పేదల శవానికి వాహనం దొరకదు!
- నిరుపేదలు తమవారి శవాలను మోసుకెళ్లాల్సిందేనా?
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అష్టకష్టాలు
- 50 వాహనాలను సిద్ధం చేసినా వినియోగించని వైనం
- ప్రభుత్వ అనుమతి లేక ఆరు నెలలుగా మూలనపడిన వాహనాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలో ఆగస్టు నెలలో మాఝీ అనే గిరిజనుడు తన భార్య శవాన్ని వాహనంలో తరలించే స్థోమత లేక 12 కిలోమీటర్లు భుజంపై మోసుకుంటూ వెళ్లాడు!
తాజాగా భాగ్యనగరంలోనూ అలాంటిదే మరో దీనగాథ! సంగారెడ్డి జిల్లా మనూరు మండలం మైకోడ్‌కు చెందిన రాములు డబ్బుల్లేక తన భార్య మృతదేహాన్ని తోపుడు బండిలో పెట్టుకొని కాలినడకన 60 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఇలా పేదలు చనిపోతే వారి శవాలను సొంతూరుకు వాహనాల్లో ఉచితంగా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక ప్రమాదాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం పేదలు చనిపోతున్నారు. ఆ శవాలను సొంతూరుకు తరలించడం వారి బంధువులకు ఆర్థికంగా శక్తికి మించిన భారంగా మారుతోంది. భార్య శవాన్ని సంగారెడ్డి జిల్లా మానూరుకు తరలించడానికే రాములును రూ.5 వేలు అడిగారు. రాష్ట్రంలో ఇతర సుదూర ప్రాంతాలకు తరలించాలంటే రూ. 15 వేలకు మించి ఖర్చు కానుంది. పేదలు అంత మొత్తాన్ని భరించడం కష్టమే. పేదల శవాలను తరలించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఆరు నెలల కిందటే వాహనాలను సిద్ధం చేసినా.. అవి మూలకు పడి ఉన్నాయి.
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో రోజుకు ఒక్కో ఆసుపత్రిలో సరాసరి 30 మంది వరకు చనిపోతుంటారని అంచనా. జిల్లా ఆసుపత్రుల్లో ఐదుగురు చొప్పున మృతి చెందుతారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిని హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాల నుంచి సొంతూళ్లకు తరలించడం పేదలకు ఆర్థికంగా భారమవుతోంది. దీంతో శవాలను వారి స్వగ్రామాలకు తరలించడానికి ప్రభుత్వమే వాహనాలను సమకూర్చాలని నిర్ణయించి ఏడాది కావొస్తోంది. ముందుగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వాహనాల్లో ఉచితంగా శవాలను తరలించాలని భావించారు. ఇందుకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర ఆసుపత్రుల వద్ద అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. తర్వాత జిల్లా ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేయాలనుకున్నారు. వీరేగాకుండా ప్రమాదాల్లో పేదలెవరైనా చనిపోయినా వారిని తరలించేలా ఏర్పాట్లు చేయాలనుకున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ లోపు అందుబాటులో ఉన్న ‘108’కు చెందిన 50 పాత అంబులెన్సులను మరమ్మతు చేసి శవాల తరలింపునకు సిద్ధంగా ఉంచారు. వాటిని తాత్కాలికంగా జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ ద్వారా నడిపించాలని నిర్ణయించారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో అవి ఆరు నెలలుగా మూలనపడి ఉన్నాయి. సిద్ధం చేసిన 50 వాహనాల్లో 25 వాహనాలు ఒక శవాన్ని తరలించేలా... మరో 25 వాహనాలు రెండు శవాలను తరలించేలా ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. అవసరాలకు అనుగుణంగా 150 శవ తరలింపు వాహనాలను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు.