గాంధీఆస్పత్రి: ప్రతిష్టాత్మక గాంధీ జనరల్ ఆస్పత్రిలో కీలక వైద్య పరికరాలకు సుస్తీ చేసింది. చికిత్సలు చేసేందుకు అవసరమైన నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ..వ్యాధి నిర్ధారణ పరికరాలను రిపేరు చేసే సాంకేతిక నిపుణులు లేకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న నిరుపేద రోగులకు కనీస వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి. సుస్తీ చేసిన వైద్యపరికరాలకు ఎప్పటికప్పుడు చికిత్స చేయాల్సిన ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో రూ.కోట్లు విలువ చేసి కొనుగోలు చేసిన ఎంఆర్‌ఐ, సీటీ, క్యాత్‌ల్యాబ్, ఎండోస్కోపి, ల్యాప్రోస్కోపి, కిడ్నీలోని స్టోన్స్‌ను బ్రేక్ చేసే లితోట్రిప్సీ, అనస్థీషియా వర్క్‌స్టేషన్, అల్ట్రాసౌండ్, స్కోప్స్, కార్డియాలజీ మోనిటర్స్, ఆర్థోడ్రిల్, వెంటిలేటర్లు, ఆపరేషన్ లైట్స్, ఎన్‌ఆర్‌ఆర్ వర్క్‌స్టేషన్, మెబైల్ ఎక్స్‌రే, ఈసీజీ మిషన్, డెఫ్రిబిరిలేటర్ తదితర కీలక వైద్య పరికరాలు మూలనపడ్డాయి. దీంతో వైద్య పరీక్షలు అవసరమైన రోగులు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. సాధారణ చికిత్సల కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఎంఆర్‌ఐ కోసం 750 మంది వెయిటింగ్
రేడియాలజీ విభాగంలోని ఎమ్మారై స్కానింగ్ మెషిన్ గత 15 రోజులుగా పనిచేయకపోవడంతో సుమారు 750 మంది రోగులు వేచిచూసే పరిస్థితి నెలకొంది. క్యాత్‌ల్యాబ్ పనిచేయకపోవడంతో వందలాది మంది రోగుల హార్ట్‌బీట్ ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేని దీనస్థితి. నూతనంగా ఏర్పాటు చేసిన 65 పడకల ఐసీయులో తప్పించి మిగిలిన టీఎంటీ, ఎస్‌ఐసీయు, కార్డియాలజీ, న్యూరోసర్జరీ, ఎన్‌ఆర్‌ఆర్, పోస్ట్ ఆపరేటివ్‌వార్డు తదితర విభాగాల్లో బీపీ, ఆక్సిజెన్ లెవల్స్, హార్ట్‌బీట్ చూపించే మానిటర్లు పనిచేయడంలేదు. గాంధీ ఆస్పత్రిలో మొత్తం 2400 వైద్యయంత్రాలు ఉండగా వాటిలో సింహభాగం చెడిపోయి గత కొన్నినెలలుగా మూలనపడ్డాయి. దీంతో వైద్యసేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
ఆందోళనలో కాంట్రాక్ట్ సిబ్బంది
గాంధీ ఆస్పత్రిలో అధికారికంగా 1012 పడకలు ఉండగా అనధికారికంగా మరో వెయ్యి మందికి వైద్యం అందిస్తున్నారు. పడకల సంఖ్య రెండువేలకు పెంచమని ఆస్పత్రి పాలనయంత్రాంగం పలుమార్లు చేపట్టిన ప్రతిపాదనలు ప్రభుత్వ పైళ్లలో మూలుగుతున్నాయి. గాంధీ ఆస్పత్రి అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులు మంజూరుచేస్తున్నప్పటికీ మౌలిక వసతులు, నిర్వహణ వ్యవహారాలను పట్టించుకోకపోవడంతో ఆ నిధులు సద్వినియోగం కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రోగుల సంఖ్య నానాటికీ పెరగడంతో పాటు రిటైర్మెంట్ ఇతర కారణాలతో వైద్యులు, సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారిపైనే అధికభారం పడడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బడ్జెట్ నిధులు కేటాయించకపోవడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులను సగంలోనే నిలిపివేశారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది నిరసనబాట పట్టారు.
బకాయిలు చెల్లిస్తేనే రిపేర్లు:ఫేబర్ సింధూరీ
పరికరాల మరమ్మతులు చేపట్టాలని వైద్యయంత్రాల నిర్వహణ కాంట్రాక్టు సంస్థ ఫేబర్ సింధూరీకి పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందించలేదని గాంధీ ఆస్పత్రి పాలనయంత్రాగం స్పష్టం చేసింది. అయితే, తమకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.200 కోట్లు బిల్లులు రావాల్సి ఉందని, అవి వచ్చిన తర్వాతే మరమ్మతులు చేస్తామని సదరు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తుండటం గమనార్హం.
అవును నిజమే..: సూపరింటెండెంట్
గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యమైన వైద్యయంత్రాలు పనిచేయకపోవడంతో సేవలకు ఆటంకం కలుగుతున్న మాట వాస్తమే. వైద్యయంత్రాల నిర్వహణ బాధ్యతలను ఫేబర్ సింధూరీ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. నిబంధనల ప్రకారం వైద్యయంత్రాల రిపేరుకు ఆస్పత్రి నిధులు కేటాయించే అవకాశం లేదు. త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment