![Emergency Health Services not Available In MGN - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/4/mgm111.jpg.webp?itok=rvA2sRDO)
ఎంజీఎం : ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనం.. రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం పేద రోగుల పాలిట శాపంగా మారాయి. పరికరాల మరమ్మతుకు సేబర్–సిందూరి ఏజెన్సీతో చేసుకున్న ఒప్పందం ఇటూ ఎంజీఎం పరిపాలనాధికారులకు.. అటూ ఆస్పత్రికి వచ్చే బాధితులకు నరకయాతన చూపిస్తున్నాయి. ఇలా ఆస్పత్రి అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడం.. ఆస్పత్రి చుట్టు ఉన్న ప్రైవేట్ ల్యాబ్, నర్సింగ్‌హోమ్‌ల దళారులకు వరంగా మారింది. సూపర్‌స్పెషాలిటీ సేవల లేమీతో కొంత మంది దళారులు అత్యవసర కేంద్రం వద్ద నిత్యం అడ్డా వేస్తూ... క్యాజువాలిటీ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందితో చేతులు కలిపి యథేచ్చగా రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షల పరికరాలు మరమ్మతులకు నోచుకోకపోవడం సైతం వారికి మరో ఆదాయ వనరుగా మారాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగుల జేబులకు చిల్లు పడుతోంది. ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి 20 రోజులు గడస్తున్న చిన్న పాటి సమస్యలు సైతం పరిష్కారం కాకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు.. అత్యవసర సేవలకు అపద్బాంధువుగా గుర్తుకు వచ్చే ధర్మాస్పత్రిలో రోజు, రోజుకూ వైద్యసేవలు పరిస్థితి అధ్వానంగా తయారు కావడంతో రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యసవర విభాగానికి (క్యాజువాలిటీ) వివిధ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, క్రిమి సంహారక మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడే బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరికి మెరుగైనా వైద్య చికిత్సలు అందించేందుకు, పూర్తి స్థాయిలో వారి యొక్క పరిస్థితులను గమనిస్తూ చికిత్సలు అందిచేందుకు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ల్యాబ్ ద్వారా పరీక్షలు చేస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా ఎమర్జెన్నీ ల్యాబ్‌లో లక్షల రూపాయాలు విలువ చేసే పరికరాలు సాంకేతిక లోపం వల్ల పనిచేయడం లేదు. అయితే వీటిని వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి లేకపోవడంతో అత్యసవరంగా చికిత్సలు అందించేందుకు అవసరమయ్యే రక్తపరీక్షలు కోసం రోగుల బంధుమిత్రులు ప్రైవేట్ కేంద్రాలకు పరుగులు తీసి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.
8 నెలలుగా నిలిచిపోయిన సీబీపీ పరీక్షలు
ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ల్యాబ్‌లో గత 8 నెలలుగా సీబీపీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడి మరమ్మతుకు నోచుకోకపోయిన పట్టించుకునే వారే కరువయ్యారు. ఆస్పత్రికి తీవ్ర కడుపునొప్పి, అపెండక్స్ వ్యాధితో బాధపడే రోగులతో పాటు రక్తహీనత కలిగిన రోగులకు సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు తప్పని సరి. ఇలాంటి రోగులకు సీబీపీ పరికరం ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్, హెచ్‌బి, డిఫినేషియల్ కౌంట్ వంటి రక్త నివేదికల ఆధారంగా వారికి వైద్య చికిత్సలు అందిస్తుంటారు. అంతేకాకుండా ఓపీ విభాగంలోని రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే పాథాలాజీ విభాగంలో సుమారు 45 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన పరికరం సైతం పనిచేయకపోవడంతో అది కాస్తా నిరుపయోగంగా మారింది. అతి కష్టం మీద అక్కడి సిబ్బంది రోజు మ్యానువల్ పద్ధతిలో 40 మంది ఓపీ రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు ప్రతి రోజు 100 నుంచి 150 మందికీ సీబీపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో సుమారు వంద మందికి పైగా రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ఒక్కొక్కరు రూ. 300 లు ఖర్చు చేయక తప్పడం లేదు.
మరమ్మతులకు నోచుకోని సీబీపీ పరికరం
సెమీ ఆటో ఎనలైజర్ పరికరం 4 నెలలుగా మూలకే
ఎంజీఎం ఎమర్జెన్సీ ల్యాబ్‌లోని సెమీ ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆ పరికరం నిరుపయోగంగా మారింది. దీంతో కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు నిర్వహించే సీరమ్ క్రియాటిన్ పరీక్షలు నాలుగు నెలలుగా చేయడం లేదు. ఈ రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్ళక తప్పడం లేదు. డయాలసిస్ చేసుకునే రోగులకు సిరమ్ క్రియాటిన్ పరీక్షలు తప్పనిసరి. ఈ వ్యాధితో బాధపడే రోగులు కొంత మంది వారానికి రెండు, మూడు సార్లు సైతం సీరమ్ క్రియాటీన్ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది.
నిరుపయోగంగా సెమీ ఆటో ఎనలైజర్
మూడు నెలలుగా ఏబీజీ పరికరం ..
ఎంజీఎం అత్యవసర విభాగంలో ఏబీజీ పరికరం ద్వారా అందించే రక్త పరీక్షల నివేదికలు కీలకం. ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతి రోజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారిని చికిత్స నిమిత్తం తరలిస్తుంటారు. వీరికి ఏబీజీ పరీక్షలు అవసరం. ఈ పరికరం ద్వారా రక్తంలో బ్లడ్, గ్లూకోజు, హెచ్‌బీ లెవల్స్ తెలిపే నివేదిక ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా వారికి వైద్యచికిత్సలు అందిస్తుంటారు. ఈ పరికరం గత మూడు నెలల క్రితం సాంకేతిక లోపం ఏర్పడి పనిచేయకపోయినా దృష్టి సారించిన దాఖాలా ల్లేవు. ప్రైవేట్ సెంటర్లలో ఏబీజీ పరీక్షల కోసం సుమారు 1100 రూపాయాలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ పరికరాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ల్యాబ్ రెండు ఏసీలు ఉండగా..ప్రస్తుతం ఓకే ఒక్క ఏసీ మాత్రమే పనిచేస్తుంది.
ఏబీజీ పరికరంలో సాంకేతిక లోపం
Comments
Please login to add a commentAdd a comment