
సాక్షి, అమరావతి: తుపాన్ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్‌వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
మూడు షిఫ్ట్‌ల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలన్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల డీఎంహెచ్‌వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment