కొత్త పాఠ్యపుస్తకాలు, సీసీఈపై టీచర్లకు టెలీకాన్ఫరెన్స్ | Teacher Training teleconference information session | Sakshi
Sakshi News home page

కొత్త పాఠ్యపుస్తకాలు, సీసీఈపై టీచర్లకు టెలీకాన్ఫరెన్స్

Published Sat, Jan 18 2014 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

Teacher Training teleconference information session

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 2014-15 విద్యాసంవత్సరంలో అమలులోకి రానున్న కొత్త పాఠ్యపుస్తకాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించినట్లు డీఈఓ డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు.  పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణీమోహన్, ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డిలతో శుక్రవారం  వీడియో సమావేశం నిర్వహించారు. డైట్ ప్రిన్సిపాల్ బీ విజయభాస్కర్, ఇ.సాల్మన్, షేక్ చాంద్‌బేగం, వి.రామ్మోహన్, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారు.  సమావేశం వివరాలను డీఈఓ వెల్లడించారు. ఉపాధ్యాయులు ఈ నెల 20 నుంచి 30 వరకు ఆయా మండల కేంద్రాల్లో టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి.
 
 షెడ్యూలు ఇదీ...  
 ఈ నెల 20న తెలుగు, 21న ఇంగ్లిష్, 22న గణితం, 23న ఫిజికల్ సైన్సు, 24న సాంఘికశాస్త్రం, 25న బయోలాజికల్ సైన్సు, 27న హిందీ ఆయా సబ్జెక్టుల హైస్కూలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే స్కూలు అసిస్టెంట్లు, కొత్త టెస్ట్‌బుక్స్, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని డీఈఓ కోరారు. ఈ నెల 28న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 29న ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 50 శాతం మంది 30న, మిగిలిన 50 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలు మూతపడకుండా విధిగా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఉదయం 9 గంటలకు సంబంధిత టెలీకాన్ఫరెన్స్ ప్రదేశాన్ని చేరుకోవాలని డీఈఓ కోరారు. టెలీకాన్ఫరెన్స్ కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్ వసతి కల్పించాల్సిందిగా ఎంఈఓలను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement