకేతిక లోపం వల్ల పనిచేయడం లేదు. అయితే వీటిని వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి లేకపోవడంతో అత్యసవరంగా చికిత్సలు అందించేందుకు అవసరమయ్యే రక్తపరీక్షలు కోసం రోగుల బంధుమిత్రులు ప్రైవేట్ కేంద్రాలకు పరుగులు తీసి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. 8 నెలలుగా నిలిచిపోయిన సీబీపీ పరీక్షలు ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ల్యాబ్‌లో గత 8 నెలలుగా సీబీపీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడి మరమ్మతుకు నోచుకోకపోయిన పట్టించుకునే వారే కరువయ్యారు. ఆస్పత్రికి తీవ్ర కడుపునొప్పి, అపెండక్స్ వ్యాధితో బాధపడే రోగులతో పాటు రక్తహీనత కలిగిన రోగులకు సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు తప్పని సరి. ఇలాంటి రోగులకు సీబీపీ పరికరం ద్వారా ప్లేట్లెట్ కౌంట్, హెచ్బి, డిఫినేషియల్ కౌంట్ వంటి రక్త నివేదికల ఆధారంగా వారికి వైద్య చికిత్సలు అందిస్తుంటారు. అంతేకాకుండా ఓపీ విభాగంలోని రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే పాథాలాజీ విభాగంలో సుమారు 45 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన పరికరం సైతం పనిచేయకపోవడంతో అది కాస్తా నిరుపయోగంగా మారింది. అతి కష్టం మీద అక్కడి సిబ్బంది రోజు మ్యానువల్ పద్ధతిలో 40 మంది ఓపీ రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు ప్రతి రోజు 100 నుంచి 150 మందికీ సీబీపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో సుమారు వంద మందికి పైగా రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ఒక్కొక్కరు రూ. 300 లు ఖర్చు చేయక తప్పడం లేదు. మరమ్మతులకు నోచుకోని సీబీపీ పరికరం సెమీ ఆటో ఎనలైజర్ పరికరం 4 నెలలుగా మూలకే ఎంజీఎం ఎమర్జెన్సీ ల్యాబ్‌లోని సెమీ ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆ పరికరం నిరుపయోగంగా మారింది. దీంతో కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు నిర్వహించే సీరమ్ క్రియాటిన్ పరీక్షలు నాలుగు నెలలుగా చేయడం లేదు. ఈ రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్ళక తప్పడం లేదు. డయాలసిస్ చేసుకునే రోగులకు సిరమ్ క్రియాటిన్ పరీక్షలు తప్పనిసరి. ఈ వ్యాధితో బాధపడే రోగులు కొంత మంది వారానికి రెండు, మూడు సార్లు సైతం సీరమ్ క్రియాటీన్ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది. నిరుపయోగంగా సెమీ ఆటో ఎనలైజర్ మూడు నెలలుగా ఏబీజీ పరికరం .. ఎంజీఎం అత్యవసర విభాగంలో ఏబీజీ పరికరం ద్వారా అందించే రక్త పరీక్షల నివేదికలు కీలకం. ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతి రోజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారిని చికిత్స నిమిత్తం తరలిస్తుంటారు. వీరికి ఏబీజీ పరీక్షలు అవసరం. ఈ పరికరం ద్వారా రక్తంలో బ్లడ్, గ్లూకోజు, హెచ్‌బీ లెవల్స్ తెలిపే నివేదిక ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా వారికి వైద్యచికిత్సలు అందిస్తుంటారు. ఈ పరికరం గత మూడు నెలల క్రితం సాంకేతిక లోపం ఏర్పడి పనిచేయకపోయినా దృష్టి సారించిన దాఖాలా ల్లేవు. ప్రైవేట్ సెంటర్లలో ఏబీజీ పరీక్షల కోసం సుమారు 1100 రూపాయాలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ పరికరాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ల్యాబ్ రెండు ఏసీలు ఉండగా..ప్రస్తుతం ఓకే ఒక్క ఏసీ మాత్రమే పనిచేస్తుంది. ఏబీజీ పరికరంలో సాంకేతిక లోపం -
అన్నీ ఉన్నా..వైద్యం సున్నా!
గాంధీఆస్పత్రి: ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో కీలక వైద్య పరికరాలకు సుస్తీ చేసింది. చికిత్సలు చేసేందుకు అవసరమైన నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ..వ్యాధి నిర్ధారణ పరికరాలను రిపేరు చేసే సాంకేతిక నిపుణులు లేకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న నిరుపేద రోగులకు కనీస వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి. సుస్తీ చేసిన వైద్యపరికరాలకు ఎప్పటికప్పుడు చికిత్స చేయాల్సిన ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్లు విలువ చేసి కొనుగోలు చేసిన ఎంఆర్ఐ, సీటీ, క్యాత్‌ల్యాబ్, ఎండోస్కోపి, ల్యాప్రోస్కోపి, కిడ్నీలోని స్టోన్స్‌ను బ్రేక్ చేసే లితోట్రిప్సీ, అనస్థీషియా వర్క్‌స్టేషన్, అల్ట్రాసౌండ్, స్కోప్స్, కార్డియాలజీ మోనిటర్స్, ఆర్థోడ్రిల్, వెంటిలేటర్లు, ఆపరేషన్ లైట్స్, ఎన్ఆర్ఆర్ వర్క్‌స్టేషన్, మెబైల్ ఎక్స్‌రే, ఈసీజీ మిషన్, డెఫ్రిబిరిలేటర్ తదితర కీలక వైద్య పరికరాలు మూలనపడ్డాయి. దీంతో వైద్య పరీక్షలు అవసరమైన రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. సాధారణ చికిత్సల కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ కోసం 750 మంది వెయిటింగ్ రేడియాలజీ విభాగంలోని ఎమ్మారై స్కానింగ్ మెషిన్ గత 15 రోజులుగా పనిచేయకపోవడంతో సుమారు 750 మంది రోగులు వేచిచూసే పరిస్థితి నెలకొంది. క్యాత్‌ల్యాబ్ పనిచేయకపోవడంతో వందలాది మంది రోగుల హార్ట్‌బీట్ ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేని దీనస్థితి. నూతనంగా ఏర్పాటు చేసిన 65 పడకల ఐసీయులో తప్పించి మిగిలిన టీఎంటీ, ఎస్ఐసీయు, కార్డియాలజీ, న్యూరోసర్జరీ, ఎన్ఆర్ఆర్, పోస్ట్ ఆపరేటివ్వార్డు తదితర విభాగాల్లో బీపీ, ఆక్సిజెన్ లెవల్స్, హార్ట్‌బీట్ చూపించే మానిటర్లు పనిచేయడంలేదు. గాంధీ ఆస్పత్రిలో మొత్తం 2400 వైద్యయంత్రాలు ఉండగా వాటిలో సింహభాగం చెడిపోయి గత కొన్నినెలలుగా మూలనపడ్డాయి. దీంతో వైద్యసేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఆందోళనలో కాంట్రాక్ట్ సిబ్బంది గాంధీ ఆస్పత్రిలో అధికారికంగా 1012 పడకలు ఉండగా అనధికారికంగా మరో వెయ్యి మందికి వైద్యం అందిస్తున్నారు. పడకల సంఖ్య రెండువేలకు పెంచమని ఆస్పత్రి పాలనయంత్రాంగం పలుమార్లు చేపట్టిన ప్రతిపాదనలు ప్రభుత్వ పైళ్లలో మూలుగుతున్నాయి. గాంధీ ఆస్పత్రి అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులు మంజూరుచేస్తున్నప్పటికీ మౌలిక వసతులు, నిర్వహణ వ్యవహారాలను పట్టించుకోకపోవడంతో ఆ నిధులు సద్వినియోగం కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రోగుల సంఖ్య నానాటికీ పెరగడంతో పాటు రిటైర్మెంట్ ఇతర కారణాలతో వైద్యులు, సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారిపైనే అధికభారం పడడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బడ్జెట్ నిధులు కేటాయించకపోవడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులను సగంలోనే నిలిపివేశారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది నిరసనబాట పట్టారు. బకాయిలు చెల్లిస్తేనే రిపేర్లు:ఫేబర్ సింధూరీ పరికరాల మరమ్మతులు చేపట్టాలని వైద్యయంత్రాల నిర్వహణ కాంట్రాక్టు సంస్థ ఫేబర్ సింధూరీకి పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందించలేదని గాంధీ ఆస్పత్రి పాలనయంత్రాగం స్పష్టం చేసింది. అయితే, తమకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.200 కోట్లు బిల్లులు రావాల్సి ఉందని, అవి వచ్చిన తర్వాతే మరమ్మతులు చేస్తామని సదరు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. అవును నిజమే..: సూపరింటెండెంట్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యమైన వైద్యయంత్రాలు పనిచేయకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతున్న మాట వాస్తమే. వైద్యయంత్రాల నిర్వహణ బాధ్యతలను ఫేబర్ సింధూరీ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. నిబంధనల ప్రకారం వైద్యయంత్రాల రిపేరుకు ఆస్పత్రి నిధులు కేటాయించే అవకాశం లేదు. త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. -
టెక్నాలజీకి పక్షవాతం
- రుయాలో నిపుణులు లేక మూలనపడ్డ అధునాతన వైద్య పరికరాలు - మూతపడే స్థాయికి కార్డియాలజీ వార్డు ముందుకు కదలని అంబులెన్స్ - ఇంక్యుబేటర్స్ పనిచేయక శిశువుల నరకయాతన రుయాలో రోగుల అవస్థలు వర్ణనాతీతం తిరుపతి అర్బన్: రుయాలోని విలువైన, అధునాతన వైద్యపరికరాలు పాడయ్యాయి. వీటిని మూలపడేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేరు. క్యాజువాల్టీ, కార్డియాలజీ, పీడియాట్రిక్(చిన్న పిల్లల), రేడియాలజీల్లో లక్షల విలువ చేసే వైద్య పరికరాలు మూలనపడ్డాయి. మరమ్మతులకు నిధులు లేక కొన్ని, పరికరాల నిర్వహణకు సరైన సిబ్బంది లేక మరికొన్ని రోగుల సేవకు దూరమయ్యాయి. గతంలో టీటీడీ నుంచి కూడా రుయా అభివృద్ధి, వివిధ విభాగాల నిర్వహణకు 40 శాతం నిధులు వచ్చేవి. కానీ ఏం జరిగిందో, ఏమో రుయాకు టీటీడీ నిధులు పూర్తిగా ఆగిపోయాయి. 800 ఎంఎం ఎక్స్‌రే అంతేనా? క్యాజువాల్టీలోని ఎక్స్‌రే మిషన్ చెడిపోయి మూడేళ్లకు పైగా కావస్తోంది. రోగులకు, క్షతగాత్రులకు ఎక్స్‌రే తీయాలంటే దూరంగా పాత భవనంలో ఉన్న మిషిన్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అందువల్ల క్షతగాత్రులను స్ట్రెచర్లపై తీసుకెళ్లేటప్పుడు వారికి ఎదురవుతున్న శారీరక ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ మిషిన్ మరమ్మతులకు సుమారు రూ.లక్షకు పైగా కావాల్సి ఉంటుంది. అయితే నిధుల లేమి కారణంగా దాన్ని పట్టించుకోవడం లేదు. అంతేగాక 800 ఎంఎం సామర్థ్యం కలిగిన ఈ మిషిన్ చెడిపోవడంతో తక్కువ సామర్థ్యం ఉన్న 500 ఎంఎం ఎక్స్‌రే మిషినే శరణ్యమయింది. రోగులకు నాణ్యమైన సేవలు అందడం లేదు. వెక్కిరిస్తున్న వెంటిలేటర్లు రుయాలోని ప్రధాన వైద్య విభాగాల కోసం మొత్తం 12 వెంటిలేటర్లను సుమారు రూ.60 లక్షలు వెచ్చించి నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేశారు. వాటిలో ఇప్పుడు 2 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన పదింటిని బాగు చేయాలంటే రూ.20 లక్షలైనా పడుతుంది. అంతేగాక ఈ వెంటిలేటర్ల నిర్వహణ కోసం విధిగా ఇద్దరు టెక్నీషియన్లు ఉండాలి. కానీ రుయాలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. వెంటిలేటర్లపై సాంకేతిక పరిజ్ఞానం లేక మూలనపడేశారు. వెంటిలేటర్లలో చాలా వాటికి వారంటీ కూడా అయిపోయింది. చస్తే కూడా స్ట్రోక్ యూనిట్లు పనిచేయవు కార్డియాలజీ, న్యూరాలజీ వార్డుల్లోని పక్షవాతం రోగులకు ఉపయోగించే స్ట్రోక్ యూనిట్ వైద్య పరికరాలు మూలనపడ్డాయి. కార్డియాలజీకి వచ్చే రోగులను మెడిసిన్ విభాగాధిపతి ఆధ్వర్యంలో పర్యవేక్షణకు ఉంచుతున్నారు. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే ఈ మిషన్లు రెండూ మూలనపడ్డాయి. వీటి మరమ్మతులకు కూడా రూ.లక్షల్లో అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంక్యుబేటర్స్ పనిచేస్తే ఒట్టు రోజులు నిండకుండా పుట్టిన శిశువులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే చిన్నారులు, కామెర్ల లక్షణాలున్న బిడ్డల కోసం చిన్న పిల్లల ఆస్పత్రిలో వినియోగించే రూ.లక్షలాది విలువ చేసే ఇంక్యుబేటర్లు పాడైపోయి మూలనపడేశారు. ప్రస్తుతం రుయా చిన్న పిల్లల ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా ఇంక్యుబేటర్లు లేక శిశువులు, వారి తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు. నిరుపయోగంగా ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ క్యాజువాల్టీ విభాగంలో ఏర్పాటు చేసిన ఆల్ట్రా సౌండ్ వైద్య యంత్రానికి నిపుణులైన వైద్యులు, సిబ్బంది లేక రెండేళ్లుగా వినియోగించడం లేదు. ఈ యంత్రంతో వివిధ శరీర నొప్పులు, ఫిజియోథెరపీ అవసరమైన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. అయితే ఈ యంత్రానికి నిర్వహణా సిబ్బంది లేక వినియోగంలోకి తేవడం లేదు. వేడి పుట్టిస్తున్న ఏసీ మిషన్లు కార్డియాలజీ విభాగంలోని వార్డులకు అమర్చిన ఏసీ మిషన్లు దుస్థితికి చేరుకుని తుప్పు పట్టిపోయాయి. ప్రస్తుతం రుయాలోని కార్డియాలజీ వార్డు దాదాపు మూతపడే దశకు చేరుకుంది. అయితే స్విమ్స్ నుంచి వచ్చే కార్డియాలజీ ప్రొఫెసర్‌తో ఓపీ మాత్రం నిర్వహిస్తూ, ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఏసీ మిషన్లు పనిచేయకపోవడంతో చివరకు వార్డునే మూతవేసే పరిస్థితికి తెచ్చారు. అంబులెన్స్ అంతే! ఇతర ప్రాంతాల నుంచి రుయాకు, రుయాలోని రోగులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సౌకర్యంగా ఉన్న అంబులెన్స్‌లు మూలనపడ్డాయి. సుమారు రూ.7లక్ష ల వ్యయంతో కొనుగోలు చేసిన అంబులెన్స్ ఇలా దుస్థితికి చేరుకోవడంతో పేద రోగులకు ప్రైవేటు అంబులెన్స్‌లే శరణ్యంగా మారాయి.