వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులు
అబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేత
టీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారం
గతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు
స్కిల్ స్కామ్‌లోనూ బాబు దుబాయ్ బంధం
ఈసారి అదే షెల్ దందాయేనా..!
గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే
సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.
అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.
పోలింగ్ తర్వాత సైలెంట్
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్‌మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.
మరోవైపు లోకేశ్‌కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్‌చుప్‌గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం.
ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో..
చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్ విమా¯éశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.
స్కిల్ స్కామ్‌లోనూ దుబాయ్ బంధం
చంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్‌లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్‌కు చేర్చారు.
ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, కిలారి రాజేశ్ దుబాయ్ నుంచే అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్‌లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇటలీలో ప్రత్యక్షం..!
గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లించి అనంతరం భారత్‌లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment