అభిరుచి, అంకితభావం, పట్టుదల ఒక దగ్గర చేరితే ఏమవుతుంది? అపురూప విజయం అవుతుంది. ఆడ్రియానా బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం అవుతుంది. ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా 23 ఏళ్ల ఆడ్రియానా బ్రౌన్లీ రికార్డ్ సృష్టించింది.
లండన్‌లో పుట్టి పెరిగిన బ్రౌన్లీకి చిన్నప్పటి నుంచి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. నాన్న పర్వతారోహకుడు. పర్వతారోహణకు సంబంధించి ఆయన చెప్పే ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వినడం అంటే ఇష్టం.
ఎనిమిదేళ్ల వయసులో పర్వతారోహకుడైన తండ్రి నుంచి ప్రేరణ ΄పొందింది బ్రౌన్లీ. పెద్ద పర్వతాలు అధిరోహించి పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. ఇరవై ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ కల సాకారం అయింది. ఆక్సిజన్ లేకుండా గాషెర్బ్రమ్ 1కు చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా, కే2 శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.
చైనాలోని 8,000 మీటర్‌ల ఎత్తులో ఉన్న పిషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించడం ద్వారా 14 శిఖరాల అధిరోహణను పూర్తి చేసింది. నిర్మలమైన ఆకాశం సాక్షిగా, సూర్యోదయం వెలుగులో పిషాపాంగ్మా పర్వతం దగ్గరకు చేరుకోగానే బ్రౌన్లీ భావోద్వేగానికి గురైంది. ‘శిఖరానికి చేరుకోకముందే నా లక్ష్యం నెరవేరబోతుంది అనే ఆనందంలో ఏడ్వడం మొదలు పెట్టాను’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం కేవలం సంఖ్యకు సంబంధించినది కాదు.
అంకితభావాన్ని, నిబద్దతను ప్రతిఫలించే అపురూప విజయం అది. పర్వతారోహణ అనేది అభిరుచి మాత్రమే కాదు త్యాగాల సమాహారం. పర్వతారోహణపై దృష్టి పెట్టిన బ్రౌన్లీ టీనేజ్ సంతోషాలకు దూరమైంది. తన కలను సాకారం చేసుకోవడానికి యూనివర్శిటీకి దూరమైంది. వ్యక్తిగత విజయాలపై మాత్రమే బ్రౌన్లీ దృష్టి పెట్టలేదు. పర్వతారోహణ విషయంలో యువతను ప్రోత్సహించడానికి, వారు తమ కలలను సాకారం చేసుకునే విషయంలో సహకరించడానికి నడుం కట్టింది.
‘సాహసం మంచిదేగానీ దుస్సాహాసం తగదు’ అంటున్న బ్రౌన్లీ ఎంతోమంది పర్వతారోహకులను దగ్గర నుంచి చూసింది. వారిలో ఉత్సాహమే కనిపిస్తుంది. శిక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సాహసాల పేరుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నాకు తెలుసు. పర్వతారోహణ పేరుతో సాహసాలకు దిగే కొద్దిమందికి ప్రాథమిక విషయాల్లో కూడా అవగాహన లేదని తెలుసుకున్నాను. ఉత్సాహమే కాదు శిక్షణ కూడా చాలా ముఖ్యం. అనుభవం లేని పర్వతారోహకులను ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అనుమతించరాదు.
వారు తమ ప్రాణాల తోపాటు ఇతరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించే పర్వతారోహకులు ముందుగా చిన్న పర్వతాలను అధిరోహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటుంది బ్రౌన్లీ. ‘ఎప్పుడు పర్వతాల గోలేనా’ అని బ్రౌన్లీని స్నేహితులు వెక్కిరించేవారు. అయితే ఆమె అలాంటి వెక్కిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు.
‘జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యం మీకు ప్రత్యేకమైనది కావచ్చు. ఇతరులకు వింతగా అనిపించవచ్చు’ అంటుంది బ్రౌన్లీ. ఒక పర్వతానికి మరో పర్వతానికి సంబంధం ఉండదు. ప్రతి పర్వతం తనదైన సవాళ్లు విసురుతుంటుంది. ‘ప్రతి సవాలు విలువైనదే’ అంటున్న ఆడ్రియానా బ్రౌన్లీ మరిన్ని సాహసాలకు సిద్ధం అవుతుంది.
(చదవండి: తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..)
Comments
Please login to add a commentAdd a comment