పునరావాసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనతే | YSRCP Govt Helps Polavaram project rehabilitation For displaced | Sakshi
Sakshi News home page

పునరావాసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనతే

Published Sun, Mar 6 2022 5:18 AM | Last Updated on Sun, Mar 6 2022 8:21 AM

YSRCP Govt Helps Polavaram project rehabilitation For displaced - Sakshi

సాక్షి అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కల్పనపై సోషల్‌ మీడియాలో టీడీపీ  చేస్తున్న ప్రచారం పచ్చిబూటకమని రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్‌ చెక్‌’లో నిగ్గుతేల్చి ఆ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు హయంలో కాలనీల నిర్మాణం జరిగిందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ట్విట్టర్‌ ద్వారా కూడా స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన గణాంకాలతో కూడిన ప్రకటనను పోస్ట్‌ చేసింది.  

కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరు పునరావాస కాలనీని సందర్శించారు. కనీస సదుపాయాలు కల్పించి నాణ్యమైన ఇళ్లను నిర్మించారంటూ షెకావత్‌ అభినందిస్తే.. కాలనీ నిర్మాణం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తంచేశారు. కానీ, టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియా వేదికగా ఇందుకూరు–1 పునరావాస కాలనీ నిర్మాణం తమ సర్కార్‌ హయాంలోనే నిర్మించినట్లుగా డబ్బా కొట్టుకుంది. 

వాస్తవం ఇదీ.. 
ఇందుకూరు–1 కాలనీని 350 మంది గిరిజన నిర్వాసిత కుటుంబాల కోసం నిర్మించారు. ఇక్కడకు ఏనుగులగూడెం, అగ్రహారం, మంటూరు గ్రామాలకు చెందిన 306 గిరిజన నిర్వాసితుల కుటుంబాలను తరలించాల్సి ఉంది. వీరి కోసం 2017లో అప్పటి కలెక్టర్‌ రూ.26.91కోట్లు మంజూరు చేశారు. 2018 ఏప్రిల్‌ 27న కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదిరింది. కానీ, జూన్‌ 2019 నాటికి ఖర్చుచేసింది కేవలం రూ.6 కోట్లు మాత్రమేనని తేలింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇందుకూరు–1 పునరావాస కాలనీ కోసం రూ.19.98 కోట్లు ఖర్చుచేసింది. ఏనుగుల గూడెం వాసులను ఫిబ్రవరి 2021లోనూ, అగ్రహారం కుటుంబాలను 2021 మేలోనూ, మనుటూరు కుటుంబాలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలకు తరలించారు. వాస్తవాలిలా ఉంటే.. టీడీపీ శ్రేణులు మాత్రం తమ హయాంలోనే ఇందుకూరు–1 పునరావాస కాలనీ నిర్మాణం పూర్తయినట్లుగా సోషల్‌ మీడియాలో గప్పాలు కొట్టుకుంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement