పునరావాస పనులను వేగవంతం చేయాలి
నెల్లూరు రూరల్: పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో నిర్వాసితులైన వారికి పునరావాస పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పునరావాస ప్యాకేజీ పథకం(ఆర్‌ఆర్) పనులపై జేసీ ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. నెల్లూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట మండలాల పరిధిలో పరిశ్రమల నిర్వాసితులకు పునరావాసంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని తహశీల్దార్లకు సూచించారు. ముత్తుకూరు మండలం నేలటూరు ఎస్సీ కాలనీ ప్రజలకు ఇళ్ల స్థలాలను నెల్లూరు రూరల్ మండల పరిధిలోని వావిలేటిపాడు వద్ద కేటాయించినట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం జేసీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నెల్లూరు, ఇందుకూరుపేట, ముత్తుకూరు తహశీల్దార్లు వాకా శ్రీనివాసులురెడ్డి, రామలింగేశ్వరరావు, చెన్నయ్య, పరిశ్రమల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.