మొదటి విడతలో ఖాళీ కానున్న కుక్కునూరు మండలం కివ్వాక గ్రామం, బుట్టాయగూడెం మండలంలో 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస గృహం
ప్ర‘జల’ కలలు ఫలించాలని తమ సొంత ఊరిని, ఆస్తులను త్యాగం చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. వారి కోసం పునరావాస కాలనీల్లో నిర్మిస్తున్న గృహాల పనులను వేగవంతం చేసింది. వారిని తరలించేందుకు శ్రీకారం చుట్టనుంది. జూలై 15 నాటికి ఆరు గ్రామాలను, నెలాఖరు నాటికి 19 గ్రామాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత పునరావాస పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా పరిధిలో మొత్తం 107 నిర్వాసిత గ్రామాలు ఉండగా, వీటిలో 41.15 కాంటూరు పరిధిలో ముంపునకు గురయ్యే 25 గ్రామాలను జూలై నెలాఖరు నాటికి ఖాళీ చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తరలింపుపై ఇప్పటికే తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే తొలివిడతలో విలీన మండలాల్లోని ఆరు గ్రామాలను జూలై 15వ తేదీ నాటికి, ఆ తర్వాత రెండో విడతలో నెలాఖరు నాటికి 19 గ్రామాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుక్కునూరు ఏ–బ్లాక్ పరిధిలోని గ్రామాలను పాక్షికంగా తరలించేలా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ చేయించే గ్రామాలన్నీ తెలంగాణ నుంచి జిల్లాలో విలీనమైన మండలాల్లోవే. ఈ గ్రామాల పరిధిలో సుమారు 7,071 కుటుంబాలను తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా వీటిలో 5,343 గిరిజనేతర కుటుంబాలు, 1,728 గిరిజన కుటుంబాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
నిర్వాసితుల త్యాగం మరువలేనిది
ఉన్న ఊరు కన్నతల్లిలాంటిదని అంటారు. ఊరి మీద మమకారం ఎవరికైనా ఉంటుంది. పుట్టి పెరిగిన వాతావరణం మనిíÙకి ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి రావాలంటే మానవుడు విలవిల్లాడిపోతాడు. అయినా పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితులు ఉన్న ఊరిని, ఆస్తులను త్యాగం చేస్తూ వేరే ప్రాంతానికి మారుతున్నారు. వీరి త్యాగం మరువలేనిది. ఇప్పటికే పోలవరం మండలంలో అనేక కుటుంబాలు పునరావాస గ్రామాలకు తరలివచ్చి స్థిర పడ్డాయి. ఇప్పుడు 41.15 కాంటూరు పరిధిలోని సుమారు 25 గ్రామాలను జూలై నెలాఖరు నాటికి తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామాల్లోని ప్రజలు మానసికంగా సిద్ధపడేలా అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. కొత్త గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కలి్పస్తామని భరోసా ఇస్తున్నారు.
భూముల్లో పంటలు వేయొద్దు
నెలాఖరు నాటికి ఖాళీ చేయించే 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాల్లో ఉన్న రైతులు వ్యవసాయ భూముల్లో ఎటువంటి పంటలూ వేయవద్దని అధికారులు చాటింపు వేయించారు. నోటీసుల ద్వారా ఆయా ప్రాంత ప్రజలకు తెలియజేశారు. నెలలోపే గ్రామాలను ఖాళీ చేసి పునరావాస గ్రామాలకు తరలి వెళ్లాల్సి ఉన్నందున పంటలు వేసిన రైతులు నష్టపోయే అవకాశం ఉందని అవగాహన కలి్పంచినట్టు కుక్కునూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వీ సూర్యనారాయణ తెలిపారు.
నిర్వాసితులను మానసికంగా సిద్ధం చేశాం
పునరావాస ప్రాంతానికి తరలింపు సమాచారం నిర్వాసితులకు అందించాం. విలీన మండలాల్లోని ముంపునకు గురయ్యే 25 గ్రామాల్లో జూలై 15 నాటికి ఆరు గ్రామాల ప్రజలను మొదటి విడతలో తరలిస్తాం. కుక్కునూరు మండలంలోని దామరచర్ల, చీరవల్లి, బోనగిరి గ్రామాలు పూర్తిగా కుక్కునూరు ఏ బ్లాక్‌లో పాక్షికంగా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అలాగే వేలేరుపాడు మండలంలోని కట్కూరు, కొయిదా, తాళ్లగొంది గ్రామాలను మొదట విడతలో తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన గ్రామాలను జూలై నెలాఖరు నాటికి తరలిస్తాం. తరలింపు సమాచారాన్ని నిర్వాసితులకు అందించాం. వారిని మానసికంగా సిద్ధం చేసేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
– ఆర్‌వీ సూర్యనారాయణ, కుక్కునూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ, కేఆర్‌పురం
అన్ని విధాలా అండగా..
నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. అనుకున్న ప్రకారమే పునరావాస గృహ నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులను తరలించే విధంగా అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. నిర్వాసితులు తమ గ్రామం నుంచి పునరావాస గృహాలకు తరలి వచ్చేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.
– తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం
Comments
Please login to add a commentAdd a comment