సాక్షి, అమరావతి : లోక్‌సభ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఘోరమైన ఓటమి తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి కొత్త చరిత్రను సృష్టించింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసమయ్యాయి. ఇక విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళంలో అర్ధరాత్రి వరకూ ఫలితం తేలలేదు. ఈ నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన అనంతరం అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మూడుచోట్లా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య విజయం దోబూచులాడుతోంది.
చంద్రబాబుకు గట్టి షాక్
కాగా, ఇప్పటివరకు జాతీయస్థాయిలో తానే సీనియర్ నేతనని, ప్రధాని మోదీ కూడా తనకన్నా జూనియర్ అని, కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన చంద్రబాబుకు తాజా లోక్‌సభ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. కొన్ని స్థానాలైనా వస్తే కేంద్రంలో ఎన్డీయేతర పార్టీలతో కలిసో, అదీ కుదరకపోతే వెనుక ద్వారాల ద్వారా బీజేపీ పంచనో చేరుదామనుకున్న చంద్రబాబుకు ఈ ఫలితాలు మింగుడుపడడంలేదు. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి 15, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లోక్‌సభ స్థానాలు వచ్చాయి. అయితే, ఎన్నికలు ముగిసిన పిదప చంద్రబాబునాయుడు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎంపీలు కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలను చంద్రబాబు తనవైపు తిప్పుకున్నారు.
ఎన్నికల ముందు బుట్టా రేణుక తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో పోటీచేసిన చంద్రబాబునాయుడు.. కేంద్ర కేబినెట్లో రెండు మంత్రి పదవుల్లో తన ఎంపీలను కూర్చోబెట్టారు. ఇన్ని చేసినా రాష్ట్రానికి ఒక్క మంచిపనినీ సాధించలేదు. కేవలం తన సొంత పనులను చక్కబెట్టుకోవడానికి, కేంద్రంలో పైరవీలకు, కమీషన్లకు మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యారు. రాష్ట్రానికి అతి కీలకమైన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కమీషన్లు దండుకోవాలనుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అసెంబ్లీలో గెలవలేకపోయినా కనీసం ఎంపీ స్థానాలు కొన్నైనా వచ్చి ఉంటే కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో అంటకాగవచ్చని భావించారు. అధికారంలో ఉన్న సమయంలో తన అవినీతి అక్రమాలపై విచారణలు జరగకుండా బయటపడవచ్చని అనుకున్నారు. కానీ, ప్రస్తుత ఫలితాలను చూసి చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినంత పని అయ్యిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
బాబుకు స్పందించని జాతీయ పార్టీలు
కాగా, ఇప్పటివరకు ఏదో ఒక వంకతో జాతీయస్థాయిలో విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నానని హడావుడి చేసిన చంద్రబాబుకు ఈ ఫలితాలు దిమ్మదిరిగేలా చేశాయి. నిన్నటివరకు ఈవీఎంలపై పోరాటం అంటూ ఢిల్లీ వీధుల్లో, వివిధ రాష్ట్రాల రాజధానుల్లో తిరిగిన చంద్రబాబుకు ఈ ఫలితాలు బ్రేకులు వేశాయి. కౌంటింగ్‌కు ముందు జాతీయస్థాయిలో విపక్షాల సమావేశం అంటూ చంద్రబాబు హడావుడి చేయబోయినా ఎగ్జిట్‌పోల్స్ చూసి జాతీయ పార్టీలు చంద్రబాబుకు స్పందించడం మానేశాయి. పైగా.. సమావేశం లేదంటూ డీఎంకే తదితర పార్టీలు స్పష్టమైన ప్రకటనలూ చేశాయి.
ఈ నేపథ్యంలో.. జాతీయస్థాయిలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడమే కాకుండా ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలు కూడా ఆశించిన స్థానాలను పొందాయి. ఈ పరిణామం చంద్రబాబును మరింత కుంగదీస్తోంది. తనకు సీట్లు రాకపోవడం ఒక విషాద పరిణామం కాగా.. మోదీ నాయకత్వంలో బీజేపీకి అత్యధిక సీట్లు రావడంతో బాబుకు ఎటూ పాలుపోవడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా మోదీ ప్రధాని కాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో మోదీ అధికార పగ్గాలు చేపడితే తనపై ఉన్న అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతుందన్న ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది.
లోక్‌సభ స్థానాల్లోనూ బాబుకు ఘోర పరాభవం
Published Fri, May 24 2019 4:26 AM | Last Updated on Fri, May 24 2019 5:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment