Health services
-
పల్లె ‘నాడి’ పట్టడం లేదు..
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆరోగ్యం నా హక్కు’.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త నినాదమిది. ప్రతి వ్యక్తికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందాలనేది డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా నిర్దేశించి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన జీవనం అందుతుందని సూచిస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలపై నివేదకను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా విడుదల చేసింది. ఆయుష్మాన్ భారత్ పేరిట పేదలకు అరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల తీరు ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరువేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పేదరికంతో సతమతం... గ్రామీణ భారతంలో పేదలే ఎక్కువ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం నుంచి 47 శాతం మంది శస్త్రచికిత్సల కోసం రుణాలు తీసుకోవడం, అప్పులు చేస్తున్నారు. ఇక 20 శాతం నుంచి 28 శాతం మంది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికే నోచుకోవడం లేదు. పట్టణ ప్రాంత జనాభాతో పోలీస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 64% మంది వయసు మీదపడకముందే మరణిస్తున్నారు. ఇక దేశ జనా భాతో పోలిస్తే 6లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లక్ష్యాలు బాగున్నా... ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు వైద్య సేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు జీడీపీలో 5.8శాతం కాగా, భారత్ మాత్రం 1%మాత్రమే ఖర్చు చేస్తోంది. 195 దేశాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్ఓ పలు కేటగిరీల్లో దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఆస్పత్రి ప్రసవాల్లో 125వ ర్యాంకు, శిశు మరణాల్లో 135వ ర్యాంకుతో భారత్ సరిపెట్టుకుంది. కేటాయింపులు రెట్టింపు చేయాలి వైద్య రంగానికి ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు రెట్టింపు చేయాలి. అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు లేకపోవ డంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మెడికల్ టీచర్స్ -
Andhra Pradesh: చేరువలో చికిత్స
అందిస్తున్న వైద్య సేవలు ఇలా.. ►ప్రతి వార్డుకు 2–3 కి.మీ దూరంలోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో క్లినిక్ ఉంటుంది. ►గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బందిని అందుబాటులోకి తెచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,920 మంది ఉద్యోగులను ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లకు మంజూరు చేసింది. నియామకాలు దాదాపు పూర్తయ్యాయి. ►గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్‌పేషెంట్ విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది. ►గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శాఖ అమలు చేసే ఆరోగ్య కార్యక్రమాలన్నీ అర్బన్ హెల్త్ క్లినిక్‌లతో పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ►పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఆరు ఆరోగ్య కేంద్రాలను ఒక క్లస్టర్‌గా చేసి, అక్కడ ఈ సేవలు అందించేందుకు ఇప్పటికే వైద్య శాఖ అల్ట్రాసౌండ్ మిషన్లను కొనుగోలు చేసింది. సాక్షి, అమరావతి: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జనాభా 9 లక్షలు. టీడీపీ హయాంలో ఇక్కడ 13 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. అంటే సుమారు 70 వేల మందికి ఒకటన్న మాట. వీటిలోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండేది. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న సమస్యలకు కూడా జీజీహెచ్కువెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రైవేట్ క్లినిక్‌లను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. నగరంలో ఉన్న 13 ఆరోగ్య కేంద్రాలకు అదనంగా మరో 17 కలిపి మొత్తంగా 30 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యాయి. అదే విధంగా విశాఖలో గతంలో 24 ఆరోగ్య కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 63 ఉన్నాయి. విజయవాడలో గతంలో 29 ఉండగా, ప్రస్తుతం 41 అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు, విశాఖ, విజయవాడ నగరాల తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేరువ చేసింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇందుకోసం నగర, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 73 మున్సిపాలిటీల్లో కేవలం 259 అర్బన్ ప్రిలిమినరీ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో.. పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు సర్కార్ వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్ జగన్ సర్కార్ గుర్తించింది. వీటిని అధిగమించి వారికి వైద్యం మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. 25 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేయడంలో భాగంగా గత టీడీపీ హయాంలో ఉన్న 259కి అదనంగా మరో 301 కేంద్రాలను కలిపి, మొత్తంగా 560 క్లినిక్‌ల ఏర్పాటుకు సంకల్పించింది. ప్రస్తుతం 542 చోట్ల వైద్య సేవలు అందుతున్నాయి. టెలీ మెడిసిన్‌తో అత్యాధునిక వైద్యం 542 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు సగటున 18,970 మంది వైద్య సేవలు పొందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 43,10,363 మంది వైద్య సేవలు పొందారు. క్లినిక్‌లలో టెలీమెడిసిన్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిషన్ వంటి స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సైతం ప్రజలకు ఇక్కడే లభిస్తోంది. ఇలా 7.86 లక్షల మంది టెలీ మెడిసిన్ సేవలు పొందారు. 216 రకాల మందులు, 60 రకాల వైద్య పరీక్షలు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. వైద్య పరీక్షల కోసం సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్, 3–పార్ట్ హెమటాలజీ అనలైజర్ సహా పలు పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గత 9 నెలల్లో 7.51 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులను నేరుగా రోగుల వాట్సాప్కే పంపుతున్నారు. ఈహెచ్‌ఆర్ (ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్) విధానంలో రోగులకు అందించిన వైద్య సేవల వివరాలను వారి డిజిటల్ హెల్త్ ఖాతాల్లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 15.09 లక్షల మంది హెల్త్ రికార్డులను వారి డిజిటల్ హెల్త్ ఖాతాలకు అనుసంధానించారు. సొంత భవనాల నిర్మాణం క్లినిక్‌ల కోసం సొంత భవనాలు సమకూర్చడంపైనా నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న 184 సొంత భవనాలకు మరమ్మతులు చేపట్టింది. మిగిలిన వాటి కోసం కొత్త భవనాల నిర్మాణం చేపడుతోంది. కొత్త భవనం నిర్మాణానికి రూ.80 లక్షలు, మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలా రూ.374.61 కోట్లతో సొంత భవనాలను సమకూరుస్తున్నారు. నిర్మాణం పూర్తయిన 116 కొత్త భవనాలను ప్రారంభించి, వాటిల్లో సేవలు మొదలుపెట్టారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే లక్ష్యం ప్రాథమిక వైద్యం కోసం పట్టణ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను వారికి చేరువ చేస్తున్నాం. జాతీయ ప్రమాణాలతో వనరులు సమకూరుస్తున్నాం. నగర, పట్టణ ప్రజలు క్లినిక్‌లలో వైద్య సేవలు వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ త్వరలో ‘అల్ట్రా సౌండ్’ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా 90 కేంద్రాలకు స్కానింగ్ పరికరాలు సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో 542 ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో చిన్న మున్సిపాలిటీల్లో కనీసం ఒకటి, పెద్ద మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆరు ఆరోగ్య కేంద్రాలకు ఒకటి చొప్పున 90 అ్రల్టాసౌండ్ స్కానింగ్ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఒక్కో పరికరం రూ.2.45 లక్షల చొప్పున 90 పరికరాలను రూ.2,20,50,000తో కొనుగోలు చేసింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు అందించేందుకు వీలుగా ఆయా ఆస్పత్రులు, డయగ్నోసిస్ సెంటర్లను ప్రీ–కాన్సెప్షన్, ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) చట్టం కింద రిజి్రస్టేషన్ చేయాల్సిందిగా డీఎంహెచ్ఓలందరికీ వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవ్వగానే సేవలు ప్రారంభిస్తామని పట్టణ ఆరోగ్య కేంద్రాల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా నగరాలు, పట్టణాల్లోని గర్భిణులకు కడుపులో ఉమ్మ నీరు స్థాయి, పుట్టబోయే బిడ్డకు వెన్నెముక, గుండె, ఇతర సమస్యలేమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వీటితో పాటు సాధారణ ప్రజలకు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా కడుపునొప్పి, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీవాపు, అపెండిక్స్, ఇతర సమస్యలను నిర్ధారించవచ్చు. కాగా, విశాఖపట్నంలో 11, విజయవాడలో 8, గుంటూరులో 4, మిగతా నగరాలు, పట్టణాల్లో 3, 2, 1 చొప్పున ఈ పరికరాలను ఏర్పాటు చేశారు. -
వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!
ఇటీవల చిన్న ఆరోగ్య సమస్య వస్తే సంప్రదించడానికి బాగా పరిచయం, వైద్య వృత్తిలో ఐదారు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం, ఎండీ జనరల్ మెడిసిన్ డిగ్రీ ఉన్న ఒక సీనియర్ జన రల్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్లాం. డాక్టర్ చాలా విపులంగా పరీక్ష చేశారు. బహుశా ఆయన స్పెషలిస్ట్ కాకపోవడం వల్లనే ఇలా పరీక్షించగలిగారు. అదే ఏ స్పెషాలిటీ ఆసుపత్రికో కన్సల్టేషన్ కు పోతే ఆ అనుభవమే వేరు. రోగి వంటిమీద ఏ స్పెషలిస్టయినా చెయ్యి వేయడం కానీ, స్టెత్ పెట్టి చూడడం కానీ సాధారణంగా ఉత్పన్నం కాదు. స్పెషలిస్టుల అప్పాయింట్మెంట్ దొరకడం, కలవడం ఒక ప్రహసనం. భారీ మొత్తంలో కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించుకుని, గంటలకొద్దీ వెయిట్ చేసి, బయటనే పారా మెడికల్ వ్యక్తితో బీపీ, సాచ్యురేషన్, బరువు ఇత్యాదులు చూపించుకుని, స్పెషలిస్టును కలిసీ కలవడంతోనే సమస్య విని, తక్షణమే ఖరీదైన డయాగ్నాస్టిక్ పరీక్షలు చేయించాలి అంటారు చాలామంది. రిపోర్టులు వచ్చిన తరువాత చాలా మంది స్పెషలిస్టులు పూర్తిగా వాటి ఆధారంగా చికిత్స మొదలు పెట్టడమే కాని క్లినికల్‌గా కోరిలేట్ చేసుకోవడం ఆరుదేమో అనాలి. పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్టుల దగ్గర, వాళ్లు చూడడానికి ముందు ఒక సహాయక డాక్టర్ రోగి వివరాలు తీసుకుంటారు. ఆ వివరాల మీదా, రేడియాలజీ, పాథాలజీ పరీక్షల రిపోర్టుల మీదా ఆధారపడి సాగు తున్నది ఆధునిక వైద్యం. ఇది మంచిదా కాదా అంటే జవాబు చెప్పగలిగేవారు ఆ రంగానికి చెందిన నిపుణులే. వైద్యరంగంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పులు, అభివృద్ధి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సిందే కాని, వాటి మరో కోణం కొంత ఆందోళనకు దారి తీస్తుంది అనడం తప్పుకాదేమో! ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్ చదువుతో ఆపి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రయివేట్ ప్రాక్టీసో చేసుకునేవారు. ఎక్కువలో ఎక్కువ జనరల్ మెడిసిన్, లేదా జనరల్ సర్జరీ చదివేవారు. వారిదగ్గరికి పోయిన రోగికి చికిత్స చేసే క్రమంలో రోగి నాడి చూడడం దగ్గరనుండి, స్టెతస్కోప్ వంటిమీద పెట్టి రోగ నిర్ధారణ చేయడంతో సహా, బీపీ చూడడం, అవసరమైన వారికి స్వయంగా ఇంజక్షన్ ఇవ్వడం, కట్టు కట్టడం లాంటి అనేకమైన వాటిని డాక్టర్ స్వయంగా చేసేవాడు. రోగికి ఎంతో తృప్తి కలిగేది. వారే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎప్పుడైతే స్పెషలిస్టులు వైద్య రంగంలో పెరిగిపోసాగారో, ఒక్కో రుగ్మతకు ఒక్కో డాక్టర్ అవసరం పెరగసాగింది. ఈ నేపథ్యంలో, ఎంబీబీఎస్ తప్ప అదనపు స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ లేని ప్రజా వైద్యుడు, 50–60 సంవత్సరాల క్రితమే వృత్తిపరంగా రోగుల అన్నిరకాల రుగ్మతలకు తన అనుభవాన్ని ఆసాంతం రంగరించి చికిత్స చేసిన మహా మనీషి, ఖమ్మం జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) అనుభవం నుంచి ప్రతి వైద్యుడూ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, ‘స్పెషలిస్టు’ డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. అధికశాతం జనరల్ ప్రాక్టీషనర్లే. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన వారే. ప్రముఖులతో సహా పలువురికి, ఆయన అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. బహుశా ఖమ్మం పట్టణంలో మొదటి టాన్సిల్ ఆపరేషన్ చేసింది ఆయనేనేమో. అలాగే వేసెక్టమీ ఆపరేషన్లు ఖమ్మంలో ప్రారంభించిది కూడా ఆయనే. డాక్టర్ రాధాకృష్ణమూర్తి చేసిన ఆపరే షన్లలో, ఈ రోజుల్లో స్పెషలిస్ట్ వైద్యులు మాత్రమే చేస్తున్న హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్ లాంటివి కూడా వున్నాయి. ఎవరూ చేపట్టని ధనుర్వాతం కేసులకూ ఆయన చికిత్స అందించేవారు. అప్పట్లో క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించారు రాధాకృష్ణమూర్తి. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే ‘ఆర్టిఫీషియల్ న్యూమో థొరాక్స్’ అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను ‘కొలాప్స్’ చేసే పద్ధతి పాటించే వారు. ఎముకలు విరిగినవారికి ప్లాస్టర్ వేసి బాగు చేయడం డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. ఇంకా కొంచెం వెనక్కు పొతే, ఆర్ఎంపీల ప్రాక్టీసు చేసిన రోజులు జ్ఞప్తికి వస్తాయి. నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా ‘సుస్తీ‘ చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము–తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలికా వైద్యులు, ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. వారిలో కొందరికి ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లుయెంజా, మలేరియా–చలి జ్వరం) ఏపీసీ ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. గ్రామాలలో ‘గత్తర’ (కలరా), ‘స్పోటకం– పాటకం’ (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు ‘దద్దులు’, ‘వంచెలు’ కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, ‘టీకాలు’ వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. ఊళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని సమీపంలోని పట్టణానికి పోయే వాళ్లు. వారి వెంట (ఆర్ఎంపీ) డాక్టర్ కూడా వెళ్లేవాడు. (క్లిక్ చేయండి: ‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి) ఇప్పుడైతే ప్రతిచోటా వందలాది మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, మల్టీ సూపర్ స్పెషలిస్టులు, వందల–వేల నర్సింగ్ హోంలు, సూపర్ స్పెషాలిటీ– మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు; వాటికి ధీటుగా, మరింత మెరుగ్గా ప్రభుత్వ రంగంలో, వివిధ అంచెలలో అన్నిరకాల వైద్యసేవలు, అందరికీ ఉచి తంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. డయాగ్నాస్టిక్ పరీక్షలన్నీ ప్రభుత్వ పరంగా అన్ని స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా లభ్యమవు తున్నాయి. భవిష్యత్తులో, బహుశా క్వాలిఫైడ్ డాక్టర్ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదేమో! అయినా ఎక్కడో, ఎందుకో, ఏదో కానరాని వెలితి! (క్లిక్ చేయండి: కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!) - వనం జ్వాలా నరసింహారావు తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ -
డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్
-
పేదరికంలోకి 50 కోట్ల మంది.. ఇక సమయం లేదు: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా: వైద్య సేవల కోసం తమ సొంతంగా ఖర్చు చేయాల్సి రావడంతో దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువ మంది తీవ్ర పేదరికంలోకి నెట్టివేయబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రజలు వైద్య సేవలు పొందే సామర్ధ్యంపై కోవిడ్ 19 ప్రభావం గురించి ఎత్తి చూపుతూ పై విధంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రెండు కొత్త నివేదికలను ప్రకటించింది. కోవిడ్ నుంచి కోలుకొని మరింత మెరుగ్గా నిర్మించుకునేందుకు ప్రయత్నించాలని అన్ని దేశాలను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అలాగే కొన్ని మార్గదర్శకాలను అందించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విషయంలో గత రెండు దశాబ్దాలుగా సాధించిన ప్రపంచ పురోగతిని కోవిడ్ మహమ్మారి ఆపే అవకాశం ఉందని పేర్కొంది. మహమ్మారికి ముందే తమ సొంత ఆరోగ్యం ఖర్చుల కారణంగా 50 కోట్ల ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారని పేర్కొంది. ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగిందని అంచనా వేస్తున్నాయి. పేదరికం పెరగడం, ఆదాయాలు తగ్గడం ప్రభుత్వాలు కఠినమైన ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నందున ఆర్థిక కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ బ్యాంక్ అందించిన నివేదికలు హెచ్చరించాయి. చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్ కేసులు.. ‘ఏప్రిల్ నాటికి వేల సంఖ్యలో మరణాలు’! 2020లో కోవిడ్ ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగించిందని, అదే విధంగా 1930 తరువాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమైందని పేర్కొంది. దీని వలన ప్రజలు సంరక్షణ కోసం చెల్లించడం కష్టతరంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కోవిడ్‌కు ముందు దాదాపు బిలియన్‌మంది ప్రజలు(100కోట్లు) తమ సంపాదనలోని 10శాతం ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రపంచ బ్యాంకుకు చెందిన బువాన్ ఉరిబె వెల్లడించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీని వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. చదవండి: యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వాలు వైద్య సేవలపై ఖర్చు చేసే వ్యయాన్ని పెంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఉరిబె తెలిపారు. మహమ్మారికి ముందు 68 శాతం మందికి అత్యవసర వైద్య సేవలు అందేవని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. తమ శక్తికి మించి ఆరోగ్య ఖర్చులు చేస్తున్న కుటుంబాలలో 90 శాతం వరకు ఇప్పటికే దారిద్య్ర రేఖ దిగువన ఉన్నాయని పేర్కొంది. ఇంకా ఏ మాత్రం సమయం లేదని, ప్రపంచ దేశాలన్ని ఆర్థిక పరిణామాలకు భయపకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేవలు పొందగలరని తమ పౌరులకు నమ్మకం కలిగించాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాంటి ప్రయత్నాలను వెంటనే ప్రారంభించి, వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దీనర్థం వైద్య సేవలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని, అలాగే ఇంటికి సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెంచాలన్నారు. మహమ్మారికి ముందు సాధించిన పురోగతి అంత బలంగా లేదని, ఈసారి భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులు ఇచ్చే షాక్‌లను తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలని పేర్కొన్నారు. యూనివర్సల్హెల్త్ కవరేజ్ దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పేదలు వైద్యం కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి నుంచి వారిని మినహాయించాల్సి ఉందని ఆరోగ్య సంస్ధ వెల్లడించింది. అందుకోసం పేద, బలహీన వర్గాలకు సేవలు అందించేలా పథకాలు రూపొందించాలని కోరింది. WHO/@WorldBank report on progress towards #HealthForAll reveals that more than half a billion people were being pushed into poverty due to health care costs and disruption in health services even before the #COVID19 pandemic https://t.co/yCt340TG2d #UHCDay pic.twitter.com/hPDqBxbLTe — World Health Organization (WHO) (@WHO) December 12, 2021 -
ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు ఎస్బీఐ కృషి
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా ఆరోగ్య అత్యవసర సేవల కల్పనకు కృషి చేస్తుందని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ (ఆర్ అండ్ డీబీ) చల్లా శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆయన కోఠి లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఏటీఎంతో పాటు క్యాష్ డిపాజిట్ మిషన్ (సీడీఎం), స్టేట్మెంట్ ప్రింటింగ్ మిషన్లతో కూడిన ఈ–కార్నర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవిడ్–19 నేపథ్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద ఎస్బీఐ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులను అందించాలని భావిస్తోందని, ఇందులో భాగంగా ఎంపికచేసిన ఆస్పత్రులకు అంబులెన్సులను అందిస్తున్నామన్నారు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి ఒక అంబులెన్స్‌ను అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది రూ.2కోట్లు సీఎస్ఆర్ కింద ఖర్చు చేసినట్లు ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 కోట్లు అదనంగా ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. -
ఆరోగ్య సంరక్షణలో వలంటీర్ల సేవలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ఇంటివద్దే సేవలందిస్తుండటాన్ని కేంద్ర ఆరోగ్య మిషన్ ప్రశంసించింది. ఆరోగ్య సేవలు పటిష్టం చేసేలా ఆశా కార్యకర్తలకు వారు సహకరిస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలో ఆరోగ్య సేవలు బాగున్నాయని కితాబిచ్చింది. జిల్లా ఆసుపత్రుల్లో టెలికన్సల్టేషన్ హబ్‌ల ఏర్పాటు, సబ్‌హెల్త్ సెంటర్లలో సాంకేతిక సేవలు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లకు సంబంధించి ఏప్రిల్ 2018– నవంబరు 2020 వరకు వివరాలను మిషన్ వెల్లడించింది. ఆ వివరాలివీ... జాతీయ సగటు కంటే మెరుగ్గా.. తల్లులు, నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య సూచికల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. రాష్ట్రంలో జీవనశైలి వ్యాధులు 60 శాతం, 12 శాతం వృద్ధుల జనాభా అంశాలు భారంగా ఉన్నాయి. నిర్దేశిత లక్ష్యంలో 40 శాతం సబ్ హెల్త్ సెంటర్లను రాష్ట్రం ఏర్పాటు చేసింది. విజయనగరం, విశాఖపట్నం, వైఎస్సార్ కడప జిల్లాల్లో 549 హెల్త్, వెల్నెస్ సెంటర్లు నడుస్తున్నాయి. స్వయం సహాయక బృందాల ఉద్యమం ద్వారా మహిళా గ్రూపుల రాష్ట్ర వ్యాప్త నెట్‌వర్క్‌ను రూపొందించడంలో ఏపీ దేశానికి మార్గదర్శనం చేసింది. తద్వారా ఆరోగ్యం, సమాజ సంబంధాలు పెంచింది. రాష్ట్రంలో ఇటీవలే ఆశ కార్యకర్తలకు స్థిరమైన వేతనం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం.. ఆరోగ్య, సంరక్షణ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో రాష్ట్రం ముందుంది. సబ్‌హెల్త్ సెంటర్, హెల్త్ వెల్త్ సెంటర్ల స్థాయిలో ఈ–ఔషధి వాడకం, జిల్లా ఆసుపత్రుల్లో టెలికన్సల్టేషన్ హబ్‌లు ఏర్పాటు చేసి ఈ–సంజీవని వినియోగిస్తోంది. ప్రజల సమాచారం సేకరణ నిమిత్తం సీపీహెచ్సీ–ఎన్సీడీ అప్లికేషన్‌ను వినియోగిస్తోంది. ఫిట్æ వర్కర్ ప్రచారంలో భాగంగా సేకరించిన హెల్త్ వర్కర్ స్క్రీనింగ్ డాటాను అనుసంధానించడానికి ఈ అప్లికేషన్ అభివృద్ధి చేస్తున్నారు. పట్టణ పీహెచ్‌సీలను ఈ–పీహెచ్‌సీలుగా మార్చారు. టెలికన్సల్టేషన్ సౌకర్యం, రోగుల వివరాలను సాంకేతిక వ్యవస్థతో నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ హెచ్‌డబ్ల్యూసీని ఏర్పాటు చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. కరోనా సమయంలో ఎస్‌హెచ్‌సీ–హెచ్డబ్ల్యూసీ బృందాలు ప్రజలకు సేవలు అందించడంతోపాటు ఇతర రోగులకు విస్తృత సేవలు అందించాయి. ఏపీ అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయి. ప్రస్తుత పురోగతిని బట్టి డిసెంబరు 2022 నాటికి రాష్ట్రంలో అన్ని హెచ్డబ్ల్యూసీలు కార్యరూపంలోకి రానున్నాయి. 2,89,483 వెల్నెస్ సెషన్లు.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై ఆరోగ్య వైద్యసదుపాయాల కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,125 కాగా కేంద్రం రూ.1,418 ఖర్చు చేస్తోంది. జనాభాను బట్టి ప్రాథమిక వైద్య సేవలకు సంబంధించి రాష్ట్రంలో 7,178 ఎస్హెచ్సీలు అవసరం కాగా 7,437 ఉన్నాయి. పీహెచ్‌సీలు 1,183కిగానూ 1,145 ఉన్నాయి. అర్బన్ పీహెచ్‌సీలు 359కిగానూ 364 ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 2,89,483 వెల్నెస్ సెషన్లు నిర్వహించారు. -
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్: బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది చేదువార్తే. ఎందుకంటే వీసా ఫీజులతోపాటు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఆరోగ్య సేవల సర్‌చార్జి భారీగా పెరగనుంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జి (ఐహెచ్ఎస్) ఏడాదికి 400 పౌండ్లు (రూ.38 వేలు) మాత్రమే ఉండగా.. తాజా బడ్జెట్ ప్రకారం ఇది 624 పౌండ్లు (సుమారు రూ.60 వేలు)కు చేరుకోనుంది. వలసదారులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకే రుసుము పెంచుతున్నట్లు రిషి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బుధవారం బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ 470 (రూ.45 వేలు) పౌండ్లుగా ఉండనుంది. -
11 సెకన్లకో ప్రాణం బలి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో అంతరాలు పెరుగుతున్నాయా? కొన్నిదేశాల్లో గర్భిణులు, నవజాతశిశు మరణాలు గణనీయంగా తగ్గుతుంటే, మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందా? అంటే ఐక్యరాజ్యసమితి(ఐరాస) అవుననే జవాబిస్తోంది. సరైన వైద్య సౌకర్యాలు, పరిశుభ్రతలేమి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 సెకన్లకు ఓ గర్భిణి–బాలింత లేదా నవజాతశిశువు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. అందుబాటులో మెరుగైన వైద్యం, మందులు, పరిశుభ్రత, పోషకాహారంతో ఈ మరణాలను నివారించవచ్చని వెల్లడించింది. అధికాదాయం ఉన్న ధనికదేశాల్లో స్త్రీ, శిశు మరణాలు తగ్గుతుంటే, ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఐరాస అనుబంధ సంస్థలు సమర్పించిన నివేదికల్లోని వివరాలను ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోలేమని హెచ్చరించారు. ► గతేడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు సగానికి తగ్గిపోయి 53 లక్షలకు చేరాయి. ► ప్రసవ సమయంలో సమస్యలతో చనిపోయే గర్భిణుల సంఖ్య మూడోవంతు తగ్గింది. ఈ సంఖ్య 2000లో 4,51,000 ఉండగా, 2017 నాటికి 2,95,000కు పడిపోయింది. ► ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 28 లక్షల మంది మహిళలు, నవజాతశిశువులు చనిపోతున్నారు. ► పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఈ మరణాలన్నీ నివారించవచ్చు. ► ప్రతీ 11 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ బాలింత లేదా గర్భిణి లేదా నవజాతశిశువు ప్రాణాలు కోల్పోతున్నారు. ► ధనిక దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో గర్భిణులు/బాలింతల మరణాలు 50 రెట్లు ఎక్కువ. ► ఆఫ్రికా దేశాల్లోని చిన్నారులు అధికాదాయం ఉన్న దేశాల చిన్నారుల కంటే చనిపోయే అవకాశాలు 10 రెట్లు అధికం. ► 2018లో ఆఫ్రికాలో ప్రతీ 13 మంది చిన్నారుల్లో ఒకరు పుట్టిన ఐదేళ్లలోపే చనిపోయారు. యూరప్‌లో ఈ సంఖ్య ప్రతి 196 మందిలో ఒక్కరే. ► ఆఫ్రికాలో ప్రసవ సమయంలో ప్రతి 37 మంది గర్భిణుల్లో ఒకరు మరణిస్తున్నారు. యూరప్‌లో ప్రతి 6,500 మంది మహిళలకు గానూ ఒకరు మాత్రమే ప్రసవ సమయంలో కన్నుమూస్తున్నారు. ► అమెరికాలోలో ప్రసవ మరణాలు 58 శాతం పెరిగాయి. అమెరికాలో 2017లో ప్రతి లక్ష ప్రసవాల సందర్భంగా 19 మంది చనిపోయారు. -
స్తంభించిన వైద్య సేవలు
సాక్షి, కర్నూలు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు శుక్రవారం కొన్ని గంటల పాటు వైద్యసేవలు పూర్తిగా నిలిపివేశారు. ఆసుపత్రిలో రోగులకు ఓపీ టికెట్ కూడా ఇవ్వకుండా బంద్ చేయించారు. అనంతరం ఓపీ విభాగాల్లో వైద్యసేవలు అందిస్తున్న వైద్యులను బయటకు పంపించి తాళాలు వేశారు. ఓపీ విభాగాల నుంచి క్యాజువాలిటీకి చికిత్స కోసం వచ్చిన రోగులను సైతం సమ్మె తర్వాత రావాలంటూ తిప్పి పంపించారు. దీంతో పలువురు రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఆందోళన ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నారు’ అంటూ జూనియర్ డాక్టర్లను ప్రశ్నించారు. సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే తమకు వైద్యాన్ని నిరాకరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ‘మీ ఆందోళన కోసం రోగులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు.. వైద్యం చేయాలి’ అని వేడుకున్నారు. కనీసం మాత్రలను అయినా ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో సమ్మెకు గల కారణాలను రోగులకు జూనియర్ డాక్టర్లు వివరించే ప్రయత్నం చేశారు. ‘మీ సమస్యలన్నీ మాకు అర్థం కావని, మాకు వైద్యం చేయాలి’ అని చేతులెత్తి రోగులు.. జూనియర్ డాక్టర్లను వేడుకున్నారు. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలేమని సమ్మె అయిపోయాక రావాలంటూ వెనక్కి పంపించారు. కాగా ఓపీ కౌంటర్ వద్ద టికెట్లు ఇవ్వకపోవడంతో అక్కడ కూడా రోగులు తీవ్రంగా మండిపడ్డారు. అత్యవసర చికిత్సకోసం వెళ్లాలన్నా ఓపీ టికెట్ ఇవ్వాలని, అది కూడా ఇవ్వకుండా బంద్ చేస్తే ఎలాగంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా రోగులు, జూనియర్ డాక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పలువురు జూనియర్ డాక్టర్లు వార్డులకు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్లి విధుల్లో ఉన్న వైద్యులను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. దీంతో పలువురు వైద్యులు వార్డుల నుంచి బయటకు వెళ్లారు. పలు విభాగాల్లో అడ్మిషన్లో ఉన్న రోగులను ఇంటికి పంపించారు. సమ్మె జరుగుతున్న కారణంగా పీజీ డాక్టర్లు విధులకు హాజరుకావడం లేదని, సమ్మె ముగిశాక రావాలంటూ డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత తమకు ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే ఎలాగంటూ పలువురు రోగులు వైద్యులను ప్రశ్నించారు. కొండారెడ్డి బురుజు వద్ద రాస్తారోకో.. ఆసుపత్రిలో ఆందోళన చేసుకుంటూ అనంతరం వైద్య విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ఆసుపత్రి నుంచి మొదలై మెడికల్ కాలేజి, రాజ్‌విహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్‌రూమ్ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు చేరుకుంది.. అక్కడ వినూత్న తరహాలో రాస్తారోకో నిర్వహించారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గంటపాటు నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రైవేటు ఆసుపత్రుల బంద్ పాక్షికం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ, ఐపీ సేవలను స్తంభింపజేసిన వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం సేవలు కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే అధిక శాతం వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు బహిష్కరించిన అనంతరం పలువురు వైద్యులు నేరుగా వారి క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. అక్కడ చికిత్సకోసం వచ్చిన రోగులకు వైద్యం అందించారు. కాగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల బంద్‌కు ఐఎంఏ పిలుపునిచ్చిన విషయం విదితమే. వీరి పిలుపు మేరకు నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రమే బంద్ చేశాయి. అధిక శాతం ఆసుపత్రులు, క్లినిక్‌లను వైద్యులు తెరిచే ఉంచారు. గర్భసంచిలో పుండు ఉంటే చికిత్స కోసం కడప నుంచి వారం క్రితం వచ్చి ఆసుపత్రిలో చేరింది. జూడాల సమ్మె కారణంగా ఆమెకు ఆపరేషన్ వాయిదా వేస్తూ వచ్చారు. ఎక్స్‌రే తీయించుకునేందుకు డబ్బులు చెల్లించాలని వస్తే ఓపీ కౌంటర్ మూసివేయడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ఇంకా ఎన్నాళ్లు ఆపరేషన్ కోసం వేచి ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది. - సూరమ్ లక్ష్మీదేవి. దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామస్తుడు. కడుపులో గడ్డ ఉండటంతో చికిత్స కోసం వారం నుంచి ఆసుపత్రికి వచ్చి పోతున్నా చికిత్స చేసే నాథుడు లేడు. వ్యవసాయం చేసుకుని జీవించే తనకు ప్రైవేటు ఆసుపత్రిలో రూ.40వేలు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేదని, పెద్దాసుపత్రే తమకు దిక్కు అని, సమ్మె చేస్తే తనలాంటి వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించాడు. - పీర్ మహమ్మద్. -
వైద్య సేవలో.. మెదక్ సెకండ్
సాక్షి, మెదక్: వైద్యసేవలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పేద ప్రజలకు వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన 12 సేవల్లో ద్వితీయ స్థానాన్ని మైదక్ కైవసం చేసుకుంది. సేవలకు ఫలితం దక్కడంతో వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 7,28,478 మంది జనాభా ఉండగా వారందరి ఆరోగ్య ప్రొఫైల్‌ను జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో పొందుపర్చారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. దీంతోపాటు గర్భిణుల సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందశాతం డెలివరీలు చేయడం, అర్హులైన ప్రతి గర్భిణికి కేసీఆర్ కిట్లు అందజేయడం, ఎప్పటికప్పుడూ టీబీ కేసులను నమోదు చేసి రోగులకు కాలానుగుణంగా చికిత్స, మెడిసిన్ అందించడం, ఒకటి నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా రెండో స్థానం నిలిచింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసి సిబ్బందిని అభినందించారు. అందరి సహకారంతో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. -
యువతకు ఉపాధి కల్పిస్తాం: మంత్రి ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన స్థితిగతులు మెరుగుపరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఆళ్ల నాని తెలిపారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించడమే కాకుండా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది యువకులు మంత్రిని కలిసి తమ జీవనోపాధికి ఉద్యోగాన్ని కల్పించాలని కోరగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టపరుస్తున్నారని, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున వలం టీర్ల ఉద్యోగాలు కల్పిస్తున్నారని, యువత వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉపాధి సౌకర్యాలు కూడా కల్పిస్తుందని ఆయన చెప్పారు. వివిధ వృత్తుల్లో స్థిరపడటానికి ఆధునిక సాంకేతిక శిక్షణ కూడా యువతకు అం దించి వారి వృత్తుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుతామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందినప్పుడే తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయగలుగుతారని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధన అందించడానికి విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో యువత చదువుకునేలా ఆర్థిక ప్రోత్సాహం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని.. ప్రతిఒక్కరూ తమ పిల్లలను చదివించడానికే ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప తాత్కాలిక ప్రయోజనాల కోసం షాపుల్లోనో, ఇతర సంస్థల్లో పనిచేయించవద్దని సూచించారు. సమాజంలో ఆర్థిక ప్రగతి సాధించాలంటే ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాలని ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కల్పించే విధంగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఎక్కడైనా ప్రమాదం జరిగిన గర్భిణికి వైద్య సేవలు అందించడానికి అవసరమైన వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నెరుసు చిరంజీవి, ఎన్. సుధీర్‌బాబు, అంబికా రాజా, మధ్యాహ్నపు బలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు. నర్సుల సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న నర్సుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని చెప్పారు. నర్సుల అసోసియేషన్ నాయకులు మంత్రి నానిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందచేశారు. దీనిపై డిప్యూటీ సీఎం నాని స్పందిస్తూ నర్సులు అంకితభావంతో పనిచేయాలని ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలే తప్ప వారిపై విసుగు, కోపం చూపించకూడదని వచ్చిన ప్రతిఒక్కరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తే సగం వ్యాధి నయమైనట్లేనని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో వై ద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని నివేదిక రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అన్ని ప్రభుత్వాసుపత్రులను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చ ర్యలు తీసుకుంటున్నామని సిబ్బంది కూడా కష్టపడి పనిచేస్తే ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వపరంగా వైద్యరంగంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి ఎంతో చొరవ చూపుతున్నారని ఇందుకు నిదర్శనమే ఆశావర్కర్ల వేతనాల పెంపు అని మంత్రి అన్నారు. ప్రభుత్వాసుపత్రులలోనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసిందని, ఈ ఉద్యోగులకు కూడా ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చడానికి సీఎం జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సైనికుల్లా పనిచేయడానికి ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని, అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించి మళ్లీ ప్రజాభిమానాన్ని చూరగొంటామని మంత్రి నాని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దిరిశాల వరప్రసాద్, మధ్యాహ్నపు బలరాం, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నెరుసు చిరంజీవి, ఎన్.సుధీర్‌బాబు పాల్గొన్నారు. -
అందని అత్యవసర సేవలు
ఎంజీఎం : ప్రజా ప్రతినిధుల పట్టింపులేని తనం.. రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం పేద రోగుల పాలిట శాపంగా మారాయి. పరికరాల మరమ్మతుకు సేబర్–సిందూరి ఏజెన్సీతో చేసుకున్న ఒప్పందం ఇటూ ఎంజీఎం పరిపాలనాధికారులకు.. అటూ ఆస్పత్రికి వచ్చే బాధితులకు నరకయాతన చూపిస్తున్నాయి. ఇలా ఆస్పత్రి అత్యవసర విభాగంలో సేవలు నిలిచిపోవడం.. ఆస్పత్రి చుట్టు ఉన్న ప్రైవేట్ ల్యాబ్, నర్సింగ్‌హోమ్‌ల దళారులకు వరంగా మారింది. సూపర్‌స్పెషాలిటీ సేవల లేమీతో కొంత మంది దళారులు అత్యవసర కేంద్రం వద్ద నిత్యం అడ్డా వేస్తూ... క్యాజువాలిటీ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందితో చేతులు కలిపి యథేచ్చగా రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షల పరికరాలు మరమ్మతులకు నోచుకోకపోవడం సైతం వారికి మరో ఆదాయ వనరుగా మారాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగుల జేబులకు చిల్లు పడుతోంది. ఆస్పత్రిలోని సమస్యల పరిష్కారానికి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి 20 రోజులు గడస్తున్న చిన్న పాటి సమస్యలు సైతం పరిష్కారం కాకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కు.. అత్యవసర సేవలకు అపద్బాంధువుగా గుర్తుకు వచ్చే ధర్మాస్పత్రిలో రోజు, రోజుకూ వైద్యసేవలు పరిస్థితి అధ్వానంగా తయారు కావడంతో రోగులు నరకయాతన పడాల్సి వస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యసవర విభాగానికి (క్యాజువాలిటీ) వివిధ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, క్రిమి సంహారక మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడే బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వీరికి మెరుగైనా వైద్య చికిత్సలు అందించేందుకు, పూర్తి స్థాయిలో వారి యొక్క పరిస్థితులను గమనిస్తూ చికిత్సలు అందిచేందుకు క్యాజువాలిటీలోని ఎమర్జెన్సీ ల్యాబ్ ద్వారా పరీక్షలు చేస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా ఎమర్జెన్నీ ల్యాబ్‌లో లక్షల రూపాయాలు విలువ చేసే పరికరాలు సాంకేతిక లోపం వల్ల పనిచేయడం లేదు. అయితే వీటిని వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి లేకపోవడంతో అత్యసవరంగా చికిత్సలు అందించేందుకు అవసరమయ్యే రక్తపరీక్షలు కోసం రోగుల బంధుమిత్రులు ప్రైవేట్ కేంద్రాలకు పరుగులు తీసి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. 8 నెలలుగా నిలిచిపోయిన సీబీపీ పరీక్షలు ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ల్యాబ్‌లో గత 8 నెలలుగా సీబీపీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడి మరమ్మతుకు నోచుకోకపోయిన పట్టించుకునే వారే కరువయ్యారు. ఆస్పత్రికి తీవ్ర కడుపునొప్పి, అపెండక్స్ వ్యాధితో బాధపడే రోగులతో పాటు రక్తహీనత కలిగిన రోగులకు సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు తప్పని సరి. ఇలాంటి రోగులకు సీబీపీ పరికరం ద్వారా ప్లేట్లెట్ కౌంట్, హెచ్బి, డిఫినేషియల్ కౌంట్ వంటి రక్త నివేదికల ఆధారంగా వారికి వైద్య చికిత్సలు అందిస్తుంటారు. అంతేకాకుండా ఓపీ విభాగంలోని రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే పాథాలాజీ విభాగంలో సుమారు 45 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన పరికరం సైతం పనిచేయకపోవడంతో అది కాస్తా నిరుపయోగంగా మారింది. అతి కష్టం మీద అక్కడి సిబ్బంది రోజు మ్యానువల్ పద్ధతిలో 40 మంది ఓపీ రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో సుమారు ప్రతి రోజు 100 నుంచి 150 మందికీ సీబీపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ పరికరాలు పనిచేయకపోవడంతో సుమారు వంద మందికి పైగా రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఆశ్రయిస్తూ ఒక్కొక్కరు రూ. 300 లు ఖర్చు చేయక తప్పడం లేదు. మరమ్మతులకు నోచుకోని సీబీపీ పరికరం సెమీ ఆటో ఎనలైజర్ పరికరం 4 నెలలుగా మూలకే ఎంజీఎం ఎమర్జెన్సీ ల్యాబ్‌లోని సెమీ ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆ పరికరం నిరుపయోగంగా మారింది. దీంతో కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు నిర్వహించే సీరమ్ క్రియాటిన్ పరీక్షలు నాలుగు నెలలుగా చేయడం లేదు. ఈ రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్ళక తప్పడం లేదు. డయాలసిస్ చేసుకునే రోగులకు సిరమ్ క్రియాటిన్ పరీక్షలు తప్పనిసరి. ఈ వ్యాధితో బాధపడే రోగులు కొంత మంది వారానికి రెండు, మూడు సార్లు సైతం సీరమ్ క్రియాటీన్ పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంది. నిరుపయోగంగా సెమీ ఆటో ఎనలైజర్ మూడు నెలలుగా ఏబీజీ పరికరం .. ఎంజీఎం అత్యవసర విభాగంలో ఏబీజీ పరికరం ద్వారా అందించే రక్త పరీక్షల నివేదికలు కీలకం. ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతి రోజు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వారిని చికిత్స నిమిత్తం తరలిస్తుంటారు. వీరికి ఏబీజీ పరీక్షలు అవసరం. ఈ పరికరం ద్వారా రక్తంలో బ్లడ్, గ్లూకోజు, హెచ్‌బీ లెవల్స్ తెలిపే నివేదిక ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా వారికి వైద్యచికిత్సలు అందిస్తుంటారు. ఈ పరికరం గత మూడు నెలల క్రితం సాంకేతిక లోపం ఏర్పడి పనిచేయకపోయినా దృష్టి సారించిన దాఖాలా ల్లేవు. ప్రైవేట్ సెంటర్లలో ఏబీజీ పరీక్షల కోసం సుమారు 1100 రూపాయాలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ పరికరాన్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ ల్యాబ్ రెండు ఏసీలు ఉండగా..ప్రస్తుతం ఓకే ఒక్క ఏసీ మాత్రమే పనిచేస్తుంది. ఏబీజీ పరికరంలో సాంకేతిక లోపం -
మరిన్ని ఆరోగ్య సేవలు ప్రైవేటుపరం
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా రూ.వేల కోట్ల విలువైన ఆరోగ్య సేవలను ప్రైవేటు పరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల వేళ మిగిలిన వాటిని కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగించాలంటూ కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. లేదంటే మీపై చర్యలు తప్పవంటూ ఆరోగ్య శాఖ సలహాదారు, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. వందలాది కోట్ల రూపాయల విలువైన పనులు ఎవరికివ్వాలో ముందే నిర్ణయించి పేరుకు టెండర్లు నిర్వహిస్తున్నారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత టెలీ ఆఫ్తల్మాలజీ(కంటి పరీక్షలు) సేవలు ఓ కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా ప్రభుత్వ పెద్దలు ముందే నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.100 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు సదరు కార్పొరేట్ ఆస్పత్రికి దక్కేలా నిబంధనలు రూపొందించడమే ఇందుకు ఉదాహరణ అని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) కింద కేన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు చేసేందుకు టెండర్ పిలుస్తున్నారు. ఒక్కో జిల్లాలో రూ.70 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాల్సిన ఈ ఆస్పత్రులను కూడా ఓ కార్పొరేట్ కంపెనీకి కట్టబెడుతున్నారు. ఆ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులే టెండర్ డాక్యుమెంట్లు తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చారంటే.. ఇక టెండర్ల ప్రక్రియ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. రూ.550 కోట్లయ్యే ఈ ప్రాజెక్టు వారికి అప్పజెప్పడంతో పాటు ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేషెంట్లను కూడా అక్కడికే తీసుకెళ్లేలా నిబంధనలు రూపొందించడం గమనార్హం. టీబీ రోగులకు మందులు అందజేయడాన్ని కూడా ప్రైవేటుకు అప్పజెప్పి భారీగా లబ్ధి చేకూర్చేందుకు యత్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోగా అందినకాడికి దండుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శాఖ సలహాదారు నేతృత్వంలో.. వైద్య విద్యా శాఖ, మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థల్లోనే ఎక్కువ టెండర్లున్నాయి. ఈ రెండు విభాగాలకు ఎన్ఎండీ ఫరూక్ మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ పెద్దలే.. ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తుండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖకు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేటు కన్సల్టెంట్.. తనకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు దక్కేలా డాక్యుమెంట్లు రూపొందించి పనులు చక్కబెడుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. ఆయన ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఓ అధికారి సాక్షికి తెలిపారు. ఉన్నతాధికారులు, సలహాదారు నేరుగా ముఖ్యమంత్రితోనే మాట్లాడి ఇదంతా చేస్తున్నట్టు వివరించారు. పైగా ఇటీవల కాలంలో చాలామంది అధికారులు ఈ శాఖలో పనిచేయలేమంటూ బలవంతంగా బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దీంతో అన్ని విభాగాలకు ఒకరే ఇన్చార్జిగా ఉండటంతో.. వీరి పని మరింత సులువైంది. -
పడకేసిన ప్రాథమిక వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లో వైద్య సేవలు పడకేశాయి. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేక గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందడం లేదు. సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంతో వైద్యం చేసే నాథుడు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండటంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల ఆస్పత్రులకు వస్తున్న గర్భిణులు సైతం అక్కడ వైద్య సిబ్బంది లేక వెనుదిరుగుతున్నారు. దీంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. 294 వైద్య పోస్టుల ఖాళీలు.. పీహెచ్‌సీలు గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తుంటాయి. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు మొదలు ఒకస్థాయి వరకు అక్కడ వైద్య సేవలు పొందొచ్చు. మరోవైపు టీకాలు వేయడం కూడా పీహెచ్‌సీల ద్వారానే జరుగుతోంది. తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక–2017 ప్రకారం రాష్ట్రంలో 668 పీహెచ్‌సీలున్నాయి. వాటిల్లో 24 గంటలు పనిచేసేవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ప్రసవాలు సైతం చేస్తారు. అత్యవసర వైద్య సేవలూ అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు, ఒక సహాయకుడు ఉండాలి. కానీ అనేకం ఖాళీగా ఉన్నాయి. మొత్తం పీహెచ్‌సీల్లో 1,318 అల్లోపతి వైద్యుల పోస్టులకు గాను, 1,024 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని ఖాళీలను భర్తీ చేసినా పట్టణ పీహెచ్‌సీలతో కలుపుకుంటే 350 ఖాళీలున్నట్లు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. పైగా చాలా ఆస్పత్రుల్లో వైద్యులు కూడా విధులకు వెళ్లకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిపై పర్యవేక్షణ కూడా లేదు. దీంతో గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందడం గగనంగా మారింది. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ప్రసవాల కోసం గర్భిణులు ఎక్కువగా 24 గంటల పీహెచ్‌సీలకు వస్తున్నారు. అయితే అక్కడా సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో వారు దూర ప్రాంతాలకు వెళ్లలేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇతర వైద్య సిబ్బంది ఖాళీలూ అధికమే పీహెచ్‌సీలతోపాటు సబ్సెంటర్లలో 9,141 మంది ఆరోగ్య కార్యకర్తలు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 7,705 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 1,436 ఖాళీలున్నట్లు సదరు నివేదిక తెలిపింది. అంతేకాదు పీహెచ్‌సీల్లో ఆరోగ్య సహాయకులు 1,111 మంది ఉండాల్సి ఉండగా, 944 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 167 ఖాళీలున్నాయి. సీహెచ్‌సీలు మొదలుకుని పీహెచ్‌సీల్లో లేబొరేటరీ టెక్నీషియన్లు 765 మంది ఉండాల్సి ఉండగా, 566 మందే పనిచేస్తున్నారు. ఇంకా 199 ఖాళీలున్నాయి. వాటిల్లో నర్సులు 1,666 మంది ఉండాల్సి ఉండగా, 1,453 మందే ఉన్నారు. ఇంకా 213 ఖాళీలున్నాయి. పీహెచ్‌సీల్లో బ్లాక్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్ పోస్టులు 633 ఉండాల్సి ఉండగా, 544 మంది పనిచేస్తున్నారు. ఇంకా 89 ఖాళీలున్నట్లు నివేదిక తెలిపింది. పీహెచ్‌సీల్లో ఖాళీలున్నమాట వాస్తవమేనని, త్వరలో సర్దుబాటు చేసి వాటిని పటిష్టం చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
ఓపీ, డయాగ్నోస్టిక్ సేవలు నిలిపివేత..
రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వి.రామిరెడ్డి వనస్థలిపురంలో ఉంటున్నారు. ఆయనకు మంగళవారం ఉద యం చాతి నొప్పి వచ్చింది. అది గుండెపోటా? సాధారణ నొప్పా? అర్థంకాలేదు. దీంతో సమీపంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లారు. తన వద్ద ఉన్న ఈజేహెచ్ఎస్ కార్డును చూపించారు. ఈ పథకం కింద సేవలను నిలిపివేశామని, డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు రూ. 20 వేలు చెల్లించి ఆసుపత్రిలో చేరారు. వరంగల్ పట్టణానికి చెందిన ఆర్.వెంకటమ్మ మంగళవారం ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని నెట్వర్క్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాక్షి, హైదరాబాద్ : ఇలా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకం సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం నుంచి ఓపీ, డయాగ్నోస్టిక్, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇన్‌పేషెంట్ సేవల్ని నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు నోటీసులు కూడా ఇచ్చింది. రూ. 1,200 కోట్ల మేరకు బకాయిలు తీర్చడంలోనూ, చర్చలు జరపడంలోనూ సర్కారు విఫలం కావడంతో మంగళవారం ఉదయం నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు అనేక ఆసుపత్రుల వద్ద ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టారు. దీంతో కొందరు పేదలు, ఉద్యోగులు డబ్బులు చెల్లించి వైద్యం పొందగా, మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు కిటకిటలాడాయి. 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిపివేత... రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు అందించేందుకు 236 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులూ ఉన్నాయి. దీనికితోడు మరో 67 డెంటల్ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్ఎస్ రోగులకు మాత్రమే డెంటల్ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్‌తో కలిపి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు 303 ఉన్నాయి. అందులో మంగళవారం 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినట్లు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అందులో హైదరాబాద్‌లో 66, వరంగల్ జిల్లాలో 34, రంగారెడ్డిలో 32, మేడ్చల్‌లో 27, నిజామాబాద్‌లో 14, కరీంనగర్ జిల్లాలో 13, ఖమ్మంలో 10, మహబూబ్‌నగర్‌లో 8, నల్లగొండలో 6, సంగారెడ్డిలో 5, సిద్దిపేట, జగిత్యాలలో 4, నిర్మల్‌లో 2, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకటి చొప్పున నిలిపివేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారితో పాటు 5.6 లక్షల మంది ఉద్యోగులు, 25 వేల మంది జర్నలిస్టులకు ఈ 303 ఆసుపత్రులు సేవలు అందిస్తాయి. ప్రతి రోజు 10 వేల మంది ఔట్పేషెంట్లు, 3 వేల మంది ఇన్ పేషెంట్ల ఆరోగ్యశ్రీ రోగులు వస్తుంటారు. ఇప్పుడు ఔట్ పేషెంట్ల సేవలనే నిలిపివేశారు. అలాగే వైద్య పరీక్షలకు కూడా బ్రేక్ పడింది. ఇక ఉద్యోగులు వెల్నెస్ సెంటర్లకు వెళ్లగా, అక్కడ చికిత్సకాని వారికి ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ‘ప్రైవేటు’కు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. నిర్లక్ష్యంగా అధికారుల తీరు... వైద్య ఆరోగ్యశాఖ తీరు తీవ్ర నిర్లక్ష్యంగా ఉంది. ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు పాక్షికంగా నిలిచిపోయినా ఏమాత్రం పట్టించుకోలేదు. బకాయిలు పేరుకుపోయి రెండు మూడేళ్లలో 12 ఆసుపత్రులు మూతపడినా అధికారులు పట్టించుకోవడం లేదని నెట్వర్క్ ఆసుపత్రులు విమర్శిస్తున్నాయి. ఎన్నికల సమయంలో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. లక్ష్మారెడ్డి ఆపద్ధర్మ మంత్రి కావడంతో అధికారులే అంతా చూసుకోవాల్సి ఉన్నా మనకు పోయేదెముంది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాగా, డబ్బులిచ్చి వైద్యం చేయించుకున్నా రీయింబర్స్మెంట్ బిల్లులు పాస్ కావడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా రాష్టవ్యాప్తంగా రూ. 50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. -
సమ్మెలో 104 సిబ్బంది
పాడేరు : ఏజెన్సీలోని 104 వైద్యసిబ్బంది ఆకస్మికంగా సమ్మె చేపట్టడంతో మంగళవారం నుంచి గ్రామాల్లో ఈ సంచార వైద్య ఆరోగ్య సేవలు స్తంభించాయి. సిబ్బంది సమ్మెకు దిగడంతో ఏజెన్సీ 11 మండలాల పరిధిలోని ఏడు 104 సంచార వాహనాలు నిలిచిపోయాయి. 104 వాహనాల్లో పని చేస్తున్న వైద్యసిబ్బంది, వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, డ్రైవర్స్, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఏజెన్సీలోని సుమారు 50 మంది 104 సిబ్బంది విధులను బహిష్కరించారు. గత శనివారం బొబ్బిలి సమీపంలో 104 వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాద ఘటనలో 104 వాహనం నడుపుతున్న డ్రైవర్‌తోపాటు ఇందులో ఉన్న స్టాఫ్ నర్సు మృతి చెందారు. ఈ వాహనానికి సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ప్రమాదానికి గురై మృతి చెందిన సిబ్బందికి నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఇది వరకే 104 వాహనాలకు సరైన రికార్డులను నిర్వహించకపోవడంపై ఇందులో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఇప్పుడీ ప్రమాదం చోటు చేసుకోవడంతో 104 సిబ్బందిలో ఆందోళనకు దారితీసింది. దీంతో అత్యవసరంగా 104 సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇంటి ముంగిటకే నాణ్యమైన వైద్యం అందించాలని 2008లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఈ 104 సర్వీస్‌లను ప్రారంభించింది. డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్యశాఖ ఆధీనంలో సిబ్బందిని నియమించి ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు, కనీస వేతన చట్టాలు అమలు చేస్తూ జీవో నంబర్ 3 ప్రకారం జీతాలు చెల్లించేవారు. 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ 104 సేవలను చంద్రన్న సంచార చికిత్సగా మార్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీస్ ప్రొవైడర్‌గా బాధ్యతలను అప్పగించి 277 వాహనాలు, ఇందులో పని చేస్తున్న సిబ్బందిని టేకోవర్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. నాటి నుంచి 104 నిర్వహణ అలక్ష్యానికి గురైంది. వాహనాలకు సరైన రికార్డులు లేవని, ప్రతి నెలా చేయవలసిన సాధారణ తనిఖీలు, రిపేర్లు నిర్వహించడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని 104 డ్రైవర్లు తెలిపారు. ప్రమాదాలు లేదా ఏదైనా వాహనాలకు సంబంధించి అవాంతరాలు ఎదురైనప్పుడు డ్రైవర్ల తప్పిదం లేకపోయినా సంస్థ నిర్వాకం, ప్రభుత్వ అలక్ష్యం వల్ల తామే మూల్యం చెల్లించాల్సి వస్తోందని వారు వాపోయారు. 104 సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, కనీస వేతన చట్టాలను అమలు చేస్తూ జీవో 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని, వాహనాలకు సక్రమంగా రికార్డులు నిర్వహించాలని, వాహనాల కండిషన్ మెరుగుపర్చాలని సమ్మె చేపట్టిన పాడేరులోని 104 సిబ్బంది సతీష్ కన్నా, రామకృష్ణ, క్రాంతి, రవిచంద్ర, ఎస్.బాలరాజు డిమాండ్ చేశారు. -
‘ఆరోగ్యసేవలు’ కొనసాగుతాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు, జర్నలిస్టుల ఆర్యోగ సేవల పథకం(ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్) కొనసాగుతుందని మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో కేటీఆర్‌తో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు రవికుమార్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్ పథకంపై ఇటీవల వస్తున్న వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి లక్ష్మారెడ్డితో చర్చించి అందరికీ ఆమోద్యయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సమాచార శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. వెల్నెస్ సెంటర్లలో మందుల కొరత, కొన్ని ఆసుపత్రులు హెల్త్‌కార్డులను నిరాకరిస్తున్నాయని కేటీఆర్‌కు చెప్పారు. ఓ చానల్లో సీనియర్ సబ్ఎడిటర్గా ఉన్న కరీం అనే జర్నలిస్టు భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమె వైద్య ఖర్చులకు రూ.12 లక్షల ఎల్వోసీ ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
ఆధార్ లేకున్నా ఆ మూడింటికి ఢోకా లేదు
ఆధార్ లేకపోతే... ఇటీవల కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రేషన్ రాక, ఆకలి తట్టుకోలేక మృత్యువు బారిన కూడా పడుతున్నారు. అయితే ఆధార్ లేకపోయినా..... కనీస సేవలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని యూఐడీఏఐ ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య సేవలు, స్కూల్ అడ్మినిషన్లు, తక్కువ ధరలకు రేషన్ ఈ మూడు సర్వీసులను ఆధార్ లేకున్నా తప్పక ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఆధార్ నెంబర్ లేదని, కనీస సేవలు తిరస్కరించవద్దని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ లేకపోవడంతో, లబ్దిదారులకు సామాజిక సర్వీసులు అందించడం లేదు. అయితే నిజమైన లబ్ధిదారుడికి ఆధార్ లేదని ప్రయోజనాలను తిరస్కరించకూడదని ప్రభుత్వ ఏజెన్సీలకు 2017 అక్టోబర్ 24నే యూఐడీఏఐ నోటిఫికేషన్ జారీచేసింది. ఆధార్ లేదని, నిజమైన లబ్దిదారున్ని ఆసుపత్రిలో చేర్చుకోలేదని మీడియా రిపోర్టులు వెలువడిన సంగతి తెలిసిందే. గుర్గావ్లో ప్రభుత్వ ఆసుపత్రి ఆధార్ లేదని ఓ నిండు గర్భిణిని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆమె గేటు వద్దే ప్రస్తావించింది. దీనిపై పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయంపై మరోసారి యూఐడీఏఐ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు లేఖ రాసింది. ఆధార్ లేకపోతే, బేసిక్ సర్వీసులు అందించడం తిరస్కరించవద్దని హెచ్చరించింది. -
‘అమ్మ ఒడి’ సేవల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వైద్య సేవ లలో మరో ముందడుగు పడింది. అమ్మ ఒడి (102 సేవలు) విస్తరణ, కొత్తగా ద్విచక్ర అంబులెన్సులు, ఏఎన్ఎంలు వినియోగించే ద్విచక్ర వాహనాల (వింగ్స్) సేవలను సీఎం కేసీఆర్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా అమలవుతున్న జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పు అయిన మహిళను, శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. 2016 డిసెంబర్ 28న రాష్ట్రంలో అమ్మ ఒడి సేవలను ప్రారంభించారు. మొదటి దశలో 41 వాహనాలతో సేవలు మొదలయ్యాయి. జీవీకే ఈఎంఆర్ఐ భాగస్వామ్యంతో 102 వాహనాలకు విస్తరించింది. అయితే 12 జిల్లాల్లోనే ఈ సేవలను కొనసాగిస్తున్నారు. మిగతా జిల్లాల్లోనూ ఈ పథకం అమలుకు కొత్తగా 200 వాహనాలను కొనుగోలు చేశారు. ఈ వాహనాల సేవలు బుధవారం ప్రారంభం కానున్నాయి. అలాగే అత్యవసర సమయాల్లో వేగంగా రోగుల దగ్గరకు వెళ్లేందుకు వినియోగించే ద్విచక్ర అంబులెన్స్ సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సేవల కోసం 50 వాహనాలను కొనుగోలు చేశారు. మరోవైపు గ్రామీణ ఆరోగ్య సేవలలో కీలకమైన ఏఎన్ఎంల కోసం తక్కువ ధరతో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయించనున్నారు. ఈ వాహనాలను సైతం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏఎన్ఎంలకు పంపిణీ చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. -
కార్మిక వైద్యానికి ‘కార్పొరేట్’ షాక్!
బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మహేశ్ నరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఈఎస్ఐ కార్డుదారుడు కావడంతో అత్యవసర సేవల కింద సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఈఎస్ఐ ఇన్‌పేషెంట్ సౌకర్యం లేదని చెప్పడంతో బంజారాహిల్స్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఏకంగా ఈఎస్ఐ సేవలు అందించలేమంటూ బోర్డు కనిపించింది. దీంతో చేసేదేం లేక సొంత ఖర్చుతో చికిత్సకు సిద్ధమయ్యారు. సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఆరోగ్య సేవలు సంకటంలో పడ్డాయి. ఈఎస్ఐసీ చందాదారులకు వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం పేరిట నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. దాంతో అత్యవసర సేవల కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్న కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందకపోతుండటంతో అత్యవసర వైద్యం కోసం చాలా మంది కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ ఆ ఆస్పత్రులు చికిత్సకు నిరాకరిస్తుండటంతో వెనుదిరుగుతున్నారు. 14.6 లక్షల ఈఎస్ఐ కార్డులు.. రాష్ట్రవ్యాప్తంగా 14.6 లక్షల ఈఎస్ఐ కార్డులున్నాయి. ఒక్కో కార్డుపై సగటున నలుగురు సభ్యులున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 58.4 లక్షల మందికి ఈఎస్ఐసీ సేవలు అందాలి. ఈఎస్ఐసీ సేవల నిమిత్తం ఒక్కో కార్డుదారుడు తన వేతనం నుంచి 6.5 శాతం మొత్తాన్ని నెలనెలా కాంట్రిబ్యూషన్ కింద చెల్లిస్తున్నాడు. ఈఎస్ఐకి నెలకు దాదాపు రూ.70 కోట్ల వరకు రాష్ట్రంలోని కార్మికులు చెల్లిస్తుండగా.. ప్రభుత్వం కూడా తనవాటా విడుదల చేస్తోంది. ఈఎస్ఐసీ ఆస్పత్రుల పరిధిలో అందని సేవలను గుర్తింపు పొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈక్రమంలో హైదరాబాద్‌లోని 39 కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఈఎస్ఐసీ గుర్తింపు ఉంది. అయితే మెజారిటీ ఆస్పత్రులు ఈఎస్ఐసీ సేవలకు మంగళం పాడాయి. కొన్ని ఆస్పత్రులు ఏకంగా సేవలందించట్లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కార్మికుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. చెల్లింపుల్లో జాప్యమే కారణం! కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈఎస్ఐ సేవల పరిస్థితి ఏడాది కాలంగా గందరగోళంగా మారింది. సకాలంలో బిల్లులు ఇవ్వట్లేదనే ఆరోపణలతో సేవలు నిలిపేస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. 6 నెలలు, ఏడాది పాటు నిధులే ఇవ్వట్లేదని, దీంతో తప్పని పరిస్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. 11 ఆస్పత్రులకు నోటీసులు.. ఈఎస్ఐసీ కార్డుదారులకు సేవలందించకపోవడంపై కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో స్పందించిన ఈఎస్ఐసీ అధికారులు ఇప్పటివరకు 11 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా స్పందించి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
వైద్యుల డిప్యుటేషన్లు రద్దు
వైద్య ఆరోగ్యశాఖకు సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అక్రమ డిప్యుటేషన్లను తక్షణమే రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆçస్పత్రుల్లో డిప్యుటేషన్లు పెద్దఎత్తున ఉన్నాయి. డీఎంఈ పరిధిలోని బోధనాసుపత్రుల్లో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు అనేకమంది డిప్యుటేషన్లపై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. పీజీ పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరి వైద్యం కింద ఏడాది కాలానికి పనిచేయాలి. అలా దాదాపు 900 మందికి సీనియర్ రెసిడెంట్లుగా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినా అందులో 300 మంది పైరవీలతో హైదరాబాద్ సహా అనుకూల ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇక ప్రొఫెసర్లు, ఇతర వైద్యులు 150 మంది వరకు వారికి పోస్టింగ్ ఇచ్చినచోట కాకుండా మరో ప్రాంతంలో పనిచేస్తున్నారు. మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా తదితర ఆస్పత్రుల్లో దాదాపు 100 మంది తమకు ఇష్టమైనచోట పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పాగా... గ్రామీణ పేద రోగులకు ఆరోగ్య సేవలు అందించాల్సిన వైద్యులు పట్టణాలు, నగరాలకు పరిమితమవడంపై సీఎం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అలాగైతే గ్రామీణ పేదలకు వైద్యం చేసే వారు ఎవరని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో అక్కడే పనిచేయాలని... ఇతర ప్రాంతాల్లో పనిచేయడాన్ని నిరోధించాలని సీఎం గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో డిప్యుటేషన్లను రద్దు చేసే అవకాశముంది. -
గ్రామాల్లో ఆరోగ్య సేవలకు 10588
న్యూఢిల్లీ: గ్రామీణులు తమ ప్రాంతంలో మాతాశిశువులకు ఉన్న ఆరోగ్య సౌకర్యాల గురించి విచారించుకోడానికి, ఫిర్యాదులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబరును ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు 10588 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే 90 సెకన్లలో కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడి సిబ్బంది వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తారు. కాల్ సెంటర్‌ను తెలుగు సహా ఏడు భాషల్లో నిర్వహించనున్నారు. -
దిగివచ్చిన ప్రైవేటు ఆసుపత్రులు
ప్రభుత్వ హెచ్చరికతో 166 ఆసుపత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అనేక నెట్వర్క్ ఆసుపత్రులు చిన్నగా సమ్మె నుంచి బయటకు వస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పేదల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీని ఇష్టారాజ్యంగా సమ్మె పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని ఆసుపత్రులు రాజీ ధోరణికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 244 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులుంటే వాటిల్లో 166 ఆసుపత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయని... మిగిలిన 78 మాత్రమే సమ్మె చేస్తున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే 78 ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కార్యాలయం తెలిపింది. అత్యధికంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులే సమ్మెలో ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలావుంటే నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిపడిన సొమ్ములో సోమవారం రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం... మంగళవారం మరో రూ.130 కోట్లకు బీఆర్వో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. -
ప్రైవేట్ భాగస్వామ్యంతో మెరుగైన సేవలు
నెల్లూరు రూరల్: ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. సింహపురి స్పెషాల్టీ ఆస్పత్రిలో శనివారం రాత్రి న్యూరో నావిగేషన్ పరికరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గుంటూరులో ప్రయోగాత్మకంగా వైద్యసేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, విజయవంతమైందని చెప్పారు. సింహపురి ఆస్పత్రి ఎండీ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, పీఏఓ నాగేంద్రప్రసాద్, వైద్యులు వెంకటేశ్వరప్రసన్న, భక్తవత్సలం, దీక్షాంతి నారాయణ్, గోపాలకృష్ణయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. పరామర్శ సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు కందుకూరి సత్యనారాయణ కుటుంబసభ్యురాలిని మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, కందుకూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.