ఆస్పత్రులా.. చెత్తకుండీలా? | Hospitals in the trash ..? | Sakshi
Sakshi News home page

ఆస్పత్రులా.. చెత్తకుండీలా?

Published Tue, Mar 24 2015 2:26 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఆస్పత్రులా.. చెత్తకుండీలా? - Sakshi

ఆస్పత్రులా.. చెత్తకుండీలా?

  • అధ్వానంగా ప్రభుత్వ ఆస్పత్రులు  
  • వైద్యుల్లేరు.. సిబ్బంది కరువు
  • పనిచేయని పరికరాలు.. మందులకూ కటకట  
  • సరిపోని పడకలు.. ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురికి చికిత్స
  • పేరుకే పెద్దాసుపత్రులు.. కానీ నిండా అసౌకర్యాలే.. డాక్టర్లు ఉండరు.. పారామెడికల్ సిబ్బంది కనిపించరు.. మందులు అందుబాటులో ఉండవు.. కాలం చెల్లిన వైద్య పరికరాలు.. చివరకు బెడ్‌లూ సరిపోవు. కొన్నిచోట్ల ఒక్కో మంచంపై ఇద్దరిని పడుకోబెడితే, మరికొన్ని ఆస్పత్రుల్లో నేలపైనే ఉంచాల్సిన పరిస్థితి. పడకలపై బెడ్‌షీట్‌లు ఉండవు.. ఉన్నా దుర్వాసన వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..   
    - సాక్షి నెట్‌వర్క్
     
    నిండా లోపాలే..

    రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు జబ్బు చేసింది. జిల్లా కేంద్రాల్లోని తొమ్మిది ప్రధాన ఆసుపత్రులకు తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. డాక్టర్లు, సిబ్బంది కొరత, వసతుల లేమి కారణంగా రోగుల అవస్థలు వర్ణణాతీతమే. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి.. ఉన్న రోగాలు పోయే మాటేమోగాని.. కొత్త రోగాలు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో బిక్కుబిక్కుమంటూ చికిత్స పొందుతున్నారు. చెత్తాచెదారం, దుర్గంధభరితంగా ఉన్న ఆసుపత్రుల ఆవరణలోనే రోగులు కాలం వెళ్లదీస్తున్నారు. విలువైన పరికరాలు కూడా మరమ్మతులకు నోచుకోక మూలనపడ్డాయి. జిల్లా ఆసుపత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులను రాష్ట్రస్థాయిలో అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.
     
    ఆరోగ్యానికి కొరత..

    ఆదిలాబాద్ రిమ్స్‌లో సరైన సంఖ్యలో వైద్యులు లేరు. పరికరాల కొరత, పారిశుధ్యలోపం, అరకొర వసతులు రోగుల పాలిట శాపంగా మారాయి. రిమ్స్‌కు మొత్తం 155 వైద్య పోస్టులు మంజూరైతే ఇందులో 45 మంది మాత్రమే ఉన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్రత్యేక చికిత్స అందించే ట్రామాకేర్ సెంటర్ ప్రారంభానికి నోచుకోలేదు. రిమ్స్‌కు రోజుకు వెయ్యి మందికిపైగా రోగులు వస్తుంటారు. పడకలు సరిపోక ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులను పడుకోబెడుతున్నారు. ఇక ఆస్పత్రి ఆవరణ అంతా చెత్తా చెదారమే. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 350 పడకల పెద్దాసుపత్రికి ఈ జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రోగులు కూడా వస్తుంటారు. ఇంత కీలకమైన ఆస్పత్రిలో సరైన సంఖ్యలో వైద్యులులేరు. 50 మంది వైద్యులు ఉండాల్సిన చోట 31 మందే ఉన్నారు. ఇక స్పెషలిస్టుల కొరత మరింతగా వేధిస్తోంది. ఐదుగురు గైనకాలజిస్టులు అవసరం ఉండగా రెండు ఖాళీలున్నాయి. పిల్లల డాక్టర్లు ఐదుగురికిగాను ఇద్దరే ఉన్నారు. ఈఎన్‌టీ డాక్టర్లు ఇద్దరికి గాను ఒక్కరే, ఆర్థోపెడిక్ ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
     
    నిర్లక్ష్యానికి చిరునామా..

    మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా ప్రభుత్వాసుపత్రులు.. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక పరికరాలున్నా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సద్వినియోగం కావడం లేదు. జిల్లాలోని 90 శాతం పీహెచ్‌సీల్లో ఆపరేషన్లు నిర్వహించడంలేదు. జిల్లా ఆసుపత్రిలో 12 మంది సివిల్ సర్జన్స్, ఒక డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఆస్పత్రిలో పరిశుభ్రత మచ్చుకు కూడా కానరాదు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని జిల్లా ఆసుపత్రి.. పేరుకే పెద్దాసుపత్రి. వ్యర్థాలన్నీ ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయి దుర్వాసన వస్తున్నా పట్టించుకునే వారు లేరు. నల్లగొండ జిల్లాలోని ఆస్పత్రుల్లో నిండా సమస్యలే. జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రిలో కాలం చెల్లిన ఎక్స్‌రే, ఈసీజీ, ఇతర పరీక్షల యంత్రాలతో ఇబ్బందిగా మారింది. ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరిపడా పడకలు అందుబాటులో లేవు. ఇక రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో డ్రైనేజీ పైప్‌లైన్ లీకవుతూ దుర్గంధం వెదజల్లుతోంది. సూర్యాపేట ఆస్పత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో తాండూరులోని ఆసుపత్రిని అసౌకర్యాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రసూతి వార్డులో కిటికీలకు తలపులు లేని కారణంగా అడ్డంగా దుస్తులు కట్టారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.
     
    వైద్యం చేసేదెవరు?

    నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 223 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెన్షియల్ వైద్యులు ఉండాలి. కానీ 62 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో రోగులకు అత్యవసర వైద్యం అందడం లేదు. కొత్తగా వైద్యకళాశాల ఏర్పడినా పోస్టుల భర్తీ నేటి వరకు చేయలేదు. పారామెడికల్ సిబ్బంది అయితే అన్ని పోస్టులు కలిపి 609 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక వరంగల్ జిల్లాలో వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఎంజీఎం బోధనాసుపత్రికి సూపర్ స్పెషాలిటీ హోదా కల్పించి రెండేళ్లవుతున్నా ఆ మేరకు సౌకర్యాలు లేవు. చాలా వైద్య పరికరాలు పనికిరాని స్థితికి చేరుకున్నా పట్టించుకోవడం లేదు. ఇక మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న గిరిజనులకు అక్కడి ఏరియా ఆస్పత్రే పెద్దదిక్కు. కానీ ఇక్కడ సిబ్బంది కొరతతోపాటు మౌలిక సదుపాయాలకూ దిక్కులేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement