సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలను నాలుగేళ్ల పాటు చేయి పట్టుకుని నడిపిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ పథకాల లబ్ధిదారుల విజయగాథలను వీడియోల రూపంలో వలంటీర్ల ద్వారా సేకరించి పంపాలని కలెక్టర్లకు సూచించారు. ఈ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మహిళల జీవితాలు, స్థితిగతులను ఏ రకంగా మార్చాయో వీడియోల్లో పొందుపరచాలని సూచించారు.
పంపిన వాటిల్లో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. ఇవి మరి కొందరిలో స్ఫూర్తిని పెంచుతాయన్నారు. సచివాలయాల స్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున ఉత్తమ విజయ గాథలకు బహుమతులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తామని, వాటితో పాటే లబ్ధిదారులపై ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు అందచేస్తామని తెలిపారు. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం
వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, అమ్మ ఒడి పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం. 2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి. ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా మారిపోయిన దుస్థితి నెలకొంది. 18 శాతం పైచిలుకు ఖాతాలన్నీ అవుట్ స్టాండింగ్, ఎన్‌పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మనం అధికారంలోకి వచి్చన తర్వాత వారికి చేయూతనిచ్చి ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం.
ఆర్థిక స్వావలంబన, సాధికారత
క్రమం తప్పకుండా ఏటా లబ్ధిదారులకు పలు పథకాలను అందించడం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం. అందువల్లే ఈ రోజు పొదుపు సంఘాల్లో ఎన్‌పీఏలు కేవలం 0.3 శాతానికి పరిమితమయ్యాయి. అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా నిలిచి నడిపించిన ప్రభుత్వం మనది.
జనవరిలో వైఎస్సార్ ఆసరా చివరి విడత
ఒక్క వైఎస్సార్ ఆసరా ద్వారానే రూ.25 వేల కోట్లకుపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఈ పథకం కింద మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం. నాలుగో విడతగా, చివరి ఇన్‌స్టాల్‌మెంట్ కింద సుమారు రూ.6,400 కోట్లు్ల ఇస్తున్నాం. జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది. దీని ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి. ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలను వివరించే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి.
సుస్థిర జీవనోపాధి..
మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం. స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం. ఇందులో భాగంగానే పలు మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానించాం. ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాల ద్వారా మహిళలు, మహిళా సంఘాలకు దీనిపై అవగాహన పెంపొందించాలి. ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం. మహిళా సంఘాలు తీర్మానాలు చేస్తే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది.
‘చేయూత’తో రూ.14,129 కోట్లు
ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైఎస్సార్ చేయూత కార్యక్రమం వేడుకలా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. పథకం కింద ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు అందచేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచి వారికి జీవనోపాధి చూపించేలా కార్యక్రమం చేపట్టాం. 45 ఏళ్లకు పైబడ్డ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందిస్తూ 26.50 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం. లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో ఏ రకంగా మార్పులు తెచి్చందో తెలియజెప్పాలి. జీవనోపాధి మార్గాలపై అవగాహన కలి్పస్తూ వారికున్న అవకాశాలను వివరించాలి. ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను లబ్ధిదారులకు అందించాలి. నా వీడియో సందేశాన్ని కూడా వారికి చేరవేయాలి.
సామాజిక న్యాయానికి చిహ్నంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
సామాజిక న్యాయానికి చిహ్నంగా విజయవాడలో 19 ఎకరాల్లో రూ.404 కోట్లతో రూపొందించిన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరిస్తున్నాం. సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి. ప్రతి సచివాలయం పరిధిలో సమావేశాలు నిర్వహించాలి. ప్రతి సచివాలయం నుంచి ఐదుగురిని 19న జరిగే అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలి.
ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతాం. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో వారందరినీ భాగస్వాములను చేస్తాం. గ్రామ స్థాయిలో పరిపాలనను చేరువ చేసి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. తద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం. ఇదొక గొప్ప మార్పు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఈ మార్పులకు ప్రతిరూపంగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment