![Minister Balineni Srinivasa Reddy Teleconference With Officials - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/22/floods.jpg.webp?itok=w7TZBnXR)
నీట మునిగిన తిరుపతి 132కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ట్రాన్స్‌కో డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆయన ఆదివారం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. విద్యుత్ సరఫరా స్థితిగతులపై ఆరా తీశారు. విద్యుత్ లేకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదని, వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు హరనాథరావు, పద్మ జనార్ధనరెడ్డి, సంతోషరావులతో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ టెలీకాన్ఫరెన్స్‌లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షల్లో ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుపతి, నెల్లూరు ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్లు, మరో 19 సబ్‌స్టేషన్లలో నీరుందని చెప్పారు. దీనివల్ల 98 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయని తెలిపారు. వీటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం విద్యుత్ పునరుద్ధరణకు తీసుకున్న చర్యల్ని ఇంధనశాఖ కార్యదర్శి మంత్రి బాలినేనికి వివరించారు. వరదలు, తుపానులు, భారీ ఈదురుగాలులు వంటి విపత్తుల్లో విద్యుత్ సమస్యల తీవ్రతను తగ్గించడానికి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సూచించారు.
రూ.30 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌కు ప్రతిపాదనలు
తిరుపతిలో ప్రస్తుతం ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్ స్థానంలో కొత్తగా రూ.30 కోట్లతో అత్యాధునిక గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్, తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాలకు ప్రతిపాదనలివ్వాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళం వద్ద 132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న స్థల వివాదంపై జిల్లా అధికారులతో మాట్లాడారు. నాలుగు రోజులుగా వరద నీటిలోనే ఉన్న తిరుపతి 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు.
నాలుగడుగుల నీరుండటంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు ప్రారంభించలేకపోయామని, అలిపిరి, రేణిగుంట సబ్‌స్టేషన్ల నుంచి తిరుపతి నగరానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రతాప్‌కుమార్ చెప్పారు. ఎస్‌జీఎస్ కళాశాల పక్కన గోడ లేకపోవటం వల్లే వరద నీరు సబ్‌స్టేషన్‌ను దిగ్బంధించినట్లు గుర్తించారు. వెంటనే గోడ నిర్మించాలని, ముందువైపు నీళ్లు రాకుండా ర్యాంపు ఏర్పాటు చేయాలని సివిల్ ఎస్‌ఈ నరసింహకుమార్‌ను డైరెక్టర్ ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నలుగురి ప్రాణాలను కాపాడిన నెల్లూరు జిల్లా విద్యుత్ సిబ్బందిని ఆయన అభినందించారు. ట్రాన్స్‌కో కడప జోన్ సీఈ శ్రీరాములు, ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ ఎస్‌ఈ చలపతి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment