rehabilitation works
-
పునరావాసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఘనతే
సాక్షి అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కల్పనపై సోషల్ మీడియాలో టీడీపీ చేస్తున్న ప్రచారం పచ్చిబూటకమని రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్’లో నిగ్గుతేల్చి ఆ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు హయంలో కాలనీల నిర్మాణం జరిగిందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ట్విట్టర్ ద్వారా కూడా స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన గణాంకాలతో కూడిన ప్రకటనను పోస్ట్ చేసింది. కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఇందుకూరు పునరావాస కాలనీని సందర్శించారు. కనీస సదుపాయాలు కల్పించి నాణ్యమైన ఇళ్లను నిర్మించారంటూ షెకావత్ అభినందిస్తే.. కాలనీ నిర్మాణం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తంచేశారు. కానీ, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఇందుకూరు–1 పునరావాస కాలనీ నిర్మాణం తమ సర్కార్ హయాంలోనే నిర్మించినట్లుగా డబ్బా కొట్టుకుంది. వాస్తవం ఇదీ.. ఇందుకూరు–1 కాలనీని 350 మంది గిరిజన నిర్వాసిత కుటుంబాల కోసం నిర్మించారు. ఇక్కడకు ఏనుగులగూడెం, అగ్రహారం, మంటూరు గ్రామాలకు చెందిన 306 గిరిజన నిర్వాసితుల కుటుంబాలను తరలించాల్సి ఉంది. వీరి కోసం 2017లో అప్పటి కలెక్టర్ రూ.26.91కోట్లు మంజూరు చేశారు. 2018 ఏప్రిల్ 27న కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదిరింది. కానీ, జూన్ 2019 నాటికి ఖర్చుచేసింది కేవలం రూ.6 కోట్లు మాత్రమేనని తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇందుకూరు–1 పునరావాస కాలనీ కోసం రూ.19.98 కోట్లు ఖర్చుచేసింది. ఏనుగుల గూడెం వాసులను ఫిబ్రవరి 2021లోనూ, అగ్రహారం కుటుంబాలను 2021 మేలోనూ, మనుటూరు కుటుంబాలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఆర్ అండ్ ఆర్ కాలనీలకు తరలించారు. వాస్తవాలిలా ఉంటే.. టీడీపీ శ్రేణులు మాత్రం తమ హయాంలోనే ఇందుకూరు–1 పునరావాస కాలనీ నిర్మాణం పూర్తయినట్లుగా సోషల్ మీడియాలో గప్పాలు కొట్టుకుంటోంది. -
పరుగులు తీస్తున్న పోలవరం పునరావాసం
పోలవరం నిర్వాసితుల త్యాగాలు మరువలేనివి. ఈ ప్రాజెక్టు వలన నిర్వాసితులుగా మారుతున్న అందరినీ ఆదుకుంటాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే నష్టపరిహారం కలిపి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క నిర్వాసితుడికీ అన్యాయం జరగకుండా గృహ సముదాయాలకు తరలిస్తాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రంపచోడవరం: అటు విశాఖ నుంచి ఇటు కృష్ణా జిల్లా వరకూ ఉన్న దాదాపు 7 లక్షల ఎకరాల భూములను సస్యశ్యామలం చేయడమే కాకుండా, వేలాది గ్రామాలకు తాగునీరు, విశాఖలోని పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడంతో పాటు.. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేసే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చేస్తున్న విషయం తెలిసిందే. అంతే వేగంగా ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను కూడా చేపడుతోంది. గత టీడీపీ ప్రభుత్వం కంటే మెరుగైన ప్యాకేజీ ప్రకటించి, ప్రతి నిర్వాసితుడికీ భరోసా కల్పించి, కొత్త ఇళ్లల్లో గృహప్రవేశం చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పునరావాస కాలనీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల అన్ని వసతుల తో కొత్త కాలనీలు నిర్మించి, పలు గ్రామాల నిర్వాసితులను తరలించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు నిర్వహిస్తూ త్వరితగతిన పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ♦పోలవరం ప్రాజెక్టులో దేవీపట్నం మండలంలోని 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 5,567 మంది నిర్వాసితులవుతున్నారు. ఈ మండలంలోని ఇందుకూరు, ఇందుకూరు–2, పెద్దబియ్యంపల్లి, పెద్దబియ్యంపల్లి–2, పోతవరం, పోతవరం–2, ముసినిగుంట, కంభలంపాలెం, గంగవరం మండలం నేలదోనెలపాడులో గిరిజనులకు పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ♦గోకవరం మండలం కృష్ణునిపాలెం వద్ద గిరిజనేతరులకు నిర్మిస్తున్న కాలనీ చివరి దశకు చేరుకుంది. ఈ కాలనీలో 1,050 ఇళ్లు నిర్మించారు. ఇప్పటికే 12 గిరిజన గ్రామాల వారిని తరలించారు. ♦విలీన ప్రాంతం చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లో 190 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇప్పటి వరకూ 21 గ్రామాలకు ఇంటి నష్టపరిహారం చెల్లించారు. మరో 169 గ్రామాలకు చెల్లించాల్సి ఉంది. ♦ఎటపాక, కూనవరం మండలాల్లోని 1,162 కుటుంబాలకు నర్సింగ్‌పేట, కాపవరం, రాయనపేట, కన్నాయిగూడెం, భైరవపట్నం, ఎర్రబోరు గ్రామాల్లో నిర్వాసితులకు ఆరు కాలనీలు నిర్మిస్తున్నారు. పెరిగిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం నిర్వాసితులకు మెరుగైన రీహేబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా అప్పటి వరకూ రూ.6.86 లక్షలుగా ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచారు. ఇప్పటికే 16 గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.50.70 కోట్లు చెల్లించారు. మరో 8 గ్రామాలకు ఇటీవలే రూ.90 కోట్లు చెల్లించారు. పునరావాసం ఇలా.. పోలవరం ముంపు మండలాలు - 5 ముంపు గ్రామాలు- 234 నిర్మిస్తున్న పునరావాస కాలనీలు- 22 నిర్మాణ వ్యయం : రూ. 800 కోట్లు ఇప్పటి వరకూ తరలించిన గ్రామాలు - 12 మే నెలాఖరుకు కాలనీలు పూర్తి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీలను మే నెలాఖరుకు పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగిస్తాం. కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కాలనీల్లో 500 మందికి ఇళ్లను అప్పగించాం. కాలనీల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. వీటిల్లో అన్ని వసతులూ కల్పిస్తాం. – నరసింహరావు, డీఈ, గృహ నిర్మాణ శాఖ, రంపచోడవరం చదవండి: మడకశిర నుంచి తమిళనాడుకు వెళ్లి.. పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు -
పునరావాసంలో మరో కీలక ఘట్టం..
ప్ర‘జల’ కలలు ఫలించాలని తమ సొంత ఊరిని, ఆస్తులను త్యాగం చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. వారి కోసం పునరావాస కాలనీల్లో నిర్మిస్తున్న గృహాల పనులను వేగవంతం చేసింది. వారిని తరలించేందుకు శ్రీకారం చుట్టనుంది. జూలై 15 నాటికి ఆరు గ్రామాలను, నెలాఖరు నాటికి 19 గ్రామాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత పునరావాస పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 107 నిర్వాసిత గ్రామాలు ఉండగా, వీటిలో 41.15 కాంటూరు పరిధిలో ముంపునకు గురయ్యే 25 గ్రామాలను జూలై నెలాఖరు నాటికి ఖాళీ చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తరలింపుపై ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే తొలివిడతలో విలీన మండలాల్లోని ఆరు గ్రామాలను జూలై 15వ తేదీ నాటికి, ఆ తర్వాత రెండో విడతలో నెలాఖరు నాటికి 19 గ్రామాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుక్కునూరు ఏ–బ్లాక్ పరిధిలోని గ్రామాలను పాక్షికంగా తరలించేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ చేయించే గ్రామాలన్నీ తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన మండలాల్లోవే. ఈ గ్రామాల పరిధిలో సుమారు 7,071 కుటుంబాలను తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా వీటిలో 5,343 గిరిజనేతర కుటుంబాలు, 1,728 గిరిజన కుటుంబాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. నిర్వాసితుల త్యాగం మరువలేనిది ఉన్న ఊరు కన్నతల్లిలాంటిదని అంటారు. ఊరి మీద మమకారం ఎవరికైనా ఉంటుంది. పుట్టి పెరిగిన వాతావరణం మనిíÙకి ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి రావాలంటే మానవుడు విలవిల్లాడిపోతాడు. అయినా పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితులు ఉన్న ఊరిని, ఆస్తులను త్యాగం చేస్తూ వేరే ప్రాంతానికి మారుతున్నారు. వీరి త్యాగం మరువలేనిది. ఇప్పటికే పోలవరం మండలంలో అనేక కుటుంబాలు పునరావాస గ్రామాలకు తరలివచ్చి స్థిర పడ్డాయి. ఇప్పుడు 41.15 కాంటూరు పరిధిలోని సుమారు 25 గ్రామాలను జూలై నెలాఖరు నాటికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామాల్లోని ప్రజలు మానసికంగా సిద్ధపడేలా అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. కొత్త గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కలి్పస్తామని భరోసా ఇస్తున్నారు. భూముల్లో పంటలు వేయొద్దు నెలాఖరు నాటికి ఖాళీ చేయించే 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాల్లో ఉన్న రైతులు వ్యవసాయ భూముల్లో ఎటువంటి పంటలూ వేయవద్దని అధికారులు చాటింపు వేయించారు. నోటీసుల ద్వారా ఆయా ప్రాంత ప్రజలకు తెలియజేశారు. నెలలోపే గ్రామాలను ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు తరలి వెళ్లాల్సి ఉన్నందున పంటలు వేసిన రైతులు నష్టపోయే అవకాశం ఉందని అవగాహన కలి్పంచినట్టు కుక్కునూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ సూర్యనారాయణ తెలిపారు. నిర్వాసితులను మానసికంగా సిద్ధం చేశాం పునరావాస ప్రాంతానికి తరలింపు సమాచారం నిర్వాసితులకు అందించాం. విలీన మండలాల్లోని ముంపునకు గురయ్యే 25 గ్రామాల్లో జూలై 15 నాటికి ఆరు గ్రామాల ప్రజలను మొదటి విడతలో తరలిస్తాం. కుక్కునూరు మండలంలోని దామరచర్ల, చీరవల్లి, బోనగిరి గ్రామాలు పూర్తిగా కుక్కునూరు ఏ బ్లాక్‌లో పాక్షికంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అలాగే వేలేరుపాడు మండలంలోని కట్కూరు, కొయిదా, తాళ్లగొంది గ్రామాలను మొదట విడతలో తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన గ్రామాలను జూలై నెలాఖరు నాటికి తరలిస్తాం. తరలింపు సమాచారాన్ని నిర్వాసితులకు అందించాం. వారిని మానసికంగా సిద్ధం చేసేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – ఆర్వీ సూర్యనారాయణ, కుక్కునూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ, కేఆర్‌పురం అన్ని విధాలా అండగా.. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. అనుకున్న ప్రకారమే పునరావాస గృహ నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులను తరలించే విధంగా అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. నిర్వాసితులు తమ గ్రామం నుంచి పునరావాస గృహాలకు తరలి వచ్చేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. – తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం -
పునరావాస పనులను వేగవంతం చేయాలి
నెల్లూరు రూరల్: పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో నిర్వాసితులైన వారికి పునరావాస పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పునరావాస ప్యాకేజీ పథకం(ఆర్ఆర్) పనులపై జేసీ ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నెల్లూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలో పరిశ్రమల నిర్వాసితులకు పునరావాసంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని తహశీల్దార్లకు సూచించారు. ముత్తుకూరు మండలం నేలటూరు ఎస్సీ కాలనీ ప్రజలకు ఇళ్ల స్థలాలను నెల్లూరు రూరల్ మండల పరిధిలోని వావిలేటిపాడు వద్ద కేటాయించినట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం జేసీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నెల్లూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు తహశీల్దార్లు వాకా శ్రీనివాసులురెడ్డి, రామలింగేశ్వరరావు, చెన్నయ్య, పరిశ్రమల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.