Teleconference
-
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, అమరావతి: అర్హత ఉండి ఏవైనా చిన్నచిన్న కారణాల వల్ల సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందని వారికి ప్రయోజనం చేకూర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు పార్టీ కో–ఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇన్చార్జి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని గుర్తుచేశారు. జూలై 1వ తేదీ నుంచి మండలస్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా పాల్గొనేలా చూడాలని కోరారు. ప్రజలందరిని ఈ శిబిరాలకు ఆహ్వానించి సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగనన్న సురక్ష క్యాంపు ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సురక్ష కార్యక్రమంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని ప్రజలు చెబితే.. సీఎంతో వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి ‘థాంక్యూ జగనన్న‘ అని టైప్‌చేసి 9052690526 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించేలా చూడాలని కోరారు. పార్టీ కమిటీల ప్రతిపాదనలను జూలై 3వ తేదీలోగా పంపాలని కోరారు. అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీని మరింతగా బలోపేతం చేసుకోగలమన్నారు. ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని, మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను పంపాలని కోరారు. అలాగే పార్టీ నగర కమిటీల ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని ఆయన సూచించారు. -
అకాల వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ టెలి కాన్ఫరెన్స్
-
అకాల వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ టెలీ కాన్ఫరెన్స్
సాక్షి, తాడేపల్లి: అకాల వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, తదనంతర పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు. విశాఖపట్నం పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయన సీఎంఓ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని తీసుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు హార్వెస్టింగ్ చేసి ఉన్న ధాన్యం ఎక్కడా ఉన్నా.. వర్షాల బారి నుంచి వాటిని కాపాడ్డానికి చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: బాలినేని నిర్ణయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి -
AP: ఖర్చుకు వెనకాడొద్దు
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల అనంతపురం జిల్లాలో విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలను పరిహారంగా అందజేశారని, అయితే మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. విద్యుత్ సంస్థల బలోపేతానికి ఇప్పటికే రూ.40వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ భద్రత కల్పించే విషయంలో ఎంత వ్యయం చేసేందుకైనా వెనుకాడదని పెద్దిరెడ్డి స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ భద్రతకు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను అధ్యయనంచేసి తగిన కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. ప్రమాదాల నివారణకు సూచనలు.. ఇక విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన క ల్పించేందుకు విద్యుత్ సబ్స్టేషన్ల కమిటీల సమావేశాలు నిర్వహించడంతోపాటు పత్రికలు, వివిధ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ వంటి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే.. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. ► క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజలను విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే వివిధ అంశాలపై శిక్షణనివ్వాలి. ► విద్యుత్ ప్రమాదాలకు ఆస్కారం ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి. ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది, కాంట్రాక్టు ఏజెన్సీలు వీటిని కచ్చితంగా పాటించాలి. ► విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఈ పనులు నిర్వహించే చోట ప్రమాదాల నివారణకు లోకల్ ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి. ► హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమీపంలో గృహాలు, ఇతర నిర్మాణాలను చేపట్టకూడదు. ► ఏడువేల మంది ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్ భద్రతా అంశాలపై శిక్షణనిచ్చి వారి సేవలను వినియోగించుకోవాలి. ► 1912 టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించాలి. ఫిర్యాదులను డిస్కంలు పరిష్కరించాలి. ► ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి. శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె. సంతోషరావు, జె. పద్మ జనార్థనరెడ్డి, ఏపీఎస్ఈసీఎం సీఈఓ ఎ. చంద్రశేఖరరెడ్డి, వివిధ జిల్లాల నుంచి అధికారులు పాల్గొన్నారు. -
రూపాయి బకాయి కూడా లేదు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లతో గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్ల చొప్పున విడుదల చేసిందని, ఈ నెల మొత్తం కూడా ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఈ లెక్కన రూ.10 వేల కోట్లు గ్రామ పంచాయతీలకు అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. గ్రామ పంచాయతీలకు రూపాయి కూడా పెండింగ్‌లో లేదన్నారు. ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమం ఈ నెల 3 నుంచి 17 వరకు జరుగుతుందని.. ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా పాల్గొనాలని కేటీఆర్ స్పష్టం చేశారు. బిల్లులు ఎక్కడా పెండింగ్‌లో లేవని, సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అబద్ధమని చెప్పారు. ఇప్పటివరకు 1,39,152 చెక్కుల ద్వారా రూ.696.71 కోట్లను ఆర్థికశాఖ క్లియర్ చేసిందని.. మిగతా పెండింగ్ చెక్కులేవైనా ఉంటే వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రెండు నెలలుగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.1,400 కోట్లు విడుదల చేయలేదని.. వెంటనే అవి విడుదల చేసేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల బకా>యిలు విడుదలయ్యేలా పోరాడాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులూ ఇవ్వకుండా.. కొత్త సాఫ్ట్వేర్ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. బండి సంజయ్ దీక్ష ఎందుకో చెప్పాలి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్ష ఎందుకు? ఎవరి మీద? చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రం మీదా? కేంద్రం ఇవ్వకపోయినా ఇచ్చిన రాష్ట్రం మీదా? అన్నది చెప్పిన తరువాతే ఆయన దీక్ష చేయాలన్నారు. -
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌న్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాసంగిలో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలపై చర్చించారు. కొనుగోలు కేంద్రాలు తగ్గించొద్దు: ‘సీఎం సూచనల మేరకు ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పా టు చేయాలి. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలి. సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలి. కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులతో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ఎక్కడెక్కడ ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో నివేదిక రూపొందించుకోవాలి..’అని సీఎస్ సూచించారు. రోజుకు నాలుగైదు కేంద్రాల తనిఖీ: ‘జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి. గత సంవత్సరం యాసంగి సీజన్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల సంఖ్యకు తగ్గకుండా ఈసారి కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి కేంద్రానికి ఓ అధికారిని నియమించి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి. ముఖ్యంగా గన్ని బ్యాగుల సేకరణపై దష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి తగు పర్యవేక్షణ జరపాలి. రైతుకు కనీస మద్దతు ధర రూ.1,960 లభిం చేలా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి..’అని ఆదేశించారు. ఏరోజుకారోజు నివేదికలు:‘కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని వెం టనే రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం సేకరణపై ఏరోజు కారోజు నివేదికలు పంపించాలి. జిల్లాల్లో వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి. అందు కోసం పోలీసు, రవాణా తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవాలి..’అని సీఎస్ చెప్పారు. హైదరాబాద్, కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయా లని సోమేశ్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో వ్యవసా య శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచా యి తీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలీకాన్ఫరెన్స్
-
పేదలకు లబ్ధి చేకూర్చడానికే ఓటీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు లబ్ధి కలగకుండా అడ్డుకోవాలనే కుట్రతోనే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్లో మీడియా అపోహలు సృష్టిస్తున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మునిసిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, నగరాలలో భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు పొంది నిర్మించుకున్న ఇళ్లకు జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. పేదలకు సంపూర్ణ ఆస్తి హక్కు కల్పించే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నిస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలోనూ గృహ రుణం తీసుకున్న లబ్ధిదారులు వారి సమస్యలను ఏకరవు పెట్టుకున్నారని గుర్తు చేశారు. రుణాన్ని తీర్చినప్పటికి డీ–ఫారం పట్టాల వల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి, కుటుంబ సభ్యుల పేరిట బదిలీ చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. గృహం విలువ పెరిగినప్పటికీ విక్రయించుకోవాలంటే తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని వాపోయిన విషయాలను గుర్తు చేశారు. అసైన్డ్ భూముల విలువ పెరిగినప్పటికీ ఆ భూముల బదలాయింపులో ఉన్న సమస్యల కారణంగా లబ్ధిదారులు వాటిని అనుభవించలేకపోతున్నారని పరిశీలనలో వెల్లడైందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములు కేటాయించిన పదేళ్ల తర్వాత లబ్ధిదారుల సొంతమయ్యేలా చట్ట సవరణ చేశామన్నారు. ఈ క్రమంలోనే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి రూపకల్పన చేశామని వివరించారు. రుణ భారం వదిలించి శాశ్వత హక్కు కల్పించేందుకు.. పేదలకు వారి గృహాలపై శాశ్వత హక్కు కల్పించాలనే సదుద్దేశంతో ఆ గృహాలపై తీసుకున్న రుణంలో అసలు, వడ్డీ ఎంత ఉన్నప్పటికీ.. వాటిని నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించామని వివరించారు. వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పేదలను ప్రభుత్వం దోచుకుంటోందని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ పథకం వల్ల గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన 50 లక్షల గృహాలు, ఇటీవల సీఎం వైఎస్ జగన్ మంజూరు చేసిన 30 లక్షల ఇళ్లు వెరసి దాదాపు 80 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరితే ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవనే భయంతోనే ఓటీఎస్ పథకంపై విష ప్రచారానికి ఒడిగట్టారన్నారు. ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను జాగృతం చేయాలని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సజ్జల పిలుపునిచ్చారు. -
తుపాను గండం: అధికారులతో మంత్రి ఆళ్ల నాని టెలికాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాన్ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మూడు షిఫ్ట్‌ల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలన్నారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీ కాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల డీఎంహెచ్వోలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. -
AP: శరవేగంగా విద్యుత్ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆయన ఆదివారం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు. విద్యుత్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదని, వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్ధనరెడ్డి, సంతోషరావులతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ టెలీకాన్ఫరెన్స్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షల్లో ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుపతి, నెల్లూరు ఈహెచ్‌టీ సబ్స్టేషన్లు, మరో 19 సబ్స్టేషన్లలో నీరుందని చెప్పారు. దీనివల్ల 98 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయని తెలిపారు. వీటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం విద్యుత్ పునరుద్ధరణకు తీసుకున్న చర్యల్ని ఇంధనశాఖ కార్యదర్శి మంత్రి బాలినేనికి వివరించారు. వరదలు, తుపానులు, భారీ ఈదురుగాలులు వంటి విపత్తుల్లో విద్యుత్ సమస్యల తీవ్రతను తగ్గించడానికి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సూచించారు. రూ.30 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌కు ప్రతిపాదనలు తిరుపతిలో ప్రస్తుతం ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్ స్థానంలో కొత్తగా రూ.30 కోట్లతో అత్యాధునిక గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్, తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాలకు ప్రతిపాదనలివ్వాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళం వద్ద 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థల వివాదంపై జిల్లా అధికారులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా వరద నీటిలోనే ఉన్న తిరుపతి 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. నాలుగడుగుల నీరుండటంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించలేకపోయామని, అలిపిరి, రేణిగుంట సబ్స్టేషన్ల నుంచి తిరుపతి నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రతాప్‌కుమార్ చెప్పారు. ఎస్జీఎస్ కళాశాల పక్కన గోడ లేకపోవటం వల్లే వరద నీరు సబ్‌స్టేషన్‌ను దిగ్బంధించినట్లు గుర్తించారు. వెంటనే గోడ నిర్మించాలని, ముందువైపు నీళ్లు రాకుండా ర్యాంపు ఏర్పాటు చేయాలని సివిల్ ఎస్ఈ నరసింహకుమార్‌ను డైరెక్టర్ ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నలుగురి ప్రాణాలను కాపాడిన నెల్లూరు జిల్లా విద్యుత్ సిబ్బందిని ఆయన అభినందించారు. ట్రాన్స్‌కో కడప జోన్ సీఈ శ్రీరాములు, ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ ఎస్ఈ చలపతి, ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
Harish Rao: గోలీలు ఇస్తున్నరా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులు/బాలింతలకు అందుతున్న వైద్య సేవల తీరుతెన్నుల గురించి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఫోన్ చేసి వారినే అడిగి తెలుసుకోనున్నారు. వైద్యులు నెలనెలా చెకప్‌లు చేస్తున్నారా? మందులు ఏ మేరకు ఇస్తున్నారు? ఆసుపత్రుల నిర్వహణలో లోపాలు ఏమైనా ఉంటున్నాయా? కేసీఆర్ కిట్ పథకం కింద అందిస్తున్న ఆర్థిక సాయం అందిందా? వంటి ప్రశ్నలు వేయనున్నారు. రోజుకో ఉమ్మడి జిల్లా చొప్పున పలువురితో టెలికాన్ఫరెన్స్ చేపట్టనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు చేసుకున్న గర్భిణుల ఫోన్ నంబర్ల ప్రకారం టెలికాన్ఫరెన్స్‌లోకి తీసుకోనున్నట్లు చెప్పారు. గర్భిణులు వారి ఇళ్ల నుంచే మంత్రితో మాట్లాడవచ్చని వివరించారు. రెండు, మూడు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. కేసీఆర్ కిట్‌లో మార్పులు చేయాలా?..: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే లక్ష్యంతో అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకం గురించి మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌లో ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు. 15 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందరికీ అందుతోందో లేదో తెలుసుకోనున్నారు. అలాగే మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ. 13 వేల చొప్పున అందిస్తున్న ఆర్థిక సాయం ఏ మేరకు అందుతోందన్న విషయాన్నీ ఆయన తెలుసుకోనున్నారు. ఈ పథకం కింద గర్భిణులు/బాలింతలకు వివిధ దశల్లో రూ. 1,073.94 కోట్ల ఆర్థిక సాయాన్ని, 10.80 లక్షల కిట్లను ఇప్పటివరకు అందించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు మంత్రికి నివేదించాయి. ఈ నేపథ్యంలో ఈ పథకంపై లబ్ధిదారులు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు? కేసీఆర్ కిట్‌లో మార్పుచేర్పులు చేయాలా? అని లబ్ధిదారులను ఆయన అడిగి తెలుసుకొనే అవకాశముంది. అలాగే ఆర్థిక సాయం అందని వారికి తక్షణమే విడుదల చేయొచ్చని తెలిసింది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని లేబర్ రూమ్‌లు పరిశుభ్రంగా ఉండట్లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మంత్రి హరీశ్ అధికారులను వివరణ కోరే అవకాశముంది. -
ప్రతిపల్లెలో పార్టీ జెండా ఎగరాలి
సాక్షి, హైదరాబాద్: పార్టీ జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించడంతోపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల స్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియనూ ప్రారంభించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు పార్టీ జెండా కార్యక్రమం సన్నాహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గంతోపాటు జిల్లా, మండల, గ్రామ పంచాయతీస్థాయి ప్రజా ప్రతినిధులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటులో పాటించాల్సిన మార్గదర్శకాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జెండా పండుగకు గ్రామ, వార్డు పరిధిలో సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్త హాజరయ్యేలా సమాచారం అందించాలన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యనేతలు హాజరవుతున్నందున స్థానిక నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాలు, వార్డుల్లో కార్యక్రమం జరిగేలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలని ఆదేశించారు. నెలాఖరులోగా రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 2 నుంచి 12 వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులకు కమిటీలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని, 20 తర్వాత జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలను స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి కేసీఆర్ ఖరారు చేస్తారన్నారు. సెప్టెంబర్ ఆఖరులోగా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తారని చెప్పారు. వివిధ సాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేటీఆర్ పార్టీ నేతలకు వివరించారు. పార్టీ క్రియాశీలక సభ్యులకే కమిటీల్లో చోటు కల్పిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కచ్చితంగా 51 శాతం ఉండాలని, లేనిపక్షంలో కమిటీలు చెల్లుబాటుకావని స్పష్టం చేశారు. గ్రామ, మండల స్థాయి వరకు సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలంటూ వాటి ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మండల కమిటీల ఏర్పాటు తర్వాతే గ్రామస్థాయిలో సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్ని కమిటీల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. నగర కమిటీల కోసం త్వరలో ప్రత్యేక సమావేశం హైదరాబాద్‌లో ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకుని సంస్థాగత కమిటీల ఏర్పాటుకు సంబంధించి త్వరలో నగర టీఆర్ఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. నగరంలోని 400కు పైగా బస్తీలతో పాటు 150 డివిజన్లకు కూడా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, రాష్ట్ర నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఉండే అవకాశముందని పార్టీ నేతలకు కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. -
త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి బొత్స
అమరావతి: టిడ్కో, మెప్మా, బ్యాంక్ సమన్వయకర్తలతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం టెలికాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా, మౌళిక వసతుల కల్పన పనులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పనుల పురోగతిపై ప్రతివారం సమీక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు చేసే ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. -
సుప్రీంలో ‘హైబ్రిడ్’ విచారణ
న్యూఢిల్లీ: గతేడాది మార్చి నుంచి ఆన్లైన్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటున్న సుప్రీంకోర్టు ఇకపై హైబ్రిడ్ విధానంలో వాదనలు విననుంది. ఈ హైబ్రిడ్ పద్ధతి ఇదే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి సాధారణ మార్గదర్శకాలను (ఎస్ఓపీ) సుప్రీంకోర్టు శనివారం విడుదల చేసింది. ‘ప్రయోగాత్మకంగా, పైలట్ ప్రాజెక్టు కింద హైబ్రిడ్ విచారణ జరుగుతుంది. వీటిలో తుది వాదనలు, సాధారణ వాదనలు.. మంగళ, బుధ, గురు వారాల్లో జరుగుతాయి. ఏ పద్ధతిలో విచారణ జరగాలన్న విషయాన్ని ధర్మాసనమే నిర్ణయిస్తుంది. ఇరు వైపు కక్షిదారుల్లో ఉన్న సంఖ్యను బట్టి, కోర్టు హాలు సైజును బట్టి ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుంది’ అంటూ మార్గదర్శకాల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక సోమ, శుక్రవారాల్లో కేవలం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారణ జరుగుతుంది. ఏమిటీ హైబ్రిడ్ పద్ధతి.. విచారణ సమయంలో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తుల సంఖ్య కోవిడ్ నిబంధనల ప్రకారం, గది సైజును మించి ఎక్కువగా ఉంటే.. అప్పుడు ధర్మాసనం హైబ్రిడ్ పద్ధతిలో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం కోర్టు గదిలో కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రత్యక్ష విచారణ జరిపేలా పార్టీల్లో ఒకరు ప్రత్యక్షంగా, మరొకరు టెలీ కాన్ఫరెన్స్‌లో ఉంటారు. ఇదే ‘హైబ్రిడ్ విధానం’ అని సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇదంతా ధర్మాసనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ఎక్కువ పార్టీలు ఉంటే అప్పుడు ఒక్కో పార్టీకి ఒక్క అడ్వొకేట్ మాత్రమే విచారణలో పాల్గొంటారని తెలిపింది. ఇతర నియమాలు కూడా.. హైబ్రిడ్ పద్ధతిలో కూడా కరోనా నిబంధనలు తప్పనిసరి. విచారణల్లో పాల్గొనే వారికి ప్రాక్సిమిటీ/లాంగ్‌టర్మ్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డులు నిర్ణీత కాలవ్యవధి అనుమతి మాత్రమే కలిగి ఉంటాయి. వాదనల్లో పాల్గొనే ఇరు పార్టీలు ఆన్లైన్ ద్వారా విచారణ జరిపేందుకు అంగీకరిస్తే ధర్మాసనం కూడా దాన్ని ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తుంది. విచారణకు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే పార్టీలను కోర్టు హాల్లోకి అనుమతిస్తారు. -
నివర్ తుపాను: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: నివర్ తుపాను ప్రభావిత జిల్లాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శ౦కర్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవసరమైన తాగునీరు, పారిశుద్ద్యం పనులు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ఆహారం, వాటర్ ఫ్యాకెట్లు తక్షణమే సరాఫరా చేయాలన్నారు. ఓహెచ్ఎస్, చేతి పంపులు శుభ్రం చేయించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేసి పంపాలని గిరిజా శ౦కర్ ఆదేశించారు. (చదవండి: తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష) నివర్ తుపాను రాగల ఆరు గంటల్లో తీవ్ర వాయు గుండం.. ఆ తదుపరి ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. తుపాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ప్రభావిత ప్రాంత ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివర్ తుపాన్: ఏపీలో వర్ష బీభత్సం..) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘కొరత లేదు.. సాకులు చెప్పొద్దు’
సాక్షి, సంగారెడ్డి: కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. కిట్లు లేవని సాకులు చెప్పొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,సర్పంచ్‌లతో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘జిల్లాకు అవసరమైన పీపీఈ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, హోం క్వారంటైన్ కిట్లు తెప్పించాం. ఎలాంటి కొరత లేదని’’ స్పష్టం చేశారు. ప్రతీ రోజు పీహెచ్ఎసీలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని..లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక దశలో కరోనాను గుర్తించకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని.. కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దని ఆయన సూచించారు. కరోనా బాధితులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం సరికాదని. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని.. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావొద్దని ప్రజలకు ఆయన సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారో.. అదే వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని వివరించారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ఎలాంటి ఆందోళన చెందకుండా పనిచేయాలని ఆయన సూచించారు. పాజిటివ్ కేసు ఒక్కటి వచ్చినా ప్రైమరీ కాంటాక్ట్ కింద అందరికీ టెస్టులు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా బారిన పడిన వారితో ప్రతీ రోజూ డాక్టర్లు, ఎఎన్ఎంలు మాట్లాడి.. వారిలో ఆత్మస్థైర్యం నింపాలని పేర్కొన్నారు. ‘‘కరోనా రాకుండా రోజూ వేడి నీళ్లు తాగాలి. ఆవిరి పట్టాలి. మాస్కులు తప్పకుండా ధరించాలి. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి వస్తే ఎవరూ అలక్ష్యం చేయకుండా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని’’ మంత్రి హరీశ్‌రావు సూచించారు. -
ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి: కన్నబాబు
సాక్షి, అమరావతి: పంటలకు గిట్టుబాటు ధరలపై సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు ఈ విషయంపై సమీక్షించారు. కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడిన కన్నబాబు, మంగళవారం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని అధికారులను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపిన ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏ రైతు ఇబ్బంది పడటానికి వీల్లేదని.. మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూడాలి అధికారులకు కన్నబాబు దిశానిర్దేశం చేశారు. ఇది చదవండి: రైతు చెంతకే వెళ్లి ధాన్యం కొనుగోలు -
పంటల తరలింపు బాధ్యత తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను గ్రామ కొనుగోలు కేంద్రాలకు తరలించడంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో జిల్లా, మండల గ్రామాల రైతుబంధు సమితి అధ్యక్షులు క్రియాశీలక పాత్ర నిర్వహించాలని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ కొనుగోలు కేంద్రంలో గోనెసంచులు, కాంటాలు, టార్పాలిన్ (తాడిపత్రి)లను తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాన్యం తీసుకుని వచ్చే రైతులు సామాజిక దూరం పాటించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, శానిటైజర్లు, నీటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. వరి, మొక్కజొన్న కోత యంత్రాలు గ్రామాల్లోకి రావడానికి తమ అనుమతులను తీసుకోవడానికి రైతులకు సహాయ సహకారాలను అందించాలన్నారు. వెటర్నరీ మందుల దుకాణాలను, విత్తన, ఎరువుల పురుగు మందుల దుకాణాలను తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న పామాయిల్ ఉత్పత్తి కంపెనీని నడిచే విధంగా చూడాలన్నారు. రైతుబంధు సమితి సభ్యులు, తమ గ్రామాలలోని రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరోసా కలిగించాలన్నారు. -
‘లాక్డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించొద్దు’
సాక్షి, గుంటూరు: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు.మంగళవారం ఆయన కలెక్టర్.. రూరల్,అర్బన్ ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లాక్డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించవద్దని మంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోకుండా బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేయడంలో వెనకాడవద్దని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 14 చోట్ల క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌ను ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఆయా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీరంగనాథరాజు సూచించారు. (ఈశాన్య భారతానికి పాకిన కరోనా) -
టెన్త్ ప్రశ్నపత్రంలోనే బిట్ పేపర్
సాక్షి, అమరావతి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇకపై ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో సాధారణ ప్రశ్నలకు, బిట్ పేపర్‌కు వేర్వేరుగా పత్రాలు ఇచ్చేవారు. ఇక నుంచి ఒకే పత్రంలో సాధారణ ప్రశ్నలు, బిట్ ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. ఆరో తరగతి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్ష వరకు అనుసరించాల్సిన విధానం, పబ్లిక్ పరీక్షల విధానాన్ని ఇందులో పొందుపరిచింది. దీనిపై అన్ని జిల్లాల విద్యాధికారులతో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎస్సీఈఆర్టీ మంగళవారం ఇచ్చిన సర్క్యులర్‌లో ముఖ్యాంశాలు - టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు - ప్రీఫైనల్, పబ్లిక్ పరీక్షల్లో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది - ప్రస్తుతమున్న 11 పేపర్లు యథాతథంగా ఉంటాయి - ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, అన్ని నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులలో రెండేసి పేపర్లు ఉంటాయి - సెకండ్ లాంగ్వేజ్‌లో ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది - కాంపోజిట్ కోర్సు 1వ పేపర్ 70 మార్కులకు, 2వ పేపర్ 30 మార్కులకు ఉంటుంది - బిట్ పేపర్ ప్రత్యేకంగా ఉండదు. ఒకే పత్రంలో అన్ని కేటగిరీల ప్రశ్నలుంటాయి - ప్రతి పరీక్షకు 2.45 గంటల సమయం ఇస్తారు. (15 నిముషాలు ప్రశ్నపత్రం చదువుకోవడానికి, 2.30 గంటలు సమాధానాలు రాసేందుకు) - ఓరియంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్/ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష మాత్రం 3.15 గంటలు ఉంటుంది. - ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ 2వ పేపర్ 1.45 గంటలు ఉంటుంది - సెకండ్ లాంగ్వేజ్‌కు 3.15 గంటలు - వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ అందిస్తారు. - మార్కుల మెమోలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను సబ్జెక్టు వారీగా, పేపర్ల వారీగా పొందుపరుస్తారు. - ఆయా సబ్జెక్టుల్లో 1, 2వ పేపర్లలో వచ్చినవి కలిపి పాస్ మార్కులను నిర్ణయిస్తారు. పేపర్ల వారీగా పాస్‌మార్కులను పరిగణనలోకి తీసుకోరు. -
కరోనా వైరస్‌పై తెలంగాణ హై అలర్ట్..!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పల్మోనాలజిస్ట్‌లు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం ఏర్పాట్లు చేసినట్లు సూచించారు. రేపటి నుంచి గాంధీ మెడికల్ కాలేజ్‌లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు 30 మందికి కరోనా వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కొక్క పరీక్షకు 10 గంటల సమయం పడుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదన్నారు. (భారత్‌లో రెండో కరోనా కేసు..!) ఈ సందర్భంగా చైనా నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈటల రాజేందర్ కోరారు. ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్స అందించేందుకు అన్నివసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. మాస్క్‌లు, సానిటైజర్లు అదేవిధంగా సరిపోయేంత మంది సిబ్బందిని సిద్ధం చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను అమలుచేస్తున్నామని తెలిపారు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రజలు ఎంత మాత్రం భయపడొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. (జీజీహెచ్‌లో కరోనా కలకలం) -
సభ్యత్వ నమోదుపై కేటీఆర్ టెలికాన్పరెన్స్
-
ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ప్రతి సోమవారం స్పందనలో వచ్చే ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే. అర్జీ ఇచ్చినప్పుడే అర్జీదారునికి రశీదు ఇవ్వాలి. ఆ సమస్యను ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తారన్నది కూడా రశీదులో నిర్దిష్టంగా పేర్కొనాలి. ఆలోగా సమస్యను కచ్చితంగా పరిష్కరించాల్సిందే’ అని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయం నుంచి ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే.. అప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలం.. మాపై ప్రజలు అచంచలమైన విశ్వాసం ఉంచి అఖండ విజయాన్ని అందించారు. వారి ఆశలు నెరవేర్చి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని చెప్పారు. ‘రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అర్జీల ద్వారా వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే కాకుండా.. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయో విశ్లేషించి, వాటికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. శాశ్వతంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కార్యాచారణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అర్జీల్లో చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రహదారులు, తాగునీటి సమస్య వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తాం. ఆ అధికారిని మీరు సంప్రదించి త్వరితగతిన పనులు జరిగేలా చూడండి’ అని సీఎం ఆదేశించారు. ఆన్లైన్లో పరిశీలన మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి అర్జీని కంప్యూటరీకరించి, ఆన్లైన్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మండల స్థాయి మొదలు తాను నిర్వహించే ప్రజాదర్బార్‌లో వచ్చే అర్జీల వరకు అన్నింటినీ ఆన్లైన్ వెబ్ పోర్టల్‌లో పొందుపరచాలని, నిర్దిష్ట గడువులోగా ఆ సమస్యలు పరిష్కరించారో లేదో తనిఖీ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆన్లైన్లో వీటిని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి పర్యటనలకు, పల్లె నిద్రకు వెళ్లినప్పుడు ‘స్పందన’లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. రచ్చబండ, ఇతర అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు తానూ తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు. దీని వల్ల కింది స్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పని చేస్తారని, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రతి మంగళశారం ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానన్నారు. చిన్న చిన్న సమస్యలను 72 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇంట్లో నుంచే సమస్య నమోదు భవిష్యత్‌లో ప్రజలు ఇంట్లో నుంచే తమ సమస్యను వెబ్ పోర్టల్‌లో నమోదు చేసేలా ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు వెబ్ పోర్టల్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు తెలిసింది. -
ఆ నలుగురు ఎంపీలది అవకాశవాదం
సాక్షి, అమరావతి: బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులది అవకాశవాదమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీలో చేరడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని పార్టీ మారిన నేతలు చెప్పటం అవకాశవాదానికి నిదర్శనమని బాబు ధ్వజమెత్తారు. పార్టీ మారిన నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుందన్నారు. నలుగురు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీ మైండ్ గేమ్‌కు పాల్పడుతోందన్నారు. తన అంగీకారంతోనే ఆ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారనే ప్రచారాన్ని ఖండించాలని, లేకపోతే ప్రజల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీపీ నేతలకు సూచించారు. నేతలు, కార్యకర్తలంతా నిబ్బరంగా ఉండాలని, రాజకీయ దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వారిపై అనర్హత వేటు పడే వరకూ పోరాటం చంద్రబాబు నివాసంలో టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. నలుగురు ఎంపీలు స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారని, టీడీపీ రాజ్యసభపక్షాన్ని బీజేపీలో విలీనం చేయటం చట్ట ప్రకారం చెల్లదని, ఇది పార్టీ ఫిరాయింపుల కిందకు వస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన నేతలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడే వరకూ పోరాడాలని నిర్ణయించారు. చంద్రబాబు రెండు, మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి, క్యాడర్‌కు ధైర్యం చెప్పాలని పలువురు నాయకులు కోరారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా సమాచారం కూడా ఇవ్వకుండా ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం సరికాదని అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెళ్లడం సరైంద కాదని చెప్పారు. కేసుల మాఫీ కోసమే బీజేపీలోకి: వర్ల రామయ్య తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కేసుల మాఫీ కోసమే బీజేపీలో చేరారని ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. నైతికత ఉంటే వారు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లాలన్నారు. సుజనా చౌదరిపై ఆర్థికపరమైన కేసులున్నాయన్నారు. వారు బీజేపీలో చేరడం వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు. నన్ను బెదిరిస్తున్నారు: బుద్ధా వెంకన్న టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు ఫిరాయించిన తర్వాత మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనను బెదిరించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సుజనా చౌదరి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి హెచ్చరించారని, కేసులు పెట్టించి బోల్టులు తిప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. తనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం డీజీపీని కలుస్తానని అన్నారు. టీడీపీపీ విలీనం చెల్లదు: ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయడం నిబంధనల ప్రకారం చెల్లదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఇసుక విధానంపై కలెక్టర్ శనివారం తన చాంబర్ నుంచి తహసీల్దార్లు, ఈవోఆర్డీలు తదితరులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా తరలించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇందులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు. ఇసుక విధానం అమలుకు జిల్లా స్థాయిలో తాను చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారని, డ్వామా పీడీ, పంచాయతీ రాజ్ ఎస్ఈ, డీపీవో, జెడ్పీ సీఈవోలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దారు ఆధ్వర్యంలో కమిటీ ఉంటుందన్నారు. ప్రతి ఇసుక రీచ్‌కు డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఈవోఆర్డీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలన్నారు. ఏ రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలినా ఆ ఇన్‌చార్జ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రీచ్‌లకు ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక తరలించుకోవాలంటే విధిగా ప్రొసీడింగ్స్‌తో పాటు వాహనాలనంబ ర్లు, ఎన్ని ట్రిప్పుల ఇసుక అవసరం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకోవాలంటే పక్కాగృ హం మంజూరు పత్రం ఉండాలన్నారు. ప్రయివేటు ఇళ్ల నిర్మాణాలకైతే పంచాయతీ సెక్రటరీల ధ్రువీకరణ అవసరమన్నారు. సమావేశంలో జా యింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెడ్పీ సీఈవో విశ్వేశ్వరనాయుడు, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించండి డయల్ యువర్ కలెక్టర్, మీ కోసంలో వచ్చిన ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది తమ సమస్యలను ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కమిషనర్‌కు అభినందన నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డిని కలెక్టర్ సత్యనారాయణ అభినందించారు. నగరంలో అంగన్వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినందుకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ–2 సుబ్బారెడ్డి, డీఆర్వో శశీదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీ దుష్ప్రచారం.. అధైర్యమొద్దు: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలకు టీడీపీ ఎంపీలంతా విధిగా హాజరుకావలని, అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవిశ్వాసం నోటీసులు అనేక పార్టీలు ఇచ్చాయని, టీడీపీ, వైఎస్ఆర్సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఎం కూడా నోటీసులు ఇచ్చాయని పేర్కొన్నారు. లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చ చేపట్టే అవకాశం ఉందని, లేదా ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చేపట్టవచ్చునని అన్నారు. అవిశ్వాసంపై చర్చను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయిలో వినిపించాలని, నాలుగేళ్లయినా విభజన చట్టంలోని 19అంశాలు అమలుచేయకపోవడాన్ని ప్రశ్నించాలని సూచించారు. పార్లమెంట్లో ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చకపోవడాన్ని నిలదీయాలన్నారు. అవిశ్వాసంపై చర్చ ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైనదని, ఈ సందర్భాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, సభావేదికగా ఐదుకోట్ల ఏపీ ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలని సూచించారు. ఈ విషయంలో కావాల్సిన సమాచారం మొత్తం ఎంపీలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎంపీలంతా ఈ రాత్రికే ఢిల్లీకి చేరుకోవాలి అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశమున్నందున మంగళవారం పసుపు చొక్కాలు, కండువాలతో టీడీపీ ఎంపీలు లోక్‌సభకు హాజరుకావాలని, ఈ రాత్రికే ఎంపీలంతా ఢిల్లీకి చేరుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇది రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదని, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం జాతీయస్థాయి అంశంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఒంటరి చేయాలనే బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తుందని, సోషల్ మీడియాలో బీజేపీ దుష్ప్రచారాన్ని అధికం చేసిందని, దీనిపై ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ నేతలకు సూచించారు. దీనివల్ల బీజేపీపైనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, టీడీపీపై మరింత సానుభూతి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. -
‘దక్షిణాది నాయకత్వంపై బీజేపీ కుట్ర’
అమరావతి : ప్రత్యేక హోదా ఒక్కటే తీసుకుని ప్రోత్సాహకాలను వదిలేయాలని వైఎస్సార్సీపీ చూస్తోందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం కూడా చంద్రబాబు టీడీపీ ఎంపీలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదాలో ప్రోత్సాహకాలు ఉండవని బీజేపీ అంటోంది. హోదా రాష్ట్రాలకు ఇచ్చిన ప్రోత్సాహకాలన్నీ ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌పై కుట్ర చేస్తున్నారు. దక్షిణాదిలో నాయకత్వం బలహీన పరచాలని చూస్తున్నారు. సమర్ధ నాయకత్వం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు.పోరాటంలో ఎవరూ వెనుకంజ వేయరాదు. అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోరాదు. ఎంపీలు సమన్వయంగా పనిచేయాలి. ఇది 5 కోట్ల ప్రజల సమస్య. ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈశాన్యరాష్ట్రాలకు కేంద్రం రూ.3 వేల కోట్లు విడుదల చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే నిధులలో కోత విధిస్తోంది. ఇది సరైన విధానం కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఎవరిమీద మనం కుట్రలు, కుతంత్రాలు చేయడంలేదు. తెలుగుదేశం పార్టీ బలపడితే రాష్ట్రానికి రాజకీయంగా మేలు జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేపట్టాం. తెలంగాణకు ఆదాయం ఎక్కువ, జనాభా తక్కువ. అందుకే తలసరి ఆదాయంలో చాలా ముందుంది. తలసరి ఆదాయంలో ఈ అంతరం పూడాలి. అందుకు తగిన తోడ్పాటు కేంద్రం అందించాల’ని కోరారు. -
ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై టీడీపీలో తర్జనభర్జన
అమరావతి: చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తర్జనభర్జన పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించలేకపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలో డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ సీనియర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులకు ఏం చేశామో చెప్పాలంటూ సీనియర్ నేతలకు సూచనలు ఇచ్చారు. అయితే ఎంపీ శివప్రసాద్ చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏమీ లేవని సీనియర్లు...సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దళితులకు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని సీనియర్లు తేల్చి చెప్పినా, శివప్రసాద్ వ్యాఖ్యలను ఖండించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచన చేయడం గమనార్హం. అంతేకాకుండా వ్యక్తిగత ఎజెండాతో శివప్రసాద్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రచారం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కనీసం స్కాలర్షిప్పుల్లో కోత పైనా చంద్రబాబు ఈ సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. -
పార్టీ సీనియర్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
అమరావతి : మంత్రివర్గ విస్తరణ అనంతరం జరుగుతున్న పరిణామాలతో పాటు, సొంత పార్టీ నేతల విమర్శలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారమిక్కడ పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. గత కొంతకాలంగా శివప్రసాధ్ అసంతృప్తిగా ఉన్నారని, దానికి భూ వ్యవహారమే కారణమని నేతలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు తెలుసని, లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్లను చేసిన ఘటన టీడీపీదే అని ... ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టి తనను లొంగదీసుకోవాలనుకోవడం సాధ్యం కాదని చంద్రబాబు వ్యాఖ్య్యానించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. హధీరాం మఠం భూములు కావాలని శివప్రసాద్ సిఫార్సు చేసినట్లు ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలతో ప్రస్తావించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. -
పార్టీ ప్రయోజనాలే ముఖ్యం: చంద్రబాబు
విజయవాడ: పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే సహించేది లేదని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మంత్రి వర్గ విస్తరణపై ఏదైనా ఉంటే తనతో నేరుగా చెప్పాలని ఆయన అన్నారు. సోమవారం ఉదయం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకన్ఫరెన్స్ నిర్వహించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు. మంత్రి వర్గంలో 26 మందికి మించి స్థానం కల్పించలేమన్నారు. అందువల్లఏ అన్ని ప్రాంతాల వారికి పాతినిధ్యం కల్పించాల్సి వచ్చిందన్నారు. కొందరికి అర్హత ఉన్నా ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే సహించనన్నారు. ప్రజలు బాగుండాలంటే పార్టీ కూడా బాగుండాలని అన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అమరావతి: వార్దా తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు, సిమెంటు, నగదు, రేషన్ సరకులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. తాను కూడా గల్ఫ్ పర్యటనను రద్దు చేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానన్నారు. -
'రాష్ట్రంలో ఉప్పు కొరత లేదు'
అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా ఉప్పు కొరత లేదని...కేవలం వ్యాపారులే కొరత సృష్టిస్తున్నారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. ఉప్పు కొరతపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో శనివారం మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప్పు, ఇతర నిత్యావసర వస్తువులకు కృత్రిమంగా కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప్పు కొరత ఉందనే వదంతులను నమ్మొద్దని, అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. -
కృష్ణా పుష్కరాలపై సీఎం సమీక్ష
విజయవాడ : కృష్ణా పుష్కరాల విధులకు ఐఏఎస్ అధికారులతోపాటు డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లతోపాటు సిబ్బంది హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం విజయవాడలో కృష్ణ పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అక్షయ ద్వారా టీటీడీ నిర్వహిస్తున్న భోజన ఏర్పాట్లపై నేడే ట్రయల్ రన్ నిర్వహించాలని ఉన్నతాధికారులకు తెలిపారు. -
ఇన్స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
నాగర్‌కర్నూల్‌రూరల్ : 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇన్స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ డీఈఓ రవీందర్ సూచించారు. శనివారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో సైన్స్ ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు రాష్ట్ర స్థాయినుంచి ‘ మనటీవీ ’ ద్వారా టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 3 వరకు ఇన్స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికయ్యేవారు భావితరాలకు మానవవనరులను ఉపయోగించుకునేలా సైన్స్ ప్రాజెక్టులను రూపొందించాలని, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు.కార్యక్రమంలో మండల విద్యాధికారి జయశ్రీ , వివిధ పాఠశాలల 35మంది సైన్స్ ఉపాధ్యాయులు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
'జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా రూపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజానీకం తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం 8వేల మందితో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో సర్ ఆర్థర్ కాటన్ మహశయుడు రుజువు చేశాడన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం వ్యతిరేకించినా కాటన్ లెక్క చేయకుండా గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా మార్చారని కొనియాడారు. సాంకేతికతే లేని ఆ రోజుల్లోనే గుర్రంపై తిరిగి కాటన్ జల వనరులను అభివృద్ధి చేసిన విషయం ప్రస్తావిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో ఇంకెంతో అభివృద్ధి సాధించవచ్చునని చెప్పారు. గ్రామకార్యదర్శి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎంపీటీసీ మెంబరు నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ఒక స్ఫూర్తితో పనిచేసి, రాష్ట్రం నుంచి కరవును శాశ్వతంగా పారదోలాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాడవాడలా చంద్రన్నబాట, ఇంటింటా ఇంకుడుగుంత, ప్రతి పొలంలో పంటకుంట తదితర కార్యక్రమాల ద్వారా ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. సకాలంలో వర్షాలు పడటం శుభసూచకమని, నేలపై పడిన ప్రతి వర్షపు చినుకు భూమిలో ఇంకేలా పంటకుంటలు, ఇంకుడు గుంతల తవ్వకం పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాలలో మండుటెండను కూడా లెక్కచేయకుండా పర్యటన పూర్తి చేశానన్నారు. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలలో కూడా త్వరలో పర్యటించి పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు. ఇప్పటివరకు మంజూరుచేసిన 5లక్షల పంటకుంటల తవ్వకాన్ని 50 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. చురుకుగా ఉన్న 3లక్షల శ్రమశక్తి సంఘాలు తలా 3 కుంటలు తవ్వితే 10లక్షల పంటకుంటల తవ్వకం లక్ష్యాన్ని సునాయసంగా నెరవేర్చుకోవచ్చునని చెప్పారు. 2015 మే నెలలో భూగర్భంలో 100 టీఎంసీలు నిల్వ ఉండటం రాష్ట్ర రైతాంగానికి సానుకూలాంశమని అన్నారు. ఈ ఏడాది ఆ నిల్వలు మరింత పెరిగేలా అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. విజయనగరం జిల్లాలో 1000 చెక్‌డ్యాములు నిర్మిస్తే కరవు అనేది శాశ్వతంగా కనుమరుగు అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. పంటకుంటలు, ఇంకుడుగుంతల తవ్వకం వల్ల నీటి సమస్య తొలగిపోతుందని అన్నారు. చెట్ల పెంపకం వల్ల పర్యావరణం మెరుగు పడుతుందంటూ, గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లి అడవులు పెంచాలని దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇంకుడు గుంతల తవ్వకం, మొక్కలు నాటడం యుద్ధ ప్రాతిపదికన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు గ్రామాలలో వ్యర్ధాల్ని కంపోస్టుగా మార్చి పొలాలలో సేంద్రీయ ఎరువుగా వినియోగించాలని చెప్పారు. రాష్ట్రంలో 10 క్లష్టర్లను తీసుకుని 'వేస్టు టు ఎనర్జీ' ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ద్వారా స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు రామాంజనేయులు, జవహర్‌రెడ్డి, శశిభూషణ్, ఇంకా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంపీటీసీలు, ఆయాశాఖల ఉద్యోగులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
'అక్రమాలు జరిగితే సహించవద్దు'
విజయవాడ: సంక్రాంతి చంద్రన్న కానుక పంపిణీలో అక్రమాలు జరిగితే సహించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం చంద్రబాబు.. 8 వేల మంది అధికారులు, ఉద్యోగులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతి కానుక సరుకుల్లో నాణ్యత లేకుంటే ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందని చంద్రబాబు అన్నారు. ఇది ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అధికారులకు సూచించారు. -
జిల్లాల కలెక్టర్లతో బాబు టెలికాన్ఫరెన్స్
విజయవాడ: భారీవర్షం తాకిడి వున్న నాలుగు జిల్లాల కలెక్టర్లతో, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున వెంటనే చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్, పునరుద్ధరణ చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రహదారుల పునరుద్ధరణ, చెరువులు, కుంటలువంటి జలాశయాల సంరక్షణ తక్షణం చూడాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. కరువు, వరద సహాయ నిధులు సకాలంలో అందేలా కేంద్రంతో సంప్రదింపులు జరిపే బాధ్యతను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి పుల్లారావుకు ఆయన అప్పగించారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో 3.27 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలలో ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించేలా ఎఫ్‌సీఐను ఆదేశించేలా కేంద్రంతో మాట్లాడాలని కంభంపాటి రామ్మోహనరావును ముఖ్యమంత్రి ఆదేశించారు. -
సీఎం తిరుపతి పర్యటన రద్దు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రద్దు అయింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు. బుధవారం తిరుపతిలో జరుగుతున్న స్విమ్స్ 6వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గోనాల్సి ఉంది. అనంతరం వర్షాల కారణంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించి, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పొల్గొనేందుకు తిరుపతి వెళ్లాల్సి ఉండగా వర్షాలు కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వర్షాలపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
విజయవాడ: రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు పక్కాగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే పలువురు మృతిచెందగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. -
పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎన్నిక నిర్వహించేందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలును విడుదల చేసిన విషం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు... పార్టీ నాయకులకు సూచనలు ఇచ్చారు. -
కొత్త పాఠ్యపుస్తకాలు, సీసీఈపై టీచర్లకు టెలీకాన్ఫరెన్స్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 2014-15 విద్యాసంవత్సరంలో అమలులోకి రానున్న కొత్త పాఠ్యపుస్తకాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డెరైక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించినట్లు డీఈఓ డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణీమోహన్, ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డిలతో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. డైట్ ప్రిన్సిపాల్ బీ విజయభాస్కర్, ఇ.సాల్మన్, షేక్ చాంద్‌బేగం, వి.రామ్మోహన్, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారు. సమావేశం వివరాలను డీఈఓ వెల్లడించారు. ఉపాధ్యాయులు ఈ నెల 20 నుంచి 30 వరకు ఆయా మండల కేంద్రాల్లో టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి. షెడ్యూలు ఇదీ... ఈ నెల 20న తెలుగు, 21న ఇంగ్లిష్, 22న గణితం, 23న ఫిజికల్ సైన్సు, 24న సాంఘికశాస్త్రం, 25న బయోలాజికల్ సైన్సు, 27న హిందీ ఆయా సబ్జెక్టుల హైస్కూలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే స్కూలు అసిస్టెంట్లు, కొత్త టెస్ట్‌బుక్స్, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని డీఈఓ కోరారు. ఈ నెల 28న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 29న ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 50 శాతం మంది 30న, మిగిలిన 50 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలు మూతపడకుండా విధిగా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఉదయం 9 గంటలకు సంబంధిత టెలీకాన్ఫరెన్స్ ప్రదేశాన్ని చేరుకోవాలని డీఈఓ కోరారు. టెలీకాన్ఫరెన్స్ కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్ వసతి కల్పించాల్సిందిగా ఎంఈఓలను ఆదేశించారు. -
అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
చెన్నూర్, న్యూస్‌లైన్ : రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మ య్య మండల స్థాయి అధికారులతో టె లికాన్ఫరెన్స్‌లో మాట్లాడి, నూతన ఐటీ ఆధారిత సేవల ను (ఐటీఈఎస్) సోమవారం నుంచి ప్రారంభించారు. స్థానిక తహశీల్దార్ కార్యాయలంలో సీఎంతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో అన్ని శా ఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత సీఎం చిత్తూరు జిల్లా కలిగిరి తహశీల్దార్‌తో మాట్లాడారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామా ఆర్టీవోతో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదులు విభాగానికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారా..? అని అడి గి తెలుసుకున్నారు. ఈ నూతన సాంకేతిక పరి జ్ఞానం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలు 1126 మం డలాలు 80 డివిజన్లలో అమలులోకి వచ్చిం దని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మండలాల తహశీల్దార్లతో మాట్లాడాల్సి ఉన్నా సమయభావంతో మాట్లాడలేకపోతున్నామన్నారు. గతంలో ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకునే వారని, కొత్త విధానంతో సీఎంతో సహా రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఈ విధానం ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ఎంపీడీవో వేముల మల్లేశం, కోటపల్లి తహశీల్దార్ ఆనంద్‌రావు, పీఆర్ ఏఈ భారత్, గృహ నిర్మా ణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఈజీ ఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఆందోళనలో అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం సమాచారాన్ని జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. విధు ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై సింహ స్వప్నంగా మారి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం నుంచి సైతం టెలీకాన్ఫరెన్స్ ప్రారంభం కావడంతో మండల స్థాయి అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారికి బాబు గాలం