సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చ సాగింది. సుదీర్ఘ చర్చ, సమాధానం అనంతరం రాత్రి 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వీస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు ప్రకటించగా, తీర్మానానికి వ్యతిరేకంగా 325 మంది సభ్యుల మద్దతు లభించింది. దాంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించి సభను సోమవారానికి వాయిదా వేశారు.
విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సమాధానంలో పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చకు నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా మోదీ సమాధానమిచ్చారు. ఒకవైపు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ఆయన మరోవైపు విపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రసంగం కొనసాగించారు. ప్రధాని ప్రసంగం తర్వాత రైట్ టు రిప్లీ కింద టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఆటోమేటిక్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. వాయిస్ ఓటును పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో బటన్స్ నొక్కడం ద్వారా తెలియజేసే విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత లోక్‌సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 సభ్యులు మద్దతు పలకగా, 325 మంది ఎంపీలు వ్యతిరేకంగా నిలవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
అంతకు ముందు మోదీ మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో అందరికి బీమా, రైతుల్లో భరోసా నింపడానికి కిసాన్ భరోసా వంటి పథకాలను వివరిస్తూ త్వరలోనే ఆయుష్మాన్ భారత్ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు చర్చలో పాల్గొన్న సభ్యులు లేవనెత్తిన పలు అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి సమాధానం ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీలు కొత్త డ్రామా మొదలు పెట్టారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగ సమయంలో చంద్రబాబు తమకు మిత్రుడని అన్నప్పుడు కిమ్మనకుండా ఉండిపోయిన టీడీపీ ఎంపీలు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు డైరెక్షన్‌లో మరో డ్రామాకు తెరలేపారు. ప్రధాని మోదీ ప్రసంగం చేస్తుండగా పోడియం వద్ద కొద్దిసేపు నిరసన నినాదాలు చేశారు. మోదీ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెస్తూ టీడీపీ నేతల లాలూచీ వ్యవహారాలను బయటపెట్టారు.
ప్యాకేజీ ఒప్పుకున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని టీడీపీ అంగీకరించిన తర్వాతే ప్యాకేజీ ప్రకటించినట్టు నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు సమాధానంగా మాట్లాడుతూ, ఆయన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీల అంశాలను ప్రస్తావించారు. ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత ప్రకటించామని, ఇప్పుడు టీడీపీయే యూటర్న్ తీసుకుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఉచ్చులో పడొద్దని తాను చంద్రబాబునాయుడుకు సూచించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో కొద్ది రోజుల కిందట తాను చంద్రబాబుతోమాట్లాడినట్టు చెప్పారు. మోదీ తన సుదీర్ఘప్రసంగంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరించారు. 14 వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయామన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసినప్పుడు టీడీపీ దాన్ని స్వాగతించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రత్యేక హోదాకన్నా ప్యాకేజీ మంచిదని చంద్రబాబు అంగీకరించిన తర్వాత ఆ రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించినట్టు వెల్లడించడంతో టీడీపీ ఎంపీలు ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలో అర్థంకాక న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు.
నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులను అందరూ సమర్థించారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం ఒక భాగమని, విశ్వాస తీర్మానాన్ని మనమంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ తీర్మానం ద్వారా అందరి నిజస్వరూపాలు బయటపడ్డాయన్నారు. సంఖ్యా బలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారన్న ప్రశ్న అందరినీ తొలుస్తోందన్నారు. నావికుడు లేని పడవలా ప్రతిపక్షాల పయనం సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు దేశంలోని ఏ వ్యవస్థపైనా నమ్మం లేదని, ఆఖరికి ఈవీఎం, రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కూడా నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అవినీతిపై బాణం ఎక్కువ పెట్టిన వెంటనే వారికి ఇబ్బంది మొదలైందని ధ్వజమెత్తారు. 2024లో కూడా వారికి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. రాఫెల్ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారు..సర్జికల్ స్ట్రైక్స్ కూడా రాజకీయం చేశారు.. చైనా రాయబారిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కలవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యుత్‌ను ఆదాచేసేందుకు దేశవ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశాం..ఇంకా చేస్తున్నామని వివరించారు.
అంతకుముందు జరిగిన చర్చలో అన్ని పార్టీల నేతలు ప్రసంగించారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని కేంద్రాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రశ్నించారు. మూక దాడులు ఇప్పటివి కావని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, అందుకే నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోందన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. అంతకు ముందు రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థకు తామే కారణమని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాటల్ని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన చర్చ కొనసాగుతోంది.
లోక్ సభలో రాహుల్ ప్రవర్తించిన తీరును లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుపట్టారు. ప్రధానిని కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్ను కొట్టడం హుందాగా లేదన్నారు. మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ తన విమర్శనాస్త్రాలను కొనసాగించారు. తన ప్రసంగం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకెళ్లి ఆయనతో కరచాలనం చేసి ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. నేటి ఉదయం తీర్మానంపై మొదట చర్చను టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించగా.. అనంతరం బీజేపీ తరపున జబల్‌పూర్ ఎంపీ రాకేష్ సింగ్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపి శాపగ్రస్థమైందన్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చను కొనసాగిస్తూ, బీజేపీ, మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
చర్చలు ఎందుకు జరపరు? కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. ఉత్తర, దక్షిణ కొరియాలే చర్చలు జరిపినప్పుడు కశ్మీర్ విషయంలో ఎందుకు చర్చలు జరపకూడదని ఆయన ప్రశ్నించారు. హిందు, ముస్లిం గొడవలతో మనల్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నామన్నారు. ‘నేను భారతీయుడిని. ఇదే గడ్డపై పుట్టా. ఇక్కడే చనిపోతా’ అని చెప్పారు.
కశ్మీర్‌పై కేంద్రం వైఖరి ఏంటి? ముస్లింలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కశ్మీర్‌పై కేంద్రం వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. మూక దాడులు ఇప్పటివి కావని చెప్పారు. కశ్మీర్‌లో తీవ్రవాదులే కాదు సైనికులు చనిపోతున్నారని తెలిపారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు.
టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేసిన హరిబాబు.. ‘కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ తన జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకండా పోరాడారు. కానీ నిస్సిగ్గుగా నేడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు’అని చెప్పిన బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అవిశ్వాసంపై టీడీపీని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం ఉండేది కాదు... కేంద్ర ప్రభుత్వంలా తాము కూడా వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రాచీనకాలంలోనే భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందని, కాంగ్రెస్ ఆ విషయాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకుంటోందన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ఖర్గే ఖండించారు. ప్రజల సమస్యల గురించి అడిగితే పురాణాలు చెప్పారని ఎద్దేవా చేశారు. బీజేపీ భావజాలం అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరకమన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ విభజించి పాలించు సూత్రాలను పాటిస్తున్నారని మండిపడ్డారు.
నోరు మెదపని టీడీపీ ఎంపీలు!.. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి కుండబద్దలు కొట్టింది. అవిశ్వాస తీర్మాణంపై లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతున్న క్రమంలో ఏపీకి హోదా ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి నేడు ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో చేస్తున్నట్లు డ్రామాలాడుతున్న టీడీపీ ఎంపీలు మాత్రం రాజ్‌నాథ్ ప్రకటనపై స్పందించడం లేదు. గత నాలుగేళ్లు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆశపడి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టిన టీడీపీ ఎంపీలు యూటర్న్ తీసుకున్నా తమ స్వభావాన్ని పార్లమెంట్ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ-బీజేపీల బంధం నిజమైనదే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది.. లోక్‌సభలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాళ్ల దగ్గర సంఖ్యా బలం కూడా లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అనైతికంగా కొన్ని పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టాయని, కానీ తాము మాత్రం ఇద్దరి ఎంపీల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. గతంలో కౌన్సిలర్లు కూడా లేని లడఖ్, కశ్మీర్ లాంటి ప్రాంతాలతో పాటు మేం అడుగు కూడా పెట్టలేమని భావించిన త్రిపురలో విజయకేతనం ఎగురవేశామన్నారు.
లోక్‌సభ మళ్లీ ప్రారంభం
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారని, విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సభను సాయంత్రం 4:30 గంటల వరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. అనంతం సభ మళ్లీ ప్రారంభమైంది.
2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి..? - నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం కేవలం ధనవంతులకే కొమ్ము కాస్తోందని సమాద్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని ఇచ్చిన హామీ ఏమైందని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మోదీ పాలనపై రైతులు, యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వమూ అన్ని ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు.
రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్.. కేంద్ర ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రజలు మెచ్చడం లేదని, మోదీ ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయమే తమకు నచ్చలేదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రాజ్యాంగ విరుద్ధంగా తొలి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలను తీసేసుకున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో సరైన సమాచారం లేదన్నారు. 1952లో ఖమ్మం అనేది వరంగల్ జిల్లాలో భాగం అని తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ నుంచి 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపేశారు. మా మండలాలను తిరిగి మాకు ఇచ్చేయాలి. కాగా, ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాలతో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందాలు చేసుకుని 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తూ ముందుకు సాగుతున్నారని’ఎంపీ వినోద్ వివరించారు.
‘రఫెల్’పై వివరణ... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన రఫెల్ డీల్ ఆరోపణలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘రఫెల్ ఒప్పందం యూపీఏ హయాంలోనే జరిగింది. ఆ సమయంలో ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఒప్పంద వివరాలు బయటపెట్టొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే వెల్లడించటం లేదు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు
ప్రధాని మాటకు విలువ ఉండాలి... ‘గల్లా స్పీచ్ విన్నాను. 21వ శతాబ్ధంలో అతిపెద్ద రాజకీయ బాధితురాలు ఆంధ్ర ప్రదేశ్. జీఎస్టీ మేం తెస్తామంటే వద్దన్నారు. ఐదు శ్లాబ్‌ల్లో వాళ్లు(బీజేపీ ప్రభుత్వం) తీసుకొచ్చారు. దేశానికి సేవకుడిగా ఉంటానని మోదీ.. పేదల పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. ఆయన కళ్లకు వ్యాపారవేత్తలే కనిపిస్తారు. వారికి లబ్ధి చేకూరేలానే నిర్ణయాలు తీసుకుంటారు. అందులో భాగమే నోట్ల రద్దు. కనీసం నా కళ్లలోకి చూసి కూడా మాట్లాడే స్థితిలో మోదీ లేరు(వెంటనే ప్రధాని చిరునవ్వులు చిందించారు)’ అంటూ రాహుల్ ఏకిపడేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ.. అమిత్ షా తనయుడిని టార్గెట్ చేసి రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగగా.. సభ పది నిమిషాలు వాయిదా పడింది.
టీడీపీ శాపగ్రస్థురాలైంది... అవిశ్వాసానికి వ్యతిరేకంగా అధికార పక్షం తరపున ఎంపీ రాకేష్ సింగ్ చర్చ ప్రారంభించారు. ‘గతంలోనూ చాలాసార్లు అవిశ్వాసం పెట్టారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ అవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. శాపగ్రస్థురాలైన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్ల టీడీపీ కూడా శాపగ‍్రస్థురాలైంది. టీడీపీ మాకు శాపనార్థాలు పెడుతోందా?.. అసలు గల్లా జయదేవ్ పూర్తి ప్రసంగం వింటే అవిశ్వాస తీర్మానం అవసరం లేదనిపిస్తోంది. మోదీ పాలనలో ప‍్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. పేద ప‍్రజల అభ్యున్నతికి బీజేపీ పాటు పడుతోంది.’ అని రాకేష్ సింగ్ ప్రసంగించారు. అంతర్జాతీయంగా భారత్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్‌ను కొత్త శక్తిగా గుర్తిస్తున్నాయి. ఉజ్వల పథకంతో 8 కోట్ల మంది మహిళలకు లబ్ధి. నెలకు ఒక్క రూపాయితో 2 లక్షల బీమా కవరేజ్. రోజుకు 90 పైసలతో జీవన్ జ్యోతి యోజన పథకం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టలేదు. మోదీని ఎలాగోలా అడ్డుకోవాలనే తపనతోనే అవిశ్వాసం. కొందరి లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దు...
గల్లాపై సీతారామన్ ఆగ్రహం.. ప్రసంగం కొనసాగించిన వేళ ప్రధానిని ఉద్దేశించి మోసగాడు అని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. ఆ ఆరోపణలపై బీజేపీ మండిపడింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సీటులోంచి లేచి టీడీపీ ఎంపీల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్‌ను ఆమె కోరారు. మరోవైపు అప్రజాస్వామికంగా తెలుగు రాష్ట్రాలను విభజించారన్న గల్లా వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపి జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఆ వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పదాన్ని తొలగించాలని కోరగా.. పరిశీలిస్తామని మేడమ్ స్పీకర్ చెప్పటంతో జితేందర్ రెడ్డి శాంతించారు.
గల్లా జయదేవ్ ప్రసంగం... సుమారు గంటపాటు ప్రసంగించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పాత విషయాలనే చెప్పుకురావటం గమనార్హం. గతంలో కాంగ్రెస్‌పై చేసిన కామెంట్లనే.. ఇప్పుడు ఆయన బీజేపీపై చేశారు. అయితే రాష్ట్రాన్ని అప్రజాస్వామిక్యంగా విభజించారన్న వ్యాఖ్యపై టీఆర్‌ఎస్ భగ్గుమంది. ఒకానోక దశలో టీఆర్‌ఎస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లే యత్నం చేయగా.. స్పీకర్ వారించటంతో సభ సర్దుమణిగింది. ఆ తర్వాత ప్రధాని మోదీపై గల్లా సంచలన ఆరోపణలు చేశారు. ‘అవినీతి పరులకు ప్రధాని కొమ్ము కాస్తున్నారు. ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. హోదాపై మాట మార్చారన్న విషయం ప్రజలకు అర్థమైంది. హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనటం వాస్తవ విరుద్ధం. ప్రణాళిక సంఘం సాకుతో హోదా ఇవ్వకపోవటం సరికాదు. స్పెషల్ ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఒక్క పైసా ఏపీకి విదల్చలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వాలి’ అని గల్లా వ్యాఖ్యానించటంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది.
కాంగ్రెస్ అభ్యంతరాలు.. ప్రతిపక్షాలకు తక్కువ సమయం ఇవ్వటంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ‘కాంగ్రెస్‌కు 38 నిమిషాలే ఇచ్చారు. సభలో ఏం జరగబోతుందోనని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అవసరమైతే అవిశ్వాసంపై చర్చ మూడురోజులపాటు సాగాలి’ అని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు.
అనంతకుమార్ సెటైర్లు.. వన్డే మ్యాచ్‌ల కాలంలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడతామనటం సరికాదు అంటూ విపక్షాల అవిశ్వాస చర్చపై బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే సెటైర్లు పేల్చారు. అవిశ్వాసం వీగిపోతుందన్న ధీమా ఆయన వ్యక్తం చేశారు.
బీజేడీ వాకౌట్... లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది.ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్‌సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు.
ప్రారంభమైన లోక్‌సభ... సభ ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. సాయంత్రం 6గంటల వరకు చర్చ కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment