20 నుంచి నోటీసులు జారీ.. 23 నుంచి మెడికల్ టెస్టులు
సర్కారు తీరుతో పరీక్షలకు వ్యయ ప్రయాసలతో 60–100 కి.మీ. వెళ్లాల్సిన పరిస్థితి
ఏరియా లేదా ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల 23 నుంచి అసలు సిసలు కష్టాలు మొదలుకానున్నాయి. ఇప్పటివరకూ దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్యంతో పింఛన్లు పొందుతున్న వారి ఇంటివద్దకే డాక్టర్లను పంపి వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ వారి అర్హతను గుర్తించేందుకు మరోసారి వారిని పరీక్షించనుంది. ఏరియా లేదా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలకు హాజరుకావాలంటూ వారికి నోటీసులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం అన్ని జిల్లాల డీఆర్‌డీఏ, వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.
దీంతో రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న 7,87,976 మంది వివిధ కేటగిరీల దివ్యాంగ పింఛనర్లతో పాటు మరో 6,833 మంది కుష్ఠువ్యాధి పింఛన్ లబ్ధిదారులు కనీసం 60–100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరియా లేదా జిల్లా ప్రభుత్వాసుపత్రులకు వ్యయ ప్రయాసలతో వెళ్లి పరీక్షలకు హాజరుకావాలి. కొన్ని జిల్లాలో సంబంధిత వైద్యులు లేకపోవడం లేదా వైద్య పరికరాలు లేనందున పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 20 నుంచి నోటీసులిచ్చి 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
8,000 మందికి ఇంటివద్దే పరీక్షలు పూర్తి..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లలో కోత పెట్టడమే లక్ష్యంగా 8,18,900 దివ్యాంగ పింఛనుదారుల అర్హతను పరీక్షించేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో 24,091 మంది పెరాలసిస్, తీవ్ర కండరాల వ్యాధులతో బాధపడేవారు కాగా.. 7,87,976 మంది దివ్యాంగ పింఛను లబ్ధిదారులు.. 6,833 మంది కుష్టు వ్యాధిగ్రస్తులున్నారు. పెరాలసిస్, తీవ్ర కండరాల వ్యాధులతో బాధపడే వారికి ఈనెల 6 నుంచి వారి ఇంటి వద్దకే వైద్యులు వచ్చి అర్హత పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైంది. వీరిలో ఇప్పటివరకు 8,010 మందికి పూర్తయ్యాయి.
మిగిలిన వారికి ఈనెల 29లోగా పూర్తిచేయనున్నారు. అలాగే, నేత్ర సంబంధిత కేటగిరి లబ్ధిదారులకు ఆసుపత్రుల వద్దే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. దీంతో.. ఈనెల 23 నుంచి అన్ని జిల్లాల్లోని 90,302 మంది కంటిచూపు సమస్యతో బాధపడుతున్న లబ్ధిదారులతో పాటు 1,09,232 మంది వినికిడి లోపం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆర్థో సంబంధిత పింఛనుదారులకు కూడా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు.
కొత్త సర్టిఫికెట్ల జారీ తర్వాత రద్దు నోటీసులు..
వైద్య పరీక్షలు పూర్తయిన పింఛనుదారులకు కొత్త సదరం సరి్టఫికెట్ల జారీ నిమిత్తం ప్రభుత్వం వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచి్చంది. వైద్యులు ఆ వెబ్ అప్లికేషన్‌లో పరీక్షల వివరాలను నమోదుచేశాక ప్రమాణాల ప్రకారం కొత్త సదరం సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైనట్లు అధికారులు చెప్పారు. అలాగే, వైద్య పరీక్షలు పూర్తయిన వారికి కొత్త సదరం సరి్టఫికెట్ల జారీ అనంతరం, అర్హత ఆధారంగా పింఛను రద్దు నోటీసులు జారీచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment