ప్రసవానికి రావాలంటేనే భయం!
ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేందుకు భయపడుతున్న గర్భిణులు
పురిటిగదులకు క్లోరినేషన్ లేదు
ఏకకాలంలో ఒకే గదిలో నాలుగైదు కాన్పులు
ఆపరేషన్ టేబుళ్లు లేని ఆస్పత్రులు 63 శాతం పైనే
మత్తువైద్యులు, చిన్నపిల్లల వైద్యులున్నది 50 శాతం మందే
భారీగా పెరుగుతున్న సిజేరియన్‌ల సంఖ్య
కుటుంబ సంక్షేమశాఖ సర్వేలో వెల్లడైన నిజాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి రావాలంటేనే గర్భిణులు భయపడుతున్నారు. ఆస్పత్రులకెళితే వైద్యసేవలు అటుంచితే పట్టించుకునేవారే లేరు. చాలా చోట్ల సుఖ ప్రసవానికి అవకాశమున్నా వైద్యులు వేచి చూసే ధోరణి ఉండదు. వెంటనే సిజేరియన్ అనడం కడుపుకోసి బిడ్డను తియ్య డం.. ఇదీ పరిస్థితి. వైద్యసేవల పరిస్థితి ఇలా ఉండగా.. కాన్పుల గదులు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. కనీసం ఆపరేషన్ చేసేందుకు టేబుళ్లు కూడా లేని దుస్థితి. చాలా చోట్ల ప్రసవ గదులకు ఇన్‌ఫెక్షన్ రాకుండా వాడే మందులు వాడట్లేదు. ప్రసవం జరుగుతున్న సమయంలో ఒక గదిలో ఒక్కరే ఉండాలి. కానీ ఒకే గదిలో నలుగురు లేదా ఐదుగురు కూడా పురిటినొప్పులతో బాధపడుతున్న దృశ్యాలు ఎన్నో. ఒక ప్రసవానికీ మరో ప్రసవానికీ కనీసం సర్జికల్ గ్లౌజ్‌లు కూడా మార్చుకోకుండానే చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి సుమారు 9.5 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతూంటే అందులో ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం 40 శాతమే జరుగుతున్నాయి. వాటిలోనూ సిజేరియన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవలే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు, గర్భిణుల పరిస్థితిపై కుటుంబ సంక్షేమశాఖ సర్వే చేస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సిజేరియన్‌ల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడైంది. సుఖప్రసవమయ్యే వీలున్నా 20 నిమిషాలు కూడా వైద్యులు వేచి ఉండట్లేదు. సుమారు 55 నుంచి 60% డెలివరీలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్‌లు జరుగుతున్నట్టు తేలింది.
సురక్షిత ప్రసవానికి ప్రత్యేక ప్రణాళిక
ఇకపై సురక్షిత ప్రసవానికి ప్రత్యేక చెక్‌లిస్ట్ పెడుతున్నాం. రాష్ట్రంలో 190 సీహెచ్‌సీలు (సామాజిక ఆరోగ్య కేంద్రాలు), 30 ఏరియా ఆస్పత్రులు, తొమ్మిది జిల్లా ఆస్పత్రులు, 11 డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రత్యేక ప్రసూతి కేంద్రాలను గుర్తించి, వాటిని బలోపేతం చేస్తున్నాం. ప్రసూతి గదుల్లో వసతులు, అత్యాధునిక యంత్రాల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దీనికోసం రూ. 17.5 కోట్ల నిధులు ఇవ్వాలని కోరాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి తొమ్మిదిన్నర లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులో 40 నుంచి 45 శాతం మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెంచుతాం. ప్రసూతి గదుల్లో పనిచేసే వైద్యులకు లేదా మిగతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణనివ్వబోతున్నాం. ఎలా చేస్తే బిడ్డ సురక్షితంగా ఉంటారో దాన్ని అమలు చేస్తాం. దీనిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళతాం.
- సౌరభ్‌గౌర్,కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్
ప్రభుత్వాసుపత్రుల్లో ఇదీ పరిస్థితి
ప్రసవ సమయంలోనూ, ఆ తర్వాతా లేబర్ గదుల్ని అంటువ్యాధులు రాకుండా క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ 28 శాతం ఆస్పత్రుల్లో అలా చేయడం లేదు. ఆస్పత్రుల్లో గ్లౌజ్‌లు, శస్త్రచికిత్సలకు వాడిన వస్తువులను డీకంటామినేటింగ్ (ప్రక్షాళన) చేయాలి. కానీ 32 శాతం ఆస్పత్రుల్లో అలా చేయడం లేదు. చాలామంది పిల్లలకు ఇన్‌ఫెక్షన్ లేదా కామెర్లు సోకితే రేడియంట్ వార్మర్‌లో పెడతారు. కానీ 5 శాతం ఆస్పత్రుల్లో ఇవి లేవు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం చిన్నపిల్లల వైద్యులు ఉండాల్సిన సంఖ్యలో 45 శాతం మందే ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మత్తు వైద్యులు(అనస్థీషియా వైద్యులు) ఉండాల్సిన సంఖ్యలో 55 శాతం మందే ఉన్నారు.హిందూపురం, అనంతపురం, ఏలూరు, కడప, నరసన్నపేట ఆస్పత్రుల్లో అనస్థీషియా వైద్యులు లేరు. బిడ్డ పుట్టగానే బీపీ, షుగర్, బరువు, గ్లూకోజ్ లెవెల్స్, కామెర్ల శాతం వంటి చాలా పరీక్షల ఫలితాలను రికార్డు చేసి ఉంచే పార్టొగ్రాఫ్‌లు 59 శాతం ఆస్పత్రుల్లో లేవు.