Deliveries Pregnant women
-
పెద్దాస్పత్రి..రద్దీలో మేటి
సాక్షి, ఖమ్మం వైద్య విభాగం: ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి ఇటీవల కాలంలో నిత్యం రోగుల తో కిటకిటలాడుతోంది. సరికొత్త భవనాలు అందుబాటులోకి రావడం, 400 పడకలు ఏర్పాటు కావడం, మెరుగైన వైద్యసేవలను విస్తృతపర్చడం, మాతా శిశు సంరక్షణ చికిత్సలు మంచిగా ఉన్నాయనే గుర్తింపు లభించడం.. తదితర కారణాలతో ఖమ్మంలోని పెద్దాస్పత్రికి రోగులు బారులు తీరుతున్నారు. కొన్ని నెలలుగా ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ల సంఖ్య పుంజుకోవడంతో 24 గంటలపాటు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జ్వర పీడితులు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు ..నిత్యం ఇక్కడ చికిత్స పొందుతుండడం సహజమే. ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడంతో ప్రసవాలకు వచ్చే వారు అంతకంతకూ పెరుగుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో 6లక్షల మందికి పైగా వైద్య సేవలు పొందడంతో..రద్దీ తీవ్రత స్థాయిని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య నాలుగింతలు పెరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి సరిహద్దు జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. రోజూ 1200 మందికి పైగా వైద్య సేవలు పొందేందుకు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ సంఖ్య సీజన్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇన్, ఔట్ పేషెంట్లు పెరగడంతో వైద్యులపై మరింత భారం పడుతోంది. వైద్య పరీక్షలు చేయడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తోంది. ఔట్ పేషెంట్ రోగులకు వారి జబ్బును బట్టి వైద్యం చేసి ఇంటికి పంపిస్తారు. రోగం నయం అయ్యేవరకు.. మందులు వాడుతూ డాక్టర్ మళ్లీ రమ్మన్నప్పుడు వచ్చి చెకప్ చేయించుకుంటుంటారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు జిల్లా ఆస్పత్రిలో 6,06,552 మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు లభించాయి. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏడాదిగా ఓపీ, ఐపీ సేవలు ఇలా.. నెల ఔట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఏప్రిల్(2018) 47,577 3,108 మే 45,362 2,880 జూన్ 48,168 2,841 జూలై 55,778 3,546 ఆగస్టు 59,813 4,606 సెప్టెంబర్ 66,248 4,842 అక్టోబర్ 64,075 4,148 నవంబర్ 58,644 3,448 డిసెంబర్ 53,054 3,125 జనవరి(2019) 53,633 3,054 ఫిబ్రవరి 54,200 3,344 6,06,552 38,942 39వేల మంది ఇన్ పేషెంట్లు.. ఆర్థోపెడిక్, గైనిక్, పీడియాట్రీషన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి చికిత్స అయినా ఇక్కడి డాక్టర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇన్ పేషెంట్ సేవలు కూడా కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రసూతి సేవలు అధికంగా అందుతుండగా, అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. షిఫ్టులవారీగా వైద్యులు సేవలు అందిస్తుండడంతో సమీప ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా, గర్భిణులకు నొప్పులు వచ్చినా, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు జరిగినప్పుడు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. 11 నెలల్లో పెద్దాస్పత్రిలో 39,000 వరకు ఇన్ పేషెంట్ ద్వారా వైద్య సేవలు అందించారు. ప్రసవాల్లో రికార్డు.. ప్రతి నెలా 900కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత డెలివరీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2017 జూన్ 2న ప్రభుత్వం కేసీఆర్ కట్ పథకాన్ని ప్రవేశపెట్టాక ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు ఆర్థికసాయం, కేసీఆర్ కిట్ లభిస్తున్నాయి. శిశువు, తల్లికి అవసరమైన 15 రకాల వస్తువులు కిట్‌లో ఉంటాయి. ఈ పథకం రాకముందు రోజుకు 10లోపు ప్రసవాలు జరిగేవి. కానీ.. ప్రస్తుతం రోజుకు 30 వరకు చేస్తున్నారు. పథకం ప్రారంభమైన 20 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,000 ప్రసవాలు నిర్వహించారు. అందులో ఒక్క జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే 14వేల డెలివరీలు జరపడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా చూసుకుంటే మూడు వంతులకు పైగా పెద్దాస్పత్రిలోనే జరుగుతున్నాయి. సేవలు మరింత పెంచేందుకు కృషి ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి రోగికి వైద్య సేవలందిస్తాం. మందులు, బ్లేడ్ల కొరత లేకుండా చూస్తున్నాం. అలాగే ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నాం. ఎంతమంది పేషెంట్లు వచ్చినా వైద్యం చేస్తాం. – డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ప్రసవాలు సరే.. మరణాల మాటేమిటి?
నిజామాబాద్‌అర్బన్: సర్కారు చర్యల వల్ల ప్రభుత్వ ఆస్పత్రులకు కొత్త కళ వచ్చింది. కేసీఆర్ కిట్ కారణంగా సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే, ప్రసవాల సంఖ్యతో పాటే మాతృ, శిశు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరైన సౌకర్యాలు కరువవడం, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడం మూలంగా మరణాల సంఖ్య పెరుగుతోంది!. జిల్లా వ్యాప్తంగా దవాఖానాల్లో ఈ ఏడాది సంభవించిన మరణాలు భయపెట్టిస్తున్నాయి. ఆర్నెళ్ల వ్యవధిలో 101 మంది నవజాత శిశువులు పురిట్లోనే కన్నుమూయడం, ఆరుగురు బాలింతలు ప్రసవ సమయంలో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. వసతులు కరువు.. జిల్లా వ్యాప్తంగా 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు ఒక ఏరియా ఆస్పత్రి, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు మరో 92 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోజుకు సుమారు 40 నుంచి 50 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక, ఆర్మూర్, బోధన్, డిచ్‌పల్లితో పాటు మోర్తాడ్, వర్ని, నవీపేట ఆస్పత్రులలో మరో 50 వరకు ప్రసవాలు నమోదవుతున్నాయి. అయితే, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు బాలింతలు, శిశువులకు సరైన వైద్యసౌకర్యలు అందడం లేదు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే వెంటిలేటర్ సదుపాయం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడంతో బాలింతలు, శిశువులు మృత్యువాతపడుతున్నారు. అందుబాటులో లేని అత్యవసర చికిత్స కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే, అందుకు తగినట్లుగా వసతులు లేకపోవడం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులు, బాలింతలు, శిశువులకు సరైన వైద్యచికిత్సలు అందడం లేదు. ప్రసవ సమయంలో గర్భిణులకు రక్తం తక్కువగా ఉండడం, ఫిట్స్ రావడం, శిశువు ఉమ్మ నీరు మింగడం, తక్కువ బరువుతో పుట్టడం తదితర కారణాలతో పాటు ఇతర సమస్యలు తలెత్తుంటాయి. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సరైన వైద్య చికిత్స అందించే సదుపాయం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ఫలితంగా మాతృ, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక, హైదరాబాద్‌కు తీసుకెళ్లలేక పేద, మధ్యతరగతి తల్లులకు కడుపుకోత మిగులుతోంది. ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కడుపులోనే శిశువు మృతి చెందినడంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. అలాగే, నవీపేట మండలానికి చెందిన ఓ బాలింత ప్రసవానంతరం మృతి చెందింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఫలితంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 101 మంది శిశువులు, ఆరుగురు బాలింతలు ప్రసవ సమయంలోనే మృత్యువాత పడ్డారు. సమన్వయ లోపమే కారణమా..? మాతృ శిశు మరణాలను తగ్గించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సమన్వయంతో పని చేయాల్సి ఉంది. అయితే, అంతటా సమన్వయ లోపం కనిపిస్తోంది. తమ గ్రామ పరిధిలో గర్భిణుల వివరాలను ఏఎన్ఎంలు రిజిస్టర్ చేసుకుంటారు. అనంతరం వారికి అంగన్వాడీలలో గుడ్లు, పౌష్టికాహారం అందిస్తుంటారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా మాత్రలు అందించడం, ప్రతి నెలా బరువును పరిశీలించడం వంటివి చేయాలి. రెండు శాఖలు సమన్వయంతో గర్భిణులకు పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. అలాగే గర్భిణికి తగు సలహాలు, సూచనలు అందించాలి. అయితే, చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో శిశు, సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో ప్రసవ సమయంలో గర్భిణులు, శిశువులకు ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరికొందరు బాలింతలు వైద్యసిబ్బంది సలహాలు, సూచనలు పట్టించుకోక పోవడం, పురాతన పద్ధతులు పాటించడం కూడా మరణాల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. జిల్లా వ్యాప్తంగా మాతృ, శిశు మరణాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం వీటి మరణాల సంఖ్య తగ్గింది. ప్రమాదక పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో నివారించేందుకు కృషి చేస్తున్నాం. – డా.సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
శిశు శోకం
ప్రభుత్వ వైద్యశాలల్లో శిశువుల మృత్యుఘోష మోగుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. శిశువుల పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య నిపుణుల కొరత.. అత్యవసరమైన సమయంలో ప్రాణాధార సదుపాయాలు లేకపోవడం, గర్భిణులకు పౌష్టికాహారం సరిగా అందకపోవడం, వారు రక్తహీనతకు లోనవుతుండడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు చేయకపోవడం తదితర పరిస్థితులు శిశు మరణాలకు కారణమవుతున్నాయి. గూడూరుకు చెందిన రమణమ్మ (పేరు మార్చాం) కాన్పు కోసం గూడూరు ఏరియా ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి (జీజీహెచ్) తీసుకెళ్లమన్నారు. జీజీహెచ్‌లో కాన్పు అనంతరం బిడ్డ చనిపోయింది. గూడూరు ఏరియా ఆస్పత్రిలో వైద్య నిపుణులు ఉండి ఉంటే, అక్కడే కాన్పు జరిగినట్టయితే బిడ్డ బతికి ఉండేదంటున్నారు బాధితురాలి బంధువులు. జిల్లాలో ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ అనేకం చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు(బారకాసు) : జిల్లాలో నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రితో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు ఏరియా ఆస్పత్రులు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఉన్నాయి. వీటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 28 ఉన్నాయి. సీహెచ్‌సీ కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో తల్లులతో పాటు పిల్లలకూ వైద్యం అందించాల్సి ఉంది. అయితే నెల్లూరు జీజీహెచ్‌లో మాత్రమే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఏడాది లోపు పిల్లలకు ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడినా జీజీహెచ్‌కు రావాల్సిందే. ఫలితంగా ఈ విభాగంలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ), సిక్ న్నూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లకు శిశువుల తాకిడి అధికమవుతోంది. ప్రాణాధార సదుపాయాలూ లేవు పసిపిల్లలకు ప్రాణాధారమైన నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను (ఎన్ఐసీయూ) ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో ఒక్క సీహెచ్‌సీలో కూడా దీన్ని ఏర్పాటు చేయలేదు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల చిన్నపిల్లల విభాగంలో తగినంత మంది వైద్యులు సైతం లేరు. ఈ విభాగంలో ఓపీ కోసం నిత్యం 100 మంది వరకు వస్తుంటారు. 20 నుంచి 30 మందికి పైగా పసిపిల్లలు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. పోషకాహారం కరువు నెలలు నిండక ముందే జన్మించడం, గర్భంతో ఉన్నప్పుడు తల్లికి బీపీ అధికంగా ఉండటం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం శిశువుల మరణాలకు ప్రధాన కారణాలవుతున్నాయి. ఇలాంటి సమస్యలను నివారించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు అందించే పోషకాహారం నాసిరకంగా ఉంటోంది. అది కూడా సక్రమంగా తల్లికి అందడం లేదు. గర్భిణులు ఇంటికి తీసుకెళ్లిన సరుకులు కుటుంబ సభ్యులందరి ఆహారంలో భాగం కావడం వల్ల తల్లికి పోషకాహార లోపం ఏర్పడుతోంది. ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతోంది. పిల్లల వైద్యులకు తీవ్ర కొరత జిల్లాలోని ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి గైనకాలజిస్ట్‌తో పాటు పిడియాట్రిషియన్, అనెస్థిటిస్ట్ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. కానీ 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు గాను 10 కేంద్రాల్లోనే పిడియాట్రిషయన్లు ఉన్నారు. 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు జిల్లాలో 28 ఉన్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో కాన్సులు సైతం సరిగా జరగడం లేదు. అధిక శాతం ప్రసవాలు నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. నెల్లూరు జీజీహెచ్ చిన్నపిల్లల విభాగంలో మూడు యూనిట్లు ఉన్నాయి. అందులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్ట్ వైద్యులు మాత్రమే ఉన్నారు. పిల్లల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు అందుకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరముందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల కొరత వాస్తవమే జీజీహెచ్ చిన్నపిల్లల విభాగంలో వైద్యుల కొరత ఉన్న మాట వాస్తవమే. ఇక్కడ నియమించిన వైద్యుల్లో చాలా మంది డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఖాళీ పోస్టుల్లో వైద్యులను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ఉన్నతాధికారులదే. త్వరలో వైద్యుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. అది జరిగితే ఇక్కడికి వైద్యులు వచ్చే అవకాశముంది. స్థానికంగా నలుగురు ప్రైవేట్ వైద్యులతో మాట్లాడాం. త్వరలో వారి ద్వారా సేవలు అందిస్తాం. – డాక్టర్ రాధాకృష్ణరాజు, సూపరింటెండెంట్, జీజీహెచ్ శిశు మరణాల నివారణకు చర్యలు శిశు మరణాలను తగ్గించేందుకు మా వంతు చర్యలు చేపడుతున్నాం. గర్భిణులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా చూడాలని ఐసీడీఎస్ సిబ్బందికి చెబుతున్నాం. రక్తహీనత ఉన్నవారికి ఐర¯న్ మాత్రలు ఇవ్వడంతో పాటు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నాం. అయినా జిల్లాలో అక్కడక్కడా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే నెల్లూరు జిల్లాలో నమోదవుతున్న శిశు మరణాలు తక్కువే. – డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్ఓ, నెల్లూరు -
కు.ని. ఆ‘పరేషాన్’ మాకొద్దు..!
గత పదిహేను రోజుల క్రితం వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అయితే ఇక్కడ ఒక్క పురు షుడు కూడా ఆపరేషన్ కోసం కనీసం పేరు నమోదు చేసుకోలేదు. ఇక్కడ 24 ఆపరేషన్లు జరగగా అందులో ఒక్క వేసెక్టమీ ఆపరేషన్ జరగలేదు. సాక్షి, ఆసిఫాబాద్‌క్రైం: జిల్లాలో గతేడాది 1,793 ఆపరేషన్లు జరగగా అందులో కేవలం 17 మంది మగవాళ్లు మాత్రమే ఆపరేషన్ కోసం ముందుకొచ్చారు. మిగతా మహిళలకు అటు ప్రసవ వేదనతోపాటు ఈ కు.ని ‘కోతలు’ తప్పడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు అని రెండు రకాలు ఉంటాయి. ఇందులో పురుషులకు చేసే ఆపరేషన్‌ను వేసెక్టమీ, మహిళలకు చేసే ఆపరేషన్‌ను ట్యూబెక్టమీ అని పిలుస్తారు. కొంతమంది మహిళల్లో రెండు మూడు కాన్పులు వరుసగా సిజేరియిన్ అయి, తిరిగి కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ ద్వారా పొట్టను నాలుగు, అయిదు అంగుళాలు మేర కోతకోయడంతో భవిష్యత్‌లో మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అవగాహన లేకే వెనుకడుగు గ్రామీణ ప్రాంతాల్లో అధిక భాగం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలంటే అది ఆడవాళ్లకు సంబంధించినదిగా భావించడం. దీనిని అధిగమించేందుకు వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండే ఆశ, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు ప్రతీ ఇంటా విస్త్రృత ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా అలాంటి కార్యక్రమాలేవి లేకపోవడంతో ప్రసవ సమయంలోనే చాలా మంది మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. మగవారిలో చాలా మందికి వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా శారీరకంగా బలహీన మవుతామనే అపోహాతో పురుషులు ఈ ఆపరేషన్లు చేయించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ ఆపరేషన్లు చేసుకుంటే శారీరక శ్రమ చేయలేమనే భావనతో మగవాళ్లు వెనుకడుగు వేస్తున్నారు. స్త్రీల కంటే పురుషులకే సులభం మహిళల కంటే పురుషులకే కు.ని. ఆపరేషన్ ఎంతో సులువుగా ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు. మగవాళ్లకు చేసే కు.ని.ఆపరేషన్‌లో గతంలో కోత విధానం ఉండేది. కాని ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. ఇందుకోసం ఎన్నో అధునాతన పద్ధతులు వచ్చాయి. సాధారణ ఇంజక్షన్ వేసుకున్న తరహాలో ఆపరేషన్లు అయిపోతున్నాయి. రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వ్యవధిలోనే వేసెక్టమీ పూర్తవుతుంది. గంటలోపే డిశ్చార్జీ కావచ్చు. మూడు నెలల తర్వాత నిత్యం జీవితంలో చేసే అన్ని పనులన్నీ సక్రమంగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నా లేనిపోని అపోహాలతో పురుషులు కు.ని. ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా మహిళలకు కోతలు తప్పడం లేదు. దృష్టి సారించని వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు సంఖ్య పెరిగేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో తన సర్వీసులో ఒక్క వాసెక్టమీ ఆపరేషన్ చేయలేదని ఓ సీనియర్ వైద్యుడు చెప్పడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వేసెక్టమీ ఆపరేషన్లు పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే కొంత మేరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. అందుబాటులో లేని సర్జన్ జిల్లాలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయాలంటే గైనకాలజీ డాక్టర్ ఎవరైనా చేయొచ్చు. అదే మగవారికి వాసెక్టమీ ఆపరేషన్ చేసేందుకు ప్రత్యేక వేసెక్టమీ సర్జన్ అవసరం. అయితే జిల్లాలో కనీసం ఒక్క సర్జన్ కూడా లేకపోవడంతో ఈ ఆపరేషన్లు జరగకపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో 1,793 కుటుంబం నియంత్రణ ఆపరేషన్లు జరగగా అందులో 99 శాతం మహిళలే ఉన్నట్లు జిల్లా వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు వెనుకడుగు వేస్తున్న మాట వాస్తవమే. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేకపోవడమే. ఇందుకోసం వైద్య సిబ్బందితో వాసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో వేసెక్టమీ ఆపరేషన్లు చేసే నిపుణుడు లేకపోవడం సమస్యగా మారింది. – డాక్టర్ సుబ్బారాయుడు,డీఎంహెచ్‌వో -
ప్రసవానికి రావాలంటేనే భయం!
ప్రభుత్వాసుపత్రులకు వెళ్లేందుకు భయపడుతున్న గర్భిణులు పురిటిగదులకు క్లోరినేషన్ లేదు ఏకకాలంలో ఒకే గదిలో నాలుగైదు కాన్పులు ఆపరేషన్ టేబుళ్లు లేని ఆస్పత్రులు 63 శాతం పైనే మత్తువైద్యులు, చిన్నపిల్లల వైద్యులున్నది 50 శాతం మందే భారీగా పెరుగుతున్న సిజేరియన్ల సంఖ్య కుటుంబ సంక్షేమశాఖ సర్వేలో వెల్లడైన నిజాలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి రావాలంటేనే గర్భిణులు భయపడుతున్నారు. ఆస్పత్రులకెళితే వైద్యసేవలు అటుంచితే పట్టించుకునేవారే లేరు. చాలా చోట్ల సుఖ ప్రసవానికి అవకాశమున్నా వైద్యులు వేచి చూసే ధోరణి ఉండదు. వెంటనే సిజేరియన్ అనడం కడుపుకోసి బిడ్డను తియ్య డం.. ఇదీ పరిస్థితి. వైద్యసేవల పరిస్థితి ఇలా ఉండగా.. కాన్పుల గదులు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. కనీసం ఆపరేషన్ చేసేందుకు టేబుళ్లు కూడా లేని దుస్థితి. చాలా చోట్ల ప్రసవ గదులకు ఇన్ఫెక్షన్ రాకుండా వాడే మందులు వాడట్లేదు. ప్రసవం జరుగుతున్న సమయంలో ఒక గదిలో ఒక్కరే ఉండాలి. కానీ ఒకే గదిలో నలుగురు లేదా ఐదుగురు కూడా పురిటినొప్పులతో బాధపడుతున్న దృశ్యాలు ఎన్నో. ఒక ప్రసవానికీ మరో ప్రసవానికీ కనీసం సర్జికల్ గ్లౌజ్‌లు కూడా మార్చుకోకుండానే చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి సుమారు 9.5 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతూంటే అందులో ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం 40 శాతమే జరుగుతున్నాయి. వాటిలోనూ సిజేరియన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవలే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు, గర్భిణుల పరిస్థితిపై కుటుంబ సంక్షేమశాఖ సర్వే చేస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. సిజేరియన్ల సంఖ్య భారీగా పెరిగినట్లు వెల్లడైంది. సుఖప్రసవమయ్యే వీలున్నా 20 నిమిషాలు కూడా వైద్యులు వేచి ఉండట్లేదు. సుమారు 55 నుంచి 60% డెలివరీలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్లు జరుగుతున్నట్టు తేలింది. సురక్షిత ప్రసవానికి ప్రత్యేక ప్రణాళిక ఇకపై సురక్షిత ప్రసవానికి ప్రత్యేక చెక్‌లిస్ట్ పెడుతున్నాం. రాష్ట్రంలో 190 సీహెచ్‌సీలు (సామాజిక ఆరోగ్య కేంద్రాలు), 30 ఏరియా ఆస్పత్రులు, తొమ్మిది జిల్లా ఆస్పత్రులు, 11 డీఎంఈ ఆస్పత్రుల్లో ప్రత్యేక ప్రసూతి కేంద్రాలను గుర్తించి, వాటిని బలోపేతం చేస్తున్నాం. ప్రసూతి గదుల్లో వసతులు, అత్యాధునిక యంత్రాల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దీనికోసం రూ. 17.5 కోట్ల నిధులు ఇవ్వాలని కోరాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి తొమ్మిదిన్నర లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులో 40 నుంచి 45 శాతం మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెంచుతాం. ప్రసూతి గదుల్లో పనిచేసే వైద్యులకు లేదా మిగతా సిబ్బందికి ప్రత్యేక శిక్షణనివ్వబోతున్నాం. ఎలా చేస్తే బిడ్డ సురక్షితంగా ఉంటారో దాన్ని అమలు చేస్తాం. దీనిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళతాం. - సౌరభ్‌గౌర్,కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ప్రభుత్వాసుపత్రుల్లో ఇదీ పరిస్థితి ప్రసవ సమయంలోనూ, ఆ తర్వాతా లేబర్ గదుల్ని అంటువ్యాధులు రాకుండా క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ 28 శాతం ఆస్పత్రుల్లో అలా చేయడం లేదు. ఆస్పత్రుల్లో గ్లౌజ్‌లు, శస్త్రచికిత్సలకు వాడిన వస్తువులను డీకంటామినేటింగ్ (ప్రక్షాళన) చేయాలి. కానీ 32 శాతం ఆస్పత్రుల్లో అలా చేయడం లేదు. చాలామంది పిల్లలకు ఇన్ఫెక్షన్ లేదా కామెర్లు సోకితే రేడియంట్ వార్మర్లో పెడతారు. కానీ 5 శాతం ఆస్పత్రుల్లో ఇవి లేవు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం చిన్నపిల్లల వైద్యులు ఉండాల్సిన సంఖ్యలో 45 శాతం మందే ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మత్తు వైద్యులు(అనస్థీషియా వైద్యులు) ఉండాల్సిన సంఖ్యలో 55 శాతం మందే ఉన్నారు.హిందూపురం, అనంతపురం, ఏలూరు, కడప, నరసన్నపేట ఆస్పత్రుల్లో అనస్థీషియా వైద్యులు లేరు. బిడ్డ పుట్టగానే బీపీ, షుగర్, బరువు, గ్లూకోజ్ లెవెల్స్, కామెర్ల శాతం వంటి చాలా పరీక్షల ఫలితాలను రికార్డు చేసి ఉంచే పార్టొగ్రాఫ్లు 59 శాతం ఆస్పత్రుల్లో లేవు.