ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని మహిళా జనరల్ ఓపీ విభాగాన్ని పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలే తప్ప అవినీతికి పాల్పడితే సహించబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంత్రి నాని శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ దుర్గాప్రసాద్, కలెక్టర్ రేవు ముత్యాలరాజుతో కలిసి గంటకు పైగా ఆసుపత్రిలో పలు విభాగాలను తనిఖీ చేయడమే కాకుండా రోగుల సమస్యలను అందుతున్న వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు.
సాక్షి, ఏలూరు : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టమైన సమాచారం తనకు ఉందని, కొన్ని ఛానల్స్‌లో కూడా పేరుతో సహా వార్తలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారుల సమావేశంలో ప్రశ్నించారు. విచారణ నిర్వహించి బాధ్యులను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి డీఎంహెచ్‌వో సుబ్రమణ్యేశ్వరిని ఆదేశించారు. తొలుత పర్యటనలో డయాలసిస్ సక్రమంగా నిర్వహించడం లేదని, సమస్యలు ఉన్నాయని బీమడోలుకు చెందిన డయాలసిస్ రోగి మంత్రి నాని దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ జరిపి తనకు రిపోర్టు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. బుట్టాయగూడెం నుంచి ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన బాలికకు ఆధార్‌కార్డు లేదని ఎం ఆర్‌ఐ స్కాన్ నిర్వహించకుండా వెనక్కి పంపడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏదో ఒక వంక చెప్పి వెనక్కి పంపడం సరికాదన్నారు. ఆధార్ లేకపోయినా ఏదో ఒక డాక్టర్‌తో సర్టిఫై చేయించి వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను సందర్శించారు. మెటర్నిటీ వార్డులో పేషంట్ బంధువులు ఒక చోట కింద కూర్చుని ఉండటం గమనించి వారికి వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన చర్యలపై చర్చించారు. ఆసుపత్రిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం సమస్యగా మారిందని, మార్చురీలో ఫ్రీజర్ బాక్సులు పనిచేయడం లేదని తదితర అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చాక కూడా స్కానింగ్, ఎక్స్‌రేల పేరుతో రోగులను బయటకు పంపితే సహించబోమని నాని హెచ్చరించారు. ఎముకల వార్డులో చేరిన రోగులకు యుద్ధప్రాతిపదికపై అవసరమైన వైద్యాన్ని ప్రారంభించి శస్త్ర చికిత్సకు తగు ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని అంతే తప్ప రోడ్డు ప్రమాదాలలో గాయపడి వచ్చిన వారికి సరైన వైద్యం అందించకపోతే ఏమి జరుగుతుందోనన్న భయం వారిలో ఉంటుందన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు సాధ్యమైనంత త్వరగా శస్త్ర చికిత్సలు పూర్తి చేయాలని ఎక్కడా కూడా జాప్యం చేస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు.
ప్రసవాల విభాగంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ సురక్షితంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించా లని రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలే తప్ప దురుసుగా ప్రవర్తిస్తే సంబంధితులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, ముఖ్యంగా షుగర్, బీపీ వంటి రోగాల పట్ల ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని, ఇటీవల మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాలలో సరైన అవగాహన లేని కారణంగా సకా లంలో మధుమేహం వ్యాధిని గుర్తించలేకపోతున్నారని దీనిపై అవగాహన పెంపొందిచాలన్నారు. 104 వాహనం పల్లెలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి తగు వైద్య సలహాలు అందించాలని కోరారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ విభాగాన్ని కూడా మంత్రి సందర్శించి ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందించే విషయంలో ఆన్‌లైన్ అనుమతులు కొంత జాప్యం జరుగుతున్నదని ఆసుపత్రిలో రోగి చేరిన తక్షణమే అవసరమైన వైద్యానికి అనుమతించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనుమతిలో జాప్యం అయితే అనారోగ్యం మరింత క్షీణిస్తుందనే భావన ప్రజల్లో ఉంటుందని అందుకే ఆన్‌లైన్ అనుమతులు శరవేగంగా జరిగేలా ఆరోగ్యమిత్రలు మరింత చొరవ చూపాలని ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మంత్రి ఆసుపత్రిలో మరుగుదొడ్ల పరిస్ధితి, నీటి సౌకర్యం, టాయిలెట్లలో విద్యుత్ లైట్లు ఉన్నాయా లేవా అనే విషయం కూడా పరిశీలించారు. డ్రగ్‌స్టోర్ విభాగాన్ని సందర్శించి మందులు పాడైపోకుండా ఏసీలను ఏర్పాటు చేయాలని, సరైన ఉష్ణోగ్రతలను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment