చంద్రబాబు ఎప్పటికీ మాకు మిత్రుడే : రాజ్‌నాథ్‌ | Chandrababu Is Still A Friend To Us, Says Rajnath Singh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఎప్పటికీ మాకు మిత్రుడే : రాజ్‌నాథ్‌

Published Fri, Jul 20 2018 5:20 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Chandrababu Is Still A Friend To Us, Says Rajnath Singh - Sakshi

రాజ్‌నాథ్‌ సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అనైతికంగా కొన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టాయని, కానీ తాము మాత్రం ఇద్దరి ఎంపీల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గతంలో కౌన్సిలర్లు కూడా లేని లడఖ్‌, కశ్మీర్‌ లాంటి ప్రాంతాలతో పాటు మేం అడుగు కూడా పెట్టలేమని భావించిన త్రిపురలో విజయకేతనం ఎగురవేశామన్నారు.

టీడీపీతో తమ బంధాన్ని రాజ్‌నాథ్‌ చెప్పకనే చెప్పారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. ఇప్పటికీ చంద్రబాబుతో మాకు మితృత్వం ఉందని, భవిష్యత్తులో కూడా తమ స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 1,050 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇప్పటివరకూ రెవెన్యూ లోటు కింద 15,959 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మేం ఎప్పుడు అవిశ్వాసం ప్రవేశపెట్టలేదని చెపన్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచారని రాజ్‌నాథ్‌ కొనియాడారు. పెద్ద నోట్లరద్దు వల్ల నష్టం జరిగిందని విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. తాత్కాలికంగా ఇబ్బందిపడ్డా దేశ ప్రజలు నోట్లరద్దుకు మద్దతు పలికారని తెలిపారు. యూపీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. అవిశ్వాసం పెట్టిన పార్టీల మధ్యే సఖ్యత లేదని, నేతృత్వం అనే అంశం చర్చకు వస్తే ఏ పార్టీ ఉండదని ఎద్దేవా చేశారు. ఆర్థిక వృద్ధిలో గణనీయమైన ప్రగతిని సాధించామని రాజ్‌నాథ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement