తమిళనాడులో.. అంతకుమించి!
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.6 వేలు ఇస్తామన్న మోదీ
- చాలా కాలంగా రూ.12 వేలు ఇస్తున్న తమిళనాడు!
- ఆ రాష్ట్రంలో తెలంగాణ మహిళా ఐఏఎస్‌ల బృందం పర్యటన
- వైద్య సౌకర్యాలపై అధ్యయనం
- అక్కడ 80 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే..
- తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 31 శాతమే
సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రు ల్లో కాన్పు చేయించుకుంటే రూ.6 వేలు ప్రోత్సా హకం ఇస్తామని ప్రధాని మోదీ నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో చాలా కాలం నుంచే రూ.12 వేలు ఇస్తుండటం గమనార్హం. ఈ విషయంలో దేశానికే తమిళనాడు ఆదర్శంగా నిలిచింది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 80 శాతం ప్రసవాలు జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం 31 శాతమే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడం, నరకప్రాయమైన గదులే ఇందుకు ప్రధాన కారణం.
ఈ నేపథ్యంలో తమిళనాడులో గర్భిణులు ప్రసవానికి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి గల కారణాలు, వసతులపై అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్.. సీనియర్ మహిళా ఐఏఎస్‌ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపారు. సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిష నర్ వాకాటి కరుణ, నిజా మాబాద్ కలెక్టర్ యోగితా రాణా, వికారాబాద్ కలెక్టర్ దివ్య ఆ బృందం లో ఉన్నారు. 2 రోజులపాటు ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించిన ఈ బృందం.. తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందస్తు చెకప్‌లు, తర్వాత కాన్పు, బిడ్డకు టీకా వంటివి చేయించుకుంటే సదరు మహిళకు ప్రభుత్వం రూ.12 వేలు ప్రోత్సాహకం ఇస్తున్నట్లు గమ నించింది. తెలంగాణలో గర్భిణులకు రూ.వెయ్యి ప్రోత్సాహకం మాత్రమే ఇస్తుండటం గమనార్హం.
50 శాతానికి తీసుకురావాలనే...
రాష్ట్రంలో ఏటా 6.3 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిల్లో 91 శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మిగిలినవి ఇళ్ల వద్ద ఏఎన్‌ఎంలు, ఇతరుల సమక్షంలో జరుగుతు న్నాయి. ఇక ఆస్పత్రుల్లో జరుగుతున్న కాన్పుల్లో 69 శాతం ప్రైవేటు, 31 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే జనని సురక్ష, జనని శిశు సురక్ష పథకాల కింద రూ.వెయ్యి ప్రోత్సాహకం, భోజనం కోసం ప్రతిరోజూ రూ.100, ఉచిత పరీక్షలు, మందులు అందజేస్తారు. సిజేరియన్ ద్వారా కాన్పు అయితే ఐదు రోజులు ఉంచి రూ.500 చెల్లిస్తారు. సాధారణ ప్రసవమైతే మూడు రోజులు ఉంచి రూ.300 ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు రావడానికి గర్భిణులు భయపడుతున్నారని రాష్ట్ర సర్కారు భావించింది. దీంతో పరిస్థితిని మార్చాల ని నిర్ణయించిన కేసీఆర్.. రాష్ట్రంలో 50 శాతానికి పైగా కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు.
సిజేరియన్ పేరుతో ప్రైవేటు దోపిడీ..
రాష్ట్రంలో ఏకంగా 58 శాతం ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 74 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. తెలంగాణలో సిజేరి యన్ కాన్పుల ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఏడాదికి రూ.1,500 కోట్లు ఆర్జి స్తున్నట్లు అంచనా. సిజేరియన్ కోసం రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి.