సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో శుక్రవారం లోక్ సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో చర్చను రక్తి కట్టించారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై జరిగిన మొత్తం చర్చను లోతుగా విశ్లేషిస్తే... అంతిమంగా సాధించిందేమిటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అన్న ప్రశ్నకు మాత్రం ఎక్కడా సమాధానం దొరకదు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రాజకీయ కోణంలో తమదైన డ్రామాను కొనసాగించాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకూ(ఆఖరి పది నిమిషాల్లో ఓటింగ్ జరిగింది) రోజంతా సాగిన ఈ తతంగం వల్ల సాధించిందేంటో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రబాబే ప్రత్యేక హోదా వద్దని అన్నారని, ప‍్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని లోక్‌సభలో పేర్కొనడంతో టీడీపీ ఇరకాటంలో పడింది.
అవిశ్వాస తీర్మానం చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బీజేపీ సర్కారును విమర్శించారు. దానికి ప్రతిగా ప్రభుత్వం పక్షాన హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, చంద్రబాబు మాకు మిత్రుడేనని, ఇప్పటికీ, ఎప్పటికీ మిత్రుడే, విడిపోయే బంధం కాదన్నారు. ఆ మాటలకు టీడీపీ సభ్యులు ఖండించకపోగా మౌనం పాటించడం గమనార్హం, అలాగే, రాష్ట్రానికి ఏఏ రంగాలకు ఎన్నెన్ని నిధులు కేటాయించారో హోం మంత్రి చెప్పినప్పుడు కూడా టీడీపీ సభ్యులు మౌనంగా వింటూపోయారు. ఇదిలావుండగా, చంద్రబాబు మా స్నేహితుడే అని రాజ్ నాధ్ చెప్పగా బీజేపీకే చెందిన ఎంపీలు రాకేష్ సింగ్, కంభంపాటి హరిబాబులు మాత్రం, టీడీపీ కాంగ్రెస్ తో దోస్తీ కట్టిందని విమర్శలు గుప్పించారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే చర్చలో టీడీపీ లేవనెత్తిన డిమాండ్లను ప్రస్తావిస్తూ మద్దతు పలికారు. టీడీపీని ఉద్దేశించి ఇటు కాంగ్రెస్ నేతలు, అటు రాజ్ నాధ్ సింగ్ మాట్లాడిన అంశాలపై సభలోనే ఉన్న ఆ పార్టీ సభ్యులు స్పందించకపోవడం గమనార్హం. చర్చను ప్రారంభించినప్పుడు టీడీపీ నేతలు బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించగా, సర్కారు తరఫున మంత్రి టీడీపీ మిత్రపక్షమనే చెప్పడం, పార్టీ తరఫున బీజేపీ ఎంపీలు మాత్రం టీడీపీపై ప్రతివిమర్శలు చేయడం, కాంగ్రెస్- టీడీపీలు కలిసిపోయాయంటూ ఎద్దేవా చేయడం వంటి మాటలతో ఆ మూడు పార్టీల నేతలు పరస్పరం ఒక పథకం ప్రకారం డ్రామాను నడిపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుమీదే చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవిశ్వాస చర్చ సందర్భంగా అసలు ఆ ప్రస్తావనే చేయలేదు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీ జోక్యం చేసుకుని రాష్ట్ర విభజన బిల్లును అప్రజాస్వామిక చర్యగా చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.
గడిచిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇరు పార్టీలు పరస్పరం భాగస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. నాలుగు సంవత్సరాల పాటు ఈ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని సాగాయి. మరికొన్ని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో రెండు చోట్లా ప్రభుత్వాల నుంచి కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీ వైదొలగింది. ఈరోజు లోక్‌సభలో టీడీపీ లేవనెత్తిన అంశాలన్నీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా అనేక రూపాల్లో చర్చ జరగడం, ప్రజాందోళనలు జరగడం, అసెంబ్లీలో చర్చకు రావడం, సమావేశాలు, నిరసన దీక్షలు ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా వంటి అంశంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అనేక ఆందోళనలు జరిగాయి. కీలకమైన ఆ అంశం జీవంతో ఉండటానికి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కారణమన్నది అందరూ అంగీకరించే విషయమే.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చిన అనేక హామీలు నెరవేరడం లేదని గడిచిన నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు అధికార టీడీపీ వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. పైపెచ్చు బీజేపీ నిర్ణయాలను అభినందిస్తూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ఆమోదించారు. నాలుగేళ్ల పాటు అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ అత్యంత సులభంగా సాధించాల్సిన అంశాలపై విషయాలను కూడా టీడీపీ పట్టించుకోలేదు. పైగా ప్రత్యేక హోదా అవసరమే లేదని చెప్పిన చంద్రబాబే మళ్లీ యూ టర్న్ తీసుకోవడం వంటి చర్యలతో ప్రజల్లో తీవ్ర విమర్శలపాలయ్యారు కూడా.
నాలుగేళ్లుగా ప్రజలను మోసపుచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఎత్తుగడలతో ముందుకొచ్చినప్పటికీ అందులోనైనా చిత్తశుద్ధితో వ్యవహరించిందా అంటే అదీ లేదు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పార్టీల మద్దతు కూడగడుతామన్న టీడీపీ తీరా సమయానికి చేతులెత్తేసింది. ఏ రాజకీయ పార్టీ కూడా టీడీపీ అవిశ్వాసానికి అనుగుణంగా కాకుండా ఎవరి ప్రాధాన్యతల మేరకు వారన్నట్టు తమ వైఖరులను మాత్రమే ప్రస్తావించారే తప్ప టీడీపీ ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతునివ్వలేకపోవడం ఆ పార్టీ వైఫల్యమే అవుతుంది. మరోవైపు నాలుగేళ్ల పాటు చెప్పిన మాటలకు, చేసిన పనులకు విరుద్ధంగా సభలో భిన్నంగా మాట్లాడి బొర్లా పడింది. పైపెచ్చు రాష్ట్రానికి అన్యాయం చేసిందని ప్రభుత్వం అవిశ్వాసం పెట్టిన టీడీపీ తీరా చర్చ సందర్భంగా ఆ విషయాన్ని మరిచి వ్యవహరించింది. పార్లమెంట్ సాధారణ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ సందర్భంగా కోరినట్టుగా తాము లేవనెత్తిన అంశాలపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని మాత్రమే టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్ లు కోరిందే తప్ప ఏ రకంగా ఆ డిమాండ్లను సాధించవచ్చో, ఏ విధంగా సాధిస్తామో చెప్పడంలో విఫలమయ్యారన్న మాట సొంత పార్టీ నుంచే వినిపించింది. మొత్తంమీద అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంత ఆర్భాటం చేసిందో చివరకు ఏమీ సాధించలేక అంతే స్థాయిలో చతికిలపడిందన్న విమర్శను మూటగట్టుకుంది.
మాజీ మంత్రి ఎందుకు మౌనం వహించారు
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు నోరు మూయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. నాలుగేళ్ల పాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అశోక గజపతి రాజు ద్వారా చంద్రబాబు అనేక పనులు చేయించుకున్నారని, చర్చకు సమాధానం సందర్భంగా అవెక్కడ తెరమీదకు తెస్తారో అన్న అనుమానంతో ఆ మాజీ మంత్రిని మౌనంగా ఉండమని ఆదేశించినట్టు తెలిసింది. బాబు ఆదేశాలతో ఏం చేయలేక అశోకగజపతిరాజు చర్చ ఆసాంతం మౌనముద్ర దాల్చారు.
Comments
Please login to add a commentAdd a comment