సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లతో గురువారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్ల చొప్పున విడుదల చేసిందని, ఈ నెల మొత్తం కూడా ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. ఈ లెక్కన రూ.10 వేల కోట్లు గ్రామ పంచాయతీలకు అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
గ్రామ పంచాయతీలకు రూపాయి కూడా పెండింగ్‌లో లేదన్నారు. ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమం ఈ నెల 3 నుంచి 17 వరకు జరుగుతుందని.. ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా పాల్గొనాలని కేటీఆర్ స్పష్టం చేశారు. బిల్లులు ఎక్కడా పెండింగ్‌లో లేవని, సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అబద్ధమని చెప్పారు. ఇప్పటివరకు 1,39,152 చెక్కుల ద్వారా రూ.696.71 కోట్లను ఆర్థికశాఖ క్లియర్ చేసిందని.. మిగతా పెండింగ్ చెక్కులేవైనా ఉంటే వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రెండు నెలలుగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన రూ.1,400 కోట్లు విడుదల చేయలేదని.. వెంటనే అవి విడుదల చేసేలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల బకా>యిలు విడుదలయ్యేలా పోరాడాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులూ ఇవ్వకుండా.. కొత్త సాఫ్ట్‌వేర్ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.
బండి సంజయ్ దీక్ష ఎందుకో చెప్పాలి?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దీక్ష ఎందుకు? ఎవరి మీద? చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని కేంద్రం మీదా? కేంద్రం ఇవ్వకపోయినా ఇచ్చిన రాష్ట్రం మీదా? అన్నది చెప్పిన తరువాతే ఆయన దీక్ష చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment