పరుగులు తీస్తున్న పోలవరం పునరావాసం | Speed Up Works Construction Of Polavaram Rehabilitation Colony | Sakshi
Sakshi News home page

పరుగులు తీస్తున్న పోలవరం పునరావాసం

Published Mon, Apr 5 2021 9:10 AM | Last Updated on Mon, Apr 5 2021 9:18 AM

Speed Up Works Construction Of Polavaram Rehabilitation Colony - Sakshi

కృష్ణునిపాలెంలో గిరిజనేతర నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీ

పోలవరం నిర్వాసితుల త్యాగాలు మరువలేనివి. ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా మారుతున్న అందరినీ ఆదుకుంటాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారం కలిపి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగకుండా గృహ సముదాయాలకు తరలిస్తాం.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రంపచోడవరం: అటు విశాఖ నుంచి ఇటు కృష్ణా జిల్లా వరకూ ఉన్న దాదాపు 7 లక్షల ఎకరాల భూములను సస్యశ్యామలం చేయడమే కాకుండా, వేలాది గ్రామాలకు తాగునీరు, విశాఖలోని పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడంతో పాటు.. 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చేస్తున్న విషయం తెలిసిందే. అంతే వేగంగా ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను కూడా చేపడుతోంది.

గత టీడీపీ ప్రభుత్వం కంటే మెరుగైన ప్యాకేజీ ప్రకటించి, ప్రతి నిర్వాసితుడికీ భరోసా కల్పించి, కొత్త ఇళ్లల్లో గృహప్రవేశం చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పునరావాస కాలనీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల అన్ని వసతుల తో కొత్త కాలనీలు నిర్మించి, పలు గ్రామాల నిర్వాసితులను తరలించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తూ త్వరితగతిన పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టులో దేవీపట్నం మండలంలోని 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 5,567 మంది నిర్వాసితులవుతున్నారు. ఈ మండలంలోని ఇందుకూరు, ఇందుకూరు–2, పెద్దబియ్యంపల్లి, పెద్దబియ్యంపల్లి–2, పోతవరం, పోతవరం–2, ముసినిగుంట, కంభలంపాలెం, గంగవరం మండలం నేలదోనెలపాడులో గిరిజనులకు పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. 
గోకవరం మండలం కృష్ణునిపాలెం వద్ద గిరిజనేతరులకు నిర్మిస్తున్న కాలనీ చివరి దశకు చేరుకుంది. ఈ కాలనీలో 1,050 ఇళ్లు నిర్మించారు. ఇప్పటికే 12 గిరిజన గ్రామాల వారిని తరలించారు. 
విలీన ప్రాంతం చింతూరు, కూనవరం, వీఆర్‌ పురం, ఎటపాక మండలాల్లో 190 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటి వరకూ 21 గ్రామాలకు ఇంటి నష్టపరిహారం చెల్లించారు. మరో 169 గ్రామాలకు చెల్లించాల్సి ఉంది. 
ఎటపాక, కూనవరం మండలాల్లోని 1,162 కుటుంబాలకు నర్సింగ్‌పేట, కాపవరం, రాయనపేట, కన్నాయిగూడెం, భైరవపట్నం, ఎర్రబోరు గ్రామాల్లో నిర్వాసితులకు ఆరు కాలనీలు నిర్మిస్తున్నారు. 

పెరిగిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ 
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నిర్వాసితులకు మెరుగైన రీహేబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్మెంట్‌ (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా అప్పటి వరకూ రూ.6.86 లక్షలుగా ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచారు. ఇప్పటికే 16 గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.50.70 కోట్లు చెల్లించారు. మరో 8 గ్రామాలకు ఇటీవలే రూ.90 కోట్లు చెల్లించారు.

పునరావాసం ఇలా.. 
పోలవరం ముంపు మండలాలు - 5
ముంపు గ్రామాలు- 234
నిర్మిస్తున్న పునరావాస కాలనీలు- 22
నిర్మాణ వ్యయం :    రూ. 800 కోట్లు
ఇప్పటి వరకూ తరలించిన గ్రామాలు - 12 

మే నెలాఖరుకు కాలనీలు పూర్తి 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీలను మే నెలాఖరుకు పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగిస్తాం. కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కాలనీల్లో 500 మందికి ఇళ్లను అప్పగించాం. కాలనీల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. వీటిల్లో అన్ని వసతులూ కల్పిస్తాం. 
– నరసింహరావు, డీఈ, గృహ నిర్మాణ శాఖ, రంపచోడవరం
చదవండి:
మడకశిర నుంచి తమిళనాడుకు వెళ్లి..  
పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement