Public hospitals
-
‘అవినీతిని సహించేది లేదు’
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలే తప్ప అవినీతికి పాల్పడితే సహించబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంత్రి నాని శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ దుర్గాప్రసాద్, కలెక్టర్ రేవు ముత్యాలరాజుతో కలిసి గంటకు పైగా ఆసుపత్రిలో పలు విభాగాలను తనిఖీ చేయడమే కాకుండా రోగుల సమస్యలను అందుతున్న వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు. సాక్షి, ఏలూరు : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టమైన సమాచారం తనకు ఉందని, కొన్ని ఛానల్స్‌లో కూడా పేరుతో సహా వార్తలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారుల సమావేశంలో ప్రశ్నించారు. విచారణ నిర్వహించి బాధ్యులను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి డీఎంహెచ్‌వో సుబ్రమణ్యేశ్వరిని ఆదేశించారు. తొలుత పర్యటనలో డయాలసిస్ సక్రమంగా నిర్వహించడం లేదని, సమస్యలు ఉన్నాయని బీమడోలుకు చెందిన డయాలసిస్ రోగి మంత్రి నాని దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ జరిపి తనకు రిపోర్టు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. బుట్టాయగూడెం నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చిన బాలికకు ఆధార్‌కార్డు లేదని ఎం ఆర్ఐ స్కాన్ నిర్వహించకుండా వెనక్కి పంపడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏదో ఒక వంక చెప్పి వెనక్కి పంపడం సరికాదన్నారు. ఆధార్ లేకపోయినా ఏదో ఒక డాక్టర్‌తో సర్టిఫై చేయించి వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను సందర్శించారు. మెటర్నిటీ వార్డులో పేషంట్ బంధువులు ఒక చోట కింద కూర్చుని ఉండటం గమనించి వారికి వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన చర్యలపై చర్చించారు. ఆసుపత్రిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం సమస్యగా మారిందని, మార్చురీలో ఫ్రీజర్ బాక్సులు పనిచేయడం లేదని తదితర అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చాక కూడా స్కానింగ్, ఎక్స్‌రేల పేరుతో రోగులను బయటకు పంపితే సహించబోమని నాని హెచ్చరించారు. ఎముకల వార్డులో చేరిన రోగులకు యుద్ధప్రాతిపదికపై అవసరమైన వైద్యాన్ని ప్రారంభించి శస్త్ర చికిత్సకు తగు ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని అంతే తప్ప రోడ్డు ప్రమాదాలలో గాయపడి వచ్చిన వారికి సరైన వైద్యం అందించకపోతే ఏమి జరుగుతుందోనన్న భయం వారిలో ఉంటుందన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు సాధ్యమైనంత త్వరగా శస్త్ర చికిత్సలు పూర్తి చేయాలని ఎక్కడా కూడా జాప్యం చేస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రసవాల విభాగంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ సురక్షితంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించా లని రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలే తప్ప దురుసుగా ప్రవర్తిస్తే సంబంధితులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, ముఖ్యంగా షుగర్, బీపీ వంటి రోగాల పట్ల ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని, ఇటీవల మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాలలో సరైన అవగాహన లేని కారణంగా సకా లంలో మధుమేహం వ్యాధిని గుర్తించలేకపోతున్నారని దీనిపై అవగాహన పెంపొందిచాలన్నారు. 104 వాహనం పల్లెలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి తగు వైద్య సలహాలు అందించాలని కోరారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ విభాగాన్ని కూడా మంత్రి సందర్శించి ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందించే విషయంలో ఆన్లైన్ అనుమతులు కొంత జాప్యం జరుగుతున్నదని ఆసుపత్రిలో రోగి చేరిన తక్షణమే అవసరమైన వైద్యానికి అనుమతించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమతిలో జాప్యం అయితే అనారోగ్యం మరింత క్షీణిస్తుందనే భావన ప్రజల్లో ఉంటుందని అందుకే ఆన్లైన్ అనుమతులు శరవేగంగా జరిగేలా ఆరోగ్యమిత్రలు మరింత చొరవ చూపాలని ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మంత్రి ఆసుపత్రిలో మరుగుదొడ్ల పరిస్ధితి, నీటి సౌకర్యం, టాయిలెట్లలో విద్యుత్ లైట్లు ఉన్నాయా లేవా అనే విషయం కూడా పరిశీలించారు. డ్రగ్‌స్టోర్ విభాగాన్ని సందర్శించి మందులు పాడైపోకుండా ఏసీలను ఏర్పాటు చేయాలని, సరైన ఉష్ణోగ్రతలను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి సూచించారు. -
వైద్యుల డిప్యుటేషన్లు రద్దు
వైద్య ఆరోగ్యశాఖకు సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల అక్రమ డిప్యుటేషన్లను తక్షణమే రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆçస్పత్రుల్లో డిప్యుటేషన్లు పెద్దఎత్తున ఉన్నాయి. డీఎంఈ పరిధిలోని బోధనాసుపత్రుల్లో సీనియర్ రెసిడెంట్ వైద్యులు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు అనేకమంది డిప్యుటేషన్లపై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. పీజీ పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరి వైద్యం కింద ఏడాది కాలానికి పనిచేయాలి. అలా దాదాపు 900 మందికి సీనియర్ రెసిడెంట్లుగా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినా అందులో 300 మంది పైరవీలతో హైదరాబాద్ సహా అనుకూల ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇక ప్రొఫెసర్లు, ఇతర వైద్యులు 150 మంది వరకు వారికి పోస్టింగ్ ఇచ్చినచోట కాకుండా మరో ప్రాంతంలో పనిచేస్తున్నారు. మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, జిల్లా తదితర ఆస్పత్రుల్లో దాదాపు 100 మంది తమకు ఇష్టమైనచోట పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పాగా... గ్రామీణ పేద రోగులకు ఆరోగ్య సేవలు అందించాల్సిన వైద్యులు పట్టణాలు, నగరాలకు పరిమితమవడంపై సీఎం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అలాగైతే గ్రామీణ పేదలకు వైద్యం చేసే వారు ఎవరని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో అక్కడే పనిచేయాలని... ఇతర ప్రాంతాల్లో పనిచేయడాన్ని నిరోధించాలని సీఎం గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో డిప్యుటేషన్లను రద్దు చేసే అవకాశముంది. -
ఆరోగ్యశాఖకే రోగం వచ్చినట్లుంది!
ప్రభుత్వ ఆసుపత్రులు అవినీతికి అడ్డాలుగా మారాయ్: వంశీచంద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు అవినీతికి అడ్డాగా, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా మారాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. శాసన సభలో మంగళవారం ఆరోగ్యశాఖ పద్దుపై ఆయన మాట్లాడుతూ.. గాంధీ, ఉస్మానియా ఆసుప త్రుల్లో విద్యుత్, నీటి సదుపాయాలు లేక ఆపరే షన్లు ఆపేశారని, ఉస్మానియాలోని న్యూరో సర్జికల్ యూనిట్లో వైద్యం అందక ఇటీవల ఐదుగురు మరణించారని పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో రూ.100 ఇస్తేనే వీల్‌చైర్ ఇస్తామని సిబ్బంది డిమాండ్ చేయడంతో చేసేది లేక తన కొడుకు టాయ్కార్పై ఆసుపత్రికి వచ్చిన సంగతిని గుర్తు చేశారు. గవర్నర్ స్థాయిలో పట్టించుకుంటే మినహా బాధ్యులపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారని చెప్పారు. రోగమొస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే ప్రజలు భయపడుతున్నారని, వాస్తవానికి రాష్ట్ర ఆరోగ్యశాఖకే పెద్ద రోగం వచ్చిందన్నారు. బీజేపీ, ఎంఐఎం అసంతృప్తి ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఛాతీ, మెటర్నిటీ ఆస్పత్రుల నిర్వహణ పట్ల బీజేపీ, ఎంఐఎం పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. బడ్జెట్ పద్దుల్లో భాగంగా వైద్యంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ సభ్యులు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు లేరని, ఎక్స్‌రే, ఈసీజీ, మంచాలు, దుప్పట్లు లాంటి కనీస సదుపాయాలను సైతం ప్రభుత్వం కల్పించలేకపోయిం దన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం ఏమాత్రం లేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో వీల్ చైర్ కోసం కూడా లంచాలు ఇవ్వాల్సి రావడం బాధాకరమని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం పట్టుకుందని, రూ.250 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు చికిత్సలు నిలిపివేశాయన్నారు. వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షించాలని, కొత్త ఆస్పత్రిని నిర్మించాలని ఎంఐఎం సభ్యుడు మౌజం ఖాన్ డిమాండ్ చేశారు. కడియం సీఎం కావాలి ప్రతి అంశానికీ వివరణాత్మకంగా సమాధానం చెప్పేవాళ్లలో నాటి సీఎం రోశయ్య, నేటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉంటారని వంశీచంద్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ‘రోశయ్య సీఎంగా చేశారు. ఎలాగూ దళిత ముఖ్యమంత్రి హామీ ఉంది గనుక కడియం కూడా సీఎం కావాలని కోరుకుంటున్నాను’అని అన్నారు! -
అవినీతి కూపంలో ప్రభుత్వ ఆస్పత్రులు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్లక్ష్యమే దీనికి కారణమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవా రం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులకు పోవాలంటే భయపడే స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో రూ.150 కోసం ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న ఘటనతోనైనా కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి కళ్లు తెరవాలన్నారు. గాంధీ, నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో చాలా సంఘటనలు జరిగాయన్నారు. మంత్రి లక్ష్మారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎర్రగడ్డ ఆస్పత్రి ఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
దవాఖానాలో మర్యాద రామన్నలు..!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఇకపై మర్యాదే మర్యాద పారిశుద్ధ్యం, బాత్రూమ్లు ఇక క్లీన్ అండ్ గ్రీన్ శాస్త్రీయ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు వంద మార్కులొస్తేనే కాంట్రాక్టర్లకు 100% చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల చీదరింపులు.. ఛీత్కారాలు.. మనం చూస్తూనే ఉంటాం. రోగులను ఎక్కడా నిలబడనీయరు.. కూర్చోనీయరు. ఇక పారిశుద్ధ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాయిలెట్లు అధ్వానంగా ఉంటే.. ఆస్పత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తుం టుంది. దీంతో సర్కారు దవాఖానాకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థి తులు ఏర్పడ్డాయి. ఇకపై ఇలాంటి పరిస్థితు లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. సమగ్ర ఆస్పతుల నిర్వహణ, వసతులు, సేవల విధాన నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 18 వేల పడకల కు ఒక్కో పడకకు నెలకు రూ.6 వేల చొప్పున నిర్వ హణ ఖర్చు కింద ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. దీంతో అన్ని ఆస్పత్రుల్లో రోగులకు మర్యాదలు చేసేందుకు, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించేందుకు.. బాత్రూంలు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తగు సిబ్బందిని నియమించుకోనున్నారు. సర్వే అనంతరం శాస్త్రీయ నిర్ణయం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల మొదలు ఉస్మానియా, గాంధీ వరకు అన్ని బోధన, ఇతర జిల్లా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అధ్వా నంగా ఉన్నాయని సర్కారు అంచనా వేసింది. కొన్ని బోధనాస్పత్రుల్లో శాంపిల్ సర్వే చేసింది. ఆస్పత్రులు అధ్వానంగా ఉండటానికి గల కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిం ది. ఒక ఆస్ప త్రిలో చేసిన సర్వే ప్రకారం అక్కడ భద్రతా సిబ్బంది 110 మంది, రోగులకు అవసరమైన సేవలు చేసేందుకు 267 మంది, పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించేందుకు 239 మంది అవసరమని, ప్రస్తుతం వీటిలో సగానికి సగం కూడా లేదని తెలిపింది. అందువల్ల సిబ్బందిని వివిధ ప్రైవేటు సంస్థల నుంచి నియమించుకుని ఆస్పత్రుల్లోని ఆయా రంగాల ను మరింత మెరుగుపరచాలని నిర్ణయిస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. బోధనాస్ప త్రులను రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదు పా యాల అభివృద్ధి సంస ఎండీ, జిల్లా స్థాయిలోని ఆసుపత్రులన్నింటినీ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో అన్ని బోధనాసుపత్రుల్లో 10 వేల పడ కలున్నాయి. వాటి నిర్వహణకు రూ.60కోట్లు, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 8 వేల పడకలకు రూ.48 కోట్లు కేటాయించారు. ‘వంద’వస్తేనే వంద శాతం చెల్లింపులు.. మార్కుల ఆధారంగా ఆçస్పత్రుల పారి శుద్ధ్యం, బాత్రూంలు, భద్రత, రోగుల పట్ల మర్యాదగా మెలగటం వంటి అంశాలను అంచనా వేస్తారు. వచ్చే మార్కులను బట్టే కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేస్తారు. లేకుంటే ఆ ప్రకారం వారికి చెల్లించే నిధుల్లో కోత విధిస్తారు. 11 విభాగాలుగా నిర్వహణ పనులను విభజించారు. ఒక్కో విభాగానికి మార్కులను నిర్ధారించారు. అటెండర్ల తీరు, వారి యూనిఫాంకు 5 మార్కులు, రోగుల పట్ల మర్యాదగా ఉంటే 10 మార్కులు, బాత్ రూం, వాష్‌రూంల క్లీనింగ్‌కు 10, వార్డుల క్లీనింగ్‌కు 10, ఓపీ, లేబరేటరీలు, లేబర్ రూంల క్లీనింగ్‌కు 10, డ్రైౖనేజీ నిర్వహణకు 10, పారిశుద్ధ్యంలో ఉపయోగించే పరిక రాలు, కెమికల్స్ తదితరాలకు 10, పబ్లిక్‌ను నియంత్రణలో ఉంచేందుకు 10, ఫిర్యాదులు లేకుండా నిర్వహించడానికి 10, భద్రతకు 10, పార్కింగ్, గుంపులు లేకుండా చూసేం దుకు 5 మార్కులు కేటాయించారు. నూటికి నూరు మార్కులు వస్తేనే నూరు శాతం నిధులు విడుదల చేస్తారు. లేకుంటే ఎంత శాతం మార్కులు వస్తాయో అంత శాతమే నిధులను విడుదల చేస్తారు. ఇలా అనేక మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. -
తమిళనాడులో.. అంతకుమించి!
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.6 వేలు ఇస్తామన్న మోదీ - చాలా కాలంగా రూ.12 వేలు ఇస్తున్న తమిళనాడు! - ఆ రాష్ట్రంలో తెలంగాణ మహిళా ఐఏఎస్‌ల బృందం పర్యటన - వైద్య సౌకర్యాలపై అధ్యయనం - అక్కడ 80 శాతానికి పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే.. - తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 31 శాతమే సాక్షి, హైదరాబాద్: గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రు ల్లో కాన్పు చేయించుకుంటే రూ.6 వేలు ప్రోత్సా హకం ఇస్తామని ప్రధాని మోదీ నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో చాలా కాలం నుంచే రూ.12 వేలు ఇస్తుండటం గమనార్హం. ఈ విషయంలో దేశానికే తమిళనాడు ఆదర్శంగా నిలిచింది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 80 శాతం ప్రసవాలు జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం 31 శాతమే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడం, నరకప్రాయమైన గదులే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో తమిళనాడులో గర్భిణులు ప్రసవానికి ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి గల కారణాలు, వసతులపై అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్.. సీనియర్ మహిళా ఐఏఎస్‌ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపారు. సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిష నర్ వాకాటి కరుణ, నిజా మాబాద్ కలెక్టర్ యోగితా రాణా, వికారాబాద్ కలెక్టర్ దివ్య ఆ బృందం లో ఉన్నారు. 2 రోజులపాటు ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించిన ఈ బృందం.. తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందస్తు చెకప్‌లు, తర్వాత కాన్పు, బిడ్డకు టీకా వంటివి చేయించుకుంటే సదరు మహిళకు ప్రభుత్వం రూ.12 వేలు ప్రోత్సాహకం ఇస్తున్నట్లు గమ నించింది. తెలంగాణలో గర్భిణులకు రూ.వెయ్యి ప్రోత్సాహకం మాత్రమే ఇస్తుండటం గమనార్హం. 50 శాతానికి తీసుకురావాలనే... రాష్ట్రంలో ఏటా 6.3 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిల్లో 91 శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో.. మిగిలినవి ఇళ్ల వద్ద ఏఎన్ఎంలు, ఇతరుల సమక్షంలో జరుగుతు న్నాయి. ఇక ఆస్పత్రుల్లో జరుగుతున్న కాన్పుల్లో 69 శాతం ప్రైవేటు, 31 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే జనని సురక్ష, జనని శిశు సురక్ష పథకాల కింద రూ.వెయ్యి ప్రోత్సాహకం, భోజనం కోసం ప్రతిరోజూ రూ.100, ఉచిత పరీక్షలు, మందులు అందజేస్తారు. సిజేరియన్ ద్వారా కాన్పు అయితే ఐదు రోజులు ఉంచి రూ.500 చెల్లిస్తారు. సాధారణ ప్రసవమైతే మూడు రోజులు ఉంచి రూ.300 ఇస్తారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు రావడానికి గర్భిణులు భయపడుతున్నారని రాష్ట్ర సర్కారు భావించింది. దీంతో పరిస్థితిని మార్చాల ని నిర్ణయించిన కేసీఆర్.. రాష్ట్రంలో 50 శాతానికి పైగా కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. సిజేరియన్ పేరుతో ప్రైవేటు దోపిడీ.. రాష్ట్రంలో ఏకంగా 58 శాతం ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 74 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. తెలంగాణలో సిజేరి యన్ కాన్పుల ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఏడాదికి రూ.1,500 కోట్లు ఆర్జి స్తున్నట్లు అంచనా. సిజేరియన్ కోసం రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. -
అభివృద్ధి పరుగులు పెట్టాలి
- సమగ్ర ప్రణాళికలు రూపొందించండి - జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 14న కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో మంగళ వారం సచివాలయం నుంచి ఆయన వీడి యో కాన్ఫరెన్స ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లాల్లోని ఆర్థిక, నీటి వనరులు, భౌగోళిక అంశాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే ఐదేళ్లలో జిల్లాల స్వరూపం మారేలా ప్రణాళికలు ఉండాలని కలెక్టర్లకు సూచించారు. తమ జిల్లాల బలం, బలహీనతలు, వనరులు తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అభివృద్ధికి ఎన్నారైల ద్వారా సహకారం పొందడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నో యువర్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా జిల్లా ప్రజల గురించి పూర్తిగా అవగాహన ఉండాలని, పూర్తి సమాచారంతో డాటాబేస్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల కొత్త బ్యాంకులు జిల్లాల్లో రోడ్నెట్వర్క్పై పూర్తి అవగాహనతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. రైల్వేస్టేషన్లు ఉన్న ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా స్థారుు ఇరిగేషన్ ప్రణాళికలను రూపొందించాలని, మిషన్ భగీరథ పనులపై దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకింగ్ నెట్వర్క్ లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బ్యాంకుల ఏర్పాటు.. తదితర అంశాలపై నివేదికలు రూపొందించాలన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించి కేంద్రం అందించే ప్రోత్సాహకం అందుకోవడంలో జిల్లా కలెక్టర్లు ముందుండాలన్నారు. జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ మందికి ఉపాధి లభించేలా చూడాలని సూచించారు. మూతపడిన పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. -
మృతదేహాల తరలింపునకు ఉచిత వాహనాలు
రాష్ట్రంలో ‘హెర్సే’ పేరుతో అందుబాటులోకి.. సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చనిపోతే మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు చేతిలో డబ్బుల్లేక భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లిన ఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆపద సమయాల్లో ప్రైవేటు వాహనదారులు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మందులు కొనేందుకే డబ్బుల్లేక ఇబ్బంది పడే పేదలు అంతమొత్తాన్ని భరించటం తలకుమించిన భారమవుతోంది. ఇలాంటి సమస్య రాష్ట్రంలో రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అలాంటి వారికోసం ‘హెర్సే’ పేరుతో ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తోంది. తొలుత 50 వాహనాలను అందుబాటులోకి తేనుంది. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద 10 చొప్పున, నిమ్స్‌కు 2, ఆరు ఉమ్మడి జిల్లా కేంద్రాలకు 6, మహబూబ్‌నగర్‌కు 2, వరంగల్ ఎంజీఎంకు 3, ఆదిలాబాద్ రిమ్స్‌కు 2, నిజామాబాద్‌కు 2, మంచిర్యాల, గజ్వేల్, భద్రాచలం ఆస్పత్రులకు ఒక్కటి చొప్పున కేటారుుంచనున్నారు. మరో పది వాహనాలను వెసులుబాటు ఆధారంగా కేటారుుంచనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్రమంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాసయాదవ్‌లు ప్రారంభించనున్నారు. రెండు రకాలుగా వాహనాలు... ఒకేసారి రెండు శవాలను తరలించేలా రెండు ఫ్రీజర్లుండే వాహనాలు, ఒక మృతదేహాన్ని తరలించేలా ఒక ఫ్రీజర్ ఉండే వాహనాలు... ఇలా రెండు రకాల వాహనాలను సిద్ధం చేస్తున్నారు. 108కి ఫోన్ చేసి వాటిని కోరవచ్చని, 24 గంటలు ఇవి ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. -
పేదల శవాల తరలింపునకు వాహనాలు
- ‘సాక్షి’ కథనానికి వైద్య, ఆరోగ్యశాఖ స్పందన - సీఎంకు ఆగమేఘాల మీద ఫైలు పంపిన అధికారులు - వారం, పది రోజుల్లో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. పేద రోగులు చనిపోతే మృతదేహాలను స్వస్థ లాలకు ఉచితంగా తరలించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ నడుం బిగించింది. ‘పేదల శవానికి వాహనం దొరకదు’ శీర్షికన సోమ వారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి స్పందిం చారు. ఇప్పటికే మూలనపడి ఉన్న 50 శవాల తరలింపు వాహనాలను వెంటనే ఉప యోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన అనుమతి కోసం సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫైలు పంపించినట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారుు. సీఎం నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రస్తుతమున్న 50 వాహనాలను పేదల శవాల తరలింపునకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. వారం, పది రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వాహనాల నిర్వహణ బాధ్యతను తాత్కాలికంగా జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థకు అప్పగిస్తామన్నారు. తర్వాత టెండర్లను ఆహ్వానించి పీపీపీ పద్ధతిలో అప్పగిస్తామని వెల్లడించారు. ప్రస్తుతమున్న వాహనాలను హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రధాన ఆసుపత్రుల వద్ద సిద్ధంగా ఉంచుతారు. ఈ వాహనాలు అవసరమున్న వారు ‘108’కు ఫోన్ చేస్తే అరగంటలో వాహనాన్ని సిద్ధం చేస్తారు. -
పేదల శవానికి వాహనం దొరకదు!
- నిరుపేదలు తమవారి శవాలను మోసుకెళ్లాల్సిందేనా? - ప్రభుత్వ ఆసుపత్రుల్లో అష్టకష్టాలు - 50 వాహనాలను సిద్ధం చేసినా వినియోగించని వైనం - ప్రభుత్వ అనుమతి లేక ఆరు నెలలుగా మూలనపడిన వాహనాలు సాక్షి, హైదరాబాద్: ఒడిశాలో ఆగస్టు నెలలో మాఝీ అనే గిరిజనుడు తన భార్య శవాన్ని వాహనంలో తరలించే స్థోమత లేక 12 కిలోమీటర్లు భుజంపై మోసుకుంటూ వెళ్లాడు! తాజాగా భాగ్యనగరంలోనూ అలాంటిదే మరో దీనగాథ! సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మైకోడ్కు చెందిన రాములు డబ్బుల్లేక తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిలో పెట్టుకొని కాలినడకన 60 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇలా పేదలు చనిపోతే వారి శవాలను సొంతూరుకు వాహనాల్లో ఉచితంగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక ప్రమాదాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం పేదలు చనిపోతున్నారు. ఆ శవాలను సొంతూరుకు తరలించడం వారి బంధువులకు ఆర్థికంగా శక్తికి మించిన భారంగా మారుతోంది. భార్య శవాన్ని సంగారెడ్డి జిల్లా మానూరుకు తరలించడానికే రాములును రూ.5 వేలు అడిగారు. రాష్ట్రంలో ఇతర సుదూర ప్రాంతాలకు తరలించాలంటే రూ. 15 వేలకు మించి ఖర్చు కానుంది. పేదలు అంత మొత్తాన్ని భరించడం కష్టమే. పేదల శవాలను తరలించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఆరు నెలల కిందటే వాహనాలను సిద్ధం చేసినా.. అవి మూలకు పడి ఉన్నాయి. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో రోజుకు ఒక్కో ఆసుపత్రిలో సరాసరి 30 మంది వరకు చనిపోతుంటారని అంచనా. జిల్లా ఆసుపత్రుల్లో ఐదుగురు చొప్పున మృతి చెందుతారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిని హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాల నుంచి సొంతూళ్లకు తరలించడం పేదలకు ఆర్థికంగా భారమవుతోంది. దీంతో శవాలను వారి స్వగ్రామాలకు తరలించడానికి ప్రభుత్వమే వాహనాలను సమకూర్చాలని నిర్ణయించి ఏడాది కావొస్తోంది. ముందుగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వాహనాల్లో ఉచితంగా శవాలను తరలించాలని భావించారు. ఇందుకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ఆసుపత్రుల వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తర్వాత జిల్లా ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేయాలనుకున్నారు. వీరేగాకుండా ప్రమాదాల్లో పేదలెవరైనా చనిపోయినా వారిని తరలించేలా ఏర్పాట్లు చేయాలనుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ లోపు అందుబాటులో ఉన్న ‘108’కు చెందిన 50 పాత అంబులెన్సులను మరమ్మతు చేసి శవాల తరలింపునకు సిద్ధంగా ఉంచారు. వాటిని తాత్కాలికంగా జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ ద్వారా నడిపించాలని నిర్ణయించారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అవి ఆరు నెలలుగా మూలనపడి ఉన్నాయి. సిద్ధం చేసిన 50 వాహనాల్లో 25 వాహనాలు ఒక శవాన్ని తరలించేలా... మరో 25 వాహనాలు రెండు శవాలను తరలించేలా ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. అవసరాలకు అనుగుణంగా 150 శవ తరలింపు వాహనాలను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. -
నిఘా నిల్ !
బందరు జిల్లా ఆస్పత్రిలో భద్రత ప్రశ్నార్థకం గుడివాడ, నూజివీడు ఏరియా ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి ఎక్కడా కానరాని సీసీ కెమెరాలు విజయవాడలో శిశువు అదృశ్యంపై సర్వత్రా ఆందోళన మచిలీపట్నం టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు నూజివీడు, గుడివాడ ఏరియా ఆస్పత్రుల్లోనూ నిఘా కొరవడింది. ఈ క్రమంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తరచూ పిల్లల అపహరణ వార్తలు తల్లిదండ్రులను ఆందళోనకు గురిచేస్తున్నాయి. అయినా సీసీ కెమెరాల ఏర్పాటుపై అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రులు కిటకిట.. ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి, గుడివాడ, నూజివీడు ఏరియా ఆస్పత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటాయి. ప్రసూతి విభాగాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. తెలుసుకునేందుకు ఆస్పత్రుల్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో ఐదు రోజుల శిశువు అపహరణకు గురైన విషయం తెలియడంతో ఇక్కడి ఆస్పత్రుల్లోని ప్రసూతి వార్డుల్లో ఉన్న బాలింతలు, వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి శిశువుల వద్ద షిఫ్టుల వారీగా కాపలా ఉంటున్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అనుమానంగా చూస్తూ భయపడుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 30మంది, సిజేరియన్ ప్రసూతి వార్డులో 30మంది బాలింతలు, శిశువులు ఉంటున్నారు. ఆయా వార్డులతోపాటు మరో 20 పడకలతో ఉన్న నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్సీఎన్ఎన్యూ) వద్ద కూడా భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
బస్తీకి సుస్తీ!
సిటీబ్యూరో: నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాల లక్షణాలతో వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. బస్తీల్లో అపరిశుభ్ర వాతావరణం, వర్షం నీరు నిల్వ ఉండడం, దోమలు, ఈగలు పెరగడంతో ప్రజలు టైఫాయిడ్, డయేరియా, కలరా, డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ైెహ దరాబాద్ జిల్లాలో 24 కలరా, 1500పైగా డయేరియా, 69 మలేరియా, 60పైగా డెంగీ కేసులు నమోదు అయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. మరోవైపు రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందడం లేదు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువవుతాయని తెలిసినప్పటికీ ఆయా ఆస్పత్రుల్లో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. వైద్యుల సంఖ్యా అంతంతమాత్రంగానే ఉంది. ఫీవర్‌కు పోటెత్తిన రోగులు రోగాలబారిన ప్రజలు చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడం, ఓపీలో తగినంత మంది వైద్యులు లేక పోవడంతో అస్వస్థతకు గురైన రోగులకు గంటల తరబడి ఓపీ క్యూలైన్లోనే పడిగాపులు తప్పడం లేదు. మధుమేహంతో బాధపడుతున్న రోగులు స్పృహ తప్పి పడిపోతుండగా, జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదే సమయంలో సహనం కోల్పొయిన కొంత మంది రోగులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన వైద్యాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. నిలోఫర్ ఓపీలో కన్పించని సీనియర్లు నిలోఫర్ ఆస్పత్రికి నవజాత శిశువులే కాకుండా 12 ఏళ్లలోపు పిల్లలకు కూడా చికిత్సలు అందిస్తుంటారు. 550 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వెయ్యి మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు తగినన్ని వార్మర్లు, వెంటిలేటర్లు లేక మృత్యువాతపడుతున్నారు. ఇక జలుబు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, టైఫాయిడ్, డెంగీ, మలేరియాతో బాధపడుతున్న 12 ఏళ్లలోపు వారు అధిక సంఖ్యలో వస్తున్నారు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేక పోవడంతో ఒక్కొ మంచంపై ఇద్దరు ముగ్గురు చిన్నారులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. ఉదయం 8.30 గంట లకే ఓపీలో ఉండాల్సిన వైద్యులు 11 దాటినా రావడం లేదు. ఓపీ సహా అత్యవసర విభాగంలోనూ జూనియర్లు మినహా సీనియర్ వైద్యులు కన్పించడం లేదు. ఉస్మానియా, గాంధీలోనూ అదే పరిస్థితి.. ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు ఇటీవల కాలంలో రోగులు పోటెత్తుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ఇన్‌పేషంట్ వార్డులు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. వీరిలో జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నవారే అధికంగా ఉంటున్నారు. ఓపీలో వైద్యుడికి చూపించుకుని, ఆయన రాసిన టెస్టులు చేయించుకుని తిరిగి వచ్చే సరికి ఓపీ సమయం ముగిసిపోతోంది. శస్త్రచికిత్సల కోసం వచ్చిన రోగులే కాదు సాధారణ జ్వరాలతో వచ్చిన రోగులు సైతం రెండు మూడు రోజులు ఆస్పత్రిలో పడిగాపులు గాయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో అడ్మిషన్ కూడా దొరక్క పోవడంతో చాలా మంది చెట్లకిందే గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల శివారు ప్రాంతాల్లోని రైతులు, కూలీలు పాముకాటుకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వీరికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో మృత్యువాతపడుతున్నారు. ఫీవర్‌లో డెంగీ కేసు నమోదు నల్లకుంట: వాతావరణంలో వస్తున్న మార్పులతో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. దీంతో స్థానిక ఫీవర్ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసి పోతోంది. గురువారం ఓపీ విభాగంలో 1047 మంది రోగులు చికిత్సలు పొందారు. కాగా వీరిలో 37 మందిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఓ డెంగీ కేసు.. రంగారెడ్డి పాత మల్లాపూర్‌కు చెందిన పార్వతదేవి(30) తీవ్రమరైన జ్వరం, ఒళ్లు నొప్పులతో చికిత్సల కోసం ఫీవర్ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన అక్కడి వైద్యులు క్లినికల్ డెంగీగా నమోదు చేసుకుని ఇన్ పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నారు. అబ్దుల్ బాబానగర్ కిషన్ బాగ్ నివాసిఅబ్దుల్ మాజిద్ కూతురు ఫర్హీన్ (9) తీవ్రమైన జ్వరంతో పాటు ఒళ్లు బిగుసుకు పోతుంది. దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్సల కోసం ఫీవర్‌కు తీసుకు వచ్చారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యు టెటానస్గా నిర్ధారించి చికిత్సలు అందిస్తున్నారు. -
నిండా నిర్లక్ష్యం
♦ లక్ష్యసాధనలో విఫలమవుతున్న ప్రభుత్వ ఆస్పత్రులు ♦ 21 పీహెచ్‌సీల్లో టీకామందు పంపిణీ 80 శాతంలోపే.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో రోగాల బారిన పడుతున్న చిన్నారులు ♦ పీహెచ్‌సీల్లో అధ్వానంగా వ్యాక్సినేషన్ పుట్టిన పిల్లలకు ఏడాదిలోపు ఇవ్వాల్సిన టీకామందు పంపిణీ ప్రక్రియ నిర్లక్ష్యానికి గురవుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లిప్త వైఖరితో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. జన్మించిన శిశువుకు ఏడాదిలోపు దాదాపు ఏడు రకాల వ్యాక్సిన్లు ఇస్తారు. వారాలు, నెలలను పరిగణనలోకి తీసుకుని ఏడాదిలోపు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. ప్రతి పీహెచ్సీ పరిధిలో తప్పనిసరిగా వందశాతం లక్ష్యాన్ని సాధించాల్సి ఉండ గా.. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ గాడితప్పింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవికాకుండా 8 క్లస్టర్ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రి, మరో రెండు ప్రాంతీయ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. క్లస్టర్ ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రులు ఇన్, ఔట్‌పేషంట్ విభాగాల్లో సేవలు అందిస్తుండగా.. పీహెచ్‌సీల్లోని సిబ్బంది మాత్రం క్షేత్రస్థాయిలో క్యాంపులు నిర్వహిస్తూ సేవలందించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియంతా పీహెచ్‌సీల ఆధ్వర్యంలోనే సాగుతుంది. ముఖ్యంగా చిన్నారులకు పంపిణీ చేసే మీజిల్స్, డీపీటీ, బీసీజీ, హెపటైటిస్ బీ తదితర వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యత పీహెసీ వైద్యులదే. అయితే జిల్లాలో చాలాచోట్ల వ్యాక్సినేషన్ లక్ష్యాలు నిర్లక్ష్యం బారినపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. 21 ఆరోగ్య కేంద్రాల్లో.. జిల్లాలో 21 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వెనుకబడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గవదబిల్లలు, పొంగువ్యాధి రాకుండా వేసే మీజిల్స్ వ్యాక్సిన్ పంపిణీలో మంచాల, దండుమైలారం, నవాబ్‌పేట , పూడూరు, కీసర, సిద్దలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. అదేవిధంగా డిప్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం రాకుండా వేసే డీపీటీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెసీలు అధ్వానంగా ఉన్నాయి. క్షయవ్యాధి బారిన పడకుండా వేసే బీసీజీ వ్యాక్సిన్ పంపిణీలో షాబాద్, సిద్దలూరు, కీసర, పూడూరు, చేన్గొముల్, బంట్వారం పీహెచ్‌సీలు వెనుకబడి ఉన్నాయి. కాలేయ సంబంధ రోగాలు రాకుండా ఉండేందుకు వేసే హెపటైటిస్ బీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెచ్‌సీలు అంతంతమాత్రం గానే పనిచేస్తున్నాయి. దీంతో ఆయా పీహెచ్‌సీల వైద్యులకు జిల్లా యం త్రాంగం నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి ఏడు రకాల వ్యాక్సిన్లు చిన్నారికి అందిస్తారు. జిల్లా సగటు పురోగతి బాగున్నప్పటికీ.. గ్రామీణ మండలాల్లో మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది. -
ఇక ఆస్పత్రుల్లోనే ఆధార్ నమోదు
♦ పీహెచ్‌సీల్లో సిబ్బందికి శిక్షణ ♦ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సన్నాహాలు ♦ జిల్లా వ్యాప్తంగా త్వరలో ప్రారంభం ఒంగోలు: ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆధార్ నమోదుతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేసేందుకు వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అవసరమైన సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసింది. పీహెచ్‌సీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. గతంలో బిడ్డ పుట్టిన వెంటనే ఆయా గ్రామాల్లో, లేదా మున్సిపాల్టీల్లో సమాచారం అందించాల్సి ఉంది. అప్పుడు సంబంధిత అధికారులు బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేవారు. ఇప్పుడు ప్రజలకు సేవలు చేరువ చేసేందుకు ఆసుపత్రిలో ప్రసవం జరిగిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. అలాగే ఆసుపత్రిలో మరణించినా వారికి కూడా మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మరి కొద్ది రోజుల్లో పీహెచ్‌సీల్లో ప్రసవం అయిన వెంటనే శిశువుకు ఆధార్ నమోదుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఇటీవల 56 మండలాల్లోని పీహెచ్‌సీల్లోని స్టాఫ్‌నర్స్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన సామగ్రి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను కూడా ప్రజలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి చిన్నారి కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కేవలం 60 శాతం లోపు ఆధార్ నమోదులున్నాయని వీటిని పెంచేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులంటున్నారు. ప్రత్యేక శిక్షణనందించాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న కాన్పులకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నాం. వీటితో పాటు ఆధార్ నమోదుకు కూడా పీహెచ్‌సీల్లోని స్టాఫ్ నర్సులకు జిల్లా కేంద్రాల్లో శిక్షణనిచ్చారు. త్వరలో వాటికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. పీహెచ్‌సీల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ నమోదు చేయడం వలన ఉపయోగంగా ఉంటుంది. - డాక్టర్ కె.రమాదేవి, దగ్గుబాడు -
వడదెబ్బకు ఐదుగురు మృతి
ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. బుధవారం ఒక్కరోజే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా.. ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వడదెబ్బ బాధితులు బారులు తీరుతున్నారు. దీంతో ఆస్పత్రిలో స్థలం చాలక వరండాలు కూడా నిండిపోయే పరిస్థితి ఏర్పాడింది. -
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి
బీబీనగర్: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగాపురంలోని నిమ్స్ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి ఆస్పత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న ప్రజల సంఖ్యను, పలు విభాగాల్లోని వైద్య పరికరాలను పరిశీలించారు. ఆస్పత్రిలో వాట ర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. మాసీ పరీవాహక ప్రాంతం కావడంతో నిమ్స్‌లో చర్యవాధ్యులకు సంబంధించిన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. నిమ్స్‌కు వచ్చి వెళ్లే వారి కోసం జాతీయ రహదారిపై బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసి ఇక్కడ స్టాప్ ఉండేలా ఆర్టీసీ అధికారులతో చర్చించామని త్వర లో ఆ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఓపీ కార్డు తీసుకుని.. ఇటీవల మిషన్ భగీరథ ప్రారంభ పనుల్లో పాల్గొన్నప్పుడు ఎడమ కాలు బెనకడంతో నొప్పిగా ఉందంటూ మంత్రి నిమ్స్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వైద్యుడితో చికిత్స చేయించుకున్నారు. 50 రూపాయలు చెల్లించి తన పేరుపై ఓపీ కార్డును తీసుకొని డాక్టర్ రాసి ఇచ్చిన మందులను కొనుగోలు చేశారు. పీహెచ్సీ వైద్యులను మందలించిన మంత్రి బీబీనగర్ పీహెచ్సీ వైద్యులు సమయపాలన పాటించడం లేదని పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో నిమ్స్ వద్దే ఉన్న పీహెచ్సీ వైద్యాధికారులను పిలిచి మందలించారు. సమయపాలన పాటించకపోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, బొక్క జైపాల్‌రెడ్డి, చెంగళ వెంకటకిషన్, మండల అధ్యక్షుడు పిట్టల అశోక్, జెడ్పీటీసీ బస్వయ్య, ఉప సర్పంచ్ అక్బర్, సింగిల్‌విండో చైర్మన్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్కార్ వైద్యానికి కార్పొరేట్ సొబగులు
సిద్దిపేటలో రూ. 1.25 కోట్లతో ఐసీయూ యూనిట్ నేడు మంత్రులు లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభం సిద్దిపేట జోన్ : సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి సొబగులను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే కంగారు మెథడ్ యూనిట్ ద్వారా గుర్తింపు పొందిన సిద్దిపేట పట్టణం వైద్యసేవల్లో మరో అడుగు వేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు నోచుకొని అత్యాధునికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను రాష్ట్రవైద్య, ఆరోగ్య శాఖమంత్రి లకా్ష్మరెడ్డి, నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావుతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసీయూ యూనిట్ ద్వారా సిద్దిపేట ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 24 గంటల పాటు అత్యవసర వైద్యసేవలను అందించడానికి రాష్ర్ట ప్రభుత్వం 10 మందితో కూడిన వైద్య బృందం ఏర్పాటు చేసింది. వీటికి అనుసంధానంగా త్వరలో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ యూనిట్, ఎయిడ్స్ బాధితుల కోసం ఏఆర్టీ సెంటర్, డెంగీ ప్రాంణాంతక వ్యాధుల కోసం ప్లేట్లెట్స్ సెఫారేటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య సేవల కోసం వచ్చే రోగుల బంధువులకు ఆశ్రయం, ఉచిత భోజన వసతి కోసం రూ. 1.31 కోట్లతో నైట్ షెల్టర్‌కు మంత్రులు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు వివిధ వైద్య సేవల కోసం వచ్చే రోగుల బంధువులు అశ్రయం పొందేందుకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో నేషనల్ అర్బన్ లవ్లీ ఉడ్ మెప్మా మిషన్ ద్వారా రూ. 1.31 కోట్లతో నైట్ షెల్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడంతస్తుల భవనంలో రోగుల బంధువులకు బసచేసే విధంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇప్పటికే హరే రామ్ సంస్థ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, రోగుల బంధువులకు మంత్రి చొరవతో ఉచితంగా భోజనం అందుతోంది. నైట్ షెల్టర్ ఏర్పాటుతో బాధితులు ఆసుపత్రుల్లో మంచాల వద్ద, ఆరుబయట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు. -
ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ చేస్తాం: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తావుని వైద్య ఆరోగ్య శాఖ వుంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలనూ భర్తీ చేస్తామన్నారు. బుధవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది. మన రాష్ట్రంలో కూడా త్వరలో ఆ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం. అంతేకాకుండా ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నలువైపులా ఆధునిక వసతులతో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తాం. చరిత్రాత్మక ఉస్మానియా భవనాన్ని కూల్చివేయకుండా సమీపంలోనే నూతనంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అందులో దవాఖానా అందుబాటులోకి తెస్తాం’ అని మంత్రి చెప్పారు. ఆసుపత్రిలో ఇటీవల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్లు మహేష్, రమేష్‌లను మంత్రి పరామర్శించారు. -
వైద్య సేవలు పూర్తిగా ప్రైవేటీకరణ
పెనమలూరు (కృష్ణా జిల్లా): రాష్ట్రంలో ఇక పూర్తిస్థాయిలో ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్యసేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల పాలన ప్రైవేటుకు అప్పగిస్తామన్నారు. శస్త్రచికిత్సలకు ప్రైవేటు వైద్యులను ఉపయోగిస్తామని చెప్పారు. విజయవాడ సమీపంలోని తాడిగడప గ్రామంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో తేజ్ కోహ్లీ ఐ బ్యాంక్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో వైద్యరంగంలో మన రాష్ట్రానికి చెందినవారే అధికంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. నేడు చాలామంది వైద్యులు తిరిగి మన రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, అటువంటి వారందరికీ అమరావతిలో స్థానం కల్పిస్తామని అన్నారు. ఎల్.వి. ప్రసాద్ ఆస్పత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో ఏర్పాటు చేయడానికి వీలుగా భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ప్రధానమంత్రి ఆరోగ్య బీమా.. త్వరలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ప్రధాన మంత్రి ఆరోగ్యబీమా పథకం అమలు చేయనుందని కేంద్రమంత్రి వెంకయ్య ప్రసంగిస్తూ తెలిపారు. వెంకయ్య అకాడమీ ఫర్ ఐ కేర్ ఎడ్యుకేషను, చిల్డ్రన్స్ ఐ హెల్త్‌కేర్ సెంటర్‌ను మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అమరావతిలో ‘అమృత’ వైద్య వర్సిటీ సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో కలసిన వర్సిటీ ప్రతినిధులు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును అందజేశారు. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతామని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నెలకొల్పే ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్‌కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎంను కలసిన వారిలో విశ్వవిద్యాలయం ప్రో చాన్స్‌లర్ డాక్టర్ ప్రేమ్‌నాయర్, అమ్మాజీ ల్యాబ్స్ డెరైక్టర్ భవానీ బిజ్లాని, కాలిఫోర్నియాకు చెందిన అమృత ఇంటర్నేషనల్ ప్రతినిధి శ్రీనివాస్ పోలిశెట్టి, భూలక్ష్మి సత్యసాయి, రఘు ఉన్నారు. -
జీజీహెచ్‌లో భద్రత డొల్ల..!
సాక్షి, గుంటూరు : ప్రభుత్వ వైద్యశాలల నుంచి పసికందులను మాయం చేస్తున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి సృష్టించే ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులు, ఆ తరువాత మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లోని ప్రసూతి విభాగాల్లో పసికందులను ఎత్తుకెళ్తున్న ఘటనలు తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రైవేటు వైద్యశాలల్లో ప్రసవం భారంగా మారడంతో పేద, నిరుపేద గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ భద్రత డొల్లతనంగా ఉండటం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడటంతో బాలింతలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లోని ప్రసూతి విభాగం నిత్యం గర్భిణులు, బాలింతలతో కిటకిటలాడుతూ ఉంటుంది. బెడ్లు సరిపోక ఒక్కో మంచంపై ఇద్దరు చొప్పున పసి బిడ్డలతో పడుకోవాల్సి వస్తోంది. ఈ విభాగంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొంటు న్నాయి. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు పసికందులను ఎత్తుకెళ్లేందుకు తెగబడుతు న్నారు. జీజీహెచ్ ప్రసూతి విభాగంలో 2011- 2012లో గుర్తుతెలియని దుండగులు ఓ పసికందును ఎత్తుకెళ్లడం తీవ్ర సంచలనం కలిగించింది. దుండగుల జాడ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. గత నెలలో కారంపూడి మండలం పేటసన్నిగండ్ల గ్రామానికి చెందిన అనూరాధ అనే మహిళ జీజీహెచ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రత్తిపాడుకు చెందిన రెహమూన్ అనే మహిళ ఆ బిడ్డను ఎత్తుకెళ్లడంతో కలకలం రేగింది. వెంటనే బిడ్డ సహా సదరు మహిళ దొరకడంతో తల్లిదండ్రులు, అధికారులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా సోమవారం జీజీహెచ్ గైనకాలజీ వార్డు వద్ద రవితేజ అనే ఏడు నెలల బిడ్డను గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు తల్లి ధనలక్ష్మి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెల వ్యవధిలో జీజీహెచ్‌లో ఇద్దరు పసికందులను ఎత్తుకెళ్లిన సంఘటనలు జరగడంతో ప్రసూతి వైద్య విభాగంలోని గర్భిణులు, బాలింతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు.. బయటపడ్డ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం.. జీజీహెచ్‌లో 2010లో రూ. 14 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓ ఆపరేటర్‌ను నియమించి, ప్రతిరోజూ వీడియో రికార్డులను పరిశీలించేవారు. అయితే రానురాను ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవి పనికి రాకుండా పోయాయి. 2012లో బిడ్డ మాయమైంది. దీంతో ఉలిక్కి పడ్డ అధికారులు తిరిగి సీసీ కెమెరాలను బాగుచేయించారు. అయితే ఆపరేటర్ లేకపోవడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఆసుపత్రిలో ఎలాంటి సంఘటన జరిగినా గుర్తించలేని దుస్థితి ఏర్పడింది. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సైతం అప్రమత్తంగా లేకపోవడంతో సోమవారం మరో బిడ్డ మాయమైంది. ఆసుపత్రిలో గేట్పాస్, స్టేపాస్, విజిటింగ్ పాస్‌లంటూ డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. భద్రతను కట్టుదిట్టం చేస్తాం ... జీజీహెచ్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తాం. సోమవారం జరిగిన ఘటనపై ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసరావును విచారణకు ఆదేశించాం. ఆయన నివేదిక అందించగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాల ఆపరేటింగ్ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాం. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం. - డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్. -
ఆస్పత్రులా.. చెత్తకుండీలా?
అధ్వానంగా ప్రభుత్వ ఆస్పత్రులు వైద్యుల్లేరు.. సిబ్బంది కరువు పనిచేయని పరికరాలు.. మందులకూ కటకట సరిపోని పడకలు.. ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురికి చికిత్స పేరుకే పెద్దాసుపత్రులు.. కానీ నిండా అసౌకర్యాలే.. డాక్టర్లు ఉండరు.. పారామెడికల్ సిబ్బంది కనిపించరు.. మందులు అందుబాటులో ఉండవు.. కాలం చెల్లిన వైద్య పరికరాలు.. చివరకు బెడ్లూ సరిపోవు. కొన్నిచోట్ల ఒక్కో మంచంపై ఇద్దరిని పడుకోబెడితే, మరికొన్ని ఆస్పత్రుల్లో నేలపైనే ఉంచాల్సిన పరిస్థితి. పడకలపై బెడ్షీట్లు ఉండవు.. ఉన్నా దుర్వాసన వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి నెట్వర్క్ నిండా లోపాలే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు జబ్బు చేసింది. జిల్లా కేంద్రాల్లోని తొమ్మిది ప్రధాన ఆసుపత్రులకు తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. డాక్టర్లు, సిబ్బంది కొరత, వసతుల లేమి కారణంగా రోగుల అవస్థలు వర్ణణాతీతమే. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి.. ఉన్న రోగాలు పోయే మాటేమోగాని.. కొత్త రోగాలు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో బిక్కుబిక్కుమంటూ చికిత్స పొందుతున్నారు. చెత్తాచెదారం, దుర్గంధభరితంగా ఉన్న ఆసుపత్రుల ఆవరణలోనే రోగులు కాలం వెళ్లదీస్తున్నారు. విలువైన పరికరాలు కూడా మరమ్మతులకు నోచుకోక మూలనపడ్డాయి. జిల్లా ఆసుపత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులను రాష్ట్రస్థాయిలో అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఆరోగ్యానికి కొరత.. ఆదిలాబాద్ రిమ్స్‌లో సరైన సంఖ్యలో వైద్యులు లేరు. పరికరాల కొరత, పారిశుధ్యలోపం, అరకొర వసతులు రోగుల పాలిట శాపంగా మారాయి. రిమ్స్‌కు మొత్తం 155 వైద్య పోస్టులు మంజూరైతే ఇందులో 45 మంది మాత్రమే ఉన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రత్యేక చికిత్స అందించే ట్రామాకేర్ సెంటర్ ప్రారంభానికి నోచుకోలేదు. రిమ్స్‌కు రోజుకు వెయ్యి మందికిపైగా రోగులు వస్తుంటారు. పడకలు సరిపోక ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులను పడుకోబెడుతున్నారు. ఇక ఆస్పత్రి ఆవరణ అంతా చెత్తా చెదారమే. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 350 పడకల పెద్దాసుపత్రికి ఈ జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రోగులు కూడా వస్తుంటారు. ఇంత కీలకమైన ఆస్పత్రిలో సరైన సంఖ్యలో వైద్యులులేరు. 50 మంది వైద్యులు ఉండాల్సిన చోట 31 మందే ఉన్నారు. ఇక స్పెషలిస్టుల కొరత మరింతగా వేధిస్తోంది. ఐదుగురు గైనకాలజిస్టులు అవసరం ఉండగా రెండు ఖాళీలున్నాయి. పిల్లల డాక్టర్లు ఐదుగురికిగాను ఇద్దరే ఉన్నారు. ఈఎన్టీ డాక్టర్లు ఇద్దరికి గాను ఒక్కరే, ఆర్థోపెడిక్ ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నిర్లక్ష్యానికి చిరునామా.. మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా ప్రభుత్వాసుపత్రులు.. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక పరికరాలున్నా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సద్వినియోగం కావడం లేదు. జిల్లాలోని 90 శాతం పీహెచ్‌సీల్లో ఆపరేషన్లు నిర్వహించడంలేదు. జిల్లా ఆసుపత్రిలో 12 మంది సివిల్ సర్జన్స్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో పరిశుభ్రత మచ్చుకు కూడా కానరాదు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రి.. పేరుకే పెద్దాసుపత్రి. వ్యర్థాలన్నీ ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయి దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారు లేరు. నల్లగొండ జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండా సమస్యలే. జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రిలో కాలం చెల్లిన ఎక్స్‌రే, ఈసీజీ, ఇతర పరీక్షల యంత్రాలతో ఇబ్బందిగా మారింది. ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా పడకలు అందుబాటులో లేవు. ఇక రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో డ్రైనేజీ పైప్‌లైన్ లీకవుతూ దుర్గంధం వెదజల్లుతోంది. సూర్యాపేట ఆస్పత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో తాండూరులోని ఆసుపత్రిని అసౌకర్యాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రసూతి వార్డులో కిటికీలకు తలపులు లేని కారణంగా అడ్డంగా దుస్తులు కట్టారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. వైద్యం చేసేదెవరు? నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 223 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెన్షియల్ వైద్యులు ఉండాలి. కానీ 62 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందడం లేదు. కొత్తగా వైద్యకళాశాల ఏర్పడినా పోస్టుల భర్తీ నేటి వరకు చేయలేదు. పారామెడికల్ సిబ్బంది అయితే అన్ని పోస్టులు కలిపి 609 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఎంజీఎం బోధనాసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హోదా కల్పించి రెండేళ్లవుతున్నా ఆ మేరకు సౌకర్యాలు లేవు. చాలా వైద్య పరికరాలు పనికిరాని స్థితికి చేరుకున్నా పట్టించుకోవడం లేదు. ఇక మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న గిరిజనులకు అక్కడి ఏరియా ఆస్పత్రే పెద్దదిక్కు. కానీ ఇక్కడ సిబ్బంది కొరతతోపాటు మౌలిక సదుపాయాలకూ దిక్కులేదు. -
‘గ్రామీణ’ వైద్యుల వేతనాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదిపాటు తప్పనిసరిగా వైద్య సేవలందించే డాక్టర్ల వేతనాలను పెంచుతూ సర్కారు బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పీజీ సూపర్ స్పెషలిస్టులకు రూ. 45 వేలు, పీజీ డిగ్రీ స్పెషలిస్టులకు రూ. 40 వేలు, పీజీ డిప్లొమా స్పెషలిస్టులకు రూ. 38 వేలు, డెంటిస్టులకు రూ.38 వేల చొప్పున వేతనాలు అందనున్నాయి. పెంచిన వేతనాలు గతేడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. మరోసారి 15 శాతం పెంపును 2017 జనవరి 1 నుంచి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు ఏడాదిపాటు గ్రామీణ ఆసుపత్రుల్లో వైద్య సేవ లు అందించాలని సర్కారు నిబంధన విధించింది. దీనిని ఉపసంహరి ంచుకొని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూడా లు గతేడాది సమ్మె కూడా చేశారు. సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులోనూ తప్పనిసరి వైద్యుల వేతనాల పెంపును పరిశీలించాలని సర్కారును ఆదేశించింది. -
భరించలేని.. కడుపుకోత!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా జిల్లాలో పరిస్థితి మెరుగుపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుండటం.. జరుగున్న సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా జిల్లాలో పరిస్థితి మెరుగుపడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ జిల్లాలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతుండటం.. జరుగున్న ప్రజల్లోనూ మార్పు రావాలి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. సిబ్బంది బాధ్యతతో పనిచేస్తున్నారు. కాన్పు మరణాలు, పోస్ట్‌నాటల్ అంశాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. గర్భిణులకు పౌష్టికాహారం, సుఖ ప్రసవం, ఆస్పత్రికి తీసుకువెళ్లడం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. కాన్పు తరువాత కూడా వైద్య సేవలు పొందవచ్చు. అయినప్పటికీ ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లోనూ మార్పు రావాలి. ఆస్పత్రుల్లో సేవలందకపోతే జిల్లా యంత్రాంగం స్పందిస్తుంది. -రెడ్డి శ్యామల, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం. -
నిఘా కళ్లకు కలక!
ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో పనిచేయని స్కైపీ వ్యవస్థ రెండేళ్ల క్రితం 11 ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ప్రారంభం జిల్లాకేంద్రం నుంచే ఆస్పత్రుల పనితీరు పరిశీలనకు అవకాశం సత్ఫలితాలివ్వడంతో పీహెచ్‌సీలకు విస్తరింపచేసేందుకు సన్నాహాలు ఈలోగానే నిఘా వ్యవస్థను ఆవరించిన నిర్లక్ష్యపు మత్తు కొన్నాళ్లుగా మూలకు చేరిన విలువైన పరికరాలు ప్రత్యక్ష పర్యవేక్షణ లోపించి.. ఆస్పత్రుల సేవలు యథాస్థితికి ప్రభుత్వ ఆస్పత్రులకు నిత్యం రోగులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వారందరికీ తక్షణ వైద్యం అందజేయాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య సిబ్బందిదే. అయితే అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఇక్కడా నిర్లక్ష్యం, అవినీతి పాతుకుపోవడంతో పేద రోగులకు సర్కారీ వైద్యం గగన కుసుమంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని చెరిపేసేందుకు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన స్కైపీ అనే నిఘా వ్యవస్థ కూడా దాదాపు కనుమరుగైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యవహారాలను ఒకేచోట కూర్చొని టీవీ తెరపై వీక్షించడంతోపాటు.. అవసరమైతే డాక్టర్లు, రోగులతో మాట్లాడే అవకాశం ఉన్న ఈ అధునాతన నిఘా కళ్లకు నిర్లక్ష్యం అనే కలక సోకింది. ఫలితంగా వ్యవస్థ మసకబారింది. ఆస్పత్రుల తీరు యథాస్థితికి చేరుతోంది. పాలకొండ రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును నేరుగా పరిశీలించి ఎప్పటికప్పుడు సూచనలు అందించేందుకు రెండేళ్ల క్రితం జిల్లాలో ఏర్పాటు చేసిన స్కైపీ వ్యవస్థ(నిఘా) దాదాపు మూలకు చేరింది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఏ ఒక్క ఆస్పత్రిలోనూ ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు. అప్పట్లో జిల్లాలోని రెండు ప్రాంతీయ ఆస్పత్రులు, 9 సామాజిక ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్)తోపాటు కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ ఆస్పత్రుల పనితీరు, రోగులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విలువైన కంప్యూటర్లు, వెబ్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు నిరుపయోగమయ్యాయి. రోగులకు మెరుగైన సేవలే లక్ష్యంగా.. ఆస్పత్రుల పనితీరు మెరుగు పరిచి, రోగులకు ఉన్నత సేవలు అందించడమే స్కైపీ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం. 2012లో డీసీహెచ్ఎస్గా ఉన్న సి.సుధాకర్ దీన్ని ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. పలు జిల్లాల్లో అప్పటికే అమల్లో ఉన్న ఈ విధానానికి శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకారం చుట్టారు. దీనిపై కరీంనగర్లో శిక్షణ పొందిన ఆయన తొలుత వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలకొండ, టెక్కలి ఏరియా ఆస్పత్రులతో పాటు సోంపేట, బారువ, పాతపట్నం, పలాస, కోటబొమ్మాళి, నరసన్నపేట, రాజాం, రణస్థలం, ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రుల్లో మొదలు పెట్టారు. ఇందుకోసం నెలరోజుల వ్యవధిలో కంప్యూటర్లు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయించారు. వాటిని డీసీహెచ్ఎస్ కార్యాలయంతో అనుసంధానం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా జిల్లా కేంద్రం నుంచే ప్రతిరోజు అన్ని ఆస్పత్రుల పనితీరును పరిశీలించడ ం.. అవసరమైతే అప్పటికప్పుడు అక్క డ వైద్యులతో నేరుగా మాట్లాడి ఆరా తీయడం, రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరగయ్యాయి. తగ్గిన అక్రమాలు ఆడియో, వీడియో విజువల్స్ ద్వారా నేరుగా జిల్లా కేంద్రం నుంచి ఆయా ఆస్పత్రుల రోగుల నుంచి సమాచారం తీసుకునే అవకాశం ఉండడంతో అక్రమాలకు చాలావరకు అడ్డుకట్ట పడింది. రోగుల నుంచి, ప్రసవాలకు వచ్చే గర్భిణుల నుంచి డబ్బులు దండుకునే సిబ్బంది చేతివాటానికి ఈ విధానం చెక్ పెట్టగలిగింది. ఏ సమయంలోనైనా కలెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు స్కైపీ వ్యవస్థ ద్వారా నేరుగా రోగులతో మాట్లాడే అవకాశం ఉందన్న భయం అటు వైద్యులు, ఇటు వైద్య సిబ్బందిలోనూ ఉండేది. సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా సేవల నాణ్యత పెరిగింది. ఫిర్యాదులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలకు సైతం స్కైపీ నిఘాను విస్తరించాలని ఉన్నతాధికారులు భావించినా.. కొన్నాళ్లకే ఉన్న వ్యవస్థే పని చేయడం మానేయడంతో ఆ ప్రతిపాదన కూడా పెండింగులో పడింది. ప్రస్తుతానికి పని చేయడం లేదు.. అంతే! ఇన్ని మంచి ఫలితాలనిచ్చిన ఈ విధానం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందే చెబుతున్నారు. కారణమేమిటని అడిగితే.. సాంకేతిక సమస్యలు చెబుతూ ప్రస్తుతానికి పని చేయడం లేదు.. అని మాత్రమే చెబుతున్నారు. ఇదే విషయమై పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఆరా తీయగా కొన్నాళ్లుగా స్కైపీ వాడడం లేదని మాత్రమే సమాధానమిచ్చారు. ఒక కంప్యూటర్ వద్ద కూర్చొని జిల్లాలో ఉన్న అన్ని ఆస్పత్రుల నిర్వహణ తీరును పరిశీలించే అవకాశాన్ని వదులుకుని వే లకు వేలు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రులను పరిశీలించడం ఎంతో కష్టసాధ్యం. సమస్య ఉత్పన్నమైనప్పుడు క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ప్రస్తుతం లేకపోయింది. నిఘా కొరవడడంతో ఆస్పత్రుల్లో సిబ్బంది ఆడిందే ఆటగా పాడిందే సాగుతోంది. ఇటీవల జిల్లాలో పలు ఆస్పత్రులను పరిశీలించిన డీసీహెచ్ఎస్ కూడా సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శం. సాంకేతిక సమస్యలను అధిగమిస్తాం స్కైపీ విధానం అన్ని ప్రాంతాల్లో అమల్లోనే ఉంది. అయితే సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం. ఇకపై స్కైపీ ద్వారా ఆస్పత్రుల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతోఆపటు పీహెచ్‌సీల కు కూడా ఈ విధానాన్ని విస్తరింపజేసేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. -ఎం.సునీల, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్) -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం
త్వరలో ఖాళీ వైద్య పోస్టుల భర్తీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య అట్టహాసంగా దంత వైద్యుల సదస్సు ప్రారంభం హాజరైన 3వేల మంది దంత వైద్యులు, విద్యార్థులు హన్మకొండ చౌరస్తా :ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడమే కాకుండా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ పద్మాక్షికాలనీ లోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాష్ట్రస్థాయి తొలి దంత వైద్య సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సుకు డాక్టర్ రాజయ్య ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. ఐడీఏ రాష్ట్ర అధ్యక్షు డు త్రినాథ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిం చిన రాజయ్య మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంతవైద్య సేవలు రాజయ్య మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే సీఎం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆరువేలమంది వైద్యు ల నియామకం కోసం కేంద్రం రూ.5.17కోట్లు కేటాయించిందన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తికాగానే వైద్యుల నియామకం ప్రారంభమవుతుందన్నారు. దంతవైద్యులు సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దంతవైద్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆస్పత్రుల్లోని లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘ఆస్పత్రి బస’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ కల్పనాదేవి, జయసింహారెడ్డి, నర్సింగరెడ్డి డాక్టర్లు చలపతిరావు, ప్రవీణ్‌కుమార్, నర్సింగరెడ్డి సురేందర్‌రెడ్డి, కరుణాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ల్యాబ్‌లున్నా.. టెక్నీషియన్లు లేరు
మోర్తాడ్ : ప్రభుత్వ ఆస్పత్రులలో రక్తం, మూత్రం, తది తర పరీక్షలను నిర్వహించి రోగాన్ని నిర్ధారించడానికి ల్యాబ్‌లను ఏర్పాటు చేసినా.. ల్యాబ్ టెక్నీషియన్లను నియమించకపోవడంతో రోగులకు సరైన సేవ లు అందడం లేదు. కొన్నేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా నే ఉంటున్నాయి. వీరి స్థానంలో ఎంపీహెచ్‌ఏలతో ల్యాబ్‌లను నెట్టుకొస్తున్నారు. జిల్లాలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్‌లతోపాటు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నా యి. గతంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమితులైనవారు తర్వాత సూపర్వైజర్లుగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే శిక్షణ పొందిన ల్యాబ్టెక్నిషియన్లు విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టు ల్లో డీఎల్‌ఎంటీ కోర్సు పూర్తి చేసినవారిని నియమించాల్సి ఉంది. ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకపోవడంతో అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఆస్పత్రుల్లో ఎంపీహెచ్‌ఏలుగా పని చేస్తున్న కాం ట్రాక్టు వైద్య సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చి వారి తోనే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు జ్వరంలాంటి వ్యాధులకే కాకుండా మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు, హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇంకా ఎన్నో రకాల వ్యాధుల నిర్ధారణకు రక్త, మూత్ర పరీక్షలు అవసరం అవుతా యి. ఎక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో తక్కువ సమయం లో నామమాత్రపు శిక్షణ పొందిన ఎంపీహెచ్‌ఏలతో నే ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. డీఎంఎల్టీ కోర్సులో రోగ నిర్ధారణ పరీక్షలను ఎలా చేయాలి, ఎలాంటి వ్యాధిని గుర్తించాలంటే ఎంత సమయం రక్తం, మూత్రం పరీక్షను నిర్వహిం చాలి, తదితర ఆంశాలపై క్షుణ్ణంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారికి పరీక్షలను నిర్వహిస్తారు. డీఎంఎల్టీ కోర్సు పూర్తి చేసినవారు ప్రైవేటుగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకునే వీలుంది. కాగా వా రు ప్రభుత్వ ఉద్యోగంపైనే టెక్నీషియన్లు మక్కువ చూపుతారు. ప్రభుత్వం మాత్రం శిక్షణ కేంద్రాల నిర్వహణకు అనుమతులు ఇస్తున్నా.. ఉపాధిని చూపలేకపోతోందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం స్పందించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పక్షవాతం.. జరభద్రం
గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి రోజూ 10 నుంచి 15మంది వరకు పక్షవాతానాకి గురైన రోగులు వైద్యం కోసం వస్తున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో వీరి సంఖ్య అధికంగానే ఉంటుంది. కాలు, చేయి పనిచేయక వికలాంగ సర్టిఫికెట్‌కోసం జీజీహెచ్‌కు వచ్చే వారిలో పక్షవాత రోగులే అధికం. ఈ వ్యాధి బారినపడిన సమయంలో సరైన అవగాహన లేక, మందులు వాడకుండా, ఎవరో చెప్పారని ఆకుపసర్లు మింగుతూ కాలయాపన చేయడం వల్ల శాశ్వతంగా వికలాంగులుగా ఉండాల్సి వస్తుందని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. పక్షవాతంపై అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్ 29న ప్రపంచ పక్షవాత నివారణ దినం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యుల సూచనలివి.. - గుంటూరు మెడికల్ జీజీహెచ్‌లో ఉచిత వైద్యం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పక్షవాతం బాధితులకు ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. అవుట్పేషేంట్ విభాగంలోని 10వ నంబర్ గదిలో ఈ వైద్యసేవలు లభిస్తున్నాయి. పక్షవాతానికి గురైన వారికి అత్యవసర వైద్యసేవల విభాగంలో 24 గంటలు వైద్యసేవలు లభిస్తాయి. వ్యాధి నిర్ధారణకు అవసరమైన సిటిస్కాన్, కలర్‌డాప్లర్ వైద్య పరికరాలు ఇక్కడ ఉన్నాయి. కారణాలు.. లక్షణాలు మెదడుకి వెళ్లే రక్తనాళం లేదా మెదడులోని రక్తనాళం గాని పూడుకుపోవటం వల్ల రక్తసరఫరా ఆగిపోతే పక్షవాతం వస్తుంది. మెదడులో కణుతులు, రక్తంలో కొవ్వు పదార్ధాల వల్ల, మెదడువాపు వచ్చే వ్యాధుల వల్ల, గుండెజబ్బుల వల్ల, స్థూలకాయుల్లోనూ వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చినవారికి ఒకే వస్తువు రెండుగా కనబడటం, మాట తడబడి, అయోమయంగా మాట్లాడటం, మింగుడు పడకపోవటం, నీరుసరిగా తాగలేకపోవటం, కళ్లు, తల తిరగటం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, మూతి ఒకవైపునకు ఒంకరపోవటం, దృష్టి మందగించటం, కాళ్లు చేతులు ఉన్నట్టుండి బలహీన పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. - డాక్టర్ శ్రీరామ ఆంజనేయులు, న్యూరాలజిస్ట్, లైఫ్ హాస్పటల్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. రక్తపోటును, షుగర్‌ను అదుపులో పెట్టుకోవాలి. పొగ, మందు తాగకూడదు. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తినకూడదు. స్థూలకాయం ఉంటే తగ్గించుకోవాలి. పక్షవాతంపై ప్రజలకు అవగాహన కల్పించి, పక్షవాతాన్ని నివారించాలనే లక్ష్యంతో మా ఆస్పత్రిలో స్ట్రోక్ యూనిట్‌ను 1996లో ఏర్పాటుచేశాం. - డాక్టర్ పమిడిముక్కల విజయ, న్యూరాలజిస్ట్, లలితా హాస్పటల్ ఫిజియోథెరపితో ఎంతో ఉపయోగం... పడిపోయిన కాలు, చెయ్యిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటంలో ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాలలో ఉచితంగా వైద్యసేవలను అందిస్తున్నాం. రోజూ సుమారు 70 మందికి పైగా వైద్యసేవలను పొందుతున్నారు. ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి తీసుకొచ్చి పేదరోగులకు ఉచితంగా ఆధునిక ఫిజియోథెరపీ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నాం. - డాక్టర్ బి.శివశిరీషా, సిమ్స్ కరస్పాండెంట్ వెంటనే డాక్టర్ వద్దకు వస్తే మేలు.. బాధితుడిని వ్యాధికి గురైన 3 గంటలనుంచి నాలుగు గంటలలోపు నరాల వ్యాధుల వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఎట్టి పరిస్థితిల్లోనూ నాటు వైద్యం జోలికి వెళ్లవద్దు. మద్యం, ధూమపానం లాంటి చెడు వ్యసనాలు ఉంటే ఏ వయసులోనైనా రావచ్చు. త్వరలోనే జీజీహెచ్‌లో స్ట్రోక్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఉన్నతాధికారులు అన్ని వసతులు కల్పిస్తే పక్షవాత రోగులకు త్వరలోనే మరింత మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. - డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి, జీజీహెచ్ -
ప్రసవానికి రావాలంటేనే భయం!
ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేందుకు భయపడుతున్న గర్భిణులు పురిటిగదులకు క్లోరినేషన్ లేదు ఏకకాలంలో ఒకే గదిలో నాలుగైదు కాన్పులు ఆపరేషన్ టేబుళ్లు లేని ఆస్పత్రులు 63 శాతం పైనే మత్తువైద్యులు, చిన్నపిల్లల వైద్యులున్నది 50 శాతం మందే భారీగా పెరుగుతున్న సిజేరియన్ల సంఖ్య కుటుంబ సంక్షేమశాఖ సర్వేలో వెల్లడైన నిజాలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి రావాలంటేనే గర్భిణులు భయపడుతున్నారు. ఆస్పత్రులకెళితే వైద్యసేవలు అటుంచితే పట్టించుకునేవారే లేరు. చాలా చోట్ల సుఖ ప్రసవానికి అవకాశమున్నా వైద్యులు వేచి చూసే ధోరణి ఉండదు. వెంటనే సిజేరియన్ అనడం కడుపుకోసి బిడ్డను తియ్య డం.. ఇదీ పరిస్థితి. వైద్యసేవల పరిస్థితి ఇలా ఉండగా.. కాన్పుల గదులు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. కనీసం ఆపరేషన్ చేసేందుకు టేబుళ్లు కూడా లేని దుస్థితి. చాలా చోట్ల ప్రసవ గదులకు ఇన్ఫెక్షన్ రాకుండా వాడే మందులు వాడట్లేదు. ప్రసవం జరుగుతున్న సమయంలో ఒక గదిలో ఒక్కరే ఉండాలి. కానీ ఒకే గదిలో నలుగురు లేదా ఐదుగురు కూడా పురిటినొప్పులతో బాధపడుతున్న దృశ్యాలు ఎన్నో. ఒక ప్రసవానికీ మరో ప్రసవానికీ కనీసం సర్జికల్ గ్లౌజ్‌లు కూడా మార్చుకోకుండానే చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి సుమారు 9.5 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతూంటే అందులో ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం 40 శాతమే జరుగుతున్నాయి. వాటిలోనూ సిజేరియన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవలే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు, గర్భిణుల పరిస్థితిపై కుటుంబ సంక్షేమశాఖ సర్వే చేస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సిజేరియన్ల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడైంది. సుఖప్రసవమయ్యే వీలున్నా 20 నిమిషాలు కూడా వైద్యులు వేచి ఉండట్లేదు. సుమారు 55 నుంచి 60% డెలివరీలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్లు జరుగుతున్నట్టు తేలింది. సురక్షిత ప్రసవానికి ప్రత్యేక ప్రణాళిక ఇకపై సురక్షిత ప్రసవానికి ప్రత్యేక చెక్‌లిస్ట్ పెడుతున్నాం. రాష్ట్రంలో 190 సీహెచ్‌సీలు (సామాజిక ఆరోగ్య కేంద్రాలు), 30 ఏరియా ఆస్పత్రులు, తొమ్మిది జిల్లా ఆస్పత్రులు, 11 డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రత్యేక ప్రసూతి కేంద్రాలను గుర్తించి, వాటిని బలోపేతం చేస్తున్నాం. ప్రసూతి గదుల్లో వసతులు, అత్యాధునిక యంత్రాల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దీనికోసం రూ. 17.5 కోట్ల నిధులు ఇవ్వాలని కోరాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి తొమ్మిదిన్నర లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులో 40 నుంచి 45 శాతం మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెంచుతాం. ప్రసూతి గదుల్లో పనిచేసే వైద్యులకు లేదా మిగతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణనివ్వబోతున్నాం. ఎలా చేస్తే బిడ్డ సురక్షితంగా ఉంటారో దాన్ని అమలు చేస్తాం. దీనిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళతాం. - సౌరభ్‌గౌర్,కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ప్రభుత్వాసుపత్రుల్లో ఇదీ పరిస్థితి ప్రసవ సమయంలోనూ, ఆ తర్వాతా లేబర్ గదుల్ని అంటువ్యాధులు రాకుండా క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ 28 శాతం ఆస్పత్రుల్లో అలా చేయడం లేదు. ఆస్పత్రుల్లో గ్లౌజ్‌లు, శస్త్రచికిత్సలకు వాడిన వస్తువులను డీకంటామినేటింగ్ (ప్రక్షాళన) చేయాలి. కానీ 32 శాతం ఆస్పత్రుల్లో అలా చేయడం లేదు. చాలామంది పిల్లలకు ఇన్ఫెక్షన్ లేదా కామెర్లు సోకితే రేడియంట్ వార్మర్లో పెడతారు. కానీ 5 శాతం ఆస్పత్రుల్లో ఇవి లేవు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం చిన్నపిల్లల వైద్యులు ఉండాల్సిన సంఖ్యలో 45 శాతం మందే ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మత్తు వైద్యులు(అనస్థీషియా వైద్యులు) ఉండాల్సిన సంఖ్యలో 55 శాతం మందే ఉన్నారు.హిందూపురం, అనంతపురం, ఏలూరు, కడప, నరసన్నపేట ఆస్పత్రుల్లో అనస్థీషియా వైద్యులు లేరు. బిడ్డ పుట్టగానే బీపీ, షుగర్, బరువు, గ్లూకోజ్ లెవెల్స్, కామెర్ల శాతం వంటి చాలా పరీక్షల ఫలితాలను రికార్డు చేసి ఉంచే పార్టొగ్రాఫ్లు 59 శాతం ఆస్పత్రుల్లో లేవు. -
ఎవరు హెచ్చరించినా..డోన్ట్‌కేర్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని, ప్రజలు స్వేచ్చగావచ్చి చికిత్స పొందవచ్చని ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే...భద్రాచలం మన్యం ప్రజలు మాత్రం.. ‘వామ్మో.. ఏరియా ఆస్పత్రిలో వైద్యమా..’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఆస్పత్రిలో సేవలు మెరుగ్గానే ఉన్నప్పటికీ ఇటీవల మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సరైన వైద్య సేవలు అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, నవజాత శిశులకు అందే సేవలు విఫలమై మరణాలు సంభవించడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మూడు నెలల కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఆక్సిజన్ అందక పసికందు మృతి చెందడం, ప్రసవం సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందడం, ప్రసవం జరిగిన తర్వాత బాలింతకు వేసిన కుట్లు విడిపోయి తీవ్ర రక్త స్రావం కావడం, శనివారం వైద్యులు, స్టాప్ నర్సులు నిర్లక్ష్యంగా ప్రసవం చేయటంతో పురిటిలోనే పసికందు మృతి చెందడం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలా వరుస మరణాలతో ఏరియా ఆస్పత్రి తరచూ వార్తల్లోకెక్కి వివాదాల్లో నిలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యంతో పాటు డాక్టర్లు, వసతుల లేమి, డయాగ్నస్టిక్ సెంటర్, స్కానింగ్ సెంటర్ లేకపోవడం..ఇలా అన్ని సమస్యలే. వాటిని పరిష్కరించడంలో స్థానిక వైద్యాధికారులతో పాటు ఉన్నతాధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వైద్య సేవలపై ఎమ్మెల్యే అసంతృప్తి... ఏజెన్నీ ప్రజలతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల వారికి సైతం భద్రాచలం ఏరియా ఆస్పత్రి పెద్ద దిక్కుగా ఉంది. కానీ ఈ ఆస్పత్రిలో వైద్యసేవలపై స్థానిక ఎమ్మెల్యే సున్నం రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఏరియా ఆస్పత్రి తనిఖీకి వచ్చిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, పీఓ దివ్యలకు ఆయన ఫిర్యాదు చేశారు. సేవలు అందించడంలో వైద్యుల నిర్లక్ష్యాన్ని ఆయన బాహాటంగానే వివరించారు. దీనికి తోడు ఆస్పత్రిలో చోటుచేసుకున్న మరణాలపై సూపరింటెండెంట్ వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే మరింత ఆగ్రహంగా ఉన్నారు. శనివారం జరిగిన పసికందు మృతి సంఘటనలో బంధువులు సూపరింటెండెంట్‌ను నిలదీయగా ‘బిడ్డ ఆయుష్షు అంత వరకే ఉంది, అందుకే చనిపోయాడు’ అంటూ అవహేళనగా మాట్లాడడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సైతం సారపాక గ్రామం గాంధీనగర్ కాలనీకి చెందిన ఓ గర్భిణి ప్రసవ సమయంలో మృతి చెందడంతో బంధువులు నిలదీయగా సూపరింటెండెంట్ ఇటువంటి వ్యాఖ్యలే చేయడంతో ఆమె బంధువులు, మహిళలు దాడి చేశారు. ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నా ఆస్పత్రి నిర్వహణలోనూ, వైద్యాధికారులు అందించే సేవల్లోనూ మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్యశాఖ మంత్రిలతో పాటు, ముఖ్యమంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమైనట్లు సమాచారం. -
రోగులకు నమ్మకం కలిగించాలి
ఆ బాధ్యత ప్రభుత్వ వైద్యులదే ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కె.కోటపాడు : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత వైద్యులదేనని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి విచ్చేసిన ఆయన బుధవారం మధ్యాహ్నం స్థానిక 30 పడకల ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో కలియతిరిగి సేవలపై ఆరాతీశారు. మరుగుదొడ్లు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆస్పత్రిలోని జనరేటర్ పనిచేయడం లేదని, దీనివల్ల ఆపరేషన్ల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వేచలపు కాసుబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ డీసీహెచ్ఎస్ నాయక్‌కు లేఖరాయాలని, దాని కాపీ తనకు ఇస్తే మంత్రితో మాట్లాడుతానని వైద్యులకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈర్లె గంగునాయుడు (నాని), కొత్తల సింహాచలంనాయుడు (నవీన్), తర్రా మురళీకృష్ణ, వర్రి చినరమణ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం మాడుగుల : శాసన సభలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ బూడి ముత్యాలనాయుడుకు బుధవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ సమస్యలపై దృష్టిసారిస్తానని తెలిపారు. స్వాగతం పలికిన వారిలో జెడ్పీటీసీ సభ్యురాలు గొల్లవిల్లి ప్రభావతి, నాయకులు గొల్లవిల్లి సంజీవరావు, రాఖి శ్రీను, వేమవరపు వెంకటధర్మజ (పెదబాబు), కనిశెట్టి నగేష్, బొద్దపు భాస్కరరావు, తాళపురెడ్డి రాజారాం, కొట్యాడ భాస్కరరావు, రొబ్బా మహేష్, కొట్యాడ కృష్ణమూర్తి, అశోక్, సయ్యపురెడ్డి నారాయణరావు, రాజుతాత, చెల్లంనాయుడు, దాడి రాజేశ్వరరావు, గోకాడ అప్పారావు తదితరులున్నారు. -
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిలిచిన వైద్యసేవలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం అంబం గ్రామానికి చెందిన పూజ(20) కవలలకు జన్మనిచ్చి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పూజ మరణించిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన మమత(28) అనారోగ్య సమస్యతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సుమలత మరణించిం దని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడులను నిరసిస్తూ ఐఎంఏ, అప్నాల ఆధ్వర్యంలో ఆస్పత్రుల యాజమాన్యాలు మూడు రోజులు గా నిరసనకు దిగాయి. ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను మూసి ఉంచాయి. ఈ నిరసన కార్యక్రమాలు ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. మూడు రోజులుగా వైద్యసేవలు అందడం లేదు. సోమవారం ప్రభుత్వ వైద్యులు సైతం ఆందోళనల్లో భాగస్వాములు కావడంతో రోగులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలోనే 92 వరకు ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రుల్లో రోజూ 500 వరకు ఔట్ పేషెంట్లు, 150 వరకు ఇన్‌పేషెం ట్లుగా సేవలు పొందుతుంటారు. ఆస్పత్రులను మూసి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులపై దాడులకు పాల్పడినవారిని అరెస్టు చేసేంతవరకు నిరసనలు తెలుపుతామని ప్రైవేట్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మూడు రోజులుగా వైద్యసంఘా లు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నాయి. మరో వైపు ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేయడంతో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకులు ప్రైవేట్ ఆస్పత్రులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి.. ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కిటకిటలాడింది. రోజూ జిల్లా ఆస్పత్రికి 350 మంది ఔట్ పేషెంట్లు వచ్చేవారు. ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేయడం తో ఈ సంఖ్య 560కి చేరింది. ఈ సమయంలో రోగులకు అందుబాటులో ఉండి సేవలు అం దించాల్సిన ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ వైద్యుల తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం జిల్లా ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన ప్రభుత్వ వైద్యులు ఐఎంఏ, అప్నా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధులు బహిష్కరించారు. ఆస్పత్రి ముందు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. అటు ప్రైవేట్ ఆస్పత్రుల మూసివేత, ఇటు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు అందుబాటు లో లేకపోవడంతో రోగులు విలవిలలాడారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో జిల్లా ఆస్పత్రికి వచ్చినవారు నరకం చూశారు. ప్రభుత్వ వైద్యుల్లో దాదాపు అందరికీ ప్రైవేట్ ఆస్పత్రులు ఉండడం వల్లే నిబంధనలను లెక్కచేయకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఆస్ప త్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి పరిపాలన అధికారికి ఎలాంటి సమాచారం అందించకుండానే వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినవారికి వైద్యసేవలు అందించాల్సింది పోయి విధులు బహిష్కరించడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను జిల్లా ఆస్పత్రి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వైద్య విధాన పరిష త్, డీఎంఈ అధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై నివేదిక కోరే అవకాశాలున్నాయి. -
రోగులపై ప్రై‘వేటు’
రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ ఫీజులు 30 శాతం వరకు పెంపు పెరిగిన నిర్వహణ భారం తప్పదంటున్న ఆస్పత్రి యాజమాన్యాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర కొర వసతులు, వైద్యుల కొరత...తదితర కారణాల వల్ల పేదలు సైతం ప్రైవేట్ ఆస్పత్రుల వైపు చూస్తున్న తరుణంలో వాటిల్లో ఫీజులు పెరిగిపోయాయి. నగరంలోని అనేక ఆస్పత్రులు రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ ఫీజులను పది నుంచి 30 శాతం వరకు పెంచేశాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెంచిన ఫీజులను వసూలు చేస్తున్నారు. అన్ని ధరలు పెరుగుతున్న దశలో ఆస్పత్రుల్లో ఫీజులను పెంచడం సహేతుకమేనని ప్రైవేట్ యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాయి. ఆస్పత్రి నిర్వహణా ఖర్చులు, వైద్యుల వేతనాలు, సర్జరీ ఖర్చులు పెరిగినందున అదే నిష్పత్తిలో ఫీజులను పెంచక తప్పలేదని చెబుతున్నాయి. హెబ్బాళలోని కొలంబియా ఏషియా ఆస్పత్రి, బాప్టిస్ట్, పాత విమానాశ్రయం రోడ్డులోని మణిపాల్, ఎంఎస్ఆర్ నగరలోని ఎంఎస్. రామయ్య, తిలక్ నగరలోని సాగర్, నృపతుంగ రోడ్డులోని సెయింట్ మార్తాస్ ఆస్పత్రుల్లో ఫీజులు పెరిగాయి. నారాయణ హృదయాలయలో అనేక పరీక్షలకు సంబంధించిన ఫీజులను గత జనవరి నుంచే 10 నుంచి 15 శాతం పెంచారు. పెరిగిన ఛార్జీల అనంతరం...హాస్‌మాట్ ఆస్పత్రిలో వివిధ రోగాలకు సంబంధించి కన్సల్టేషన్ ఫీజులు రూ.250 మొదలు రూ.550 వరకు ఉన్నాయి. = విఠల్ మల్య ఆస్పత్రిలో కన్సల్టేషన్ ఫీజును రూ.400, రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.100గా నిర్ణయించారు. ఆపోలో ఆస్పత్రి కూడా ఫీజులను పెంచే దిశగా యోచిస్తోంది. ఎక్కడెక్కడ.. ఎంతెంత... = బాప్టిస్ట్ ఆస్పత్రిలో సాధారణ కన్సల్టేషన్ ఫీజు రూ.50 నుంచి రూ.70కి పెరిగింది. రెండోసారి కన్సల్టేషన్ ఫీజు రూ.30 నుంచి రూ.50కి పెంచారు. ఇతర కన్సల్టేషన్ ఫీజును రూ.175 నుంచి రూ.250కి పెంచారు. = కొలంబియా ఏషియా ఆస్పత్రిలో రూ.500 నుంచి రూ.600 = రామయ్య ఆస్పత్రిలో రూ.300 నుంచి రూ.350 = సాగర్ ఆస్పత్రిలో రూ.250 నుంచి రూ.300కు, రూ.350 నుంచి రూ.450కు పెరిగాయి. = మణిపాల్ ఆస్పత్రిలో గతంలో రూ.400, రూ.500 ఉన్న కన్సల్టేషన్ ఫీజును రూ.వంద చొప్పున పెంచారు. -
ప్రజారోగ్యం గాలికి
పేదల ఆరోగ్యంపై పాలకుల చిన్నచూపు {పభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కల్పనలో నిర్లక్ష్యం ప్రభుత్వ ఆస్పత్రులంటేనే సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పదేళ్లకు ముందూ, గడిచిన ఈ నాలుగేళ్లూ ఇదే పరిస్థితి. చూడ్డానికి బోలెడన్ని ఆస్పత్రులున్నా అవన్నీ సమయానికి సామాన్యునికి వైద్యం అందించలేని దీనస్థితిలో ఉన్నాయి. సాధారణ జబ్బులకూ దిక్కులేని పరిస్థితి. ప్రజారోగ్యం పట్టించుకోని పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఏటా నాలుగు కోట్ల మంది ప్రభుత్వాసుపత్రులకు వెళుతుంటే రెండున్నర కోట్ల మందికి కూడా సరైన వైద్యం అందడం లేదు. ఏటా పధ్నాలుగు లక్షల కాన్పులు జరుగుతూ ఉంటే సరైన వసతులు, వైద్యం అందని కారణంగా తొమ్మిది లక్షల మందికి పైగా గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న పరిస్థితి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్నీ వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1630 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో ఏడు వందల కేంద్రాల్లో వైద్యులు లేరు. ఏటా మూడువేల మంది మెడిసిన్ పట్టభద్రులు వస్తున్నా మనకు వైద్యులు కరువు. {పెగ్నెన్సీ టెస్టు కోసం పీహెచ్సీకెళితే ఆ టెస్టు చేయలేరు. గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్ కోసం వెళితే ఆ పరికరాలుండవు. ఆరు లక్షల మందికి రెండు సార్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉండగా, రెండు లక్షల మందికి ఒక్కసారి కూడా చెయ్యలేదు. ఇప్పటికీ అన్ని రకాల మందులూ కరువే. సామాజిక ఆరోగ్య కేంద్రాల(సీహెచ్‌సీ) పరిస్థితి ఘోరం. ప్రతి సీహెచ్‌సీలో ప్రసూతి, చిన్నపిల్లల, అనస్తీషియా వైద్యులు ఉండాలి. కానీ 70 సీహెచ్‌సీల్లో మినహా అన్ని అస్పత్రుల్లోనూ వైద్యుల కొరతే. గత నాలుగేళ్లలో ఈ ఆస్పత్రులకు ఎన్ఆర్హెచ్ఎం నిధుల కింద రూ.200 కోట్లు మాతా శిశు వైద్యానికి ఖర్చు చేసినట్టు చెప్పుకుంటున్నా ఫలితం లేదు. ఇప్పటికీ ప్రతి వెయ్యి ప్రసవాలకు 44 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. సెకండరీ కేర్ కూడా అధ్వానమే {పాథమిక ఆరోగ్యం తర్వాత సెకండరీ కేర్ చాలా కీలకం. రాష్ట్రంలో సెకండరీ కేర్‌కు 17 జిల్లా ఆస్పత్రులు, 58 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలోనూ వసతుల కొరతే. ఈ ఆసుపత్రులకు అవసరమైన 350 మంది స్పెషలిస్టు డాక్టర్లు లేరు. కార్పొరేట్ హవా బోధనాసుపత్రులను 1994 నుంచి 2004 వరకూ అంటే దశాబ్దం పాటు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఈ పదేళ్లలో కార్పొరేట్ ఆస్పత్రులను బాగా ప్రోత్సహించారు. మెడికల్ టూరిజం అంటూ విదేశీ రోగులను ఆహ్వానించి, సామాన్య స్వరాష్ట్ర రోగులను గాలికొదిలారు. కొత్త వైద్య కళాశాలలు గానీ, కొత్తగా వైద్య సీట్లుగానీ రాకపోగా, పనిచేసే వైద్యులపైన కూడా ఆంక్షలు పెట్టడంతో చాలామంది ప్రభుత్వ వైద్య కళాశాలలను వదిలేసి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు. రిమ్స్‌లతో మళ్లీ ప్రాణం బోధనాసుపత్రులు లేని ప్రాంతాల్లో వాటితో పాటు పెద్దాసుపత్రులను నిర్మించడానికి 2007లో వైఎస్ఆర్ పూనుకు న్నారు. రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) పేరుతో శ్రీకాకుళం, ఒంగోలు, కడప, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో ఒక్కో కళాశాలను రూ.200 కోట్లతో నిర్మించడమే కాకుండా, ప్రతి కళాశాలకూ 100 ఎంబీబీఎస్ సీట్లు వచ్చేవిధంగా చేశారు. విశాఖపట్నంలో రూ.250 కోట్లతో విమ్స్ పేరిట సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకోగా.. ఆయన మరణం తర్వాత అదికూడా పడకేసింది. దీనికిప్పుడు నిధులివ్వడం లేదు. రోగులకు సరిపడా మందులు 1994-2004 మధ్య కాలంలో ప్రభుత్వాసుపత్రిలో మందులంటే బంగారం దొరికినంత భాగ్యం. అతికష్టమ్మీద ఆపరేషన్ జరిగినా మందులు బయట కొనుక్కోవాలి. 2004 నుంచి 2009 వరకూ ఎక్కడా రోగులకు మందుల కొరత లేదు. ఏటా రూ.198 కోట్లు కేవలం మందుల కొనుగోలుకే ఇచ్చేవారు. పీహెచ్‌సీలకు, బోధనాసుపత్రులకు అవసరమైతే అదనంగా కూడా కేటాయించారు. ఇప్పుడు ఏటా రూ.330 కోట్లు కేటాయిస్తున్నా రూ.165 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నారు. -
పురిటికష్టాలు
గుంటూరు మెడికల్ ,న్యూస్‌లైన్ :పెద్దాసుపత్రిలోనే పడకలు లేవంటే ఇక పల్లెటూళ్లలోని ఆరోగ్య కేంద్రాల్లో మంచాలు కూడా ఉండవంటే నమ్మక తప్పదు. కాన్పుకోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్ళేందుకు ఆర్థిక స్థోమతలేని పేదరోగులు ప్రభుత్వ ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. తీరా అక్కడకు వెళితే కనీసం మంచాన్ని కూడా ఇచ్చే స్థితిలే ప్రభుత్వ ఆస్పత్రులు లేవు. మంచాలను కొనేందుకు డబ్బులు లేవా అంటే ఉన్నాయి. వాటిని వైద్యాధికారులు తమకు లబ్ధి చేకూర్చే వాటి కోసం వినియోగిస్తున్నారు. జిల్లాకు జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా కోట్లాది రూపాయలు వస్తున్నాయి. వాటితో గర్భిణులు, బాలింతలకు ఎంతో చేసే అవకాశం ఉంది. స్వలాభమే తప్ప రోగుల సంక్షేమం పట్టని అధికారులు, వారి సమస్యలపై చొరవ చూపని ప్రభుత్వం వెరసి సర్కా రు దవాఖానాలకు వచ్చే వారికి పురిటికష్టాలు తప్పటం లేదు. జీజీహెచ్‌లో..... సుమారు ఆరు జిల్లాల నుంచి జీజీహెచ్‌కు రోగులు వస్తుంటారు. కాన్పుల విభాగంలో 120 పడకలను కేటాయించినప్పటికీ ప్రతి రోజూ 200 మందికి పైగానే బాలింతలు వార్డులో ఉంటున్నారు. రోజూ 30కి పైగా కాన్పులు జరుగుతున్నాయి. ఒక్కో పడకపై ఇరువురు లేదా ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. పురిటినొప్పులకంటే పడకలు లేక బాలింతలు పడుతున్న కష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సరిపడా వైద్య సిబ్బంది కూడా లేకపోవటంతో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. రాత్రి వేళల్లో కాన్పుకోసం ఆస్పత్రులకు వచ్చేవారు తెల్లవార్లు వైద్యుల రాకకోసం ఎదురు చూస్తున్నారు. పురిటినొప్పులు తట్టుకోలేక బంధువులు కాన్పుచేయమని అడిగినా గోడు వినేవారు ఉండరు. కాన్పుల నిపుణులు విధులకు డుమ్మా కొడుతూ పీజీ వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందిపై భారం మోపుతున్నారు. గ్రామీణ, పురపాలక పట్టణ ఆస్పత్రుల్లో అర్హులైన, సమర్థులైన గైనకాలజిస్టులు లేకపోవటం, కాన్పుచేసే ఆపరేషన్ థియేటర్స్, ఇతర వైద్య పరికరాలు కూడా అలంకార ప్రాయంగానే ఉండటంతో వారంతా జీజీహెచ్‌నే ఆశ్రయిస్తున్నారు. రోజు రోజుకు కాన్పుల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా పడకలను, వైద్యులను, సిబ్బందిని నియమించటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు. పర్యవసానంగా సర్కారీ దవాఖానాల్లో పురిటికష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. కాన్పు అనంతరం బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా జీజీహెచ్‌లో ఉంటున్న కొందరు తల్లులు కటిక నేలపైనే ఉండాల్సివస్తున్నది. కాన్పుకు ముందు,తర్వాత కూడా కష్టాలు తప్పటం లేదు. -
ప్రసవ వేదన
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి సౌకర్యాలు అధ్వానం సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మహిళలకు ప్రత్యక్ష నరకం అత్యవసర పరిస్థితుల్లో నిపుణులు కానరాని వైనం {పైవేటు ఆస్పత్రులే దిక్కనుకుంటున్న జనం ప్రసవమంటే మహిళకు పునర్జన్మే అంటారు. మరో ప్రాణికి జన్మనిచ్చే ఆ క్లిష్ట తరుణం అమ్మతనానికి అగ్ని పరీక్ష అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కాన్పు సజావుగా సాగడానికి ఎంత మంచి సౌకర్యాలుండాలి! వైద్యులు, సిబ్బంది ఎంత శ్రద్ధగా సేవలందించాలి! కానీ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం అటువంటి సేవలు, వసతుల ఊసే లేదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల వైపు గర్భిణులు కనీసం తొంగి చూడడం లేదు. సిబ్బంది బాధ్యతారాహిత్యం, కనీస సౌకర్యాలకూ నోచుకోని దైన్యం ప్రభుత్వ ఆస్పత్రంటేనే గర్భిణులు బెంబేలెత్తిపోయేలా చేస్తున్నాయి. దాంతో పీహెచ్సీలలో కాన్పులు నానాటికీ తగ్గిపోతున్నాయి. మరోదారి లేక అక్కడ ప్రసవాలకు సిద్ధపడుతున్న అతివలకు ఈ సమస్యలు భయానక అనుభవాలను మిగులుస్తున్నాయి. చోడవరం,న్యూస్‌లైన్: ప్రసవాలకు ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని ఎలుగెత్తి చాటుతున్నారు.. అక్కడి పరిస్థితులను మాత్రం పెద్దలు వాటంగా విస్మరిస్తున్నారు. అధ్వానంగా ఉండే వాతావరణంలో, కనీస వసతులకు నోచుకోని వైద్యశాలల్లో.. డాక్టర్లు లేక, సిబ్బంది సాయపడక.. గర్భిణులు నరకయాతన పడుతున్నారు. ఈ బాధలెందుకు లెమ్మని అప్పోసప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ప్రసూతి సేవలకు సంబంధించి ప్రభుత్వ ఆస్పత్రుల తీరు దయనీయంగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో ప్రసవాలంటేనే మహిళలు అస్యహించుకునే పరిస్థితి ఉంది. ఆరోగ్యకేంద్రాల్లో కనీస సౌకర్యాలు కానరావడం లేదు.. వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. దాంతో ఒకప్పుడు నెలలో 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరిగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పుడా సంఖ్య పదికి మించడం లేదు. కశింకోట పీహెచ్సీ వంటి వాటిలో అయితే నెలకు ఐదు ప్రసవాలు చేయడం గగనంగా మారింది. కొందరు ఎఎన్ఎంలు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. నైపుణ్యం లేని ఆశ కార్యకర్తలే కాన్పు చేయిస్తున్నారు. ప్రసవం క ష్టమైతే చేతులెత్తేస్తున్నారు. అటువంటి స్థితిలో ఆపరేషన్‌కు అనుకూలమైన థియేటర్లు, సర్జన్లు అందుబాటులో ఉండడం లేదు. క్లిష్ట దశలో కేజీహెచ్‌కు తరలించే లోగా కొందరు గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి. ఏఎన్ఎంలు.. ఎక్కడ ? మైదాన ప్రాంతాల్లో, ఏజెన్సీలో మారుమూలు ప్రాంతాల్లో ఉన్న సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలు సక్రమంగా ఉండడం లేదు. దేవరాపల్లి మండలంలో ఇటీవల ఓ గర్భిణిని నదిలో కాజ్వే దాటిస్తూ ఉండగా, మధ్యలోనే ప్రసవించిన సంఘటనే దీనికి తార్కాణం. ఇటీవల కె.కోటపాడు 30పడకల ఆస్పత్రిలో రికార్డులు తనిఖీ చేసిన కలెక్టర్ బాగా త గ్గిపోయిన ప్రసవాల సంఖ్యను చూసి అవాక్కయ్యారు. ఈ పరిస్థితికి ఆస్పత్రుల్లో పరిస్థితులే కారణమన్నది విస్పష్టం. గ్రామీణులకు ఇక్కడి సేవలపై నమ్మకం కొరవడుతోంది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల నిర్వహణ మరీ అధ్వానంగా ఉంది. ప్రస్తుతం వీటిని మొక్కుబడిగా నిర్వహిస్తున్నా రు. అప్పుడప్పుడు లక్ష్యాల కోసం మెగా కుటుంబ సంక్షేమ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మెగా శిబిరాలప్పుడు పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకొస్తున్న సిబ్బంది ఆపరేషన్ల అనంతరం వారి గోడు పట్టించుకోవడం లేదు. ఆపరేషన్ల తర్వాత నేలపైనే వదిలేస్తున్నారు. తిరిగి ఇళ్లకు తరలించే విషయాన్ని కూడా గాలికొదిలేస్తున్నారు. -
ఉప లోకాయుక్త సుడిగాలి పర్యటన
గంగావతి, న్యూస్‌లైన్ : కర్ణాటక రాష్ట్ర ఉప లోకాయుక్త బృందం గురువారం గంగావతి తాలూకాలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులు, హాస్టల్, ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించింది. గురువారం ఉదయం తాలూకాలోని సంగాపుర, రామదుర్గ, బసవనదుర్గ, కురిహట్టి క్యాంప్‌లలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఉప లోకాయుక్త శశిధర్ మజిగె పరిశీలించారు. ప్రధానంగా ఈ గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కాంపౌండ్ గోడలు, గ్రామాల్లో నిర్మించిన డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నగరంలోని బీసీఎం హాస్టల్లోకి ప్రవేశించి హాస్టల్ మరుగుదొడ్లు, వంటగది విద్యార్థుల గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఆహారం సరిగా అందుతోందా? వసతులు సరిగా ఉన్నాయా? తాగునీటి సదుపాయం ఉందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి రిజిస్టర్‌ను పరిశీలించారు. మహిళల కాన్పులకు సంబంధించిన ఫైళ్లను చూసి మడిలు కిట్లను సరైన రీతిలో అందించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని రోగుల వార్డులను సందర్శించి సరైన రీతిలో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారా?అని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనకగిరి తదితర గ్రామాలకు వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించి కుష్టిగి తాలూకాలో ప్రవేశించారు. ఉప లోకాయుక్త వెంట కొప్పళ డీవైఎస్పీ ఎస్కే. మురనాళ్, లోకాయుక్త సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీంబాషా, గంగావతి తహ శీల్దార్ గంగన్న, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎస్ఎన్. మఠద్, నగరసభ కమిషనర్ నింగన్న కుంబణ్ణనవర్, స్థానిక టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జ్యోతిబా నిక్కం, ప్రభుత్వ ఆస్పత్రి పాలక మండలి అధికారి డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.