ట్రావెల్‌​ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్‌ సీన్‌.. | Huge Money Seized On Travel‌ Buses In AP | Sakshi
Sakshi News home page

ట్రావెల్‌​ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్‌ సీన్‌..

Published Fri, Apr 1 2022 4:25 PM | Last Updated on Sat, Apr 2 2022 10:28 AM

Huge Money Seized On Travel‌ Buses In AP - Sakshi

నల్లజర్ల/ప్రత్తిపాడు/నరసన్నపేట:ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రెండు వేర్వేరు టోల్‌ప్లాజాల వద్ద శుక్రవారం వేకువజామున ఈ తనిఖీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన సోదాల్లో రూ.4.76 కోట్ల నగదు, 352 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద జరిపిన తనిఖీల్లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం పట్టుబడింది. వివరాలివీ.. 

వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 37టీబీ7555 నంబరు గల బస్సులో ప్రయాణికుల సీట్ల కింద, లగేజీ డిక్కీలోనూ 11 పార్శిళ్లలో ఉన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ మొత్తాన్ని రూ.4,76,89,050 లుగా లెక్కగట్టారు. అలాగే.. 352.892 గ్రాముల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవరు, క్లీనరుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరుగాక మరో ఏడుగురు వ్యక్తులు మూడు కార్లలో బస్సు వెనకాలే వస్తున్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  

జీఎస్టీ తప్పించుకునేందుకే.. 
గతంలో బంగారం వ్యాపారం చేసే పిన్నిని కోటేశ్వరరావు, రమేష్‌ అన్నదమ్ములు. నరసన్నపేటలో ఉండే వీరు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు. శ్రీకాకుళంలోని వ్యాపారులకు జీఎస్టీ బిల్లులు లేకుండా (జీరో బిజినెస్‌) బంగారం ఇప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఉగాదికి వరుసగా సెలవులు రావడంతో ముందుగానే వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుని బంగారం కొనుగోలుకు బయలుదేరి పోలీసులకు చిక్కారు. మరోవైపు.. బంగారం కొనుగోలు నిమిత్తం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి విజయవాడకు ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు వారు వెల్లడించారు. తిరిగి ఇదే బస్సులో సాయంత్రం బంగారం తరలించనున్నట్లు తెలిపారు. ఇలా నెలకు నాలుగైదుసార్లు వెళ్తుంటామన్నారు. ఇక పట్టుబడ్డ నోట్ల లెక్కింపు కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ త్రినా«థ్, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ రవికుమార్, నల్లజర్ల తహసీల్దారు ఎ.శ్రీనివాస్, సీఐలు ఆకుల రఘు, వైవీ రమణ పాల్గొన్నారు. దీనిపై ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారాన్ని ప్రభుత్వ కస్టడీకి పంపినట్లు వెల్లడించారు.  

‘తూర్పు’లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం.. 
ఇక తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద గంజాయి కోసం మాటువేస్తే అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు పట్టుబడ్డాయి. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో జగ్గంపేట సీఐ బి సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతిరావు తమ సిబ్బందితో టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఎదురెదురు మార్గాల్లో వస్తున్న పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సోదాచేశారు. దీంతో బ్యాగుల్లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం పట్టుబడినట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సొత్తుకు సంబంధించి ఎలాంటి రశీదులూ లేవని  తెలిపారు. 

నరసన్నపేటలో  కలకలం 
పద్మావతి ట్రావెల్స్‌ బస్సుల్లో పెద్దఎత్తున డబ్బు, బంగారం పట్టుబడిందన్న సమాచారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. అంతాకలిసి హడావుడిగా పశ్చిమగోదావరి జిల్లాకు బయల్దేరారు. వీరి కదలికలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన సొత్తు అంతా పలాస, నరసన్నపేటకు చెందిన హోల్‌సేల్‌ వ్యాపారులదేనని తెలుస్తోంది. వీటికి ఆధారాలు చూపించి వాటిని వెనక్కి తీసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక నిత్యం పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లే ప్రైవేటు బస్సులు శుక్రవారం ఈ ఘటనలతో నిలిచిపోయాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement