సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను గ్రామ కొనుగోలు కేంద్రాలకు తరలించడంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో జిల్లా, మండల గ్రామాల రైతుబంధు సమితి అధ్యక్షులు క్రియాశీలక పాత్ర నిర్వహించాలని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ కొనుగోలు కేంద్రంలో గోనెసంచులు, కాంటాలు, టార్పాలిన్ (తాడిపత్రి)లను తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధాన్యం తీసుకుని వచ్చే రైతులు సామాజిక దూరం పాటించాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బులు, శానిటైజర్లు, నీటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. వరి, మొక్కజొన్న కోత యంత్రాలు గ్రామాల్లోకి రావడానికి తమ అనుమతులను తీసుకోవడానికి రైతులకు సహాయ సహకారాలను అందించాలన్నారు. వెటర్నరీ మందుల దుకాణాలను, విత్తన, ఎరువుల పురుగు మందుల దుకాణాలను తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న పామాయిల్ ఉత్పత్తి కంపెనీని నడిచే విధంగా చూడాలన్నారు. రైతుబంధు సమితి సభ్యులు, తమ గ్రామాలలోని రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరోసా కలిగించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment