Cyclone Jawad
-
కరిగిపోతూ.. కడలిలో కలసిపోతూ..
పిఠాపురం: జవాద్ తుపాను ప్రభావంతో కొత్తపల్లి మండల తీర ప్రాంతంలో కడలి కల్లోలం సృష్టించింది. ఎక్కడ చూసినా సుమారు 5 మీటర్ల మేర ముందుకు వచ్చిన సముద్రం తీరప్రాంతాన్ని కబళించింది. పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్రంగా కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లు సుమారు 12 ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. మరికొన్ని ఇళ్లు ఏ క్షణంలోనైనా సముద్ర కోతకు గురయ్యే ప్రమాదకర పరిస్థితికి చేరాయి. కోతతో కోనపాపపేటలో సముద్రంలో కలిసిపోతున్న కొబ్బరి చెట్లు విలువైన కొబ్బరి చెట్లు కడలిలో కలసిపోతున్నాయి. కోతకు గురవుతున్న తమ ఇళ్లలోని సామగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించుకునే పనిలో కొందరు మత్స్యకారులు నిమగ్నమయ్యారు. కోతకు గురైన ప్రాంతాలను కొత్తపల్లి ఎంపీపీ కారే సుధ, మత్స్యకార నాయకుడు కారే శ్రీనివాసరావు తదితరులు ఆదివారం పరిశీలించారు. మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతం రెండో రోజు కూడా కోతకు గురైంది. పలు ఇళ్లతో పాటు బీచ్ రోడ్డు సుమారు కిలోమీటరు మేర ధ్వంసమైంది. శుక్రవారం నిలిపివేసిన రాకపోకలను ఆదివారం పునరుద్ధరించారు. కెరటాల ఉధృతి కొనసాగుతుండడంతో బీచ్ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కోతకు గురైన ఇంట్లో భయాందోళనల నడుమ మత్స్యకార కుటుంబం నేల మాయమై.. బావి మిగిలిందిలా.. కోనపాపపేటలో సముద్ర కోత తీవ్రతకు ఈ బావి సాక్ష్యంగా నిలుస్తోంది. పక్కనే సముద్రం ఉన్నా మంచినీటిని ఇచ్చి ప్రజల అవసరాలను తీర్చిన ఈ నేల బావి.. తీవ్రంగా అలల కోతకు గురైంది. ఫలితంగా చుట్టూ ఉన్న నేల కొట్టుకుపోగా బావి మట్టితో పూడుకుపోయి ఇలా మిగిలింది. -
200 ఏళ్లలో ఇలా సాగిన తుపాను లేదు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/మహారాణిపేట(విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో పూరి తీరం వైపు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 370 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి 50, గోపాల్‌పూర్‌కు 130, పారదీప్‌కు 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తరువాత 24 గంటల్లో పూరి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మినహా రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంపై ఇక జవాద్ ప్రభావం ఉండదని పేర్కొంది. వచ్చే పదిరోజులు రాష్ట్రంలో సాధారణ వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. చలి తీవ్రత పెరగనుందని, రాత్రి సమయంలో శీతల గాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించారు. కూలిన ఆర్కే బీచ్ వద్ద చిల్డ్రన్ పార్కు గోడ 140 బోట్లు, మత్స్యకారులు సురక్షితం తుపాను బలహీనపడటంతో అధికారులు, మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 140 మరబోట్లు పారదీప్, గంజాంలో చిక్కుకుపోవడంతో మత్స్యకారుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తదితరులు ఒడిశా అధికారులు, పోర్టు అధికారులను సంప్రదించారు. దీంతో 140 బోట్లకు పారదీప్, గంజాంలలో ఆశ్రయం కల్పించారని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మత్స్యకారులకు అందించి మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు ఎంతో సహకారం అందించారని విశాఖ డాల్ఫిన్ బోటు సంఘం అధ్యక్షుడు చోడిపల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం అర్ధరాత్రి ఎగసిపడిన అలలతో సముద్రం దూసుకొచ్చింది. అలల దాటికి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద చిల్డ్రన్స్ పార్కు గోడ కూలిపోయింది. దీంతో సుమారు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లిందని జీవీఎంసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ నుంచి గోకుల్ పార్క్ వరకు ప్రవేశాన్ని నిషేధించారు. 200 ఏళ్లలో ఇలా సాగిన తుపాను లేదు జవాద్ తుపాను ప్రయాణం భిన్నంగా సాగింది. దక్షిణ చైనా సముద్రంలో మొదలైన దీని ప్రయాణం.. పశ్చిమ బెంగాల్ వైపు సుదీర్ఘంగా సాగింది. పైగా సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతోంది. ఇలా సుదీర్ఘ ప్రయాణం చేసి.. తీరం దాటకుండానే బలహీనపడిన తుపాను గడిచిన 200 ఏళ్లలో లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
తుపాను దృష్ట్యా పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా విజయవాడ మీదుగా నడుస్తోన్న పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లు ఇవే... ఈ నెల 4 న యశ్వంతపూర్–పూరి (22884), రాయగడ–గుంటూరు (17244), భువనేశ్వర్–తిరుపతి (22879), హౌరా–సికింద్రాబాద్ (12703), హౌరా–యశ్వంతపూర్ (12245), భువనేశ్వర్–ముంబై సిఎస్టి (11020), హౌరా–తిరుపతి (20889), చెన్నై సెంట్రల్–హౌరా (12842), హైదరాబాద్–హౌరా (18046), డిబ్రుగర్–కన్యాకుమారి (15906), యశ్వంతపూర్–కామాఖ్య (12551), యశ్వంతపూర్–హౌరా (12864), యశ్వంతపూర్–భాగల్పూర్ (12253), కన్యాకుమారి–హౌరా (12666).. ఈ నెల 5న చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (22808), షాలీమార్–త్రివేండ్రం సెంట్రల్ (22642), హౌరా–తిరుచురాపల్లి (12663), తిరుపతి–భువనేశ్వర్ (22880), తిరుపతి–హౌరా (20890), యశ్వంతపూర్–టాటా (12890), భువనేశ్వర్–బెంగళూరు (18463/12845), భువనేశ్వర్–సికింద్రాబాద్ (17015), పూరి–ఓఖా(20871), భువనేశ్వర్–తిరుపతి (22871), రాయగడ–గుంటూరు (17244), పూరి–తిరుపతి (17479), పూరి–చెన్నై సెంట్రల్ (22859), భువనేశ్వర్–ముంబై సీఎస్టీ (11020), తిరుపతి–భువనేశ్వర్ (22880), చెన్నై సెంట్రల్–హౌరా (12842) రైళ్లు రద్దు. ఈ నెల 5, 6 తేదీల్లో మైసూర్–హౌరా (22818) 6, 7 తేదీల్లో గౌహతి–బెంగళూరు (12510), 7న బెంగళూరు–హతియా (18638), ఆగర్తల–బెంగళూరు (02984) రైళ్లు రద్దు. -
తప్పిన ముప్పు.. బలహీనపడిన జవాద్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం/పిఠాపురం: ఉత్తరాంధ్రకు జవాద్ తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తుపాను శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తుపాను ప్రభావం ఓ మోస్తరుగా శ్రీకాకుళం జిల్లాపైనే కనిపించింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదు కాలేదు. మొత్తంగా జవాద్ తుపాను ప్రభావం భయపెట్టినంతగా మన తీరంపై ప్రభావం చూపకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తుపాను బలహీనపడి ఒడిశా వైపు కదలడంతో మన తీరంలో తేలికపాటి వర్షాలు మినహా భారీ వర్షాలకు అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. ప్రస్తుతం జవాద్ విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 260 కి.మీ., పూరీకి 330 కి.మీ., పారదీప్‌కు 420 కి.మీ. దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 12 గంటల్లో మరింత క్రమంగా బలహీనపడి ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా పూరీ దగ్గరకు చేరుతుంది. ఆ తర్వాత ఒడిశా కోస్తా వెంబడి ప్రయాణించి పశ్చిమ బెంగాల్ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కాగా, జవాద్ ప్రభావంతో శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గార మండలం తులుగులో 7.1 సెంటీమీటర్లు, పలాస, కొర్లాంలో 5.5, సంతబొమ్మాళిలో 5.4, రాజాపురంలో 5.1, పొలాకి, ఇచ్ఛాపురంలో 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో సగటున 3.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. పలాసలో అత్యధికంగా 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రణస్థలంలో 2.2, లావేరులో 1.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం (నేడు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారముందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థిని మృతి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో బలమైన గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం గోపీనాథపురంలో కొబ్బరి చెట్టు విరిగి పడి ఇంటర్ విద్యార్థిని గోరకల ఇందు(16) మృతి చెందింది. అదే మండలంలోని గోవిందపురంలో రెండు ఆవులు, మూడు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా కనిపించింది. తీర ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. శుక్రవారం నుంచి శనివారం రాత్రి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలిచారు. ఉప్పాడలో దెబ్బతిన్న 20 ఇళ్లు తూర్పుగోదావరి జిల్లాపై తుపాను ప్రభావం లేనప్పటికీ సముద్రం కల్లోలంగా మారి కెరటాలు ఎగసిపడ్డాయి. తీరానికి చేరువగా ఉన్న 20 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయని బాధిత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు తీర రహదారి కోతకు గురయింది. కెరటాల ఉధృతికి ఎన్టీపీసీ సమీపంలోని పెద్ద వంతెన శిథిలావస్థకు చేరి కూలిపోడానికి సిద్ధంగా ఉంది వరద ముప్పును నివారించండి: మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో వరద ముప్పును నివారించడానికి చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి తుపాను ప్రభావం ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల జలవనరుల శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, వచ్చే ప్రవాహాల ఆధారంగా.. దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తూ వరద ముప్పును తప్పించాలని సూచించారు. చెరువు కట్టలు తెగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
AP: ‘జవాద్’ను ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధం
సాక్షి, అమరావతి: జవాద్ తుపాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి విద్యుత్ శాఖ సన్నద్ధమైంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఐదు జిల్లాల్లో సముద్ర తీరం వెంబడి గల 43 మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందన్న సమాచారం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని 15,35,683 (ఎల్టీ, హెచ్‌టీ) సర్వీసులకు విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. చదవండి: Cyclone Jawad: దూసుకొస్తున్న ‘జవాద్’.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం తుపాను ప్రభావిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ సామాగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా 30 వైర్లెస్ సెట్లను ఇప్పటికే తెప్పించగా, మరో 20 సెట్లను ఏలూరు, రాజమహేంద్రవరం సర్కిల్స్ నుంచి అవసరాన్ని బట్టి తెచ్చుకునేందుకు సిద్ధం చేశారు. ప్రైవేటు క్రేన్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 42,189 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటిలో ఏవైనా దెబ్బతింటే.. వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు సిద్ధం చేశారు. హాస్పటళ్లు, వాటర్ వర్క్స్, కలెక్టరేట్లు, రెవెన్యూ కార్యాలయాలకు ముందస్తుగా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు సిద్ధం శ్రీకాకుళం జిల్లాలో 1,300 మందితో 108 బృందాలు, విజయనగరం జిల్లాలో 708 మందితో 30 బృందాలు, విశాఖపట్నం జిల్లాలో 810 మందితో 72 బృందాలు, తూర్పు గోదావరి జిల్లాలో 765 మందితో 53 బృందాలు, పశి్చమ గోదావరి జిల్లాలో 400 మందితో 35 బృందాలను ఏపీఈపీడీసీఎల్ సిద్ధంగా ఉంచింది. కార్పొరేట్, సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో 24 గంటలూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ మొత్తం ఆపరేషన్స్ పర్యవేక్షణకు నోడల్ ఆఫీసరనూ నియమించింది. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని డిస్కం సీఎండీ సంతోషరావు విజ్ఞప్తి చేశారు. -
Cyclone Jawad: దూసుకొస్తున్న ‘జవాద్’.. తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
సాక్షి నెట్వర్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం ఉ.11.30 గంటలకు తుపానుగా మారింది. దీనికి జవాద్ అని పేరు పెట్టారు. ఇది ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 280 కి.మీల దూరంలో.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి 400 కి.మీ.లు, పూరీకి 460 కి.మీ, పారాదీప్‌కి 540 కి.మీ.ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపు వస్తుండగా.. శనివారం ఉదయం ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలోకి వెళ్లనుంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరిగే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద, అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. అనంతరం ఇది దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించనుందని వివరించారు. దీని ప్రభావంవల్ల ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80–90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. అలాగే, శనివారం మధ్యాహ్నం 110 కి.మీ గరిష్ట వేగంతో కూడా గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. తుపాను ప్రభావంతో సముద్రం అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 5 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తుపాను కారణంగా శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయంటూ రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అదేవిధంగా శనివారం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో.. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సర్కారు అప్రమత్తం.. రంగంలోకి సహాయక బృందాలు తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా జిల్లాల్లో మోహరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ కే కన్నబాబు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల నుంచి జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రను మూడ్రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ డీఎం వీరనారాయణ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1,735 సహాయక బృందాలను ఏర్పాటుచేసింది. అలాగే, వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్లైన్లు ఏర్పాటుచేశారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే.. – విశాఖపట్నం రైల్వేస్టేషన్లో : 0891–2744619, 2746330, 2746344, 2746338 – విజయనగరం : 08922–221202, 221206, 8500358610 – శ్రీకాకుళం : 0892–286213, 286245, 8500359367 – నౌపడ జంక్షన్ : 08942–83520, 85959, 8500172878 – రాయగడ స్టేషన్ పరిధిలో : 06856–223400, 223500 ఇప్పటికే 95 రైళ్లను రద్దుచేసిన వాల్తేరు డివిజన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులు.. తాజాగా మరో 24 రైళ్లని రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. నౌకాదళం సంసిద్ధత తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం తూర్పు నావికాదళం సైతం సన్నద్ధంగా ఉంది. నాలుగు నౌకలు, నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంగా ఉంచింది. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం నుంచే కాకుండా రాష్ట్రంలో నేవల్ ఆఫీసర్స్ ఇన్ఛార్జ్, ఒడిశా అధికారులు తుపాను కదలికలు, దాని ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వంతొ నిరంతరం సమీక్షిస్తున్నారు. అలాగే.. ముందస్తు సహాయక చర్యల్లో భాగంగా 13 వరద సహాయక బృందాలను, నాలుగు డైవింగ్ బృందాలను, ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంచేసినట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షాలు తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వర్షాలు ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం తుపాను నష్టనివారణ చర్యలు చేపట్టింది. కలెక్టర్, జేసీలు తీరప్రాంత గ్రామాల్లో తిష్టవేశారు. శ్రీకాకుళంలో ప్రత్యేకాధికారి హెచ్. అరుణ్‌కుమార్, కలెక్టర్ శ్రీకేష్ బి. లాఠకర్లతో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు తీరప్రాంత గ్రామాల్లో పర్యటించారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో కెరటాలు తీరాన్ని ముక్కలు చేశాయి. ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన జియోట్యూబ్ రక్షణ గోడను సైతం ఛిన్నాభిన్నం చేశాయి. కెరటాలు దూసుకువచ్చి మత్స్యకారుల ఇళ్లపై విరుచుకుపడ్డాయి. మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. -
Cyclone Jawad: సహాయక చర్యల్లో ఏ లోపం ఉండకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు నేపథ్యంలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్ వెంటనే జవాద్ తుపాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరిత కూడా ఇందులో పాల్గొన్నారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. ►ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలి. ►సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ►సహాయ శిబిరాల్లో ఆహారం నాణ్యత చాలా ముఖ్యం. మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ పరిశుభ్రంగా ఉండాలి. ►అన్ని జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలి. మరోసారి అన్ని చోట్ల పరిస్థితులను సమీక్షించండి. అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి. ►ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ► చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించండి. ఎక్కడైనా గండ్లు, బలహీనంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జల వనరుల శాఖ అధికారుల దృష్టికి తెచ్చి అత్యవసర మరమ్మతులు చేపట్టండి. ►ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్ ముప్పు లేనప్పటికీ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. పూర్తిస్థాయిలో అప్రమత్తం: సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ తుపాన్ నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ చెప్పారు. ఇప్పటికే 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 6 కోస్ట్‌గార్డ్ టీమ్‌లు, 10 మెరైన్ పోలీస్ బృందాలు, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 18 ఫైర్ సర్వీస్ టీమ్‌లను ఉత్తరాంధ్ర జిల్లాలలో మోహరించినట్లు తెలిపారు. 115 జేసీబీలతో పాటు 115 టిప్పర్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. 232 నీటి ట్యాంకర్లు, 295 డీజిల్ జనరేటర్లు, 46,322 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,018 మెట్రిక్ టన్నుల పప్పులు, 41,032 లీటర్ల వంట నూనె, 391 టన్నుల పంచదారను ఆయా జిల్లాలకు పంపించామని వెల్లడించారు. వైద్య బృందాలు, అవసరమైన ఔషధాలను తరలించడంతోపాటు లోతట్టు ప్రాంతాలకు చెందిన 54 వేల కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కోన శశిధర్, పౌర సరఫరాల కమిషనర్ ఎం.గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్ నారాయణ్ గుప్తా, అదనపు డీజీ ఎ.రవిశంకర్ అయ్యన్నార్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. -
జవాద్ తుపాన్: ఏపీ ప్రజలకు అధికారులు కీలక సూచన
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖపట్నానికి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. చదవండి: AP Rain Alert: బలపడిన వాయుగుండం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) విద్యుత్ వినియోగదారులకు అప్రమత్తం చేసింది. జవాద్ తుఫాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని ఏపిఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేయాలని పేర్కొంది. చదవండి: Cyclone Jawad: బలపడిన వాయుగుండం.. సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు తుఫాన్ ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం. 1912, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని ఏఎండీ కె.సంతోషరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు.. ► విశాఖపట్నం కార్పోరేట్ ఆఫీసు- 9440816373 / 8331018762 ► శ్రీకాకుళం- 9490612633 ► విజయనగరం-9490610102 ► విశాఖపట్నం-7382299975 ► తూర్పుగోదావరి-7382299960 ► పశ్చిమగోదావరి-9440902926 -
బలపడిన వాయుగుండం.. సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడనుంది. ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సూచించాయి. చదవండి: (PRC CM Jagan: పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన) 5వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని కోరాయి. సాయంత్రానికి ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. అది మరింత బలపడి, తుపానుగా మారి.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుందని తెలిపింది. తుపానును ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలను అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సమయం గడుస్తున్న కొద్ది.. తుపాను తీరాన్ని తాకే ప్రాంతంపై స్పష్టత రానుంది. 24 ఎన్డీఆర్ఎఫ్, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ఓడీఆర్ఏఎఫ్ను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. -
తుపాను గండం: అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాన్ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మూడు షిఫ్ట్‌ల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలన్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల డీఎంహెచ్వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. -
Cyclone Jawad: బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను కారణంగా 95 రైళ్లు రద్దు గురు, శుక్ర, శనివారాల్లో 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్ధా డివిజన్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.