Inpatient services
-
చికిత్స.. పక్కా లెక్క
సాక్షి, అమరావతి: రోగి ఆస్పత్రికి వెళితే చిత్తు కాగితం మీద కూడా మందులు రాసిన సందర్భాలు అనేకం. కేస్ షీట్లు రాసేందుకు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో పేపర్లు ఉండేవి కావు. ఇదంతా గతం. ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నిర్వహణ జరుగుతోంది. ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్) ప్రమాణాల మేరకు ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్ట్రీ నిర్వహిస్తారు. ప్రతి పేషెంట్‌కు సంబంధించిన వివరాలు నిబంధనల మేరకు రిజిస్ట్రీ (నమోదు) అవుతాయి. గతంలోలా కాకుండా ఓపీ, ఐపీ స్లిప్పులూ మారనున్నాయి. ఇన్ పేషెంట్‌కు సంబంధించి ఏకంగా 16 పేజీల పుస్తకం నిర్వహిస్తారు. ఎవరు ఎలాంటి వైద్యం చేశారు.. ఏం మందులు రాశారు.. ఏయే రోగ నిర్ధారణ పరీక్షలు చేశారు వంటి వివరాలన్నీ ఈ కేస్ షీట్లో ఉంటాయి. ఒక్కసారి ఇన్ పేషెంట్‌గా చేరిన వ్యక్తి సమాచారం మొత్తం ఈ పుస్తకంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ నాణ్యతా ప్రమాణాలు.. ► ప్రస్తుతం రాష్ట్రంలో పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్) మదింపు జరుగుతోంది. ఈ ప్రమాణాలను అందుకోవాలంటే ఆస్పత్రుల్లో ఆయా నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగానే ఓపీ, ఐపీ స్లిప్పులు, రిజిస్ట్రీలో భారీగా మార్పులు తెచ్చారు. ► దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్‌క్యూఏఎస్ మదింపు పరిధిలోకి ఇన్ని ఆస్పత్రులను తీసుకురాలేదు. ఏపీలో మాత్రమే ఈ విధానంతో ముందుకెళుతున్నారు. ఎన్‌క్యూఏఎస్ ప్రమాణాల మదింపు సుమారు 90 రకాల సేవలకు సంబంధించి చేస్తారు. ఇందులో ఓపీ..ఐపీ ప్రధానమైనవి. ఒక పేజీ ఓపీ షీట్, 16 పేజీల కేస్ షీట్ ► తాజాగా ఇన్ పేషెంట్ షీట్‌ను మార్చారు. ఇందులో జబ్బు వివరాలు, పేషెంట్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, రోగ నిర్ధారణ పరీక్షలు ఇవన్నీ చేసి అందులో రాయాలి. ► కేస్ షీట్.. 16 పేజీలతో ముద్రించిన పుస్తకం డాక్టర్ల దగ్గర ఉంటుంది. మొదటి పేజీలో పేషెంట్ వివరాలు, అంగీకార పత్రం మొదలుకుని అన్ని వివరాలు ఉంటాయి. ► ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్.. అంటే రోగ నిర్ధారణ పరీక్షలు చేశాక ఫలితాలు విధిగా రాయాల్సి ఉంటుంది. 3వ పేజీలో రోగి హిస్టరీ అంటే పేషెంట్‌కు దీర్ఘకాలిక జబ్బులున్నాయా.. ఎలాంటి మందులు వాడుతున్నారు, కుటుంబ హిస్టరీ వంటివన్నీ రాస్తారు. ► మెడికల్ చార్ట్ పేరుతో 5వ పేజీ రూపొందించారు. ఇందులో మందు పేరుతో పాటు డోసు, ఎన్ని వాడాలి, ఏ టైములో వాడాలి అనేది రాసి ఉంటుంది. ► నర్సు ఏ షిఫ్టులో ఎన్నిసార్లు పరీక్షించిందో, సేవలు అందించిందో అనే దానికి ఒక పేజీ కేటాయించారు. రోగికి కౌన్సిలింగ్ చేయడం, ఆహారం గురించి చెప్పడం విధిగా రాయాలి. ► డిశ్చార్జి సమ్మరీతో పాటు రోగి చనిపోతే డెత్ సమ్మరీ కాపీ ఒకటి ఆస్పత్రి వద్ద ఉంచుకుని, మరొకటి పేషెంట్ కుటుంబ సభ్యులకు విధిగా ఇవ్వాలి. ఇందులో విధిగా కారణాలను రాయాల్సి ఉంటుంది. రోగికి సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్ డేటాలో నిక్షిప్తం చేస్తారు. -
పెద్దాస్పత్రి..రద్దీలో మేటి
సాక్షి, ఖమ్మం వైద్య విభాగం: ప్రభుత్వ జిల్లా ప్రధాన ఆస్పత్రి ఇటీవల కాలంలో నిత్యం రోగుల తో కిటకిటలాడుతోంది. సరికొత్త భవనాలు అందుబాటులోకి రావడం, 400 పడకలు ఏర్పాటు కావడం, మెరుగైన వైద్యసేవలను విస్తృతపర్చడం, మాతా శిశు సంరక్షణ చికిత్సలు మంచిగా ఉన్నాయనే గుర్తింపు లభించడం.. తదితర కారణాలతో ఖమ్మంలోని పెద్దాస్పత్రికి రోగులు బారులు తీరుతున్నారు. కొన్ని నెలలుగా ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ల సంఖ్య పుంజుకోవడంతో 24 గంటలపాటు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. జ్వర పీడితులు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారు ..నిత్యం ఇక్కడ చికిత్స పొందుతుండడం సహజమే. ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడంతో ప్రసవాలకు వచ్చే వారు అంతకంతకూ పెరుగుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 11 నెలల కాలంలో 6లక్షల మందికి పైగా వైద్య సేవలు పొందడంతో..రద్దీ తీవ్రత స్థాయిని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య నాలుగింతలు పెరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి సరిహద్దు జిల్లాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. రోజూ 1200 మందికి పైగా వైద్య సేవలు పొందేందుకు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ సంఖ్య సీజన్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇన్, ఔట్ పేషెంట్లు పెరగడంతో వైద్యులపై మరింత భారం పడుతోంది. వైద్య పరీక్షలు చేయడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తోంది. ఔట్ పేషెంట్ రోగులకు వారి జబ్బును బట్టి వైద్యం చేసి ఇంటికి పంపిస్తారు. రోగం నయం అయ్యేవరకు.. మందులు వాడుతూ డాక్టర్ మళ్లీ రమ్మన్నప్పుడు వచ్చి చెకప్ చేయించుకుంటుంటారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు జిల్లా ఆస్పత్రిలో 6,06,552 మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు లభించాయి. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏడాదిగా ఓపీ, ఐపీ సేవలు ఇలా.. నెల ఔట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఏప్రిల్(2018) 47,577 3,108 మే 45,362 2,880 జూన్ 48,168 2,841 జూలై 55,778 3,546 ఆగస్టు 59,813 4,606 సెప్టెంబర్ 66,248 4,842 అక్టోబర్ 64,075 4,148 నవంబర్ 58,644 3,448 డిసెంబర్ 53,054 3,125 జనవరి(2019) 53,633 3,054 ఫిబ్రవరి 54,200 3,344 6,06,552 38,942 39వేల మంది ఇన్ పేషెంట్లు.. ఆర్థోపెడిక్, గైనిక్, పీడియాట్రీషన్, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి చికిత్స అయినా ఇక్కడి డాక్టర్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇన్ పేషెంట్ సేవలు కూడా కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రసూతి సేవలు అధికంగా అందుతుండగా, అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. షిఫ్టులవారీగా వైద్యులు సేవలు అందిస్తుండడంతో సమీప ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినా, గర్భిణులకు నొప్పులు వచ్చినా, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నాలు జరిగినప్పుడు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. 11 నెలల్లో పెద్దాస్పత్రిలో 39,000 వరకు ఇన్ పేషెంట్ ద్వారా వైద్య సేవలు అందించారు. ప్రసవాల్లో రికార్డు.. ప్రతి నెలా 900కు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత డెలివరీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2017 జూన్ 2న ప్రభుత్వం కేసీఆర్ కట్ పథకాన్ని ప్రవేశపెట్టాక ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు ఆర్థికసాయం, కేసీఆర్ కిట్ లభిస్తున్నాయి. శిశువు, తల్లికి అవసరమైన 15 రకాల వస్తువులు కిట్‌లో ఉంటాయి. ఈ పథకం రాకముందు రోజుకు 10లోపు ప్రసవాలు జరిగేవి. కానీ.. ప్రస్తుతం రోజుకు 30 వరకు చేస్తున్నారు. పథకం ప్రారంభమైన 20 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,000 ప్రసవాలు నిర్వహించారు. అందులో ఒక్క జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే 14వేల డెలివరీలు జరపడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా చూసుకుంటే మూడు వంతులకు పైగా పెద్దాస్పత్రిలోనే జరుగుతున్నాయి. సేవలు మరింత పెంచేందుకు కృషి ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి రోగికి వైద్య సేవలందిస్తాం. మందులు, బ్లేడ్ల కొరత లేకుండా చూస్తున్నాం. అలాగే ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నాం. ఎంతమంది పేషెంట్లు వచ్చినా వైద్యం చేస్తాం. – డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్బీ కోర్సులు
ఏపీలో ఎనిమిది ఆస్పత్రుల్లో సీట్లకు కసరత్తు రాష్ర్టంలో 15 ఆస్పత్రుల్లో డీఎన్బీకి దరఖాస్తులు హైదరాబాద్: జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో ఇక డీఎన్బీ (డిప్లొమాట్ నేషన్ బోర్డ్) కోర్సులు రానున్నాయి. పీజీ తత్సమానమైన ఈ కోర్సులకు తొలి దశలో ఐదు స్పెషాలిటీల్లో సీట్ల దరఖాస్తుకు కసరత్తు జరుగుతోంది. 2015-16 సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకటీ లేదా రెండు కళాశాలలకు మాత్రమే డీఎన్బీ కోర్సులు రానున్నాయి. అయితే 2017 నుంచి అన్ని జిల్లా ఆస్పత్రులకూ డీఎన్బీ సీట్లను తెచ్చుకోవాలని రెండు రాష్ట్రాలు యత్నిస్తున్నాయి. 2015-16 సంవత్సరానికి తెలంగాణలో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, రాజమండ్రి జిల్లా ఆస్పత్రుల్లో ఈ కోర్సులకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది దరఖాస్తు చేస్తున్న కళాశాలలకు ఒక్కో స్పెషాలిటీకి రెండు డీఎన్బీ సీట్లు వచ్చే అవకాశముందని తెలిసింది. తొలిదశలో ఐదు స్పెషాలిటీల్లో.. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బోధనాసుపత్రుల్లో మాత్రమే ఎంబీబీఎస్, పీజీ సీట్లున్నాయి. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం ఈ కోర్సులు నడుస్తున్నాయి. అయితే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన రావడంతో ఇరు ప్రభుత్వాలు ఐదు కోర్సులకు సీట్లకు దరఖాస్తు చేశాయి. ఇందులో పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, గైనకాలజీ, జనరల్ సర్జరీ విభాగాలున్నాయి. డీఎన్బీ ఎలా ఉంటుంది: డీఎన్బీలో ప్రవేశం కోసం ఎన్బీఈ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్) నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇది వైద్య శాస్త్రంలో భారతీయ వైద్యమండలికి తత్సమానమైనది. ఈ బోర్డు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోకి వస్తుంది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు డీఎన్బీలో చేరడానికి అర్హులు. ఇందులోనూ మూడేళ్ల కాలపరిమితి కలిగిన డీఎన్బీ బ్రాడ్ స్పెషాలిటీ (పీజీ), మూడేళ్లు కాలపరిమితి కలిగిన డీఎన్బీ సూపర్ స్పెషాలిటీ, రెండేళ్ల పీజీ డిప్లొమా ఉంటాయి. ఎన్బీఈ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందాలి. దేశంలో వైద్య డిగ్రీలు ప్రదానం చేసే విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లకు ఈ డీఎన్బీ సర్టిఫికెట్ సమానం. అర్హత ఏంటంటే...? ఈ కోర్సుల నిర్వహణకు అర్హత సాధించాలంటే ఆస్పత్రుల్లో కొన్ని వసతులుండాలి. ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ సర్వీసులు, 24 గంటల క్యాజువాలిటీ, శస్త్రచికిత్సలకు అనుకూలమైన వసతులుండాలి. అన్నిటికీ మించి ఆస్పత్రికి ప్రైవేటు లేదా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆస్పత్రుల్లో విజయనగరం జిల్లా ఆస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రి, ఏలూరు జిల్లా ఆస్పత్రి, మచిలీపట్నం జిల్లా ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, చిత్తూరు జిల్లా ఆస్పత్రి, ప్రొద్దుటూరు (కడప) జిల్లా ఆస్పత్రి, నంద్యాల (కర్నూలు) జిల్లా ఆస్పత్రులు. తెలంగాణలో.. జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, నయాపూల్ మెటర్నిటీ ఆస్పత్రి, నీలోఫర్ ఆస్పత్రి, సరోజినీ దేవి ఆస్పత్రి, సర్ రొనాల్డ్ రాస్ ఫీవర్ హాస్పిటల్ (ఇవన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి), మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి, తాండూర్ జిల్లా ఆస్పత్రి, కరీంనగర్ జిల్లా ఆస్పత్రి, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి, నల్గొండ జిల్లా ఆస్పత్రి, నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి, ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రి, ఖమ్మం జిల్లా ఆస్పత్రులు.