రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్‌నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. నిధులిచ్చామని రాజ్‌నాథ్ చెబుతుంటే టీడీపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. చరిత్రలో కర్ణాటక అనుభవ్ మండపం, తంజావూరు చోళుల వ్యవస్థ నుంచి కూడా బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శమని, ప్రజాస్వామ్య పునాదులు భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
‘దేశంలో నాలుగేళ్లుగా ఉగ్రదాడులు జరగకుండా అణచివేశాం. చరిత్రలో అతిపెద్ద మూక దాడులు 1984లో జరిగాయి. కొందరు నేతలు హిందూ పాకిస్తాన్, హిందూ తాలిబన్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. గతంలో పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు తాలిబన్ గుర్తుకురాలేదా..? కౌరవులను చంపిన పాండవులే వారి కర్మకాండలు నిర్వహించారు. అంతటి గొప్ప సంప్రదాయం ఉన్న దేశ మనది. పాకిస్తాన్ ఒక దేశం కాదు.. ఒక దరిద్రం. ప్రధాని నరేంద్ర మోదీ నిజాయితీ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. నిరుపేద తల్లిగర్భం నుంచి పుట్టిన మోదీలాంటి వ్యక్తే రైతుల నిజమైన బాధను అర్థం చేసుకోగలరని’రాజ్‌నాథ్ అన్నారు.
డైలమాలో కాంగ్రెస్!!
మరోవైపు అవిశ్వాసంలో ఓటు వేయాలా.. వద్దా.. అనే దానిపై కాంగ్రెస్ సందిగ్దంలో పడిపోయినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసానికి ఓటేయడంపై కాంగ్రెస్‌లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదంటుండగా.. మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment