ఏపీలో ఎనిమిది ఆస్పత్రుల్లో సీట్లకు కసరత్తు
రాష్ర్టంలో 15 ఆస్పత్రుల్లో డీఎన్‌బీకి దరఖాస్తులు
హైదరాబాద్: జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో ఇక డీఎన్‌బీ (డిప్లొమాట్ నేషన్ బోర్డ్) కోర్సులు రానున్నాయి. పీజీ తత్సమానమైన ఈ కోర్సులకు తొలి దశలో ఐదు స్పెషాలిటీల్లో సీట్ల దరఖాస్తుకు కసరత్తు జరుగుతోంది. 2015-16 సంవత్సరానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకటీ లేదా రెండు కళాశాలలకు మాత్రమే డీఎన్‌బీ కోర్సులు రానున్నాయి. అయితే 2017 నుంచి అన్ని జిల్లా ఆస్పత్రులకూ డీఎన్‌బీ సీట్లను తెచ్చుకోవాలని రెండు రాష్ట్రాలు యత్నిస్తున్నాయి. 2015-16 సంవత్సరానికి తెలంగాణలో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, రాజమండ్రి జిల్లా ఆస్పత్రుల్లో ఈ కోర్సులకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది దరఖాస్తు చేస్తున్న కళాశాలలకు ఒక్కో స్పెషాలిటీకి రెండు డీఎన్‌బీ సీట్లు వచ్చే అవకాశముందని తెలిసింది.
తొలిదశలో ఐదు స్పెషాలిటీల్లో..
ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బోధనాసుపత్రుల్లో మాత్రమే ఎంబీబీఎస్, పీజీ సీట్లున్నాయి. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం ఈ కోర్సులు నడుస్తున్నాయి. అయితే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన రావడంతో ఇరు ప్రభుత్వాలు ఐదు కోర్సులకు సీట్లకు దరఖాస్తు చేశాయి. ఇందులో పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, గైనకాలజీ, జనరల్ సర్జరీ విభాగాలున్నాయి.
డీఎన్‌బీ ఎలా ఉంటుంది: డీఎన్‌బీలో ప్రవేశం కోసం ఎన్‌బీఈ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్) నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇది వైద్య శాస్త్రంలో భారతీయ వైద్యమండలికి తత్సమానమైనది. ఈ బోర్డు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోకి వస్తుంది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు డీఎన్‌బీలో చేరడానికి అర్హులు. ఇందులోనూ మూడేళ్ల కాలపరిమితి కలిగిన డీఎన్‌బీ బ్రాడ్ స్పెషాలిటీ (పీజీ), మూడేళ్లు కాలపరిమితి కలిగిన డీఎన్‌బీ సూపర్ స్పెషాలిటీ, రెండేళ్ల పీజీ డిప్లొమా ఉంటాయి. ఎన్‌బీఈ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కౌన్సిలింగ్ ద్వారా సీట్లు పొందాలి. దేశంలో వైద్య డిగ్రీలు ప్రదానం చేసే విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్లకు ఈ డీఎన్‌బీ సర్టిఫికెట్ సమానం.
అర్హత ఏంటంటే...?
ఈ కోర్సుల నిర్వహణకు అర్హత సాధించాలంటే ఆస్పత్రుల్లో కొన్ని వసతులుండాలి. ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్ సర్వీసులు, 24 గంటల క్యాజువాలిటీ, శస్త్రచికిత్సలకు అనుకూలమైన వసతులుండాలి. అన్నిటికీ మించి ఆస్పత్రికి ప్రైవేటు లేదా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధంగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆస్పత్రుల్లో
విజయనగరం జిల్లా ఆస్పత్రి, రాజమండ్రి జిల్లా ఆస్పత్రి, ఏలూరు జిల్లా ఆస్పత్రి, మచిలీపట్నం జిల్లా ఆస్పత్రి, తెనాలి జిల్లా ఆస్పత్రి, చిత్తూరు జిల్లా ఆస్పత్రి, ప్రొద్దుటూరు (కడప) జిల్లా ఆస్పత్రి, నంద్యాల (కర్నూలు) జిల్లా ఆస్పత్రులు.
తెలంగాణలో..
జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, నయాపూల్ మెటర్నిటీ ఆస్పత్రి, నీలోఫర్ ఆస్పత్రి, సరోజినీ దేవి ఆస్పత్రి, సర్ రొనాల్డ్ రాస్ ఫీవర్ హాస్పిటల్ (ఇవన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి), మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి, తాండూర్ జిల్లా ఆస్పత్రి, కరీంనగర్ జిల్లా ఆస్పత్రి, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి, నల్గొండ జిల్లా ఆస్పత్రి, నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి, ఆదిలాబాద్ జిల్లా ఆస్పత్రి, ఖమ్మం జిల్లా ఆస్పత్రులు.
జిల్లా ఆస్పత్రుల్లో డీఎన్‌బీ కోర్సులు
Published Mon, Feb 23 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement