సాక్షి, అమరావతి: బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులది అవకాశవాదమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీలో చేరడమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతామని పార్టీ మారిన నేతలు చెప్పటం అవకాశవాదానికి నిదర్శనమని బాబు ధ్వజమెత్తారు. పార్టీ మారిన నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుందన్నారు. నలుగురు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీ మైండ్ గేమ్‌కు పాల్పడుతోందన్నారు. తన అంగీకారంతోనే ఆ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరారనే ప్రచారాన్ని ఖండించాలని, లేకపోతే ప్రజల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని టీడీపీ నేతలకు సూచించారు. నేతలు, కార్యకర్తలంతా నిబ్బరంగా ఉండాలని, రాజకీయ దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వారిపై అనర్హత వేటు పడే వరకూ పోరాటం
చంద్రబాబు నివాసంలో టీడీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. నలుగురు ఎంపీలు స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారని, టీడీపీ రాజ్యసభపక్షాన్ని బీజేపీలో విలీనం చేయటం చట్ట ప్రకారం చెల్లదని, ఇది పార్టీ ఫిరాయింపుల కిందకు వస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన నేతలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడే వరకూ పోరాడాలని నిర్ణయించారు. చంద్రబాబు రెండు, మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి, క్యాడర్‌కు ధైర్యం చెప్పాలని పలువురు నాయకులు కోరారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా సమాచారం కూడా ఇవ్వకుండా ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం సరికాదని అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లడం సరైంద కాదని చెప్పారు.
కేసుల మాఫీ కోసమే బీజేపీలోకి: వర్ల రామయ్య
తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కేసుల మాఫీ కోసమే బీజేపీలో చేరారని ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. నైతికత ఉంటే వారు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లాలన్నారు. సుజనా చౌదరిపై ఆర్థికపరమైన కేసులున్నాయన్నారు. వారు బీజేపీలో చేరడం వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు.
నన్ను బెదిరిస్తున్నారు: బుద్ధా వెంకన్న
టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు ఫిరాయించిన తర్వాత మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనను బెదిరించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సుజనా చౌదరి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి హెచ్చరించారని, కేసులు పెట్టించి బోల్టులు తిప్పిస్తానని వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. తనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం డీజీపీని కలుస్తానని అన్నారు.
టీడీపీపీ విలీనం చెల్లదు: ప్రత్తిపాటి పుల్లారావు
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయడం నిబంధనల ప్రకారం చెల్లదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదన్నారు.
ఆ నలుగురు ఎంపీలది అవకాశవాదం
Published Sat, Jun 22 2019 4:45 AM | Last Updated on Sat, Jun 22 2019 4:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment