సాక్షి, హైదరాబాద్: పార్టీ జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించడంతోపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల స్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియనూ ప్రారంభించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు పార్టీ జెండా కార్యక్రమం సన్నాహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గంతోపాటు జిల్లా, మండల, గ్రామ పంచాయతీస్థాయి ప్రజా ప్రతినిధులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటులో పాటించాల్సిన మార్గదర్శకాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
జెండా పండుగకు గ్రామ, వార్డు పరిధిలో సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్త హాజరయ్యేలా సమాచారం అందించాలన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యనేతలు హాజరవుతున్నందున స్థానిక నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాలు, వార్డుల్లో కార్యక్రమం జరిగేలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలని ఆదేశించారు.
నెలాఖరులోగా రాష్ట్ర కార్యవర్గం
ఈ నెల 2 నుంచి 12 వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులకు కమిటీలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. 12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని, 20 తర్వాత జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలను స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి కేసీఆర్ ఖరారు చేస్తారన్నారు. సెప్టెంబర్ ఆఖరులోగా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తారని చెప్పారు. వివిధ సాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేటీఆర్ పార్టీ నేతలకు వివరించారు. పార్టీ క్రియాశీలక సభ్యులకే కమిటీల్లో చోటు కల్పిస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కచ్చితంగా 51 శాతం ఉండాలని, లేనిపక్షంలో కమిటీలు చెల్లుబాటుకావని స్పష్టం చేశారు. గ్రామ, మండల స్థాయి వరకు సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలంటూ వాటి ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మండల కమిటీల ఏర్పాటు తర్వాతే గ్రామస్థాయిలో సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్ని కమిటీల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
నగర కమిటీల కోసం త్వరలో ప్రత్యేక సమావేశం
హైదరాబాద్‌లో ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకుని సంస్థాగత కమిటీల ఏర్పాటుకు సంబంధించి త్వరలో నగర టీఆర్‌ఎస్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. నగరంలోని 400కు పైగా బస్తీలతో పాటు 150 డివిజన్లకు కూడా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, రాష్ట్ర నాయకత్వాన్ని సమన్వయం చేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నెల మొదటి వారంలో ప్రత్యేక సమావేశం ఉండే అవకాశముందని పార్టీ నేతలకు కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment