పార్టీ సీనియర్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
అమరావతి : మంత్రివర్గ విస్తరణ అనంతరం జరుగుతున్న పరిణామాలతో పాటు, సొంత పార్టీ నేతల విమర్శలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారమిక్కడ పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. గత కొంతకాలంగా శివప్రసాధ్ అసంతృప్తిగా ఉన్నారని, దానికి భూ వ్యవహారమే కారణమని నేతలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అయితే ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దళితులకు ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు తెలుసని, లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్‌లను చేసిన ఘటన టీడీపీదే అని ... ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టి తనను లొంగదీసుకోవాలనుకోవడం సాధ్యం కాదని చంద్రబాబు వ్యాఖ్య్యానించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
హధీరాం మఠం భూములు కావాలని శివప్రసాద్ సిఫార్సు చేసినట్లు ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలతో ప్రస్తావించారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు.