పెద్దాస్పత్రి..రద్దీలో మేటి | People Rush To Government Hospital Of Khammam | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రి..రద్దీలో మేటి

Published Thu, Mar 7 2019 2:56 PM | Last Updated on Thu, Mar 7 2019 2:58 PM

People Rush To Government Hospital Of Khammam - Sakshi

ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి

సాక్షి, ఖమ్మం వైద్య విభాగం: ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి ఇటీవల కాలంలో నిత్యం రోగుల తో కిటకిటలాడుతోంది. సరికొత్త భవనాలు అందుబాటులోకి రావడం, 400 పడకలు ఏర్పాటు కావడం, మెరుగైన వైద్యసేవలను విస్తృతపర్చడం, మాతా శిశు సంరక్షణ చికిత్సలు మంచిగా ఉన్నాయనే గుర్తింపు లభించడం.. తదితర కారణాలతో ఖమ్మంలోని పెద్దాస్పత్రికి రోగులు బారులు తీరుతున్నారు. కొన్ని నెలలుగా ఇన్‌ పేషెంట్, ఔట్‌ పేషెంట్ల సంఖ్య పుంజుకోవడంతో 24 గంటలపాటు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జ్వర పీడితులు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు ..నిత్యం ఇక్కడ చికిత్స పొందుతుండడం సహజమే. ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టడంతో ప్రసవాలకు వచ్చే వారు అంతకంతకూ పెరుగుతున్నారు.

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో 6లక్షల మందికి పైగా వైద్య సేవలు పొందడంతో..రద్దీ తీవ్రత స్థాయిని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య నాలుగింతలు పెరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌ జిల్లాల నుంచి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి సరిహద్దు జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది.

రోజూ 1200 మందికి పైగా వైద్య సేవలు పొందేందుకు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ సంఖ్య సీజన్‌లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇన్, ఔట్‌ పేషెంట్లు పెరగడంతో వైద్యులపై మరింత భారం పడుతోంది. వైద్య పరీక్షలు చేయడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తోంది. ఔట్‌ పేషెంట్‌ రోగులకు వారి జబ్బును బట్టి వైద్యం చేసి ఇంటికి పంపిస్తారు. రోగం నయం అయ్యేవరకు.. మందులు వాడుతూ డాక్టర్‌ మళ్లీ రమ్మన్నప్పుడు వచ్చి చెకప్‌ చేయించుకుంటుంటారు. 2018 ఏప్రిల్‌ నుంచి 2019 ఫిబ్రవరి వరకు జిల్లా ఆస్పత్రిలో 6,06,552 మంది ఔట్‌ పేషెంట్లకు వైద్య సేవలు లభించాయి.

ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏడాదిగా ఓపీ, ఐపీ సేవలు ఇలా..

 నెల  ఔట్‌ పేషెంట్‌  ఇన్‌ పేషెంట్‌
 ఏప్రిల్‌(2018)  47,577  3,108
 మే  45,362  2,880
 జూన్‌  48,168  2,841
 జూలై  55,778  3,546
 ఆగస్టు  59,813  4,606
 సెప్టెంబర్  66,248  4,842
 అక్టోబర్‌  64,075  4,148
 నవంబర్‌  58,644  3,448
 డిసెంబర్‌  53,054  3,125
 జనవరి(2019)  53,633  3,054
 ఫిబ్రవరి  54,200  3,344
 6,06,552

 38,942

39వేల మంది  ఇన్‌ పేషెంట్లు..

ఆర్థోపెడిక్, గైనిక్, పీడియాట్రీషన్, జనరల్‌ సర్జన్, జనరల్‌ మెడిసిన్‌ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి చికిత్స అయినా ఇక్కడి డాక్టర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇన్‌ పేషెంట్‌ సేవలు కూడా కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రసూతి సేవలు అధికంగా అందుతుండగా, అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. షిఫ్టులవారీగా వైద్యులు సేవలు అందిస్తుండడంతో సమీప ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా, గర్భిణులకు నొప్పులు వచ్చినా, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు జరిగినప్పుడు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. 11 నెలల్లో పెద్దాస్పత్రిలో 39,000 వరకు ఇన్‌ పేషెంట్‌ ద్వారా వైద్య సేవలు అందించారు.

ప్రసవాల్లో రికార్డు..

ప్రతి నెలా 900కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత డెలివరీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2017 జూన్‌ 2న ప్రభుత్వం కేసీఆర్‌ కట్‌ పథకాన్ని ప్రవేశపెట్టాక ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు ఆర్థికసాయం, కేసీఆర్‌ కిట్‌ లభిస్తున్నాయి. శిశువు, తల్లికి అవసరమైన 15 రకాల వస్తువులు కిట్‌లో ఉంటాయి. ఈ పథకం రాకముందు రోజుకు 10లోపు ప్రసవాలు జరిగేవి. కానీ.. ప్రస్తుతం రోజుకు 30 వరకు చేస్తున్నారు. పథకం ప్రారంభమైన 20 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,000 ప్రసవాలు నిర్వహించారు. అందులో ఒక్క జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే 14వేల డెలివరీలు జరపడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా చూసుకుంటే మూడు వంతులకు పైగా పెద్దాస్పత్రిలోనే జరుగుతున్నాయి.  
 
సేవలు మరింత పెంచేందుకు కృషి

ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి రోగికి వైద్య సేవలందిస్తాం. మందులు, బ్లేడ్ల కొరత లేకుండా చూస్తున్నాం. అలాగే ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు శానిటేషన్‌ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నాం. ఎంతమంది పేషెంట్లు వచ్చినా వైద్యం చేస్తాం.
– డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మేల్‌ వార్డులో వైద్యసేవలు పొందుతున్న రోగులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement