![This Woman Capitalised On Her Medical Condition To Support Family](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/nurse.jpg.webp?itok=Ac8Fal-o)
ఎదురైన సమస్యనే అనుకూలంగా మార్చుకుని ఎదిగేందుకు సోపానంగా చేసుకోవడం గురించి విన్నారా..?. నిజానికి పరిస్థితులే ఆ మార్గాన్ని అందిస్తాయో లేక వాళ్లలోని స్థ్యైర్యం అంతటి ఘనకార్యాలకు పురిగొల్పితుందో తెలియదు గానీ వాళ్లు మాత్రం స్ఫూర్తిగా నిలిచిపోతారు. కళ్ల ముందే కలలన్నీ ఆవిరై అడియాశలుగా మిగిలిన వేళ కూడా కనికనిపించని ఆశ అనే వెలుగుని వెతికిపట్టుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటారు కొందరు. వీళ్లని చూసి.. కష్టానికి కూడా కష్టపెట్టడం ఎలా అనేది క్లిష్టంగా ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఈ మహిళ. ఆమె విషాద జీవిత కథ ఎందరికో ప్రేరణ కలిగించడమే గాక చుట్టుముట్టే సమస్యలతో ఎలా పోరాడాలో తెలుపుతుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం అసామాన్య ధీరురాలైన ఆ మహిళ గాథ ఏంటో చూద్దామా..!.
ఆ మహిళ పేరు మేరీ ఆన్ బేవన్(Mary Ann Bevan). ఆమె 1874లో లండన్‌లోని న్యూహామ్(Newham, London)లో జన్మించింది. ఆమె నర్సుగా పనిచేసేది . అయితే ఆమె థామస్ బెవాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే వివాహం అయిన 11 ఏళ్లకు అనూహ్యంగా భర్త మరణిస్తాడు. ఒక్కసారిగా ఆ నలుగురి పిల్లల పోషణ ఆమెపై పడిపోతుంది. ఒక పక్క చిన్న వయసులోనే భర్తని కోల్పోవడం మరోవైపు పిల్లల ఆలనాపాలన, పోషణ అన్ని తానే చూసుకోవడం ఆమెను ఉక్కిరిబిక్కిర చేసేస్తుంటాయి.
సరిగ్గా ఇదే సమయంలో ఆమె అక్రోమెగలీ(Acromegaly) అనే వ్యాధి బారినపడుతుంది. దీని కారణంగా ఆమె శరీరంలోని గ్రోత్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయ్యి శారీరక రూపం వికృతంగా మారిపోతుంది. ఆమె శరీరంలో కాళ్లు, చేతులు, ముఖ కవళికలు తదితరాలన్ని అసాధారణంగా పెరిగిపోతాయి.
దీంతో బయటకు వెళ్లి పనిచేయలేక తీవ్ర మనో వేదన అనుభవిస్తుంది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తానే సంపాదించక తప్పనిస్థితి మరోవైపు ఈ అనారోగ్యం రెండూ ఆమెను దారుణంగా బాధిస్తుంటాయి. భర్త పోయిన దుఃఖానికి మించిన వేదనలు ఎదుర్కొంటుంది మేరీ. ఈ అనారోగ్యం కారణంగా కండరాల నొప్పులు మొదలై పనిచేయడమే కష్టంగా మారిపోతుంటుంది. చెప్పాలంటే దురదృష్టం పగబట్టి వెంటాడినట్లుగా ఉంటుంది ఆమె పరిస్థితి.
అయినా ఏదో రకంగా తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతలా తాపత్రయపడుతుందో వింటే మనసు ద్రవించిపోతుంది. సరిగ్గా ఆసమయంలో 1920లలో, "హోమిలీయెస్ట్ ఉమెన్" పోటీ పెడతారు. దీన్ని "అగ్లీ ఉమెన్" పోటీ(Ugly Woman contest) అని కూడా పిలుస్తారు. ఇందులో పోటీ చేసి గెలిస్తే తన కుటుంబాన్ని హాయిగా పోషించుకోవచ్చనేది ఆమె ఆశ. నిజానికి అలాంటి పోటీలో ఏ స్త్రీ పోటీ చేయడం అనేది అంత సులభంకాదు. ఎందుకంటే అందుకు ఎంతో మనో నిబ్బరం, ధైర్యం కావాలి.
ఇక్కడ మేరీకి తన చుట్టూ ఉన్న కష్టాలే ఆమెకు అంతటి ఆత్మవిశ్వాసాన్ని స్థ్యైర్యాన్ని అందించాయి. ఆమె అనుకన్నట్లుగానే ఈ పోటీలో పాల్గొని గెలుపొందింది కూడా. ఆ తర్వాత ఆమె అరుదైన జీవసంబంధ వ్యక్తులకు సంబంధించిన ఐలాండ్ డ్రీమ్‌ల్యాండ్ సైడ్‌షోలో "ఫ్రీక్ షో ప్రదర్శనకారిణిగా పనిచేసింది. మరికొన్నాళ్లు సర్కస్‌లో పనిచేసింది. ఇలా కుటుంబాన్ని పోషించడానికి తన అసాధారణమైన వైద్య పరిస్థితినే(Medical Condition) తనకు అనుకూలమైనదిగా చేసుకుని కుటుంబాన్ని పోషించింది.
చివరికి ఆమె 59 ఏళ్ల వయసులో మరణించింది. తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసం పనిచేస్తూనే ఉంది. దురదృష్టం కటికి చీకటిలా కమ్ముకున్నప్పుడే దాన్నే జీవితానికి ఆసరాగా మలుచుకుని బతకడం అంటే ఇదే కదా..!. సింపుల్‌గా చెప్పాలంటే దురదృష్టంలోని మొదటి రెండు పదాలను పక్కన పడేసి అదృష్టంగా మార్చుకోవడం అన్నమాట. చెప్పడం సులువు..ఆచరించాలంటే ఎంతో గట్స్ కావలి కదూ..!.
(చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?)
Comments
Please login to add a commentAdd a comment