ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై టీడీపీలో తర్జనభర్జన
అమరావతి: చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ తర్జనభర్జన పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఖండించలేకపోతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీలో డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ సీనియర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులకు ఏం చేశామో చెప్పాలంటూ సీనియర్ నేతలకు సూచనలు ఇచ్చారు. అయితే ఎంపీ శివప్రసాద్ చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏమీ లేవని సీనియర్లు...సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది.
దళితులకు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని సీనియర్లు తేల్చి చెప్పినా, శివప్రసాద్ వ్యాఖ్యలను ఖండించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచన చేయడం గమనార్హం. అంతేకాకుండా వ్యక్తిగత ఎజెండాతో శివప్రసాద్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రచారం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కనీసం స్కాలర్‌షిప్పుల్లో కోత పైనా చంద్రబాబు ఈ సమావేశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.