నాలుగింటితోనే భయం
గుండె, క్యాన్సర్ వైద్యానికి భారీగా వ్యయం
ప్రసవాలు, ప్రమాద చికిత్స ఖర్చులూ భారమే
ప్రైవేట్‌లో ఆరోగ్యశ్రీ సేవలకు విముఖత
⇒ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన లీలావతి కాన్పు కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి వెళ్లింది. అక్కడ ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు పడుకుని ఉండటంతో ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు వెళ్లింది. నార్మల్ డెలివరీ అయింది కానీ.. రూ.30 వేలు బిల్లు వేయడంతో ఆ కుటుంబం విస్తుపోయింది.
⇒ అనంతపురం హౌసింగ్‌బోర్డుకు చెందిన రంగనాయకులు అనే 45 ఏళ్ల వ్యక్తి ఛాతిలో నొప్పి రావడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లారు. గుండె కవాటాలు మూసుకుపోయాయని, స్టంటు వేసి రూ.2.70 లక్షల బిల్లు వేయడంతో రంగనాయకులు హతాశులయ్యారు.
⇒ ఈ రెండు సమస్యలే కాదు క్యాన్సర్, ప్రమాద బాధితుల వైద్య ఖర్చులు కూడా భారీగా ఉండడంతో జనం హడలెత్తిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆ నాలుగు రకాల జబ్బులకు భయపడిపోతున్నారు. వైద్యం ఖరీదుతో కూడుకుని ఉండటమే ఇందుకు కారణం. గుండె, క్యాన్సర్, కాన్పులు, ప్రమాద బాధితులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. సంపన్నులు ఎలాగోలా వైద్యం చేయించుకుంటున్నారు. పేదల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. రూ.5 లక్ష ల్లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందేవి.
గడిచిన ఐదేళ్లూ ఉచిత వైద్యసేవలు సజావుగా అందాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో ఒడుదుడుకులు మొదలయ్యాయి. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యమందించేందుకు నిరాకరిస్తున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడమేనని తెలుస్తోంది. విధిలేని పరిస్థితుల్లో అప్పోసప్పో చేసి ప్రైవేట్‌గా చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది.
గుండెజబ్బులతో దడ
గుండె జబ్బులు సామాన్యులను భయపెడుతున్నాయి. ఏటా 20 వేల వరకు గుండెపోటు కేసులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోVýæ్యశ్రీ సేవలు లేవంటున్నారంటే ఇక దారుణ పరిస్థితులే. ఒక స్టంట్ వేస్తే రూ.2 లక్షల వరకు అవుతోంది. దీంతో జనం బెంబేలేత్తుతున్నారు.
క్యాన్సర్ కేసులతో ఆందోళన
ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ కేసులు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌లు ఎక్కువ. చాలామంది హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. సర్జరీలు, కీమో థెరపీలకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
ప్రమాద బాధితులకు భరోసా లేదు
అనంతపురం జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాద కేసులు నమోదవుతున్నాయి. పాలీ ట్రామా కేసుల చికిత్సకు భారీ వ్యయం అవుతుంది. సర్వజన ఆస్పత్రిలో లోడు పెరగడంతో చెయ్యలేకపోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఒక్కోసారి సర్కారు నుంచి నిధులు రావడం లేదని చేతులెత్తేస్తున్నాయి. దీంతో రోజురోజుకూ సామాన్యుల్లో ఆందోళన పెరుగుతోంది.
ఖరీదైన జబ్బులకు చిక్కే
క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు, గుండె ఆపరేషన్లు లాంటి ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే పేదలకు చిక్కులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలందించడం లేదు. ఇటీవల మా బంధువుల అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసినప్పటికీ.. అదనపు ఖర్చుల కింద రూ.వేలల్లో డబ్బు వసూలు చేశారు. – లీలావతి, బీటీపీ, గుమ్మఘట్ట మండలం
కాన్పు జరిగితే గండం గడిచినట్టే
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 55వేల వరకూ కాన్పులు (డెలివరీలు) జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లు ఆరోగ్యశ్రీలో ఇబ్బంది లేకుండా నార్మల్, సిజేరియన్ డెలివరీలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు. ప్రైవేటు ఆస్పత్రులు నిధుల సమస్యతో కేసులు తీసుకోవడం లేదు. దీంతో నార్మల్ డెలివరీకి రూ.30 వేలు, సిజేరియన్‌కు రూ.50 వేలు చెల్లించుకోవాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment