CM Jagan Video Conference With District Collectors Over Cyclone Jawad Affected - Sakshi
Sakshi News home page

Cyclone Jawad: సహాయక చర్యల్లో ఏ లోపం ఉండకూడదు: సీఎం జగన్‌

Published Fri, Dec 3 2021 8:23 PM | Last Updated on Sat, Dec 4 2021 8:32 AM

CM Jagan Video Conference On Cyclone Jawad Affected District collectors - Sakshi

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రకు తుపాన్‌ ముప్పు నేపథ్యంలో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఈ విషయంలో ఎటువంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్‌ వెంటనే జవాద్‌ తుపాన్‌ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సుచరిత కూడా ఇందులో పాల్గొన్నారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆ వివరాలివీ..
ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలి.
సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు. జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
సహాయ శిబిరాల్లో ఆహారం నాణ్యత చాలా ముఖ్యం. మంచినీరు, టాయిలెట్లు.. ప్రతి ఒక్కటీ పరిశుభ్రంగా ఉండాలి. 
అన్ని జిల్లాలలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉండాలి. మరోసారి అన్ని చోట్ల పరిస్థితులను సమీక్షించండి. అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి.
ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
 చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టల పరిస్థితి ఎలా ఉందో పరిశీలించండి. ఎక్కడైనా గండ్లు, బలహీనంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జల వనరుల శాఖ అధికారుల దృష్టికి తెచ్చి అత్యవసర మరమ్మతులు చేపట్టండి.
ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్‌ ముప్పు లేనప్పటికీ అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి.

పూర్తిస్థాయిలో అప్రమత్తం: సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ
తుపాన్‌ నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ చెప్పారు. ఇప్పటికే 11 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 6 కోస్ట్‌గార్డ్‌ టీమ్‌లు, 10 మెరైన్‌ పోలీస్‌ బృందాలు, 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 18 ఫైర్‌ సర్వీస్‌ టీమ్‌లను ఉత్తరాంధ్ర జిల్లాలలో మోహరించినట్లు తెలిపారు. 115 జేసీబీలతో పాటు 115 టిప్పర్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. 232 నీటి ట్యాంకర్లు, 295 డీజిల్‌ జనరేటర్లు, 46,322 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 1,018 మెట్రిక్‌ టన్నుల పప్పులు, 41,032 లీటర్ల వంట నూనె, 391 టన్నుల పంచదారను ఆయా జిల్లాలకు పంపించామని వెల్లడించారు.

వైద్య బృందాలు, అవసరమైన ఔషధాలను తరలించడంతోపాటు లోతట్టు ప్రాంతాలకు చెందిన 54 వేల కుటుంబాలను సహాయ శిబిరాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్ర«ధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ కోన శశిధర్, పౌర సరఫరాల కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌ నారాయణ్‌ గుప్తా, అదనపు డీజీ ఎ.రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు సమీక్షకు హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement