సాక్షి, అమరావతి: ‘ప్రతి సోమవారం స్పందనలో వచ్చే ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే. అర్జీ ఇచ్చినప్పుడే అర్జీదారునికి రశీదు ఇవ్వాలి. ఆ సమస్యను ఎన్ని రోజుల్లోగా పరిష్కరిస్తారన్నది కూడా రశీదులో నిర్దిష్టంగా పేర్కొనాలి. ఆలోగా సమస్యను కచ్చితంగా పరిష్కరించాల్సిందే’ అని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయం నుంచి ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిందే.. అప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలం.. మాపై ప్రజలు అచంచలమైన విశ్వాసం ఉంచి అఖండ విజయాన్ని అందించారు. వారి ఆశలు నెరవేర్చి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని చెప్పారు.
‘రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అర్జీల ద్వారా వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే కాకుండా.. ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయో విశ్లేషించి, వాటికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. శాశ్వతంగా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కార్యాచారణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అర్జీల్లో చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రహదారులు, తాగునీటి సమస్య వంటి సామాజిక సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరు కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తాం. ఆ అధికారిని మీరు సంప్రదించి త్వరితగతిన పనులు జరిగేలా చూడండి’ అని సీఎం ఆదేశించారు.
ఆన్‌లైన్‌లో పరిశీలన
మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి అర్జీని కంప్యూటరీకరించి, ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. మండల స్థాయి మొదలు తాను నిర్వహించే ప్రజాదర్బార్‌లో వచ్చే అర్జీల వరకు అన్నింటినీ ఆన్‌లైన్ వెబ్ పోర్టల్‌లో పొందుపరచాలని, నిర్దిష్ట గడువులోగా ఆ సమస్యలు పరిష్కరించారో లేదో తనిఖీ చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో వీటిని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ స్థాయి పర్యటనలకు, పల్లె నిద్రకు వెళ్లినప్పుడు ‘స్పందన’లో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. రచ్చబండ, ఇతర అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు తానూ తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు. దీని వల్ల కింది స్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పని చేస్తారని, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రతి మంగళశారం ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానన్నారు. చిన్న చిన్న సమస్యలను 72 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఇంట్లో నుంచే సమస్య నమోదు
భవిష్యత్‌లో ప్రజలు ఇంట్లో నుంచే తమ సమస్యను వెబ్ పోర్టల్‌లో నమోదు చేసేలా ముఖ్యమంత్రి కార్యాలయం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆ మేరకు వెబ్ పోర్టల్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు తెలిసింది.
ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే
Published Wed, Jul 3 2019 3:50 AM | Last Updated on Wed, Jul 3 2019 12:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment