Yellur
-
‘అవినీతిని సహించేది లేదు’
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలే తప్ప అవినీతికి పాల్పడితే సహించబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంత్రి నాని శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ దుర్గాప్రసాద్, కలెక్టర్ రేవు ముత్యాలరాజుతో కలిసి గంటకు పైగా ఆసుపత్రిలో పలు విభాగాలను తనిఖీ చేయడమే కాకుండా రోగుల సమస్యలను అందుతున్న వైద్యం తీరును అడిగి తెలుసుకున్నారు. సాక్షి, ఏలూరు : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని స్పష్టమైన సమాచారం తనకు ఉందని, కొన్ని ఛానల్స్‌లో కూడా పేరుతో సహా వార్తలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారుల సమావేశంలో ప్రశ్నించారు. విచారణ నిర్వహించి బాధ్యులను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి డీఎంహెచ్‌వో సుబ్రమణ్యేశ్వరిని ఆదేశించారు. తొలుత పర్యటనలో డయాలసిస్ సక్రమంగా నిర్వహించడం లేదని, సమస్యలు ఉన్నాయని బీమడోలుకు చెందిన డయాలసిస్ రోగి మంత్రి నాని దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ జరిపి తనకు రిపోర్టు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. బుట్టాయగూడెం నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చిన బాలికకు ఆధార్‌కార్డు లేదని ఎం ఆర్ఐ స్కాన్ నిర్వహించకుండా వెనక్కి పంపడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏదో ఒక వంక చెప్పి వెనక్కి పంపడం సరికాదన్నారు. ఆధార్ లేకపోయినా ఏదో ఒక డాక్టర్‌తో సర్టిఫై చేయించి వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను సందర్శించారు. మెటర్నిటీ వార్డులో పేషంట్ బంధువులు ఒక చోట కింద కూర్చుని ఉండటం గమనించి వారికి వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన చర్యలపై చర్చించారు. ఆసుపత్రిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం సమస్యగా మారిందని, మార్చురీలో ఫ్రీజర్ బాక్సులు పనిచేయడం లేదని తదితర అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చాక కూడా స్కానింగ్, ఎక్స్‌రేల పేరుతో రోగులను బయటకు పంపితే సహించబోమని నాని హెచ్చరించారు. ఎముకల వార్డులో చేరిన రోగులకు యుద్ధప్రాతిపదికపై అవసరమైన వైద్యాన్ని ప్రారంభించి శస్త్ర చికిత్సకు తగు ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని అంతే తప్ప రోడ్డు ప్రమాదాలలో గాయపడి వచ్చిన వారికి సరైన వైద్యం అందించకపోతే ఏమి జరుగుతుందోనన్న భయం వారిలో ఉంటుందన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులకు సాధ్యమైనంత త్వరగా శస్త్ర చికిత్సలు పూర్తి చేయాలని ఎక్కడా కూడా జాప్యం చేస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రసవాల విభాగంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి బిడ్డ సురక్షితంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించా లని రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలే తప్ప దురుసుగా ప్రవర్తిస్తే సంబంధితులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, ముఖ్యంగా షుగర్, బీపీ వంటి రోగాల పట్ల ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని, ఇటీవల మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోందని, గ్రామీణ ప్రాంతాలలో సరైన అవగాహన లేని కారణంగా సకా లంలో మధుమేహం వ్యాధిని గుర్తించలేకపోతున్నారని దీనిపై అవగాహన పెంపొందిచాలన్నారు. 104 వాహనం పల్లెలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి తగు వైద్య సలహాలు అందించాలని కోరారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ విభాగాన్ని కూడా మంత్రి సందర్శించి ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందించే విషయంలో ఆన్లైన్ అనుమతులు కొంత జాప్యం జరుగుతున్నదని ఆసుపత్రిలో రోగి చేరిన తక్షణమే అవసరమైన వైద్యానికి అనుమతించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమతిలో జాప్యం అయితే అనారోగ్యం మరింత క్షీణిస్తుందనే భావన ప్రజల్లో ఉంటుందని అందుకే ఆన్లైన్ అనుమతులు శరవేగంగా జరిగేలా ఆరోగ్యమిత్రలు మరింత చొరవ చూపాలని ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మంత్రి ఆసుపత్రిలో మరుగుదొడ్ల పరిస్ధితి, నీటి సౌకర్యం, టాయిలెట్లలో విద్యుత్ లైట్లు ఉన్నాయా లేవా అనే విషయం కూడా పరిశీలించారు. డ్రగ్‌స్టోర్ విభాగాన్ని సందర్శించి మందులు పాడైపోకుండా ఏసీలను ఏర్పాటు చేయాలని, సరైన ఉష్ణోగ్రతలను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి సూచించారు. -
ఉగాదిలోగా ఇళ్లస్థల పట్టాలు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : ఏలూరు నియోజకవర్గంలో అర్హత గల పేద ప్రజలకు ఉగాదిలోగా ఇళ్లస్థల పట్టాలు అందజేయడానికి 500 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మండల అధికారులతో ఆయన సమీక్షించారు.సమాజంలో పేదరికం కారణంగా ఎన్నో వేల కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధించలేకపోతున్నాయని కనీసం సొంత ఇల్లు లేక అద్దె చెల్లించలేక వేలాది మంది బాధపడుతున్నారని, అటువంటి వారందరికీ ఉగాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్లస్థల పట్టాలను పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని, ఈ మేరకు ఏలూరు నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబా నికి సొంత ఇంటి కలను సాకారం చేయాలంటే కనీసం 500 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఏలూరు పరిసర గ్రామాలలో భూసేకరణకు వారం రోజుల్లో తగు ప్రతిపాదనలు సమర్పించాలని తహసీల్దార్ పి.సోమశేఖర్‌ను మంత్రి ఆదేశించారు. వెంకటాపురం పంచాయతీలోనే ఇప్పటికే 6 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఏ గ్రామంలో చూసినా సొంత ఇల్లు లేక బాధపడే ప్రజలు ఉన్నారని, ఈసారి అందరికీ సొంత ఇల్లు నిర్మించి తీరతామని చెప్పారు. పోణంగిలోని డంపింగ్ యార్డ్‌ను మరో వైపుకు మళ్లించి డంపింగ్ యార్డు స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించే అవకాశాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారపుపేట, చొదిమెళ్ళ, వెంకటాపురం, కొమడవోలు, వట్లూరు, హనుమాన్‌నగర్‌లోని గ్రీన్‌సిటీ వెనుక తదితర గ్రామాల్లో భూములను సేకరించి తగు చర్యలు తీసుకోవాలని నగరంలోని పేదలందరికీ కూడా ఈ చుట్టు ప్రక్కల అందుబాటులో ఉన్న భూములను ఇళ్ల స్ధలాలుగా కేటాయించాలని అందుకు తక్షణమే సర్వే నిర్వహించి ఏ గ్రామంలో ఎంత భూమి సేకరించగలమో ఒక అంచనాకు రావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో మెడికల్ కాలేజీకి నిధులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించి జీఓనూ జారీ చేసిందని, కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ఎంత భూమి కావాలో కూడా తెలుసుకోకుండా హడావిడిగా ఏలూరు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ.. రూ.266 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించిందని, కానీ కార్యరూపం దాల్చలేదని ఆళ్ల నాని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో మెడికల్ కాలేజీకి అవసరమైన నిధులు కేటాయిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు పెన్షన్లు ఏలూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవానికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చెప్పారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని పలువురు మహిళలు మంత్రి నానిని కలిసి తమకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరారు. మంత్రి ఆళ్ళనాని స్పందిస్తూ అర్హత కలిగిన పేదలందరికీ నూరు శాతం పెన్షన్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇంకా ఎవరైనా ఉంటే వారంతా దరఖాస్తు చేసుకోవాలని మండల అధికారులకు సమర్పించాలని, ఆన్లైన్ చేయించి అందరికీ పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. పోణంగి, వైఎస్సార్ కాలనీలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రతీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలోని ప్రతీ పేద కుటుంబం ఆరోగ్యంగా జీవించాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. ఎవరైనా లంచాలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని, అవినీతి రహిత పాలన అందించటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, మంచెం మైబాబు, బొద్దాని శ్రీనివాస్, ఎన్.సుధీర్‌బాబు, కిలాడి దుర్గారావు, నెరుసు చిరంజీవి, సుంకర చంద్రశేఖర్ ఉన్నారు. -
సరిహద్దు లొల్లి..
సాక్షి, ముంబై: కర్ణాటక సరిహద్దులోని ‘యెళ్లూర్’ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకీ మరాఠీ ప్రజలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. కర్ణాటక పోలీసులు యెళ్లూర్ గ్రామంలోని మరాఠీ ప్రజలను ఇళ్లల్లోకి చొరబడి చితకబాదారు. ఇది చాలా అమానుష’ మంటూ దుయ్యబట్టారు. భారత్-పాక్ సరిహద్దు అంశం ఎంత కీలకమైనదో.., శివసేనకు కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు అంశం కూడా అంతే కీలకమైనదని ఉద్దవ్ నొక్కి చెప్పారు. సరిహద్దులోని యెల్లూర్ సంఘటనపై సోమవారం ప్రచురితమైన ‘సామ్నా’ సంపాదకీయంలో ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక తీరుపై మండిపడ్డారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. సరిహద్దు సంఘటనపై ఏపార్టీ నాయకులూ ఎందుకు నోరు విప్పడంలేదని నిలదీశారు.‘ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ సంఘటనపై అన్ని పార్టీలూ రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించాయి. మరి ఈ ఘటనపై ఎవరూ ఎందుకు నోరు విప్పడంలేదో అర్థం కావడంలేదు.. ఇది మన ఆత్మగౌరవ సమస్య..’ అని అన్నారు. సరిహద్దులోని మరాఠీ ప్రజలకు శివసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే అక్కడ భవిష్యత్తులో ఎటువంటి దుర్ఘటనలు జరిగినా కేంద్రం బాధ్యత వహించాల్సి వస్తుందని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో కొన్నేళ్లుగా సమస్య నడుస్తోంది. సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న మరాఠీలు తమను కర్ణాటక ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, తమ ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని ఎప్పటినుంచో ఉద్యమం చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఐదు దశాబ్దాల కిందట యెళ్లూర్లో ఏర్పాటుచేసిన మహారాష్ట్ర రాజ్-యెళ్లూర్’ అనే హోర్డింగ్‌ను పోలీసులు శనివారం తొలగించారు. దిమ్మెను పగలగొట్టేశారు. దాంతో స్థానిక మరాఠీలు ఆందోళనకు దిగడంతో కర్ణాటక పోలీసులు మరాఠీయులను చితకబాదారు. శని,ఆదివారాల్లో జరిగిన ఘటనలో సుమారు 50మందికి పైగా మరాఠీలు గాయపడ్డారు. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ‘ముంబైలో కర్ణాటక సంఘం, భవనం కూడా ఉన్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో వాళ్లు హోటల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి స్థానిక మరాఠీలు ఎన్నడూ ఎటువంటి హానీ తలపెట్టలేదు. కాని కర్ణాటకలో ఉన్న మరాఠీయులను మాత్రం స్థానిక ప్రభుత్వం అణగదొక్కేందుకు యత్నిస్తోంది..’ అని ఠాక్రే విమర్శించారు. ఇదే విషయమై గతంలో బేల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసేశారు. అయితే తర్వాత జరిగిన ఎన్నికల్లో సైతం మరాఠీ ప్రతినిధులే విజయం సాధించారని.. దీన్ని బట్టి అక్కడి స్థానికుల్లో ఉన్న ఆకాంక్షను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలకు కేంద్రం న్యాయం చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎంకు పృథ్వీరాజ్ చవాన్ ఫోన్.. యెళ్లూర్ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసే చర్యలకు దిగకూడదని హితవు పలికారు. సరిహద్దులో శాంతి స్థాపనకు కృషిచేయాలన్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీష్ రాణే మాట్లాడుతూ ముంబైలో కర్ణాటక దినోత్సవాన్ని జరగకుండా అడ్డుకుంటామన్నారు. అలాగే ముంబైలోని డబ్బావాలాలు సైతం కర్ణాటకలో మరాఠాలపై జరిగిన దాడిని ఖండించారు. ఈ మేరకు సోమవారం నగరంలో ఆందోళన నిర్వహించారు. యెళ్లూర్ ఘటన జరిగి ఉండాల్సింది కాదని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఘటనకు కారకులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, సరిహద్దు గ్రామాల్లో శాంతిస్థాపనకు కృషిచేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.