నిజామాబాద్‌అర్బన్: సర్కారు చర్యల వల్ల ప్రభుత్వ ఆస్పత్రులకు కొత్త కళ వచ్చింది. కేసీఆర్ కిట్ కారణంగా సర్కారు దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే, ప్రసవాల సంఖ్యతో పాటే మాతృ, శిశు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరైన సౌకర్యాలు కరువవడం, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడం మూలంగా మరణాల సంఖ్య పెరుగుతోంది!. జిల్లా వ్యాప్తంగా దవాఖానాల్లో ఈ ఏడాది సంభవించిన మరణాలు భయపెట్టిస్తున్నాయి. ఆర్నెళ్ల వ్యవధిలో 101 మంది నవజాత శిశువులు పురిట్లోనే కన్నుమూయడం, ఆరుగురు బాలింతలు ప్రసవ సమయంలో మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది.
వసతులు కరువు..
జిల్లా వ్యాప్తంగా 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు ఒక ఏరియా ఆస్పత్రి, నాలుగు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు మరో 92 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోజుకు సుమారు 40 నుంచి 50 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక, ఆర్మూర్, బోధన్, డిచ్‌పల్లితో పాటు మోర్తాడ్, వర్ని, నవీపేట ఆస్పత్రులలో మరో 50 వరకు ప్రసవాలు నమోదవుతున్నాయి. అయితే, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు బాలింతలు, శిశువులకు సరైన వైద్యసౌకర్యలు అందడం లేదు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనే వెంటిలేటర్ సదుపాయం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే వ్యవస్థ లేకపోవడంతో బాలింతలు, శిశువులు మృత్యువాతపడుతున్నారు.
అందుబాటులో లేని అత్యవసర చికిత్స
కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగింది. అయితే, అందుకు తగినట్లుగా వసతులు లేకపోవడం కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులు, బాలింతలు, శిశువులకు సరైన వైద్యచికిత్సలు అందడం లేదు. ప్రసవ సమయంలో గర్భిణులకు రక్తం తక్కువగా ఉండడం, ఫిట్స్ రావడం, శిశువు ఉమ్మ నీరు మింగడం, తక్కువ బరువుతో పుట్టడం తదితర కారణాలతో పాటు ఇతర సమస్యలు తలెత్తుంటాయి. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సరైన వైద్య చికిత్స అందించే సదుపాయం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. ఫలితంగా మాతృ, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక, హైదరాబాద్‌కు తీసుకెళ్లలేక పేద, మధ్యతరగతి తల్లులకు కడుపుకోత మిగులుతోంది. ఇటీవల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కడుపులోనే శిశువు మృతి చెందినడంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. అలాగే, నవీపేట మండలానికి చెందిన ఓ బాలింత ప్రసవానంతరం మృతి చెందింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఫలితంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 101 మంది శిశువులు, ఆరుగురు బాలింతలు ప్రసవ సమయంలోనే మృత్యువాత పడ్డారు.
సమన్వయ లోపమే కారణమా..?
మాతృ శిశు మరణాలను తగ్గించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సమన్వయంతో పని చేయాల్సి ఉంది. అయితే, అంతటా సమన్వయ లోపం కనిపిస్తోంది. తమ గ్రామ పరిధిలో గర్భిణుల వివరాలను ఏఎన్‌ఎంలు రిజిస్టర్ చేసుకుంటారు. అనంతరం వారికి అంగన్‌వాడీలలో గుడ్లు, పౌష్టికాహారం అందిస్తుంటారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా మాత్రలు అందించడం, ప్రతి నెలా బరువును పరిశీలించడం వంటివి చేయాలి. రెండు శాఖలు సమన్వయంతో గర్భిణులకు పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. అలాగే గర్భిణికి తగు సలహాలు, సూచనలు అందించాలి. అయితే, చాలా చోట్ల క్షేత్ర స్థాయిలో శిశు, సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సిబ్బంది మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో ప్రసవ సమయంలో గర్భిణులు, శిశువులకు ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరికొందరు బాలింతలు వైద్యసిబ్బంది సలహాలు, సూచనలు పట్టించుకోక పోవడం, పురాతన పద్ధతులు పాటించడం కూడా మరణాల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం..
జిల్లా వ్యాప్తంగా మాతృ, శిశు మరణాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం వీటి మరణాల సంఖ్య తగ్గింది. ప్రమాదక పరిస్థితుల వల్ల అప్పుడప్పుడు మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో నివారించేందుకు కృషి చేస్తున్నాం. – డా.సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment