
సాక్షి, అమరావతి: అర్హత ఉండి ఏవైనా చిన్నచిన్న కారణాల వల్ల సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందని వారికి ప్రయోజనం చేకూర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు పార్టీ కో–ఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని గుర్తుచేశారు. జూలై 1వ తేదీ నుంచి మండలస్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా పాల్గొనేలా చూడాలని కోరారు. ప్రజలందరిని ఈ శిబిరాలకు ఆహ్వానించి సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జగనన్న సురక్ష క్యాంపు ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సురక్ష కార్యక్రమంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని ప్రజలు చెబితే.. సీఎంతో వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి ‘థాంక్యూ జగనన్న‘ అని టైప్‌చేసి 9052690526 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించేలా చూడాలని కోరారు.
పార్టీ కమిటీల ప్రతిపాదనలను జూలై 3వ తేదీలోగా పంపాలని కోరారు. అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీని మరింతగా బలోపేతం చేసుకోగలమన్నారు. ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని, మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను పంపాలని కోరారు. అలాగే పార్టీ నగర కమిటీల ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని ఆయన సూచించారు.