సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలకు టీడీపీ ఎంపీలంతా విధిగా హాజరుకావలని, అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అవిశ్వాసం నోటీసులు అనేక పార్టీలు ఇచ్చాయని, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఎం కూడా నోటీసులు ఇచ్చాయని పేర్కొన్నారు. లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చ చేపట్టే అవకాశం ఉందని, లేదా ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసాన్ని చేపట్టవచ్చునని అన్నారు.
అవిశ్వాసంపై చర్చను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయిలో వినిపించాలని, నాలుగేళ్లయినా విభజన చట్టంలోని 19అంశాలు అమలుచేయకపోవడాన్ని ప్రశ్నించాలని సూచించారు. పార్లమెంట్‌లో ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చకపోవడాన్ని నిలదీయాలన్నారు. అవిశ్వాసంపై చర్చ ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైనదని, ఈ సందర్భాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, సభావేదికగా ఐదుకోట్ల ఏపీ ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలని సూచించారు. ఈ విషయంలో కావాల్సిన సమాచారం మొత్తం ఎంపీలకు అందుబాటులో ఉంచుతామన్నారు.
ఎంపీలంతా ఈ రాత్రికే ఢిల్లీకి చేరుకోవాలి
అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశమున్నందున మంగళవారం పసుపు చొక్కాలు, కండువాలతో టీడీపీ ఎంపీలు లోక్‌సభకు హాజరుకావాలని, ఈ రాత్రికే ఎంపీలంతా ఢిల్లీకి చేరుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇది రాష్ట్రానికే పరిమితమైన అంశం కాదని, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం జాతీయస్థాయి అంశంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఒంటరి చేయాలనే బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తుందని, సోషల్ మీడియాలో బీజేపీ దుష్ప్రచారాన్ని అధికం చేసిందని, దీనిపై ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ నేతలకు సూచించారు. దీనివల్ల బీజేపీపైనే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, టీడీపీపై మరింత సానుభూతి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment