వైద్యుల డిప్యుటేషన్లు రద్దు
వైద్య ఆరోగ్యశాఖకు సీఎం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అక్రమ డిప్యుటేషన్లను తక్షణమే రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆçస్పత్రుల్లో డిప్యుటేషన్లు పెద్దఎత్తున ఉన్నాయి. డీఎంఈ పరిధిలోని బోధనాసుపత్రుల్లో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు అనేకమంది డిప్యుటేషన్లపై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
పీజీ పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరి వైద్యం కింద ఏడాది కాలానికి పనిచేయాలి. అలా దాదాపు 900 మందికి సీనియర్ రెసిడెంట్లుగా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినా అందులో 300 మంది పైరవీలతో హైదరాబాద్ సహా అనుకూల ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇక ప్రొఫెసర్లు, ఇతర వైద్యులు 150 మంది వరకు వారికి పోస్టింగ్ ఇచ్చినచోట కాకుండా మరో ప్రాంతంలో పనిచేస్తున్నారు. మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా తదితర ఆస్పత్రుల్లో దాదాపు 100 మంది తమకు ఇష్టమైనచోట పనిచేస్తున్నారు.
ఏళ్ల తరబడి పాగా...
గ్రామీణ పేద రోగులకు ఆరోగ్య సేవలు అందించాల్సిన వైద్యులు పట్టణాలు, నగరాలకు పరిమితమవడంపై సీఎం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అలాగైతే గ్రామీణ పేదలకు వైద్యం చేసే వారు ఎవరని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో అక్కడే పనిచేయాలని... ఇతర ప్రాంతాల్లో పనిచేయడాన్ని నిరోధించాలని సీఎం గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో డిప్యుటేషన్లను రద్దు చేసే అవకాశముంది.