మృతదేహాల తరలింపునకు ఉచిత వాహనాలు
రాష్ట్రంలో ‘హెర్సే’ పేరుతో అందుబాటులోకి..
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చనిపోతే మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు చేతిలో డబ్బుల్లేక భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లిన ఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆపద సమయాల్లో ప్రైవేటు వాహనదారులు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మందులు కొనేందుకే డబ్బుల్లేక ఇబ్బంది పడే పేదలు అంతమొత్తాన్ని భరించటం తలకుమించిన భారమవుతోంది. ఇలాంటి సమస్య రాష్ట్రంలో రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అలాంటి వారికోసం ‘హెర్సే’ పేరుతో ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తోంది. తొలుత 50 వాహనాలను అందుబాటులోకి తేనుంది. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద 10 చొప్పున, నిమ్స్‌కు 2, ఆరు ఉమ్మడి జిల్లా కేంద్రాలకు 6, మహబూబ్‌నగర్‌కు 2, వరంగల్ ఎంజీఎంకు 3, ఆదిలాబాద్ రిమ్స్‌కు 2, నిజామాబాద్‌కు 2, మంచిర్యాల, గజ్వేల్, భద్రాచలం ఆస్పత్రులకు ఒక్కటి చొప్పున కేటారుుంచనున్నారు. మరో పది వాహనాలను వెసులుబాటు ఆధారంగా కేటారుుంచనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్రమంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాసయాదవ్‌లు ప్రారంభించనున్నారు.
రెండు రకాలుగా వాహనాలు...
ఒకేసారి రెండు శవాలను తరలించేలా రెండు ఫ్రీజర్లుండే వాహనాలు, ఒక మృతదేహాన్ని తరలించేలా ఒక ఫ్రీజర్ ఉండే వాహనాలు... ఇలా రెండు రకాల వాహనాలను సిద్ధం చేస్తున్నారు. 108కి ఫోన్ చేసి వాటిని కోరవచ్చని, 24 గంటలు ఇవి ఆస్పత్రుల వద్ద అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.